‘రద్దు’ కాదు మోదీ విజయ పరంపరకు అడ్డుకట్ట
అవలోకనం
ఆర్థికరంగంలో నిజంగా ఎలాంటి మెరుగైన పనితీరును ప్రదర్శించకుండానే భారత్‌లో నెహ్రూ, ఆయన కుమార్తె ఇందిర , పాకిస్తాన్‌లో జుల్ఫికర్ ఆలీ భుట్టో, ఆయన కుమార్తె బెనజీర్ భుట్టో తమ ఓటర్లకు తాము అంటిపెట్టుకుని ఉండగలిగారు. సరిగ్గా అలాగే భారత ప్రధాని నరేంద్ర మోదీ కూడా ఓటర్లపై తన పట్టును నిలుపుకోగలరని అనుకోవచ్చు. అందువలన బీజేపీ తన విజయ పరంపరను 2017లో కూడా కొనసాగిస్తే ఆశ్చర్యపడాల్సింది ఏమీ లేదు.
ఒక నాయకుని జనాదరణను అంచనా వేసేటప్పుడు ఆ నేత పనితీరుకు ఉండే ప్రాముఖ్యత ఏమిటి? తార్కికంగా చూస్తే ప్రజలకు సుఖసంపదలను కలుగ చేయగలిగిన నేతకు ప్రజాదరణ లభిస్తుందని భావించాలి. ప్రజాస్వామ్య విధా నాలలోకెల్లా అత్యంత ముఖ్యమైన, విలువైన అంశం అదే అనిపిస్తుంది. కాబట్టి దేశం లేదా రాష్ట్రం అధిక ఆర్థిక వృద్ధి రేటును సాధిస్తున్న కాలంలో అధికారంలో ఉన్న పార్టీలు తిరిగి అధికారంలోకి రాగలుగుతాయి. గత రెండు దశాబ్దాల కాలంలో చాలా మంది భారత నేతలు ప్రభుత్వ వ్యతిరేకతను తలకిందులు చేసి అధికారాన్ని నిలబెట్టుకోగలిగారు. ఒడిశాలో నవీన్ పట్నాయక్, బిహార్‌లో నితీష్ కుమార్, మధ్యప్రదేశ్‌లో శివరాజ్ సింగ్ చౌహాన్, పశ్చిమ బెంగాల్‌లో మమతా బెనర్జీ వంటి ముఖ్యమంత్రులు ఈ సందర్భంగా మనకు గుర్తుకు వస్తారు. తమ రాష్ట్రాలు సాపేక్షికంగా త్వరితగతిన వృద్ధి చెందుతున్న కాలంలో వారు నాయ కులుగా ఉన్నారు, అధికారంలో ఉన్నారు.
ప్రభుత్వ వ్యతిరేకతను ఒక శక్తివంతమైన రాజకీయ అంశంగా భావిస్తారు. ఆ గుదిబండను తలకిందులు చేయడానికి ఆర్థిక వృద్ధి వారికి తోడ్పడింది. దీనికి విరుద్ధ తర్కాన్ని బట్టి చూస్తే... మంచి పనితీరును, ప్రత్యేకించి ఆర్థిక వ్యవస్థ విషయంలో మంచి పనితీరును ప్రదర్శించలేని నాయకులను ఓటర్లు శిక్షిస్తారు. తమకు నాయకులుగా ఉన్నవారు ఆర్థిక సంపద రీత్యా తమ జీవితాల్లో పరి వర్తనను తేవాలని ఓటర్లు ఆశిస్తారు.
దీనికి మద్దతుగా నిలిచే గణాంక సమాచారమేమీ లేకపోవడమే ఈ సిద్ధాంతంతో ఉన్న సమస్య. చారిత్రకంగా మన దేశం అత్యున్నత ఆర్థిక వృద్ధిని సాధిస్తుండిన 2004–2014 దశాబ్దిలో కాంగ్రెస్ అధికారంలో ఉంది. అయినా అది 2014 ఎన్నికల్లో చిత్తు చిత్తుగా ఓడిపోయింది, లోక్‌సభలో ఎన్నడూ ఎరుగనంతటి అతి తక్కువ స్థానాలకు దిగజారిపోయింది. ఆ ఎన్నికలను ఇతర అంశాలు ప్రభావితం చేశాయని ఎవరైనా అనొచ్చు. మన్మోహన్ ప్రభుత్వంపై పడ్డ అవినీతి ముద్ర, మోదీ రంగంపైకి రావడం, దూకుడుగా ప్రచారం సాగించడం అనేవి సుస్పష్టంగా కనిపించే ఇతర అంశాలు. కాబట్టి 2014 సార్వత్రిక ఎన్నికలను మనం ఒక మినహాయింపుగా లేదా ఈ సిద్ధాంతం పరిధిలోకి రానిదిగా చూడవచ్చు.
దురదృష్టవశాత్తూ అంతకు ముందటి గణాంక సమాచారం మరింత అర కొరగా ఉంది. 2004 వరకు సాగిన ఐదేళ్ల అటల్ బిహారీ వాజ్‌పేయి పాలన ఇటీవలి కాలంలో అత్యధిక వృద్ధిని సాధించిన కాలంగా రెండవ స్థానంలో నిలుస్తుంది. ఆ ఎన్నికలలో విజయం పట్ల ఆయన ఎంతో ధీమా చూపారు. ‘భారత్ వెలిగిపోతోంది’ అనే ప్రకటనల యుద్ధంతో ఆయన తమ ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించారు. కానీ ఆయన ఓటమి పాలయ్యారు. ఆయన ఓట మికి కారణాలు సైతం నిజంగా ఎవరికీ అర్థంకానివే. దేశాన్ని తాము సౌభాగ్య వంతం చేశామనే భారతీయ జనతా పార్టీ విశ్వాసం వాస్తవ దూరమైననది, నిరాధారమైనది ఆనే ఊహాగానం ప్రచారంలోకి వచ్చింది. అంటే పనితీరు బాగుండి ఉంటే ఆయన ఆ ఎన్నికల్లో గెలిచి ఉండేవారే కదా?
నేనైతే కాదు అంటాను. ఉపఖండంలో జరిగే ఎన్నికలలో విజయాన్ని సాధించడానికి ఆర్థికరంగంలోని పనితీరు బాగుండటం ఆవశ్యకమైన çపరిస్థితేమీ కాదు. అందుకు అంతకు ముందటి దశాబ్దాలలోని ఆర్థిక రంగం పని తీరే రుజువు. స్థూల జాతీయోత్పత్తి రీత్యా 1950లు,1960లలో ఆర్థిక రంగంలో కాంగ్రెస్ పని తీరు మరీ నాసిరకమైనది. ‘హిందూ వృద్ధి రేటు’ అంటే ఆ కాలం నాటి 3 శాతం లేదా అంతకంటే తక్కువ వృద్ధి రేటు అని అర్థం. అయినా కాంగ్రెస్ ఆ కాలంలో గొప్ప ఎన్నికల విజయాలను సాధించింది.
నేడు సుపరిపాలనగా మనం పిలిచేది ఏదీ ఆ కాలంలో కనబడలేదు లేదా చర్చకు రాలేదు. 1960ల నాటికంటే నేడు మనం పూర్తిగా భిన్నమైన ప్రజలమా? కాదంటాను నేను. దేశాలు, ప్రత్యేకించి భారత్ వంటి ప్రాచీన దేశాలు అంత నాటకీయంగా మారిపోజాలవు. కాబట్టి అన్నిటికంటే మిన్నగా ఆర్థిక రంగంలోని పనితీరే ఎన్నికలలో లబ్ధిని చేకూర్చే అంశం అనడానికి ఎలాంటి ఆధారం లేదనే చెప్పాలి.
పెద్ద నోట్ల రద్దు ఫలితంగా నేడు నెలకొన్న సంక్షోభం 2017 ఎన్నికలలో మోదీ పార్టీ విజయావకాశాలను ఎలా ప్రభావితం చేస్తుంది? దానిని పరిశీలిం చడం కోసమే మనం ఈ అంశాన్ని చర్చిస్తున్నాం.పెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్‌తో పాటు పంజాబ్, గోవా వంటి చిన్న రాష్ట్రాలలోనూ, ఆ తదుపరి గుజరాత్‌లోనూ బీజేపీ ఎన్నికలను ఎదుర్కోవాల్సి ఉంది. మోదీ హయాంలో ఆర్థిక రంగం పని తీరు నిరుత్సాహకరంగా ఉండటం, ఉపద్రవంగా మారిన పెద్ద నోట్ల రద్దు వ్యవ హారం మోదీని పరాజితుడ్ని చేసే అవకాశం ఎక్కువగా ఉన్నదని ఆ పార్టీ వ్యతి రేకులు భావించవచ్చు.
అది మరీ అంత సామాన్యమైన విషయమేమీ కాదనుకుంటాను. ప్రజలను సమ్మోహితులను చేసే శక్తి, విశ్వసనీయత, కథనాత్మకత ఇంకా మోదీ పక్షానే ఉన్నాయి. కొందరు ఓటర్లలో ఉన్న అసంతృప్తిని ఆగ్రహంగా పరివర్తన చెందించ డానికి ప్రతిపక్షం చాలా కృషి చేయాల్సి ఉంటుంది. నోట్ల రద్దు దుష్ప్రభావం ఫిబ్రవరిలో కూడా కొనసాగినంత మాత్రాన, అది విజయాన్ని వారి ఒడిలోకి వచ్చి వాలేలా చేస్తుందని ఆశించడానికి వీల్లేదు. నిర్లక్ష్యపూరితంగా జరిపిన నోట్ల రద్దు వల్ల ఆర్థిక వ్యవస్థ దెబ్బతిన్నా, కొన్ని త్రైమాసికల పాటు జీడీపీ వృద్ధి కొన్ని పాయింట్లు తగ్గినా... వాటికవే మోదీ జనాదరణను మటుమాయం చేయలేవు.
ఆర్థికరంగంలో నిజంగా ఎలాంటి మెరుగైన పనితీరును ప్రదర్శించకుండానే భారత్‌లో నెహ్రూ, ఆయన కుమార్తె ఇందిర , పాకిస్తాన్‌లో జుల్ఫికర్ ఆలీ భుట్టో, ఆయన కుమార్తె తమ ఓటర్లకు తాము అంటిపెట్టుకుని ఉండగలిగారు. సరిగ్గా అలాగే మోదీ కూడా ఓటర్లపై తన పట్టును నిలుపుకోగలరని అనుకోవచ్చు. అందు వలన బీజేపీ తన విజయ పరంపరను 2017లో కూడా కొనసాగిస్తే ఆశ్చర్య పడాల్సింది ఏమీ లేదు.
(వ్యాసకర్త ఆకార్ పటేల్, కాలమిస్టు,
రచయిత aakar.patel@icloud.com )