కేంద్రంలో మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి... మతవాద, మితవాద నియంతృత్వ పోకడలతో పయనిస్తోంది. అచ్ఛే దిన్ వచ్చేస్తాయని ప్రజలకు నమ్మ బలికారు. 2015–16 కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టిన సందర్భంగా అప్పటి ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రసంగంలో 2022 నాటి కల్లా 6 కోట్ల మంది నిరుపేదలకు పక్కా ఇళ్ళు కట్టిస్తామని హామీ ఇచ్చారు. విద్య, వైద్యం అందరికీ ఉచితంగా అందిస్తామని; రైతులకు గిట్టుబాటు ధర కల్పిస్తామని, ప్రతి ఏటా 2 కోట్ల మందికి ఉద్యోగాలు కల్పిస్తామని, నల్లధనాన్ని బయటకు తీసి ప్రతి కుటుంబానికి 15 లక్షల చొప్పున అందిస్తామని వాగ్దానాలు చేశారు. వీటిలో ఏ ఒక్కటీ అమలుకు నోచు కోలేదు. ప్రజలు చచ్చే దిన్ వచ్చాయి.
మోదీ రాజ్యసభలో మాట్లాడుతూ... ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అక్రమ పద్ధతుల్లో విభజించారని వాపోయారు. విభజన జరగడంలో బీజేపీ పాత్ర ఉందనేది మర్చిపోయారా? అక్రమ పద్ధతుల్లో జరుగుతున్నప్పుడు ఆనాడు ఎందుకు ప్రశ్నించలేదు? గుడ్డిగా ఎందుకు బలపరిచారు? ఈ నాటకాలు ప్రజలు అర్థం చేసుకోలేరని అనుకుంటున్నారా? కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చి ఏడున్నర సంవత్సరాలు అవుతున్నా... తెలుగు రాష్ట్రాలకు విభజన చట్టంలో ఉన్నవి ఏ ఒక్కటీ అమలు చేయకుండా ప్రతి బడ్జెట్లో మొండి చేయి చూపిస్తూ తెలుగు ప్రజలకు అన్యాయం చేస్తున్నది. ప్రధాని ఇలా అబద్ధాలు చెప్పడం తగునా?
కేంద్ర ప్రభుత్వం తాజాగా పార్లమెంటులో ప్రవేశ పెట్టిన 2022–23 ఆర్థిక సంవత్సర బడ్జెట్ దేశ ప్రజలను మరోసారి మోసగించి మభ్యపెట్టే విధంగా ఉంది. ఈ బడ్జెట్ ప్రజలకు తీరని నష్టం చేసేలాగా, కార్పొరేట్లకు అధిక లాభదాయకంగానూ ఉంది. వ్యవసాయ రంగానికి కేటాయింపులు తగ్గించారు. ఎరువుల సబ్సిడీని తగ్గించారు. రైతు పంటకు గిట్టుబాటు ధరల గ్యారెంటీ లేదు. (చదవండి: వారికి ఆర్థిక స్థిరత్వం అక్కర్లేదా?)
రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామని చెప్పి కార్పొరేట్ శక్తులకు ఆదాయం పెంచే విధానాలు చేపడుతున్నారు. వ్యవసాయ రంగాన్ని మరింత సంక్షోభానికి నెట్టి వేస్తు న్నారు. పేదల ఆహార సబ్సిడీ సవరించిన అంచనాలతో 27.75 శాతం తగ్గించి కోత పెట్టారు. గ్రామీణ ఉపాధి హామీ పథకానికి గత బడ్జెట్ కంటే 25 వేల కోట్లు తగ్గించారు. ఇది ఉపాధి కూలీల జీవనోపాధిపై తీవ్ర ప్రభావం చూపుతుంది. (చదవండి: ఇది మనుషులు పట్టని అభివృద్ధి)
కరోనా రెండోదశ సృష్టించిన మృత్యు విలయం నుంచి గుణపాఠాలు తీసుకొని ఆరోగ్య రంగానికి పెద్ద పీట వేయాలి. అందుకు సరిపడే బడ్జెట్ కేటాయించాల్సిన అవ సరం ఎంతో ఉన్నప్పటికీ ఈ బడ్జెట్లో నామమాత్రంగా, స్వల్పంగా ఆరోగ్య మిషన్ కింద కేటాయింపులు చేశారు. విద్యారంగం కరోనాకు కుదేలైనా దాన్ని మళ్లీ గాడిలో పెట్టే చొరవ అంతగా కనిపించలేదు. ఏటా 3.5 లక్షల కోట్ల రూపాయల నుంచి 4 లక్షల కోట్ల రూపాయల వరకు పెట్టుబడులు పెట్టే స్థితిలో ఉన్న ఎల్‌ఐసీని 74 శాతం వాటాను కార్పొరేట్‌లకు ఇవ్వడం ద్వారా ప్రైవేటుపరం చేయడానికి పూనుకుంది. జాతీయ బ్యాంకుల ప్రైవేటీకరణ మొదలైంది. దీని వల్ల సామాన్య ప్రజలకు తీరని నష్టం జరుగుతుంది. ఎయిర్ ఇండియా, రైల్వే రంగం, జాతీయ రహదారులు, బీఎస్‌ఎన్‌ఎల్, బొగ్గు గనులు, ఓడరేవులు వంటి ప్రభుత్వం కింద ఉన్నవాటిని కార్పొరేట్ శక్తుల చేతుల్లో పెట్టడానికి మోదీ ప్రభుత్వం ఒక మధ్యవర్తిగా వ్యవహరిస్తున్నది.
కరోనాను ఎదుర్కొనడంలో మోదీ ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. ప్రభుత్వం అనుసరించిన తప్పుడు విధానాల వలన కరోనా కేసులు, మరణాలు విపరీతంగా పెరిగాయి. 2020 మార్చిలో ముందస్తు ప్రణాళిక లేకుండా అకస్మాత్తుగా లాక్‌డౌన్ ప్రకటించడం వలన ప్రజలు ఆర్థి కంగా చితికి పోయారు. ఈ నష్టానికి కేంద్రానిదే బాధ్యత. ఇలాంటి విధానాలతో దేశాన్ని తిరోగమనం వైపు తీసు కెళ్తున్నారు. ప్రజలు వీరి మోసపూరిత విధానాలను అర్థం చేసుకొని వారి రాజకీయ కుయుక్తులను తిప్పి కొడుతూ దేశ సంపదను, ప్రజల హక్కులను, ప్రజాస్వామ్యాన్ని కాపాడు కోవడానికి చైతన్యంతో వ్యవహరించాలి.
- జూలకంటి రంగారెడ్డి
మాజీ శాసనసభ్యులు, సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు
Comments
Please login to add a commentAdd a comment