స్వేచ్ఛ, సమానతలకు ప్రతీక | Constitution symbolizing freedom, equality mallepally laxmaiah kotta konam | Sakshi
Sakshi News home page

స్వేచ్ఛ, సమానతలకు ప్రతీక

Published Wed, Jan 25 2017 11:58 PM | Last Updated on Tue, Sep 5 2017 2:06 AM

స్వేచ్ఛ, సమానతలకు ప్రతీక

స్వేచ్ఛ, సమానతలకు ప్రతీక

కొత్త కోణం
భారత రిపబ్లిక్‌ దినోత్సవం ఒక చారిత్రాత్మకమైన ప్రాధాన్యతను, రాజకీయ, పాలనా పరమైన విస్తృతిని కలిగి ఉంది. ఆ రోజున అమలులోకి వచ్చిన మన రాజ్యాంగం అత్యంత విశిష్టమైనది. అది ప్రపంచంలోనే అత్యంత వివరమైన రాజ్యాంగం. అది భాష, ప్రాంత, కుల, మత, లింగ వివక్షలను వ్యతిరేకిస్తున్నది. అంతేకాదు భాష, మత, మైనారిటీలకు, తరతరాలుగా వివక్షకు గురవుతున్న షెడ్యూల్డ్‌ కులాలు, షెడ్యూల్డ్‌ తెగలకు సామాజిక మైనారిటీలకు ప్రత్యేక రక్షణలు కల్పించడం మన రాజ్యాంగం ప్రత్యేకత.

‘‘మన దేశ వర్తమాన, భవిష్యత్తులను సుందరంగా, అద్భుతంగా తీర్చిదిద్దే బాధ్యతలను మనం మన భుజస్కంధాల మీదికి ఎత్తుకున్నాం. చిన్న చిన్న విషయాలపైన దృష్టి పెట్టడం మంచిది కాదు. భారత దేశం ప్రపంచ వేదిక మీద ఒక ప్రధాన భూమికను పోషించే వైపు పయనిస్తున్నది. ప్రపంచంలోని కళ్లన్నీ మన వైపే చూస్తున్నాయి. నూతన భారతదేశ అవతరణకు మనం అడుగు దూరంలోనే ఉన్నాం. గతంలోని సంఘటనలు, వర్తమాన దృశ్యాలు, భవిష్యత్‌ ఆవిష్కరణలన్నీ మన ఆలోచనలలో ప్రతిబింబించాలి.’’ భారత రాజ్యాంగ సభలో రాజ్యాంగ రచనకు సంబంధించిన తీర్మానాన్ని ప్రవేశపె డుతూ 1940, డిసెంబర్‌ 13న జవహర్‌లాల్‌ నెహ్రూ అన్న మాటలివి. అప్ప టికింకా మనకు స్వాతంత్య్రం రాలేదు. డిసెంబర్, 9, 1946 నుంచి ప్రారంభ మైన రాజ్యాంగ సభ డిసెంబర్, 26, 1949 వరకు కొనసాగి, భారత రాజ్యాం గాన్ని అందించింది. భారత రాజ్యాంగం అమలులోనికి వచ్చింది మాత్రం 1950, జనవరి 26న. ఆ రోజునే ఎంచుకోవడం కాకతాళీయం కాదు. అది ఒక చారిత్రక సందర్భానికి, మన స్వాతంత్య్రోద్యమ చరిత్రలోని ఒక మైలురాయికి సంకేతం.

జనవరి 26 చరిత్రలో మైలురాయి
1929లో బ్రిటిష్‌ ప్రభుత్వం ప్రజాభీష్టానికి భిన్నంగా భారత దేశానికి పరిమిత స్వేచ్ఛ (డొమినియన్‌ స్టేటస్‌)ను ఇవ్వడానికి మాత్రమే అంగీకరించింది. దానిని కాంగ్రెస్‌ సహా అన్ని పార్టీలు తీవ్రంగా వ్యతిరేకించాయి.1929 డిసెం బర్‌ 31, 1930 జనవరి 1 తేదీలలో జరిగిన లాహోర్‌ కాంగ్రెస్‌ మహాసభ సంపూర్ణ స్వరాజ్య తీర్మానాన్ని  ఆమోదించింది. ఆ తదుపరి 1930 జనవరి 2న కాంగ్రెస్‌ స్టీరింగ్‌ కమిటీ సమావేశం చేసిన తీర్మానం మేరకు దేశ వ్యాప్తంగా ఉద్యమకారులందరూ జనవరి 26న సంపూర్ణ స్వరాజ్య దినం పాటించి, సంపూర్ణ స్వరాజ్య సాధనకు ప్రతిజ్ఞలు చేశారు. చరఖా చిహ్నం ఉన్న మూడు రంగుల జెండాను ఎగురవేశారు. ఆ చారిత్రక ఘట్టానికి చిహ్నం గానే 1950 జనవరి, 26న భారత ప్రథమ రాష్ట్రపతిగా డాక్టర్‌ రాజేంద్రప్రసాద్‌ ప్రమాణ స్వీకారం చేశారు. అప్పటికే రాజ్యాంగ సభ ఆమోదం పొందిన మన రాజ్యాంగం ఆ రోజు నుంచి అమలులోకి వచ్చింది. అప్పటి నుంచి జనవరి 26ను గణతంత్ర (రిపబ్లిక్‌) దినోత్సవంగా జరుపుకుంటున్నాం. ఆగస్టు 15 స్వాతంత్య్ర దినోత్సవానికి ఇచ్చిన ప్రాధాన్యాన్ని ఇస్తున్నాం.  

స్వాతంత్య్రం పొందడం అంటే కేవలం బ్రిటిష్‌ పాలన అంతం కావ డమని మనం సర్దిపెట్టుకోలేదు. దేశ భవిష్యత్తును, ప్రజలందరి క్షేమాన్ని, సంక్షేమాన్ని ఒక నియమబద్ధమైన విధాన సమూదాయంగా తీర్చిదిద్దాలనే మనం రాజ్యాంగానికి ఎంతో ప్రాధాన్యం ఇచ్చాం. భావి భారత దేశాన్ని ప్రపంచ దేశాల సరసన సమున్నతంగా నిలిపేందుకు రాజ్యాంగ సభ సభ్యులు ఎంతో సమయాన్ని వెచ్చించారు, అహరహం శ్రమించారు. అసమా నతలు, అంతరాలు లేని భారతావనిని కాంక్షించారు. రాజ్యాంగంలో పొందు పరిచిన ప్రతి అంశంపైన ఎంతో విస్తృతమైన చర్చను జరిపారు. ఎన్నో విష యాలను ఆచి తూచి పరిగణనలోనికి తీసుకున్నారు. ఎంతో శ్రద్ధతో అక్షరీక రించి తుది రూపునిచ్చారు.

స్వతంత్రమా? ప్రజాస్వామ్యమా?
కేవలం రాజ్యాంగ సభ సభ్యులు మాత్రమే కాకుండా, దేశంలోని పౌరులెవ రికైనా దీని మీద వ్యాఖ్యానించే అధికారం ఉంటుందని నెహ్రూ మొదటే ప్రక టించారు. దానికి అనుగుణంగానే నెహ్రూ ప్రతిపాదించిన కొన్ని విషయాలపై సైతం రాజ్యాంగ రచనా సంఘం ప్రత్యామ్నాయ ప్రతిపాదనలను చేసింది.  నెహ్రూ భారత్‌ను ‘స్వతంత్ర సర్వ సత్తాక గణతంత్ర దేశం’గా పేర్కొనగా... రాజ్యాంగ సభ దాన్ని ‘సర్వ సత్తాక ప్రజాస్వామ్య, గణతంత్ర దేశం’గా ప్రకటించింది.

నెహ్రూ పేర్కొన్న స్వతంత్ర, సర్వసత్తాక అనే రెండు పదాలలో స్వతంత్ర పదం అవసరంలేదని, సర్వసత్తాక అనేదే స్వతంత్ర దేశమనే భావనను కూడా బలంగా వ్యక్తం చేస్తుందని రాజ్యాంగ సభ అభిప్రాయపడింది. గణతంత్ర అనే పదం ఉన్నందువల్ల ప్రజాస్వామ్యం అని విడిగా పేర్కోనవసరం లేదని నెహ్రూ వ్యాఖ్యానించారు. కానీ రాజ్యాంగ రచనా సంఘానికి చైర్మన్‌గా ఉన్న అంబేడ్కర్‌ ప్రజాస్వామ్యమనే భావన పట్ల, ఆ పదానికి  ఉన్న విస్తృతమైన అర్థం పట్ల ఎక్కువగా మొగ్గు చూపారు. అంతేకాకుండా ప్రజాస్వామ్యమనే తాత్వికత భారత సామాజిక పరిస్థితులకు మరింతగా సరిపోతుందని అభి ప్రాయపడ్డారు. నెహ్రూలాంటి తిరుగులేని నాయకుడు కూడా అంబేడ్కర్‌ లాంటి వాళ్ళు ప్రతిపాదించిన విషయాలను విశాల దృక్పథంతో ఆలోచించి, చాలా సానుకూలంగా స్పందించారు. అందువల్లనే భారత రాజ్యాంగం ఒక బృహత్తర గ్రంథంగా రూపొందింది. సామాజిక, రాజకీయ, ఆర్థిక న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం, సోదరత్వంతో కూడిన ఆ రాజ్యాంగాన్ని ఆనాటి సభ ఆమోదించింది

ప్రజాస్వామ్యమే కాదు గణతంత్రం కూడా
రాజ్యాంగంలోని అన్ని అంశాలతో పాటు పీఠిక (ప్రియాంబుల్‌)లో పొందు పర్చిన అంశాలు చాలా ప్రా«ధాన్యతను కలిగి ఉన్నాయి. అంబేడ్కర్‌ అమెరి కాలో విద్యాభ్యాసాన్ని సాగిస్తున్న కాలం నుంచి ప్రజాస్వామ్యమనే భావనల పైన ఎంతో అధ్యయనం చేశారు. 1936లో కుల నిర్మూలన రచించే నాటికే ప్రజాస్వామ్యంపై ఆయనకు సమగ్రమైన అవగాహన ఏర్పడింది. భారత రాజ్యాంగ పీఠికలో పొందుపరిచిన ప్రజాస్వామ్యం, గణతంత్రం అనే భావ నలపైన కూడా చాలా లోతైన చర్చలు, అధ్యయనాలు జరిగాయి. పైపైన చూస్తే ఈ రెండు పదాలకు పెద్ద తేడా లేనట్టుగా కనిపిస్తున్నదని, కానీ అవి రెండూ వేర్వేరుగా అస్తిత్వాన్ని కలిగి ఉన్నాయని రాజనీతి తత్వవేత్తలు భావి స్తున్నారు.

ప్రజాస్వామ్యమంటే ప్రజల కోసం, ప్రజల చేత, ప్రజల యొక్క ప్రభు త్వమని, వ్యవస్థ అని అర్థం చెప్పుకుంటాం. ప్రజాస్వామ్యంలో వంశపారం పర్యంగా కాకుండా ప్రజలు ఎన్నుకున్న ప్రతినిధులు పాలన చేస్తారు. దీనిలో ఎటువంటి సందేహం లేదు. సిద్ధాంతపరంగా ఇది నూటికి నూరు పాళ్లు నిజం. ఇందులో ప్రత్యక్ష, పరోక్ష విధానాలు ఉన్నాయి. అయితే మెజారిటీ ప్రతినిధుల అభిప్రాయం ప్రకారం విధానాలు రూపొందుతాయి, పరిపాలన సాగుతుంది. అంటే మైనారిటీగా ఉన్న కొందరి అభిప్రాయాలకు విలువ లేకుండా పోతుంది. అందువల్ల మెజారిటీ వర్గం అధికారాలకు అంతు ఉండదు. అందుకే మెజారిటీ అధికారం మైనారిటీ రాజకీయాల పట్ల, జీవి తాల పట్ల అణచివేసే విధానాలను అవలంబిస్తుంది. ఇది ఇప్పుడు చాలా దేశాల్లో మనం చూస్తున్నాం.

రిపబ్లిక్‌ పరిపాలన దీనికి పూర్తిగా విరుద్ధమైనది కాకపోయినా, కొన్ని  ఇతర ముఖ్యమైన అంశాలను అలాంటి వ్యవస్థలు కలిగి ఉంటాయి. రిపబ్లిక్‌ దేశాల్లో ప్రభుత్వాలను ప్రజలే ఎన్నుకుంటారు. అయితే ఎన్నికైన ప్రభుత్వా లుగానీ, ప్రజా ప్రతినిధులుగానీ వ్యక్తిగతమైన, పార్టీ పరమైన విధానాలతో మాత్రమే పనిచేసే వీలుండదు. ఒక నిర్దిష్టమైన పద్ధతి ద్వారా రూపొం దించుకున్న రాజ్యాంగం గానీ, చట్టంగానీ ప్రభుత్వాల పని విధానానికి ప్రాతి పదిక అవుతుంది. రాజ్యాంగంలో పేర్కొన్న వివిధ అంశాల వెలుగులో ప్రభు త్వాలు పనిచేయాలి. ప్రజాప్రతినిధులకు కూడా మార్గదర్శకం రాజ్యాంగమే తప్ప సొంత అభిప్రాయాలు గానీ, ఆలోచనలు గానీ కావు. ఇది భారత రిపబ్లిక్‌ వ్యవస్థకు కూడా వర్తిస్తుంది. అందుకే భారత రాజ్యాంగం విశిష్టతను కలిగి ఉన్నది. ప్రపంచంలో అత్యంత వివరమైన రాజ్యాంగం మనదే కావడం విశేషంగా చెప్పుకోవాలి.

ప్రపంచంలోనే విశిష్ట రాజ్యాంగం
అంతే కాకుండా మరొక ప్రత్యేకత కూడా మన భారత దేశపు రాజ్యాంగానికి ఉన్నది. ఈ దేశం వివిధ మతాల సమ్మేళనం మాత్రమే కాదు. ఎన్నో వందల పేర్లతో ఉన్న కులాలతో కూడి ఉండడం కూడా భారత దేశ ప్రత్యేకత. అందు వల్ల భాష, ప్రాంత, కుల, మత, లింగ వివక్షలను భారత రాజ్యాంగం వ్యతి రేకిస్తున్నది. ముఖ్యంగా భాష, మత మైనారిటీలకు ఇక్కడ చాలా రక్షణలు కల్పించారు. అంతేకాకుండా, ముఖ్యంగా హిందూ మతంలో తరతరాలుగా వివక్షకు గురవుతున్న అంటరాని కులాలైన షెడ్యూల్డ్‌ కులాలు, అడవుల్లో నివసించే షెడ్యూల్డ్‌ తెగలను సామాజిక రంగంలో మైనారిటీలుగా గుర్తించి.. వారిని సామాజికంగా ప్రధాన స్రవంతిలోనికి తీసుకురావడానికి వీలుగా ప్రత్యేక రక్షణలు కల్పించడం మన రాజ్యాంగం ప్రత్యేకత. రాజ్యాంగ రచనా సంఘానికి చైర్మన్‌ బాబా సాహెబ్‌ అంబేడ్కర్‌ ఆలోచనా విధానంలోని ప్రధానాంశం కూడా అదే. అందుకే రాజ్యాంగంలో మైనారిటీలనే పదానికి ప్రాధాన్యం ఇవ్వడం జరిగింది. ప్రాంతీయ విభేదాల వల్ల వివక్షకు గురయ్యే ప్రమాదాన్ని పసిగట్టి, వాటి పరిరక్షణకు కూడా కొన్ని అంశాలను రాజ్యాం గంలో పొందుపరిచారు. రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 3, ఆర్టికల్‌ 38లను అందులో భాగంగానే చూడాలి. ఇటువంటి ముఖ్యమైన అంశాలు రిపబ్లిక్‌ దేశాల్లో మాత్రమే, అందులోనూ రాజ్యాంగ పరిధిలో పాలన జరిగే దేశాలోన్లే ఎక్కువగా అమలులో ఉన్నాయి.

భారత రిపబ్లిక్‌ దినోత్సవం ఒక చారిత్రాత్మకమైన ప్రాధాన్యతను, రాజ కీయ, పాలనాపరమైన విస్తృతిని కలిగి ఉంది. భారత దేశంతోపాటు, ప్రపం చంలో పలు శతాబ్దాలుగా ఎన్నో రిపబ్లిక్‌లు ఎన్నో చోట్ల ఉనికిలో ఉన్నాయి. బౌద్ధానికి ముందు మన దేశంలో 16 గణాలతో కూడిన జనపదాలు ఉనికిలో ఉన్నాయి. అయితే వాటికి ఈనాడు మనం రూపొందించుకున్న రిపబ్లిక్‌కు ఎంతో తేడా ఉన్నది. భారతదేశంలో వేల ఏళ్లుగా సాగిన సామాజిక ఉద్య మాలు, భారత స్వాతంత్య్ర సమరం సమయంలో సాగిన అనేకానేక ఆలో చనల సారమే రాజ్యాంగం. వీటన్నింటినీ అత్యంత లోతుగా పరిశీలించే శక్తి కలిగిన మేధావి, రాజనీతివేత్త బాబా సాహెబ్‌ అంబేడ్కర్‌ నేతృత్వంలో ఏర్ప డిన రాజ్యాంగ రచనా సంఘం రూపొందించిన రాజ్యాంగం భారతదేశ భవి ష్యత్‌ గమనానికి ఒక వాహకంలాగా పనిచేసి, రాజ్యాంగ పీఠికలో పేర్కొన్న న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం, సోదరత్వం ప్రాతిపదికగా ఏర్పడే సమా జాన్ని నిర్మాణం చేస్తుం దని ఆశిద్దాం.

మల్లెపల్లి లక్ష్మయ్య
సామాజిక విశ్లేషకులు ‘ మొబైల్‌ : 97055 66213  
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement