మాటలు కాదు చేతలు కావాలి | Mallepalli Lakshmayya opinion on modi government | Sakshi
Sakshi News home page

మాటలు కాదు చేతలు కావాలి

Published Thu, Aug 11 2016 12:31 AM | Last Updated on Mon, Oct 8 2018 9:06 PM

మాటలు కాదు చేతలు కావాలి - Sakshi

మాటలు కాదు చేతలు కావాలి

గోసంరక్షకులను విమర్శిస్తే అన్ని తప్పులూ మాఫీ అవుతాయనుకోవడం పొరపాటు. దళితు లను దేశ అభివృద్ధిలో నిజమైన భాగస్వాములను చేయకుండా దళితుల గురించి మాట్లాడే ఏ మాటలకైనా అర్థం లేదు. అవి కేవలం మొసలికన్నీళ్లేనని భావించాల్సి వస్తుంది. ప్రధాని దళితుల గురించి మాట్లాడే ముందు తన నియోజకవర్గం వారణాసిలోని కాటికాపరుల గురించి ఆలోచించాలి, దేశవ్యాప్తంగా దళితుల గుండె మంటలను చల్లార్చే చర్యలు తీసుకోవాలి. వారిపై దాడులను అరికట్టి, వారి సామాజిక, ఆర్థికాభివృద్ధికి కృషి చేయాలి.
 
వారణాసికి మరోపేరు కాశీ. కాశీలో మరణం మహా పుణ్యమని, స్వర్గానికి సోపానమని ప్రజల విశ్వాసం. అటువంటి సాంప్రదాయక, చారిత్రక ప్రదేశ మైన వారణాసి నేటి రాజకీయాల్లో కూడా ప్రముఖ స్థానాన్ని ఆక్రమించుకు న్నది. నేటి మన ప్రధాని నరేంద్ర మోదీ ఈ నియోజకవర్గం నుంచే  లోక్‌సభలో ప్రాతినిధ్యం వహిస్తున్నారని తెలిసిందే. మోదీ గత ఆదివారం హైదరా బాద్‌లో జరిగిన బీజేపీ కార్యకర్తల మహా సమ్మేళనంలో చేసిన ప్రసంగానికీ, వారణాసికీ సంబంధం ఉన్నది. కుహనా గోసంరక్షకులను విమర్శించడంతో పాటూ ఆయన అదే వేదికపై నుంచి ‘దళితుల మీద దాడులు చేయవద్దు, నన్ను చంపండి’ అంటూ సంచలనాత్మకమైన వ్యాఖ్యలు చేశారు. తద్వారా దళిత పక్షపాతిగా తనను తాను ప్రకటించుకునే ప్రయత్నం చేశారు. గో సంరక్షకుల పేరుతో దళితుల మీద జరుగుతున్న దాడులను ఆయన తీవ్రంగా దుయ్యబట్టడం కూడా అందులో భాగమే.
ఓట్ల కోసమేనా ఈ దళిత జపం?
మోదీ ఆ ప్రసంగం చేసిన కొన్ని గంటల్లోనే... ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పు గోదావరి జిల్లా ఉప్పలగుప్పం మండలం భీమనపల్లి శివారు సూదాపాలెంలో సోమవారం రాత్రి ఆవు చర్మం ఒలుస్తున్న మాదిగలను చితకబాదారు. కామన గరువు గ్రామానికి చెందిన కొంతమంది ఎలిషా, లాజర్‌ల పైన, వ్యాన్ డ్రైవర్ లక్ష్మణ్‌కుమార్ పైన దాడి చేసి, చెట్టుకు కట్టేసి తీవ్రంగా కొట్టారు. అయితే అది బతికి ఉన్న ఆవు చర్మం కాదని, చనిపోయిన ఆవును తాను తీసుకెళ్లమంటేనే వారు దాన్ని తీసుకెళ్లారని ఆ ఆవు యజమాని అరవింద్ పోలీసులకు తెలియజేశారు. గోసంరక్షణ పేరుతో దళితుల మీద దాడులు జరగకుండా చూడాలని, ఒకవేళ జరిగితే ప్రభుత్వాలు కఠినంగా వ్యవహరిం చాలని మోదీ పిలుపునిచ్చారు. ఇప్పుడు ఏపీలో అధికారంలో ఉన్నది బీజేపీ భాగస్వామిగా ఉన్న సంకీర్ణ ప్రభుత్వమే. ఆ ప్రభుత్వం ఈ దురాగతంపై ఎటువంటి చర్యలు తీసుకుంటుందో  వేచి చూద్దాం. దళితుల మీద అత్యంత ప్రేమతో, సానుభూతితో మాట్లాడినట్టు కనిపించినా మోదీ మాటలు రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని చేసినవేనని విమర్శకులు భావి స్తున్నారు. అశేష ప్రజానీకం మనోభావాలను, ఆహారపుటలవాట్లను ధిక్క రిస్తూ గోసంరక్షణ పేరుతో దేశంలో సాగుతోన్న దారుణమైన దాడులను అరి కట్టడానికి ఏం చర్యలు చేపడతారో ఆయన ఒక్కమాటైనా చెప్పి ఉంటే బాగుం డేది. కానీ అది చేయలేదు.
 
వారణాసి దళితులకు ఒరిగిందేమిటి?

మిగతా ప్రాంతాల గురించి కాసేపు పక్కన పెడదాం. ప్రధాని మోదీ ప్రాతి నిధ్యం వహిస్తున్న వారణాసిలోని దళితుల బతుకులను బాగుపరచడానికి తన ప్రణాళిక ఏమిటో ప్రకటించి ఉండి ఉంటే... ఆయన మాటలకూ, చేత లకు పొంతన ఉన్నదని భావించొచ్చు. వారణాసిలో గంగానది ఒడ్డున శ్మశానాల్లో  పనిచేస్తున్న వారు, ఆ పట్టణంలో ఇంకా చేతులతో మానవ మలాన్ని ఎత్తి పోస్తున్న వాళ్లు, రోడ్లను, పరిసరాలను శుభ్రం చేస్తున్న వాళ్లు అంతా ఎవరు? దళితులే. ప్రధాని మోదీ మొదట వీరి గురించి ఆలోచించాలి. అక్కడి దళితులలో అత్యధికులు డోమ్ కులస్తులు. తరతరాలుగా అంటరాని వారుగా ఉన్న వీరు రాజా హరిశ్చంద్రుని వారసులమని చెప్పుకుంటారు. ఎంతో దుర్భర జీవితాలను గడుపుతున్న వీరిని పురాణాల మత్తుజల్లి శవాల కమురు వాసనల మధ్య బానిసల్లా పడేశారు. పుణ్యం కోసం కాశీలో చనిపోతున్న వారి సంగతి సరే, వారు చనిపోయాక ఇక్కడే నరకాన్ని అను భవిస్తున్న వాళ్ల సంగతేమిటి? గుట్టలు గుట్టలుగా వచ్చిపడే శవాల కాలే కమురు కంపు వాసనను భరిస్తూ చితిమంటలతో రక్తాన్ని సలసల మరిగించు కుంటున్నవారంతా చొక్కా అయినా లేని దళితులే. వారి స్థితిగతులను తెలుసు కోవడానికి పార్లమెంటు సభ్యునిగా, ప్రధానిగా ఇప్పటి వరకు మోదీ ప్రయ త్నించిన దాఖలా లేదు. అసలాయన ఏనాడూ తన నియోజకవర్గ దళితుల గురించి మాట్లాడిందే లేదు. ఆయన నియోజక వర్గంలో 20 లక్షలకు పైగా ఎస్సీలున్నారు. వారణాసి మొత్తంలో అక్షరాస్యత 75 శాతం కాగా, దళితుల అక్షరాస్యత 54 శాతమే. ఇలాగైతే అంటరాని కులాలు, సాధారణ ప్రజల స్థాయిని అందుకోవడానికి ఎంత కాలం పడు తుందో అర్థం చేసుకోవచ్చు. అట్టడుగున పడిఉన్న అక్కడి దళితుల పరి స్థితులను బాగుచేయడానికి కృషి చేయకుండా మోదీ ఈ అంతరాలను పెంచిపోషిస్తూనే ఉన్నారు.

మోదీ హయాంలో పెరిగిన దాడులు
దళితుల భద్రత, రక్షణ గురించి ఆలోచించే ముందు ఏడాదికేడాది దళితుల మీద పెచ్చుపెరుగుతున్న దాడులు నిజంగా ఈ దేశాన్ని ప్రేమించే వారినంద రినీ కలవరపెడుతున్నాయి. దళితులపై హత్యలు, అత్యాచారాల సంఖ్య మరింత ఎక్కువగా కనిపిస్తున్నది. 2009లో 624 మంది దళితులు హత్యకు గురైతే 2014లో ఆ సంఖ్య 744కు పెరిగింది. దళిత మహిళలపై అత్యాచారాల సంఖ్య 2009లో 1,346 కాగా, 2014లో 2,233కు పెరిగింది. కిడ్నాప్‌ల సంఖ్య 2009లో 512 అయితే, 2013లో 628గా నమోదైంది. దళితులపైన జరుగు తున్న అత్యాచారాలు, దాడులు, అవమానాలపై నమోదైన కేసుల సంఖ్యను చూసినా మోదీ నిర్ణయాత్మకమైన రీతిలో స్పందించాల్సిన అవసరం స్పష్ట మౌతుంది. 2011లో ఇలాంటి మొత్తం కేసుల సంఖ్య 33,719 కాగా, 2014లో 47,004కు పెరిగాయి. ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, బిహార్, మధ్య ప్రదేశ్ ఈ విషయంలో అగ్రశ్రేణిలో ఉన్నాయి. ఉత్తరప్రదేశ్‌లో సమాజ్‌వాదీ పార్టీ అధి కారంలోకి వచ్చిన తర్వాత దళితులపైన దాడుల సంఖ్య అత్యంత వేగంగా పెరిగింది. 2012లో 6,201, 2013లో 7,078, 2014లో 8,066 ఇలాంటి కేసులు నమోదయ్యాయి.

రాజస్తాన్‌లో కూడా 2012లో 5,559 కేసులు   నమోదైతే, అవి 2014లో 6,734కు పెరిగాయి. మోదీ సొంత రాష్ట్రమైన గుజరాత్ కూడా ఏమీ తీసిపోలేదు. సరాసరి ఏటా దళితులపై 1,669 దాడులు, అత్యాచారాలు, హత్యలు జరుగుతున్నాయి. పైగా గుజరాత్ దళిత జనాభా 7 శాతం మాత్రమే. జాతీయ మానవహక్కుల సంఘం తాజా నివేదిక ప్రకారం దళితులపైన ప్రతి పద్దెనిమిది నిమిషాలకు ఒక దాడి జరుగుతున్నది, ప్రతిరోజూ కనీసం ముగ్గురు దళిత మహిళలపై అత్యాచా రాలు జరుగుతున్నాయి, ప్రతిరోజూ ఇద్దరు దళితులు హత్యకు గురవు తున్నారు, ప్రతిరోజూ ఇద్దరు దళితుల ఇళ్లు దగ్ధమౌతున్నాయి. అయినా దళితుల సంక్షేమం గురించి మోదీ ప్రభుత్వం ఇప్పటి వరకు ఆలోచించినట్టే  కనిపించడం లేదు. గతంలో కన్నా పరిస్థితి మరింత దిగజారింది. ఉదాహర ణకు, ఏటా కేంద్ర బడ్జెట్‌కు ముందు  ‘ఎకనమిక్ రివ్యూ’ పేరిట కేంద్రం పార్లమెంటులో ప్రవేశపెట్టే నివేదిక దేశంలోని వివిధ రంగాల అభివృద్ధిని సమీక్షించి, భవిష్యత్‌లో తీసుకోబోయే చర్యలను సూచిస్తుంది. మోదీ  అధికా రంలోకి వచ్చిన తరువాత ఎకనమిక్ రివ్యూలో ఎస్సీ, ఎస్టీల అభివృద్ధి, భవి ష్యత్ కార్యాచరణల గురించి ఎటువంటి ప్రస్థావనా లేకపోవడం విచారకరం.

 ప్రణాళికా సంఘం సైతం ఎస్సీ, ఎస్టీల అభివృద్ధి పట్ల ప్రత్యేక శ్రద్ధను కనబరిచేది. దాని స్థానంలో ఏర్పాటైన నీతి ఆయోగ్. అటువంటి విష యాలపైన దృష్టి పెట్టకపోగా, ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ పర్యవేక్షణ తన బాధ్యత కాదని తేల్చి చెప్పింది. దీనితో కేంద్రం క్రమంగా ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ అమలుకు తిలోదకాలివ్వనుందని భావించాల్సి వస్తోంది. దళితులను కాల్చ డానికి బదులు నన్ను కాల్చండనే ఒక భారీ సినిమా డైలాగ్ కొట్టాల్సిన అవ సరం లేదు. దళితుల రక్షణకు తన ప్రాణాలను పణంగా పెట్టాల్సిన అవసరం అంతకన్నా లేదు. దళితుల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెడితే చాలు. మోదీ అధికారంలోకి వచ్చి రెండేళ్లు దాటినా... దళితుల అభివృద్ధిని వేగవంతం చేసే కార్యక్రమాన్ని ఒక్కటైనా ప్రకటించలేకపోయింది.
 
మొసలి కన్నీళ్లేనా?  
అంతెందుకు.. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ దళిత పరిశోధక విద్యార్థి  రోహిత్ వేముల ఆత్మహత్యపై దేశమంతటా ఉద్యమం వ్యాపించింది. అయినా తెలంగాణలో తొలిసారిగా అడుగుపెట్టిన మోదీ కంటితుడుపుగా నైనా రోహిత్ గురించి మాట్లాడక పోవడం ఆయన లోపల దాగివున్న వాస్తవి కతకు అద్దం పడుతోంది. ఎక్కడినుంచో తన్నుకొచ్చినట్టు దళితుల గురించి నాలుగు వాక్యాలు మాట్లాడితే ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరన్నది ఆయనా, బీజేపీ గ్రహించాలి. ప్రభుత్వాలు దళితుల సంక్షేమం, అభి వృద్ధికి చేపట్టాల్సిన చర్యలను గురించి కనీసం ఒక సమీక్షా సమావేశాన్ని కూడా మోదీ ప్రభుత్వం ఇప్పటి వరకు నిర్వహించలేకపోవడం దేన్ని సూచిస్తున్నది?

 దేశ చరిత్రలో దళితులకు గుర్తుండే ఏకైక ప్రధాని పేరు ఇందిరమ్మ. దళితుల కోసం ఆమె 1974లో ప్రత్యేకంగా ఒక మంత్రిత్వశాఖను ఏర్పాటు చేశారు. ఆ తర్వాత ఎస్సీ, ఎస్టీల కోసం ఇందిరా గాంధీ రూపొందించిన పథకాలే మరొక రూపంలో ఇప్పటికీ కొనసాగుతున్నాయి. కాగా దళితుల కోసం ప్రాణాలిస్తానంటున్న మోదీ ఆర్థికాభివృద్ధి సమీక్ష నుంచి ఎస్సీ, ఎస్టీలను తొలగించే ఆలోచనలో ఉన్నారు. గత రెండేళ్లుగా ప్రధాని మోదీ అను సరిస్తున్న విధానాలు అత్యంత నిరుపేద వర్గాలకు చెందిన, అణచివేతకు గురవుతున్న, సామాజికంగా అట్టడుగున ఉన్న దళితుల్లో, ఆదివాసుల్లో కోపా గ్నులు రగిలిస్తున్నాయి. ప్రస్తుతం నరేంద్రమోదీ సొంత రాష్ట్రంలో జరుగు తున్న దళిత ఉద్యమం యావత్ దేశ ప్రజల దృష్టినీ ఆకర్షిస్తున్నది, ఆలోచింప జేస్తున్నది. ఇది కేవలం గోసంరక్షకులకు వ్యతిరేకంగా జరుగుతున్నది మాత్రమే కాదు. గోసంరక్షకులను విమర్శిస్తే అన్ని తప్పులూ వాటంతటవే మాఫీ అవుతాయనుకోవడం పొరపాటు. దళితులను ఈ దేశ అభివృద్ధిలో నిజ మైన భాగస్వాములుగా చేయకుంటే దళితుల గురించి మాట్లాడే ఏ మాటల కైనా అర్థం లేదు. అవి కేవలం మొసలికన్నీళ్ళు మాత్రమేనని భావించాల్సి వస్తుంది. అందుకే ప్రధాని మోదీ దళితుల గురించి మాట్లాడే ముందు తన నియోజకవర్గమైన వారణాసిలోని కాటికాపరుల గురించి ఆలోచించాలి, ఆచ రించాలి. దేశవ్యాప్తంగా రగులుతున్న దళితుల గుండెమంటలను చల్లార్చే చర్యలు తీసుకోవాలి. వారిపై దాడులను అరికట్టి, వారి సామాజిక, ఆర్థికా భివృద్ధి గురించి ఆలోచించాలి.

(వ్యాసకర్త:మల్లేపల్లి లక్ష్మయ్య, సామాజిక విశ్లేషకులు  మొబైల్ : 97055 66213)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement