
శత వసంతాల ద్రవిడ చైతన్యం
కొత్త కోణం
శత వసంతాల ద్రవిడ చైతన్యం బ్రాహ్మణ వ్యతిరేక ఉద్యమంగా ప్రారంభమై దేశ సామాజిక, సాంస్కృతిక, రాజకీయ జీవితంపై చెరగని ముద్రను వేసింది. అయితే అది బ్రాహ్మణ వ్యతిరేక చైతన్యాన్ని రగిల్చి, వారి ఆధిపత్యాన్ని నిరసించడానికే పరిమితమైంది. కుల వ్యతిరేక, కుల నిర్మూలన చైతన్యాన్ని అందించలేకపోయింది. ఆచరణలో అది సమాజంలో సమానత్వం, సోదరత్వాల భావనను పెంపొందింపజేయలేక పోయింది. అందువల్లనే దళితుల పట్ల వివక్షను నిరసించలేక పోయింది.
తమిళనాట ద్రవిడ చైతన్య స్రవంతికి శతవసంతాల చరిత్ర ఉన్నది. మొదట బ్రాహ్మణ వ్యతిరేక ఉద్యమంగా ప్రారంభమైన ఈ చైతన్యం దేశ సామాజిక, సాంస్కృతిక, రాజకీయ జీవితంపై చెరగని ముద్రను వేయగల ఉద్యమంగా పరిణమించింది. 1916 నవంబర్ 20న ఏర్పడ్డ దక్షిణ భారత సంక్షేమ సంస్థలో మొదట బ్రాహ్మణేతర జమీందార్లు, రాజులు, ధనవంతులు, వ్యాపా రస్తులు భాగస్వాములుగా ఉన్నారు. దీంతో ఆర్థిక ఇబ్బందులేమీ లేకుండా ఈ సంస్థ చాలా శక్తిమంతంగా పనిచేయడం మొదలు పెట్టింది. ఇంగ్లిషులో ‘జస్టిస్’, తమిళంలో ‘ద్రవిడియన్’ను, తెలుగులో ‘ఆంధ్ర ప్రకాశిని’ని అనే మూడు దిన పత్రికలను ఏక కాలంలో ఆ సంస్థ వెలువరించేది. 1916లో ఏర్పడ్డ జస్టిస్ పార్టీ 1920, 1923 ఎన్నికల్లో మద్రాసు ప్రెసిడెన్సీలో అధిక స్థానాలను సాధించి అధికారాన్ని హస్తగతం చేసుకుంది. అయితే 1926లో స్వరాజ్ పార్టీ విజయం సాధించిన తదుపరి ఆ పార్టీ 1936 దాకా ఉనికిలో ఉన్నప్పటికీ, ఆ ఎన్నికల్లో ఒక్క సీటును కూడా గెలుచుకోలేక పూర్తిగా కను మరుగైంది. దానితో ద్రవిడ ఉద్యమం మొదటి దశ ముగిసింది.
బ్రాహ్మణాధిపత్య వ్యతిరేకత.. జస్టిస్ పార్టీ
దక్షిణ భారత సంక్షేమ సంస్థ, జస్టిస్ పార్టీలు ఆవిర్భవించడానికి బలమైన సామాజిక కారణాలున్నాయి. బ్రిటిష్ పాలనలో అందివచ్చిన ఇంగ్లిష్ విద్య బ్రాహ్మణులతో సహా కొన్ని బ్రాహ్మణేతర కులాలను కూడా విద్యావంతులను చేసింది. కానీ ప్రభుత్వోద్యోగాలపై బ్రాహ్మణుల గుత్తాధిపత్యం నెలకొంది. మద్రాసు ప్రెసిడెన్సీ నుంచి 1882-1904 మధ్య 16 మంది ఇండియన్ సివిల్ సర్వీస్(ఐసిఎస్)కు ఎంపికైతే అందులో 15 మంది బ్రాహ్మణులే. 1913లో 128 శాశ్వత జిల్లా మున్సిఫ్ మెజిస్ట్రేట్ ఉద్యోగాలను కల్పిస్తే అందులో 93 మంది బ్రాహ్మణులవే. 1914లో మద్రాసు విశ్వవిద్యాలయం నుంచి 650 మంది పట్టభద్రులైతే అందులో 452 మంది బ్రాహ్మణులే. ఇక 1877లో 292 మంది న్యాయ తదితర శాఖల అధికారులను నియమిస్తే అందులో 202 మంది బ్రాహ్మణులే.
దీనితో మిగతా కులాలలోని సంపన్నులు, విద్యా వంతులు ఈ వివక్షకు వ్యతిరేకంగా సంఘటితం కావడం మొదలు పెట్టారు. పైగా అన్ని రంగాల్లో బ్రాహ్మణులదే పెత్తనం కావడం వల్ల వీరంతా సమాజం నుంచి వెలివేతకు గురైనట్టు భావించారు. అందువల్లనే సమాజంలోని పైపొ రల్లో ఉన్న వెల్లాల్ అనే సామాజిక వర్గం బ్రాహ్మణ వ్యతిరేక ఉద్యమానికి తొలిసారిగా నాయకత్వం వహించింది. ఫలితంగా 1916లో జస్టిస్ పార్టీ ఉనికిలోకి వచ్చింది. ఇందులో వెల్లాల్‌లతో పాటు, కమ్మ, రెడ్డి, నాయర్‌లు కూడా ప్రముఖ స్థానంలో ఉండేవారు. అయితే అది శూద్రులలోని పై వర్గాలకే ప్రాతినిధ్యం వహించడం వల్ల త్వరలోనే కనుమరుగైంది.
1920లో అధికారంలోనికి వచ్చిన జస్టిస్ పార్టీ పలు సంస్కరణలను చేపట్టింది. దేవాదాయ చట్టంలో మార్పులు, పరిశ్రమలకు సహాయం, సివిల్ సర్వీసును భారతదేశానికి అన్వయించే విధంగా రూపొందించడం, విద్యా భివృద్ధి, పురుషులతో సమానంగా మిహ ళలకు ఓటు హక్కును కల్పించడం, సివిల్ సర్వీసుల్లో బ్రాహ్మణేతరులకు రిజర్వేషన్లు వంటివి వాటిలో ముఖ్యమై నవి. అయితే వీటివల్ల బ్రాహ్మణాధిపత్యం స్థానంలో బ్రాహ్మణేతర ఆధిపత్య కులాల పెత్తనం పెరిగింది. ఇతర నిమ్న స్థాయి ద్రవిడులకు ఎటువంటి ప్రయోజనం కలగలేదు. తమిళులలోని చాలా కులాలు ఎన్నో విషయాల్లో వెనుకబడిపోయాయని పలువురు యువకులు గుర్తించారు. వారిలో పెరి యార్ (గౌరవనీయులు)గా సుప్రసిద్ధులైన ఎరోడ్ వెంకట రామస్వామి నాయకర్ ముఖ్యులు. అంతవరకు బ్రాహ్మణ వ్యతిరేక ఉద్యమంలో ప్రధాన పాత్రధారులుగా ఉన్న తెలుగు కమ్మ, రెడ్డి, మళయాళ నాయర్‌లను పక్కకు నెట్టి... తమిళ బ్రాహ్మణేతర దిగువ కులాలను(బీసీలు) సమీ కరించారు. వారే ప్రధాన శక్తిగా మహాత్మ జ్యోతీరావు ఫూలే స్థాపించిన సత్యశోధక్ సమాజ్ స్ఫూర్తితో 1925లో ‘ఆత్మగౌరవ’ ఉద్యమాన్ని ప్రారంభించారు.
పెరియార్ ఆత్మగౌరవ ఉద్యమం
1937 ఎన్నికల్లో జస్టిస్ పార్టీ ఘోర పరాభవం తర్వాత చాలా మంది నాయ కులు, కార్యకర్తలు ఆ పార్టీని విడిచి రామస్వామి నాయకర్ నడుపుతున్న ఆత్మగౌరవ ఉద్యమంలో చేరారు. బ్రాహ్మణేతరత నుంచి పెరియార్ ఈ ఉద్యమాన్ని ఆర్య, ద్రవిడ విభజన కోణం వైపునకు మరల్చారు. అంతేగాక ‘‘తమిళనాడు తమిళులకే చెందాలి. ద్రవిడ నాడు ద్రవిడులకే చెందాలి’’ అనే నినాదాన్ని ఆయన తన ప్రధాన విధానంగా ప్రకటించారు. ఆ ప్రాతిపదికపైనే 1942లో ‘ద్రవిడ కజగం’ (ద్రవిడ సంఘం) అనే సంస్థను ప్రారంభించారు. తమిళనాడులోని రాజకీయ రంగం నుంచి సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక రంగాలన్నింటిపైనా ద్రవిడ కజగం (డీకే) తీవ్ర ప్రభావాన్ని నెరపింది. అది బలమైన తమిళ జాతీయవాదాన్ని పాదుకొల్పగలిగింది. అందువల్లనే తమిళ నాట ఉత్తరాదిపైన, హిందీపైన వ్యతిరేకత అణువణువునా నిండి ఉంటుంది. డీకే తొలుత హిందూ పురాణాలు, సంప్రదాయాల మీద తీవ్ర వ్యతిరేకతను కనబరిచింది.
బ్రాహ్మణాధిపత్యం స్థానంలో మిగతా సంపన్న కులాల పెత్తనం కోసం జస్టిస్ పార్టీ కృషి చేస్తే... పెరియార్ నాయకత్వంలోని ద్రవిడ కజగం హిందూ మత పునాదులనే ప్రశ్నించింది. అందువల్లనే డీకే నుంచి విడివడి ద్రవిడ మున్నేట్ర కజగం (డీఎంకే) ఇంకా పెరియార్ భావనలను కొన్నిటిని అనుసరిస్తోంది. ముఖ్యంగా హిందూ ఆధిపత్యాన్ని పూర్తి స్థాయిలో అది అంగీకరించలేకపోవడానికి ప్రధాన కారణం పెరియార్ అందించిన తాత్వికతే. అయితే డీఎంకే నుంచి విడివడ్డ ఆల్ ఇండియా అన్నా ద్రవిడ మున్నేట్ర కజగం(ఏఐడీఎంకే)కు అంత బలమైన తాత్విక, రాజకీయ ద్రవిడ సైద్ధాంతిక పునాది లేదు. అయినా సాహిత్య, సాంస్కృతిక రంగాలలో, ప్రత్యే కించి సాహిత్యం, ద్రవిడ ఉద్యమం ప్రభావం చాలా ఎక్కువ. తమిళ సినిమా రంగంలో కింది కులాల నుంచి వచ్చిన వారు చాలామంది దర్శకులుగా, రచయితలుగా, సంగీత దర్శకులుగా కనిపిస్తారు.
సమాన స్రవంతిగా సాగిన దళిత ఉద్యమం
అయితే ద్రవిడ ఉద్యమానికి ముందు, వెనుకా అంతగా వెలుగుచూడని కోణం మరొకటి ఉంది. అదే అంటరాని కులాల విముక్తి ఉద్యమం. నిజానికి ద్రవిడ ఉద్యమానికి మూల బిందువైన జస్టిస్ పార్టీ బ్రాహ్మణ వ్యతిరేక ఉద్యమానికి బలమైన స్ఫూర్తినిచ్చింది అదే. జస్టిస్ పార్టీ ఆవిర్భావానికి చాలా ఏళ్లు ముందుగానే అంటరాని కులాల సామాజిక విముక్తి ఉద్యమాలు మొద లయ్యాయి. 1845లో జన్మించిన పండిత్ అయోతిదాస్ అనే సిద్ధ వైద్యుడు 1891లో పంచమర్ మహాజన సభను స్థాపించారు. ఆ సంస్థ నాయకత్వంలో అంటరాని కులాలకు విద్యను అందించడానికి తీసుకోవాల్సిన చర్యల గురించి ఎన్నో ఉద్యమాలు చేశారు. అదే సమయంలో అంటరాని కులాల పట్ల వివ క్షకు పరిష్కారం బౌద్ధం మాత్రమేనని బౌద్ధాన్ని స్వీకరించి, ప్రచారం చేశారు. 1907లో ‘ఒరుపైస తమిళన్’ అనే పత్రికను స్థాపించారు.
ఆయన వారస త్వంలో రెట్టమలై శ్రీనివాసన్, ఎంసీ రాజాలాంటి దళిత ఉద్యమ నేతలు ద్రవిడ ఉద్యమం కంటే ముందే కుల వ్యతిరేక ఉద్యమాలు నడిపారు. రెట్ట మలై శ్రీనివాసన్, బీఆర్ అంబేడ్కర్‌తో పాటూ లండన్ రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్నారు. ఈ విషయ ప్రస్తావనకు కారణం... ద్రవిడ ఉద్య మానికి ఒకరకంగా ప్రత్యక్ష, పరోక్ష ప్రేరణ అంటరాని కులాల చైతన్యం. సంఘటితశక్తి కావడమే. 1916లో ప్రారంభమైన బ్రాహ్మణ వ్యతిరేక ఉద్యమం, ఆ తర్వాత ద్రవిడ ఉద్యమంగా మారి, శూద్రులలోని ఆధిపత్య కులాలు సంఘటితం కావడానికి ఉపయోగపడింది. కానీ అదే సమయంలో శూద్ర కులాల ఆధిపత్యం అంటరాని దళిత కులాలకు వ్యతిరేకంగా మారింది.
ఇది తమిళనాడుకే పరిమితం కాదు. బ్రాహ్మణేతర, బ్రాహ్మణ వ్యతిరేక ఉద్యమాలు జరిగిన బిహార్, ఉత్తరప్రదేశ్, ఆంధ్ర లాంటి ప్రాంతాల్లో స్వాతం త్య్రానికి ముందు, తర్వాత బ్రాహ్మణులతో సమాన హక్కుల కోసం పోరాడి, ఆర్థిక, రాజకీయ, సామాజిక ఆధిపత్యాన్ని సాధించిన సంపన్న కులాలు అంటరాని కులాలపై దాడులు జరిపాయి. తమిళనాడులో చరిత్రాత్మకమైన ద్రవిడ ఉద్యమానికి నాయకత్వం వహించిన శూద్ర కులాలు అక్కడి అంట రాని కులాలపై సాగిస్తున్న అత్యాచారాలు ఏ రాష్ట్రానికీ తీసిపోవడం లేదు.
ద్రవిడ ఉద్యమంలో ప్రముఖ పాత్ర వహించిన మరవాలు, కల్లర్లు, తేవర్లు ఈ రోజు అంటరాని కులాలైన పల్లార్, పరయాలపై దాడులు సాగి స్తున్నారు. బ్రాహ్మణాధిపత్యానికి, ఇతర ఆధిపత్య కులాల పెత్తనానికి వ్యతి రేకంగా పోరాడిన కింది స్థాయి శూద్ర కులాలు అంటరాని కులాల పట్ల వివ క్షాపూరితంగా వ్యవహరించడం ఆశ్చర్యం కలిగించవచ్చు. ద్రవిడ ఉద్యమం బ్రాహ్మణ వ్యతిరేక చైతన్యాన్ని రగిల్చి వారి ఆధిపత్యాన్ని నిరసించటానికే పరిమితమైంది. కుల వ్యతిరేక, కుల నిర్మూలన చైతన్యాన్ని అందించ లేక పోయింది. ఆచరణలో ఆ ఉద్యమం కుల ఆధిపత్య వ్యతిరేక ఉద్యమంగానే సాగింది తప్ప, సమాజంలో సమానత్వం, సోదరత్వాల భావనను పెంపొం దింపజేయలేకపోయింది, కుల నిర్మూలన చైతన్యాన్ని అందించలేక పోయింది అన్నది వాస్తవం.
మల్లెపల్లి లక్ష్మయ్య
వ్యాసకర్త సామాజిక విశ్లేషకులు
మొబైల్ : 97055 66213