ఎన్నాళ్లీ ఉక్కుతెరలు?
సామాన్యుని నోట్లు రద్దు చేసినపుడు కనీసం కారణాలు చెప్పకుండా వాటిని రహస్యాలుగా పరిగణించి చుట్టూ ఇనుప కోట గోడలు నిర్మించడం సమంజసమా? రెండో బాహుబలిగాడైనా ఈ గోడలు కూల్చగలడా?
ఢిల్లీలోని రెండు పోస్టాఫీసు శాఖల్లో 2016 నవంబర్ 8 నుంచి 25 వరకు ఎంతమంది వ్యక్తులు నోట్ల మార్పిడి చేసుకున్నారు? 8 నవంబర్ నుంచి 1 డిసెంబర్ వరకు ఎంతడబ్బు మార్పిడి జరిగింది? వారిలో ఎంతమంది తమ ఐడీ కార్డులు చూపారు అని రాంస్వరూప్ కోరారు. కోరిన సమాచారం సిద్ధంగా లేదు, ఇవ్వం పొమ్మన్నారు తపాలా వారు. ఈ దరఖాస్తును తిరస్కరించేముందు పీఐఓ బుర్రను ఉపయోగించారా అనే అనుమానం కలుగుతుంది. సెక్షన్ 7(9) ప్రకారం అడిగిన రూపంలో లేకపోతే, అడిగిన రీతిలోకి మార్చేందుకు విపరీతంగా వనరులు ఉపయోగించవలసి వస్తే ఆ రూపంలో కాకుండా ఉన్న రూపంలోనే ఇవ్వాలని చట్టం నిర్దేశిస్తున్నదే గాని తిరస్కరించే అవకాశం ఇవ్వలేదు.
విపరీతంగా వనరుల వినియోగం అవసరం లేకపోతే అడిగిన రూపంలో ఇవ్వాలని ఈ సెక్షన్ వివరిస్తున్నదే గాని తిరస్కారానికి మినహాయింపు కాదు. సమాచారం సేకరించనవసరం లేదని కొందరు అధికారులు భావిస్తున్నారు. అది సరి కాదు. కొన్ని కోర్టులు సమాచారం సృష్టించనవసరం లేదని తీర్పులు ఇచ్చిన మాట నిజమే. దాని అర్థం ఆ విభాగంలో లేని సమాచారాన్ని కొత్తగా తయారు చేయనవసరం లేదనే కానీ విభిన్నమైన ఫైళ్లలో ఉన్న సమాచారాన్ని సేకరించను పొమ్మని తిప్పికొట్టడానికి వీల్లేదు. రోజూ ఎంతమంది, ఎన్ని నోట్లు మార్చుకున్నారో లెక్క తీసి చెప్పలేరా? ఐడి ఎంతమంది చూపారో లేదో కూడా చెప్పలేరా? రాంస్వరూప్ అడిగిన సమాచారం ఇవ్వడానికి పెద్ద కష్టపడాల్సిన అవసరం గానీ, డబ్బు ఖర్చుచేయాల్సిన పని గానీ లేదు. 17 లేదా 22 రోజుల రిజిస్టర్ పేజీల్లో అంకెలను కూడడం అంత కష్టమా?
పీఐఓని మించిపోయారు మొదటి అప్పీలు అధికారి. ఆయన ఇది వ్యక్తిగత సమాచారం కనుక ఇవ్వజాలమని తీర్పు చెప్పారు. వీరు కూడా బుర్ర ఉపయోగించారని చెప్పలేము. నోట్లు మార్చుకున్న వారి చిరునామాలు వ్యక్తిగతం అంటే ఒప్పుకోవచ్చు కాని, ఎంత సొమ్ము ఎందరు మార్చుకున్నారనే సమాచారం వ్యక్తిగతం అయ్యే అవకాశమే లేదు. అసలు పబ్లిక్ అథారిటీలు పెద్ద నోట్ల రద్దు విషయమై ఎవరు అడిగినా లేదనడమే నేర్చుకున్నారు. సమాచారం ఇస్తే ఏమవుతుందో అనే భయం తప్ప ఇది ప్రజలకు సంబంధించిన విషయం, ఇవ్వవలసిన బాధ్యత ఉందనే ఆలోచనే లేదా?
ప్రజలను ప్రభావితం చేసిన విధాన నిర్ణయ వివరాలను ఎవ్వరూ అడగకుండా తమంతట తామే ఇవ్వడం ప్రభుత్వ విభాగాల బాధ్యత అని సెక్షన్ 4 చాలా స్పష్టంగా వివరించింది. 10 మార్చి 2017న రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పెద్ద నోట్ల రద్దు ప్రభావం తొలి అంచనా పేరుతో ఒక అధికారిక నివేదిక ప్రకటించింది. అవినీతి, నల్ల ధనం, దొంగనోట్లు, ఉగ్రవాదులకు సాయం చేసే ధనం వంటి తీవ్రమైన సమస్యలపై దాడిచేయడానికే పెద్ద నోట్ల రద్దు చేసారని, ఈ మహా లక్ష్యాలను సాధించే క్రమంలో ఆర్థిక కార్యకలాపాలపైన ఈ నిర్ణయం తీవ్రమైన ప్రభావం చూపిందని, ముఖ్యంగా నవంబర్ డిసెంబర్ నెలల్లో విపరీతంగా ఇబ్బందులెదురైనాయని జనవరి నెలలో కష్టాలు కాస్త తగ్గాయని వివరించారు. ప్రధానమంత్రి జనధన్ యోజనలో ఖాతాలు విపరీతంగా పెరిగాయని పేర్కొన్నారు.
ఆర్థిక వేత్తలంతా పెద్దనోట్ల రద్దు అనే ఈ దిగ్భ్రాం తికరమైన విధానం ప్రభావాన్ని అధ్యయనం చేయవలసిన అవసరం ఉంది. అందుకని అడిగిన వివరాలు ఇవ్వడం ఈ పెద్దల బాధ్యత. సెక్షన్ 4 (1) సి డి నియమాల్లో తమ నిర్ణయాల వల్ల ప్రభావితమయ్యే ప్రజలకు నిర్ణయాల వివరాలను ఇవ్వాలని, పరిపాలక, అర్థన్యాయ నిర్ణయాలకు కారణాలను కూడా నిర్ణయాల ప్రభావం పడే వ్యక్తులకు ఇవ్వాలని సమాచార హక్కు చట్టం వివరిస్తున్నది. పెద్దనోట్ల రద్దు నిర్ణయం ప్రభావం పడని పౌరుడెవరయినా ఉన్నాడా? బిచ్చగాడు, రిక్షా నడిపేవాడు, తోపుడుబండి వర్తకుడు కూడా దెబ్బతిన్నాడు. డబ్బులేని పేదవాడు కూడా రాబోయే డబ్బు కోల్పోయాడు. పెద్ద క్యూలలో గంటలకొద్దీ ఎదురుచూడడం మాత్రమే కాదు సమయానికి చేతికి డబ్బు అందక సామాన్యులు తల్లడిల్లిపోయారు. ఈ కష్టాలు తాత్కాలికం అనీ, తరువాత అద్భుతమైన ప్రగతి జరిగిపోతుందని నమ్మిన పెద్దలు ఆ సంగతులు కూడా చెప్పాలి కదా.
నోట్ల రద్దు గురించి ఎవ్వరేమడిగినా ఇవ్వకూడదనే రహస్య రక్షణకు ఎందుకు కంకణం కట్టుకున్నారు? సామాన్యుని నోట్లు రద్దు చేసినపుడు కనీసం కారణాలు చెప్పకుండా వాటిని రహస్యాలుగా పరిగణించి చుట్టూ ఇనుప కోట గోడలు నిర్మించడం సమంజసమా, రెండో బాహుబలిగాడైనా ఈ గోడలు కూల్చగలడా? మన ప్రజాస్వామ్య దేశంలో నిజంగా నియమ పాలన సమపాలన జరుగుతున్నట్టయితే ఈ రహస్యాలు ఎందుకు? ఈ నిర్ణయం అమలు చేసే ప్రతి ప్రభుత్వ శాఖపైన ఈ విధానానికి కారణాలను, వివరాలను, ప్రభావానికి సంబంధించిన సత్యాలను, మంచి చెడుల వాస్తవాలను ప్రకటించవలసిన బాధ్యత ఉంది.
పెద్దనోట్ల రద్దు నిర్ణయానికి ముందే చెప్పాల్సిన వివరాలను ఆ తరువాత కూడా చెప్పకపోవడం న్యాయం కాదు. ప్రజా శ్రేయస్సు కోసం వ్యక్తిగత విషయాలను కూడా వెల్లడించవచ్చునని సమాచార హక్కు చట్టం నిర్దేశిస్తుంటే ఇంకా దాపరికం ఎందుకు? (రాంస్వరూప్ వర్సెస్ పోస్ట్ ఆఫీస్ సీఐసీ, పోస్ట్స్ ఎ, 2017, 10813 కేసులో 18.5.2017 నాడు ఇచ్చిన తీర్పు ఆధారంగా).
మాడభూషి శ్రీధర్
వ్యాసకర్త కేంద్ర సమాచార కమిషనర్
professorsridhar@gmail.com