కాలాన్ని జయించిన జాషువా | mallepalli laxmaiah article on Gurram Jashuva | Sakshi
Sakshi News home page

కాలాన్ని జయించిన జాషువా

Published Thu, Sep 22 2016 2:00 AM | Last Updated on Mon, Oct 8 2018 9:06 PM

గుర్రం జాషువా సెప్టెంబర్ 28, 1895 - జూలై 24, 1971 - Sakshi

గుర్రం జాషువా సెప్టెంబర్ 28, 1895 - జూలై 24, 1971

కొత్త కోణం
జాషువా ఛందోబద్ధ కవిత్వాన్ని ఎంచుకోవడంలో అభ్యంతరాలున్నాయి. ఆయన కవిత్వ ఉద్దేశం ఆధిపత్య పండితలోకాన్ని తట్టిలేపడం కూడా. ఏ వర్గమైతే తమ పండిత ప్రగ ల్భంతో ఆధిపత్యం చలాయిస్తున్నదో దానిని సవాల్ చేయదల్చుకున్నాడు. ఏ పాండిత్య మైతే ఆధిపత్య కులాలను సాహిత్యం తమ సొంతమని విర్రవీగేలా చేసిందో, అదే పాండి త్యంతో ప్రతిఘటించదల్చుకున్నాడు. అంబేడ్కర్ ఇంగ్లిష్ చదువుతో సాధించిన డిగ్రీలతో ఆధిపత్య సమాజాన్ని ఎదిరించినట్టే జాషువా ఛందోబద్ధ కవిత్వంతో చెడుగుడాడారు.
 
సమ ధర్మంబు వీడి ధనుంజయుడు పంపె / నతనిచే జచ్చె రాధేయుడనెడు ఏల్కు / పుట్టినను చింతకలదు కాబోలు నీకు / నట్లు కాదయ్య! గెలుపు నీదియె కర్ణ! మహాకవి, కవి చక్రవర్తి గుర్రం జాషువా కావ్య ఖండిక ‘భారత వీరుడు’లోని పద్యపంక్తులివి.  జాషువా జీవితం, సాహిత్యంపైన వేల పేజీల వ్యాఖ్యానాలు, ప్రశంసలు అచ్చయినవి. అయినా ఏనాటికానాడు జాషువా కొత్తగానే కనిపిస్తాడు. గతాన్ని జీర్ణించుకొని, వర్తమానంలో జీవించి, భవి ష్యత్‌కు మార్గమేసిన జాషువా సాహిత్యం ఒక సమగ్ర అవలోకనగా కనిపి స్తున్నది. ఆయన సాహిత్యం ఆద్యంతం ఒక తాత్విక చింతనలోసాగింది. ఆయన గబ్బిలంను ఉద్దేశించిన నాగార్జునసాగర్ గలగలలు, వినిపించిన భరత పురుషుల చరితను విప్పిచెప్పిన ఆయన వాదం వివక్ష, అవమానం అసమానతలు లేని సామ్యవాదం.

ఇప్పటికి కూడా చాలా మంది కవులలో లేని చారిత్రక దృష్టి జాషువాలో కనిపిస్తుంది. ఈ వ్యాసం మొదట్లో ప్రస్తావించిన పద్యపాదములే అందుకు సాక్ష్యం. సామాజిక న్యాయం గురించి, సమానత్వం గురించి రాసే వాళ్లలో చాలా మంది ఇప్పటికీ పాండ వులదే న్యాయమని వ్యాఖ్యానిస్తుంటారు. కానీ భారతదేశంలోని కుల వ్యవస్థ పుట్టుకను, పరిణామాలను లోతుగా అర్థం చేసుకొని, నేటి తరానికి ఒక శాస్త్రీయ దృష్టిని ఆనాడే అందించాడు జాషువా. అందుకే తన ఖండ కావ్యంలో కర్ణుడిని భారతవీరుడు అన్నాడు. అర్జునుడిని దోషిగా నిలబెట్టాడు. ఆనాటికే కాదు, ఈనాటికీ ఇది సాహసమే. కులం పునాదులను కొల్లగొట్టాలంటే ధర్మ శాస్త్రాల గుట్టును బట్టబయలు చేయాలన్న డా.బాబాసాహెబ్ అంబేడ్కర్ తాత్వికతకు జాషువా ఆలోచన సరిగ్గా సరితూగుతుంది. అనేక రకాలుగా అవమానాల పాల్జేసి చివరకు కుతంత్రంతో కర్ణుడిని వధించారని కూడా జాషువా ప్రకటించాడంటే ఆయన ఆ రోజుల్లోనే హిందూ ధర్మశాస్త్రాల మీద యుద్ధం ప్రకటించినట్టు అర్థం చేసుకోవాలి.
 
దారిద్య్రం నేర్పిన ధీరత్వం
గుర్రం జాషువా 1895 సెప్టెంబర్ 28వ తేదీన గుంటూరు జిల్లా వినుకొండలో జన్మించారు.  తండ్రి వీరయ్య, తల్లి లింగమాంబ. తండ్రి యాదవ కులం వారైతే, తల్లి మాదిగ కులం. ఇరు కుటుంబాలు వారిని వెలివే శాయి. వీరయ్య క్రైస్తవంలో చేరి, పాస్టర్‌గా జీవనం సాగించారు. వీరయ్య జీవితం మాదిగ జీవన విధానంతోనే ముడిపడి ఉన్నది. అందుకే జాషువా తన పుట్టుకను, పెంపకాన్ని కలిపి ఒక చైతన్యాన్ని అందిపుచ్చుకున్నాడు. జాషువా తల్లి దండ్రులే ఈ సమాజం మీద ప్రతిఘటన జెండా ఎత్తారు. సరిగ్గా ఇక్కడే ఇటీవల హైదరాబాద్ విశ్వవిద్యాలయంలో బలిదానం చేసుకున్న వేముల రోహిత్ గుర్తుకొస్తాడు. గుర్రం జాషువా తండ్రి యాదవ కులానికి చెందిన ప్పటికీ తాను తన తల్లి జీవితాన్నీ, తండ్రి చైతన్యాన్నీ అందిపుచ్చుకొని అంట రానివానిగా ప్రకటించుకున్నారు.

రోహిత్ వేముల తండ్రి వడ్డెర కులస్తుడైన ప్పటికీ తాను తన తల్లి కులంలో తన అస్థిత్వాన్ని వెతుక్కొని వివక్షాపూరిత సమాజంపై ధిక్కారస్వరమయ్యాడు. జాషువా ఈ భూమి మీదకి అడుగు పెట్టేనాటికి తన చుట్టూరా ఒక సామాజిక చైతన్య వాతావరణం ఉన్నది. ‘‘తినడానికి పిడికెడు అన్నం లేదు, ఊగడానికి తూగుటుయ్యాల లేదు, నాన్న గారు దారిద్య్రాన్ని, సాంఘిక అసమానతను పట్టుకొని పుట్టారు. దారిద్య్రం లోని రుచిని, సాంఘిక పుటసమానతలోని అవమానాన్నియనుభవిస్తూ వచ్చిన మనిషి, నిరాశతో, నిస్పృహతో కృంగి, కృశించి, నశించి పోగల అవ కాశం ఉంది. కానీ ఇక్కడే మనిషి వ్యక్తిత్వం, ధీరత్వం దాగి ఉంది. నాన్నగారి వ్యక్తిత్వం, ధీరత్వం ఇక్కడే అవగాహన అయింది’’ అంటూ ఆయన కూతురు హేమలతా లవణం అన్న మాటలు జాషువా గుండె ధైర్యాన్ని గుర్తుకు తెప్పిస్తాయి.
 
ఈ చైతన్యం, కసి జీవితానుభవం నుంచే వచ్చాయి. కుల అణచి వేతతోపాటు, పేదరికాన్ని జమిలిగా అనుభవించిన వారు జాషువా. పండుగ నాడు పిండివంటలు తినడం పిల్లలకు గొప్ప అనుభూతి. కానీ ఇంట్లో వాటికి కరువు. ఒక అమ్మాయి తినుబండారాలు తీసుకెళ్తుంటే కిందపడ్డ వాటిని తీసుకొని తన తమ్ముడు ఇస్రాయెల్‌కు ఇస్తాడు జాషువా. ఆయనే స్వయంగా తాను రాసిన ‘స్వప్న’లో ‘‘పేదరికం పెద్ద వింత విద్యాశాల దానిలోన లజ్జ కనపడదు’’ అని రాయడంలో జాషువా అనుభవించిన ఆకలి బాధ ప్రతిబిం బిస్తుంది. జాషువా ‘‘జీవితం నాకు ఎన్నో పాఠాలు నేర్పింది. నాకు గురువులు ఇద్దరు. పేదరికం, కులభేదం. ఒకటి సహనాన్ని నేర్పితే, మరొకటి నాలో ఎదిరించే శక్తిని పెంచింది, కానీ బానిసగా మాత్రం మార్చలేదు.
దారిద్య్రాన్ని, కుల భేదాన్ని కూడా చీల్చి నేను మనిషిగా నిరూపించుకోదలిచాను. వాటిపై కత్తిగట్టాను. అయితే నా కత్తి కవిత. నా కత్తికి సంఘంపై ద్వేషం లేదు. దాని విధానంపై ద్వేషం’’ అంటూ సమాజంలోని అంతరాలపై తన వైఖరిని స్పష్టం చేశారు. విశ్వనరుడను నేను అంటూ రాసిన పద్యంలో ‘‘నేను కులాల చట్రంలో ఇమడను, అవేవీ నన్ను బంధించలేవు’’ అంటూ తన నిరసనను తెలియజేయడం మాత్రమే కాదు, తాను ఒక ఉన్నతమైన విశ్వ మానవుణ్ణి అని ప్రకటించుకున్నారు.
 కుల మతాల గీచుకొన్న గీతలజొచ్చు/పంజరాన గట్టుపడను నేను నిఖిల లోకమెట్లు నిర్ణయించిన నాకు/తరుగులేదు విశ్వనరుడనేను అని కవితా గర్జన చేశారాయన.
 
కులం అసమానతలపై పోరు
 గుర్రం జాషువా కుల అసమానతలపై, అంటరానితనంపై విసిరిన పద్యాల ఈటెలు కుల వ్యవస్థ పునాదులను పెకిలించాయి. బ్రహ్మదేవుడికి నలుగురు కుమారులు పుట్టెనని చెప్పిన ధర్మశాస్త్రాన్ని, అయిదో కొడుకు అంటరానివాడై ఎలా పుట్టాడని ప్రశ్నిస్తారు. దేవాలయంలో పూజలు, అర్చనలు చేస్తున్న వాళ్లు సాటి మనిషిని కులం పేరుతో హింసిస్తున్న వైనాన్ని కూడా ప్రశ్నించారు. అదే విధంగా వానినుద్ధరించు భగవంతుడేలేడు./మనుజుడెట్లు వాని కనికరించు వాడుజేసుకొన్న పాపకారణమేమొ/యింతవరకు వాని కెరకలేదు. అంటూ అంటరానితనానికి కారణం ఏమిటో తెలియదంటూ మిలియన్ డాలర్ల ప్రశ్నని సమాజంపై సంధించారు.
 
కనపడలేదు దైవతం కాని పదార్థం భారతంబునన్/గనుపడలేదు వర్ణము కన్న పిశాచము భారతంబునన్ / కనుపడలేదు సత్కులం కన్న మహా కళం కము భారతంబునన్/గనుపడలేదు పంచముని కన్నన్ నీఛపు జంతు వేది యున్ అంటూ అంటరాని కులాలు అనుభవిస్తున్న దీనస్థితిని తెలియజేస్తూ ‘ధర్మసంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే’ అంటూ చేసిన గీతోపదే శాన్ని తన తాత్విక చింతనతో తిప్పి కొట్టారు. ధర్మసంస్థానార్థంబు ధరణి మీద /నవతరించెదననే నబ్సభవుని తండ్రి / మునుపు జన్మించి నెత్తినకెత్తినది లేదు /నేడు జన్మింపకున్న మునిగినదీ లేదు.’ అంటూ గీతాసారాన్ని నిస్సారం చేసి పడేశారు.

అదే సమయంలో ముప్పు ఘటించి వీని కులమున్ గలిమిన్ గబళించి దేహమున్ /బిప్పి యొనర్చి నీ భరత వీరుని పాదం కందకుండగా జెప్పులుకుట్టి జీవనం సేయును గాని నిరాకరింపే లే/దెప్పుడు నప్పుపడ్డది సుమీ భారతావని వీని సేవకున్ అంటూ దోపిడీ సమాజంపై కవితా కత్తులు ఝుళిపించాడు. అంటరాని కులాల శ్రమతో వారి నైపుణ్యంతో తయారు చేసిన ఎన్నో వస్తువులను ముఖ్యంగా, కాలికి ముల్లంటకుండా వాడే చెప్పు లను కుట్టించి ఇచ్చిన వాడు కూటికీ కులానికీ తక్కువై మనిషికన్నా హీనంగా బతకడాన్ని  జాషువా సవాల్ చేశారు. హిందూమతం స్త్రీలను అణచివేసిన విధానాన్ని కూడా ఆయన సహించలేకపోయాడు. అంటరాని కులాలతోపాటు మహిళలు కూడా ఏవిధంగా హిందూ మతం చట్రంలో బందీలైపోయారో వివరించారు.
 
కొట్టుటకు, తిట్టుటకు నొక /పట్టా జన్మించినట్లు భావించి వెతల్  బెట్టితి నిల్లాలిని నా /పెట్టు శ్రమలనోర్చె సతియు విధియనుకొనుచున్ అంటూ స్త్రీలపై మగవారి అధికారాన్ని నిర్ద్వంద్వంగా నిరసించాడు. అరవై యేండ్లు దాటినా తల్లి ప్రేమ తరగనిదని, తల్లి తన బిడ్డలపైన ఉన్న మమ కారానికి ఈ లోకంలో సాటిలేదని అమ్మ ప్రేమకు అగ్రతాంబూలం ఇచ్చారు. అబలలని పేరుపెట్టి మహిళలను అణచివేస్తున్నారని చెపుతూ ‘అబలయన్న బిరుదమంటించి కాంతల / స్వీయ శక్తులదిమి చిదిమినారు / సబలయన్న బిరుదు సాధించి హక్కులు /గడ న చేసి కొమ్ము కష్ట చరిత.’ అని హక్కుల సాధనకు నారీలోకం నడుం బిగించాలని పిలుపునిచ్చాడు.
 
ఆయన లక్ష్యం సామాన్యుడే
 గుర్రం జాషువా తన జీవితం మొత్తాన్ని సాహితీ ఉద్యమానికి అంకితం చేశాడు. కొద్దిమందికి కొన్ని సందేహాలున్నాయి. ఆయన ఛందోబద్ధ కవి త్వాన్ని ఎంచుకోవడంలో అభ్యంతరాలున్నాయి. కానీ ఆయన లక్ష్యం సామా న్యుడే. అయితే అంతకుమించి ఆయన తన కవిత్వ ఉద్దేశం ఆధిపత్య పాండి  త్యలోకాన్ని తట్టిలేపడం కూడా. ఏ వర్గమైతే తమ పండిత ప్రగల్భంతో ఆధిపత్యం చలాయిస్తున్నదో దానిని సవాల్ చేయదల్చుకున్నాడు. ఏ పాండి త్యమైతే ఆధిపత్య కులాలను సాహిత్యం తమ సొంతమని విర్రవీగేలా చేసిందో, అదే పాండిత్యంతో జాషువా ప్రతిఘటించదల్చుకున్నాడు.

బాబా సాహెబ్ అంబేడ్కర్ తన ఇంగ్లిష్ చదువు ద్వారా సాధించిన ఎన్నో డిగ్రీలతో ఆధిపత్య సమాజాన్ని ఎదిరించినట్టే జాషువా ఛందోబద్ధ కవిత్వంతో చెడుగు డాడారు. అందుకే జాషువాను ఆధిపత్య కులాలలోని ప్రజాస్వామికవాదులే ఎక్కువగా గుర్తించి గౌరవించారు. ఒకరకంగా ఆ రోజు జాషువా సాగించిన సాహితీ పోరాటం సరైనదే. కుల సమాజం కొనసాగడానికి, వివక్ష సమసి పోవడానికి, అంటరాని కులాలు కారణం కాదు. అందుకు ఆధిపత్య కులాలదే బాధ్యత. అందుకే జాషువా ఆ మార్గాన్ని ఎన్నుకొని అలుపెరుగని పోరా టాన్ని సాగించారు. అంటరాని కులాల విముక్తి కోసం అహరహం శ్రమించిన జాషువా సాహిత్యం, జీవితం స్ఫూర్తిదాయకాలే.
 (సెప్టెంబర్ 28న జాషువ జయంతి సందర్భంగా)
 

మల్లెపల్లి లక్ష్మయ్య
 వ్యాసకర్త సామాజిక విశ్లేషకులు  మొబైల్ : 97055 66213
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement