ఎనిమిదిన్నర ఏండ్ల ప్రధాని నరేంద్ర మోదీ పాలనలో ప్రజలకు మేలు చేసిన పని ఒకటి కూడా లేదనే చెప్పాలి. అధికారంలోకి వచ్చినప్పటి నుండి దేశ ప్రజలపై మోయలేని భారాలు వేసి కడ గండ్లపాలు చేశారు. బీజేపీ సర్కార్ తీసుకున్న అనాలోచిత నిర్ణయాలు, దివాలాకోరు ఆర్థిక విధానాలు దేశాన్ని అధోగతిలోకి నెట్టాయి. ఈరోజు దేశంలో ఆర్థిక వ్యవస్థ పతనానికి బీజేపీ ప్రభుత్వ ఆర్థిక విధానాలే ప్రధాన కారణం. 2016లో పెద్ద నోట్లను అకస్మాత్తుగా రద్దు చేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకోవడం వల్ల దేశ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలింది.
ఏటా రెండు కోట్ల మంది నిరుద్యోగులకు కొలువులు ఇస్తామని హామీ ఇచ్చి గద్దెనెక్కిన బీజేపీ ప్రభుత్వం ఈ దేశ నిరుద్యోగ యువతను నిండా ముంచింది. ఎనిమిదిన్నర ఏండ్లలో ఇవ్వాల్సిన 16.05 కోట్ల ఉద్యోగాల లెక్క చెప్ప మని ప్రశ్నిస్తే పకోడీలు, బజ్జీల బండ్లు పెట్టుకొని అమ్ము కోండని చెప్తున్నారు. కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉన్న వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న 16 లక్షలకు పైగా ఉన్న పోస్టులను భర్తీ చేయకుండా కాలం గడుపుతూ దగా చేస్తున్నారు. అంతే కాకుండా ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ హోల్ సేల్‌గా బడా కార్పొరేట్‌లకు అమ్మేస్తున్నారు. డిజిన్వెస్ట్‌మెంట్ పేరుతో 35 సంస్థలను 3 లక్షల 72 వేల కోట్ల రూపాయల విలువైన ఆస్తులను అమ్మేశారు.
బ్యాంకులకు వేలకోట్లు ఎగవేసిన కార్పొరేట్ పెద్దలపై మోదీ సర్కార్ జాలి పడి ఏకంగా 12 లక్షల కోట్ల రుణాలను రైటాఫ్ చేసి వాళ్ళ రుణం తీర్చుకుంది. కానీ ఓట్లేసి గెలి పించిన సామాన్య ప్రజలకు ఆసరాని ఇచ్చే అనేక సంక్షేమ పథకాలను ఉచితాలుగా ప్రచారం చేస్తూ వాటిని రద్దు చేయించడానికి ప్రయత్నిస్తున్నది. చివరకు నిత్యావసర వస్తువులైన పాలు, పెరుగు, పప్పు, ఉప్పు తదితర వస్తు వులపైన కూడా జీఎస్టీని పెంచి సామాన్యుల బ్రతుకులను దుర్భరంగా మార్చారు. 2014 లో రూ. 410 ఉన్న గ్యాస్ సిలిండర్ల ధర ఇప్పుడు రూ. 1100 దాటింది. అడ్డగోలుగా ఎక్సైజ్ సెస్సులు వడ్డించి పెట్రోల్, డీజిల్ ధరలను హద్దు పద్దు లేకుండా పెంచి ఎనిమిదేండ్లలో 30 లక్షల కోట్ల రూపాయలను ప్రజల నుండి వసూలు చేశారు.
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ యువతకు రిజర్వేషన్ కోటాకు గండికొట్టారు. హైదరాబాద్ కు ముంజూరైన ఐటీఐఆర్ ప్రాజెక్టును రద్దు చేసి లక్షలాది ఐటీ ఉద్యోగాలకు గండి కొట్టి తెలంగాణ యువతకు తీరని ద్రోహం చేసింది మోదీ సర్కార్. దేశానికి అన్నం పెట్టే రైతన్నల పొట్ట గొట్టడానికి మూడు వ్యవసాయ నల్ల చట్టాలను తెచ్చి వాటికి వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న రైతులను దేశ ద్రోహు లుగా చిత్రించింది. 750 మంది రైతుల మరణాలకు కారణ మైన నల్ల చట్టాలను చివరికి మోదీ సర్కార్ ఉపసంహ రించుకుంది.
కేంద్రం అసమర్థ ఆర్థిక విధానాల ఫలితంగా మన దేశ రూపాయి విలువ గింగిరాలు తిరిగి 83 రూపాయలకు పడిపోయింది. దీనితో ఆర్థిక వ్యవస్థ అతలాకుతలం అవుతోంది. ‘మేకిన్ ఇండియా’ అట్టర్ ఫ్లాప్ అయ్యింది. దేశం అప్పుల కుప్పగా తయారయ్యింది. స్వతంత్ర భారత దేశంలో 67 ఏండ్ల కాలంలో పాలించిన ప్రధానులందరూ చేసిన అప్పు రూ. 55.87 లక్షల కోట్లు. 2014 లో మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ఎని మిదిన్నర ఏండ్లలో చేసిన అప్పు అక్షరాల 80 లక్షల కోట్లు. ఇప్పుడు మొత్తం దేశం అప్పు రూ. 135.87 లక్షల కోట్లకు చేరుకుంది. అంతర్జాతీయ ఆకలి సూచిలో భారతదేశ ర్యాంక్ దారుణంగా దిగజారి 107వ స్థానానికి చేరుకుంది. మన చుట్టూ ఉన్న దేశాల కంటే మన దేశంలోనే ఆకలితో అలమటించే వారు ఎక్కువని ఈ ర్యాంక్ స్పష్టం చేస్తోంది. రైతుల వ్యవసాయ బావుల మోటార్లకు మీటర్లు పెట్టాలని నెల నెలా రైతులు కరెంట్ బిల్లులు కట్టాల్సిందేనని రాష్ట్రాల మెడల మీద కత్తి పెట్టి బెదిరి స్తుంది మోదీ సర్కార్. ఉచిత విద్యుత్తును రైతులకు ఇవ్వొ ద్దని ఆదేశిస్తున్నది. కృష్ణా నది జలాల్లో తెలంగాణ వాటా తేల్చకుండా రాజకీయం చేస్తూ రెండు రాష్ట్రాల మధ్య తగువు పెంచుతోంది.
దేశంలో కొత్తగా 157 మెడికల్ కాలేజీలను మంజూరు చేసిన మోదీ ప్రభుత్వం అందులో ఒక్కటంటే ఒక్కటి కూడా తెలంగాణకు ఇవ్వకపోవడం కేంద్రం వివక్షకు సంకేతం. ప్రతి జిల్లాకు ఒక నవోదయ పాఠశాల ఇవ్వాలని చట్టం చెబుతున్నా తెలంగాణ లోని కొత్త జిల్లాల్లో ఒక్క నవోదయ పాఠశాల కూడా ఏర్పాటు చేయకుండా కక్ష పూరితంగా వ్యవహరించింది. ఎనిమిదిన్నరేండ్లలో ఐఐటీ, ఐఐఎం, ట్రిపుల్ ఐటీ లాంటి 36 ప్రీమియర్ విద్యాసంస్థలను వివిధ రాష్ట్రాల్లో నెలకొల్పిన కేంద్రం తెలంగాణలో ఒక్క ఉన్నత విద్యాసంస్థను కూడా ఏర్పాటు చేయలేదు. విభజన చట్టం ప్రకారం ట్రైబల్ వర్సిటీ ఏర్పాటు చేయాల్సి ఉండగా కొర్రీలు పెడుతూ, జాప్యం చేస్తూ రాష్ట్ర విద్యార్థులకు అన్యాయం చేస్తున్నది.
కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ విషయంలో మోసానికి పాల్పడింది మోదీ సర్కారు. ఇక్కడ పెట్టాల్సిన కోచ్ ఫ్యాక్టరీని వేరే చోటుకు తరలించి రాష్ట్రంలోని ప్రజల దశాబ్దాల కలల్ని కాల్చేసింది. బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ పై అబద్ధాలు చెబుతూ ఫ్యాక్టరీ పెట్టడం కుదరదని చావు కబురు చల్లగా చెప్పారు. గిరిజన ప్రజల ఆశల్ని అవకాశాల్ని ఆవిరి చేశారు. పక్క రాష్ట్రాల ప్రాజెక్టులకు జాతీయ హోదా ఇస్తున్న కేంద్రం పాలమూరు రంగారెడ్డి, కాళేశ్వరం ప్రాజెక్టులకు హోదా అడిగితే కుదరదని చెప్పి తెలంగాణ రైతాంగంపై పగ పట్టినట్టు వ్యవహరిస్తున్నారు కేంద్ర పెద్దలు. వెనుకబడిన జిల్లాల అభివృద్ధి నిధులను ఎగ్గొడుతూ బకాయిల్ని విడుదల చేయకుండా తప్పించుకు తిరుగుతున్నది మోదీ ప్రభుత్వం. 9, 10 షెడ్యూళ్లలోని సంస్థలను విభజించకుండా నాన్చుతూ రెండు రాష్ట్రాల మధ్య చిచ్చుపెట్టి చోద్యం చూస్తున్నది.
ఈ విధంగా మోదీ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలను అవలంభిస్తూ ఇచ్చిన హామీలు నెరవేర్చ కుండా మత విద్వేషాలను రెచ్చ గొడుతూ పబ్బం గడుపుకుంటున్నది. ప్రజలు ఎన్నుకున్న బీజేపీయేతర రాష్ట్ర ప్రభుత్వాలను కూల్చడానికి ప్రయత్నిస్తున్నారు. తమను వ్యతిరేకించిన వారిని ఈడీ, సీబీఐ లాంటి దర్యాప్తు సంస్థలను ఉసిగొల్పి కేసులు పెట్టి వేధించి లొంగదీసు కుంటున్నారు. బీజేపీ యేతర రాష్ట్ర ప్రభుత్వాలను గవర్నర్ల ద్వారా అనేక ఇబ్బందులు పెడుతున్నారు. ఒకే భాష, ఒకే మతం, ఒకే ఎన్నిక, ఒకే పార్టీ ఉండాలనే లక్ష్యంతో ఫాసిస్టు పోకడలతో మోదీ ఈ ఎనిమిదిన్నర సంవత్సరాలు పాలన సాగిస్తూ వచ్చారు.
తెలంగాణ రాష్ట్రానికి ఏ విధమైన సహాయం అందిం చకపోగా ఈ ప్రభుత్వాన్ని అక్రమ పద్ధతుల్లో పడగొట్టడానికి ఢిల్లీ బ్రోకర్ల ద్వారా వందల కోట్ల రూపాయలతో ఎమ్మె ల్యేలకు ఎరజూపి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్న క్రమంలో ఆ దొంగలు బయటపడ్డారు. తమ పప్పులు ఉడకకపోవడంతో గవర్నర్‌ని ఉపయోగించి ప్రభుత్వాన్ని అస్థిర పరిచేందుకు కుట్రలు పన్నుతున్నారు. (క్లిక్ చేయండి: రాష్ట్రాల వృద్ధిలో కేంద్రం పాత్రేమిటి?)
ఇది ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టు లాంటిది. దీన్ని తిప్పి కొట్టవలసిన సమయం ఆసన్నమైంది. అధికార టీఆర్‌ఎస్ ఒక్కటే కాకుండా రాష్ట్రంలోని వామపక్షాలు, అభ్యదయ, లౌకిక శక్తులు అందరినీ కలుపుకొని కేంద్రం మీద యుద్ధభేరి మోగించాలి. అదే సమయంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా గతంలో తాను ఇచ్చిన హామీలు, వాగ్దానాలు అమలుకు పూనుకోవాలి. ప్రగతిభవన్‌లో ప్రజా దర్బార్ ప్రారంభించాలి. ప్రజల సమస్యలు తెలుసుకోవాలి. ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఆ బాధ్యతను భుజానికెత్తు కోవాలి. ఇవన్నీ చేసినప్పుడే బీజేపీ ఆటలు సాగకుండా నివారించగలుగుతాము. అదే మనందరి కర్తవ్యం.
- జూలకంటి రంగారెడ్డి
సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు, మాజీ ఎమ్మెల్యే
Comments
Please login to add a commentAdd a comment