నోట్ల రద్దు తుపానును తట్టుకున్న ప్రతిభా పాటవం!
అవలోకనం
జనాభాలోని అతి పెద్ద విభాగాలను మోదీ తన పక్షానికి తిప్పుకోగలిగారు. బహుశా ఆయనకు ఓటేయని లక్షలాది ప్రజలు కూడా ఒక కీలకమైన మార్పులో తాము పాల్గొంటున్నామన్న ఉద్దేశంతో పెద్ద నోట్ల రద్దుతో తమకు కలుగుతున్న అసౌకర్యాన్ని పెద్దగా లెక్కించలేదు. మన్మోహన్ సింగ్ ప్రభుత్వం ఈ చర్యకు సిద్ధపడి ఉంటే మీడియా కానీ, మధ్యతరగతి పట్టణ జనాభా కానీ ఇలాంటి ఉల్లాస స్థితిని పొంది ఉండేదని ఊహించడానికి కూడా సాధ్యం కాదు. పెద్ద నోట్లను రద్దు చేసిన వెంటనే జనావళి ఆగ్రహాన్ని వ్యక్తం చేసి ఉండేది.
భారతదేశంలో ఏ నాయకుడు కానీ, ఆధునిక ప్రజాస్వామ్యంలో ఏ ఇతర రాజ కీయ నేత కానీ.. గత ఏడు వారాలుగా కొనసాగుతున్న పెద్దనోట్ల రద్దు అనంతర సంక్షోభంలో నరేంద్రమోదీలాగా బతికిబట్టకట్టి ఉండేవారు కాదు. జనరంజక నేతగా మోదీ ప్రతిభాపాటవాలకు ఎవరైనా రుజువుకోసం చూస్తున్నట్లయితే, ఈ ఏడువారాల కాలంలోనే అది ప్రదర్శితం కావడాన్ని చూడవచ్చు. ఆ మహాద్భుత ప్రదర్శనను చూసి అభినందిద్దాం. ఎందుకంటే మనం ఒక నిజమైన పరిపూర్ణ నాయకుడి సమక్షంలో ఉన్నాం.
పెద్ద నోట్ల రద్దు సంక్షోభం గురించి కేంద్ర ప్రభుత్వం ముందుగా గ్రహించలేదనడానికి మనకు ప్రస్తుతం కొన్ని ఆధారాలు అందుబాటులో ఉన్నాయి. మొదటిది ఏదంటే పరిస్థితులు సాధారణ స్థితికి చేరుకుంటాయని మోదీ ప్రారంభ ప్రకటనలో కొన్ని అంచనాలు వెల్లడించారు కానీ అది తప్పని తేలిపోయింది. రెండోది. ఆర్థిక వ్యవస్థపై నోట్ల కొరత ప్రభావం అర్థమవుతున్న తరుణంలో మోదీ ముందే నిర్ణయించుకున్న షెడ్యూల్ ప్రకారం జపాన్ సందర్శనను కొనసాగించారు. జపాన్ నుంచి ఆయన స్వదేశానికి తిరిగివచ్చే సమయానికి జనం క్యూలు అంత త్వరగా అదృశ్యం కావన్న విషయం స్పష్టమైంది.
పెద్ద నోట్ల రద్దుపై మోదీ ప్రారంభ ప్రకటన ఎంత శక్తివంతంగానూ, సమర్థవంతంగానూ ఉండిందంటే అది వెంటనే ప్రజాభిప్రాయాన్ని సానుకూలంగా మలి చింది. మీడియా మొత్తంగా మోదీ పక్షాన నిలిచింది. ఆత్మవిశ్వాసం కోల్పోయిన కాంగ్రెస్ పార్టీ సైతం మోదీ చర్యకు మద్దతు తెలుపుతున్నట్లు ప్రకటించింది. క్షేత్రస్థాయి నుంచి ఎదిగివచ్చిన నేతలు మమతా బెనర్జీ, అరవింద్ కేజ్రీవాల్ ఇరువురూ మోదీ చర్యలోని ప్రమాదాన్ని పసిగట్టి వ్యతిరేకత ప్రకటించారు.
వాస్తవానికి జనాభాలోని అతి పెద్ద విభాగాలను మోదీ తన పక్షానికి తిప్పుకోగలిగారు. బహుశా ఆయనకు ఓటేయని లక్షలాది ప్రజలు కూడా ఒక కీలకమైన మార్పులో తాము పాల్గొంటున్నామన్న ఉద్దేశంతో తమకు కలుగనున్న అసౌకర్యాన్ని పెద్దగా లెక్కించలేదు. మన్మోహన్ సింగ్ ప్రభుత్వం ఇలాంటి పెద్ద నోట్ల రద్దు చర్యకు సిద్ధపడి ఉంటే మీడియా కానీ, మధ్యతరగతి పట్టణ జనాభా కానీ ఇలాంటి ఉల్లాస స్థితిని పొంది ఉండేదని ఊహించడానికి కూడా సాధ్యం కాదు. అలా చేసి ఉంటే జనం ప్రతిస్పందన పూర్తి భిన్నంగా ఉండేది. పెద్ద నోట్లను రద్దు చేసిన వెంటనే జనం ఆగ్రహించేది. ఏడువారాలు కొనసాగివుంటే అది తీవ్రక్రోధంగా పరిణమించేది. నోట్ల రద్దు ద్వారా కలుగుతున్న ఇబ్బంది మరికొన్ని నెలలు కొనసాగనుందని స్పష్టమవుతుండటంతో ఇప్పుడు జనంలో ఆగ్రహం పొడ సూపుతోంది. అయితే ఇన్ని వారాలపాటు సంక్షోభం కొనసాగడం గణనీయమైనదే అయినప్పటికీ మోదీ దాన్ని ఇంకా కొనసాగించనున్నారు.
మోదీ ప్రతిభాపాటవాలకు సంబంధించిన రెండో ఉదాహరణ ఏదంటే తన చర్యపై ప్రతికూల ఫలితం ఊహించిన దానికంటే పెద్దదిగానే ఉందని ఆయన చాలా త్వరగా గ్రహించడమే. జపాన్ నుంచి తిరిగొచ్చిన వెంటనే మోదీ వరుస ప్రసంగాలు చేశారు. వాటిలో రెండు విషయాలను పేర్కొన్నారు. తన జీవన కర్తవ్యం కోసం తన కుటుంబ జీవితాన్నే త్యాగం చేశానని దేశప్రజలకు స్పష్టం చేశారు. ఈ సమస్య చేతులు దాటిపోయిందని గ్రహించారు కనుకే ప్రసంగిస్తూ మధ్యలోనే తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. రెండోది. నోట్ల రద్దు తర్వాత 50 రోజుల్లోపు సాధారణ స్థితి నెలకొనదని మోదీ చెప్పారు. ఈ రెండో చర్య ద్వారా, తన వ్యూహాన్ని మళ్లీ అంచనా వేసుకోవడానికి తగినంత సమయాన్ని మోదీ సాధించుకున్నారు. ఆవిధంగా మీడియాను మళ్లీ తన పక్షానికి తిప్పుకున్నారు. ప్రజలెదుర్కొంటున్న తక్షణ సమస్యలనుంచి మీడియా దృష్టిని మళ్లించగలిగారు.
మోదీ 50 రోజుల అసౌకర్యంపై చేసిన ఈ వ్యాఖ్య నోట్ల రద్దుతో ఎలా వ్యవహరించాలో ఆలోచించే స్వేచ్ఛను ఆయనకు అందించింది. కొన్ని మీడియా ప్రచురణలు సూచించినట్లుగా మోదీ ప్రారంభ ప్రసంగంలో డిజిటల్ ఆర్థిక వ్యవస్థ గురించిన ప్రస్తావన లేదు. నల్లధనం, నకిలీ కరెన్సీ, ఉగ్రవాదానికి మాత్రమే మోదీ తొలి ప్రసంగం పరిమితమైంది. అయితే జపాన్ నుంచి తిరిగొచ్చాక చేసిన ప్రసంగాలు నోట్ల రద్దు ప్రక్రియలో ఉన్నట్లుండి మార్పులను తీసుకొచ్చాయి. ఈ ఆకస్మిక మార్పులకు కూడా మోదీ ప్రతిభ, విశ్వసనీయతే కారణం. ఈ మార్పు గోల్ పోస్టును మార్చడమేనని ప్రతిపక్షం అనొచ్చు కానీ, నోట్ల రద్దు విధానం మంచి దని, ప్రజలకు కలుగుతున్న అసౌకర్యం అంతిమంగా లబ్ధి కలిగిస్తుందని విస్తృత ప్రజానీకానికి నచ్చచెప్పినంతవరకు మోదీ తాననుకున్న ప్రకారమే వెళతారు. ఈ విధానంలోని నిర్దిష్ట ప్రయోజనాలు రాజకీయాలకు అనవసరం.
పెద్ద నోట్ల రద్దు జరిగిన 40 రోజుల తర్వాత కూడా దేశవ్యాప్తంగా బీజేపీ ఎన్నికల్లో విజయాలు సాధిస్తుండటమే దీనికి ఉదాహరణ. ప్రభుత్వ వ్యతిరేకతను ఎదుర్కొంటున్న పంజాబ్‌లో కూడా బీజేపీ విజయం సాధించడం గమనార్హం. వాస్తవానికి ఈ క్షణంలో మాత్రం మోదీకి ఎదురుగా ప్రతిపక్షం లేదనే చెప్పాలి. ప్రతి భారతీయుడినీ నోట్ల రద్దు చర్య ప్రతికూలంగా ప్రభావితం చేస్తున్నప్పటికీ మోదీ ఇప్పటికీ పరిస్థితులను పూర్తిగా తన అదుపులోనే పెట్టుకుంటున్నారు. జనంలో అసౌకర్యాన్ని ఉపయోగించుకుని లబ్ధి పొందే అవకాశం కాంగ్రెస్‌కు వచ్చినప్పటికీ దాన్ని ఆ పార్టీ ఇంతవరకు వినియోగించుకోలేదు. పెద్ద నోట్ల రద్దును వ్యతిరేకిస్తూ బహిరంగంగా ప్రకటించడానికి చాలా మంది ఊగిసలాడుతున్నారు. అలా చేస్తే తమను ఎక్కడ నిందిస్తారో అనే భయం వారిది.
నవంబర్ 8 నాటి నుంచి మోదీ సాధించిన దాన్ని భారత్‌లో ఏ నాయకుడూ సాధించి ఉండేవారు కాదు. ప్రజాస్వామిక రాజకీయాల్లో అతికొద్ది మందినేతలకు మాత్రమే ఇది సాధ్యమయింది. నవంబర్ 8 తర్వాత రెండో నెల వేతనాలకు జనం వెంపర్లాడే సమయానికి అంటే 2017 ప్రారంభంలో ఈ పరిస్థితిలో మార్పు కలుగవచ్చు. అంతవరకు ప్రధాని మోదీ అనుభవిస్తున్న వైభవం కేవలం అదృష్టం కాదని, ప్రజాభిప్రాయాన్ని తనవైపునకు తిప్పుకోవడమే కాకుండా దాన్ని కొనసాగించడమే అసలు కారణం అని తప్పక గ్రహించాల్సి ఉంటుంది.
(వ్యాసకర్త : ఆకార్ పటేల్ కాలమిస్టు, రచయిత aakar.patel@icloud.com )