విప్లవాలు రాజ్యాంగాలకు పురుడుపోస్తాయి. విప్లవాల కాలంలో వ్యక్తమయ్యే ప్రజల ఆకాంక్షలు తరువాతి కాలంలో రాజ్యాంగాలుగా రూపుదిద్దుకుంటాయి. నేటి తిరుగుబాటు సాహిత్యమే రేపటి రాజ్యాంగం అనేది ఈ అర్థంలోనే.1789లో ఆరంభమైన ఫ్రెంచ్ విప్లవం పదేళ్ళు కొనసాగింది. న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం, సోదరభావం అనే నూతన సామాజిక విలువల్ని... ఇది ప్రధాన నినాదాలుగా మార్చింది. అమెరికా అంతర్యుధ్ధం ముగింపు సందర్భంగా అప్పటి దేశాధ్యక్షుడు అబ్రహాం లింకన్ 1863 నవంవరు 19న పెన్సిల్వేనియాలోని గెటిస్ బర్గ్‌లో అమరుల సమాధుల వద్ద ప్రసంగిస్తూ ‘‘ప్రజల యొక్క–ప్రజల చేత– ప్రజల కొరకు’’ పనిచేసేది అంటూ ప్రజాస్వామిక ప్రభుత్వానికి కొత్త నిర్వచనం ఇచ్చాడు.
భారత రాజ్యాంగ ఆవిర్భావం భిన్నమైనది. అది ఫ్రాన్స్ మాదిరి విప్లవంలో పుట్టినది కాదు. అమెరికాలా అంతర్యుద్ధంలో పుట్టిందీ కాదు. ఇది బ్రిటిష్ వలస పాలనకు వ్యతిరేకంగా సాగిన జాతీయోద్యమ ఫలితం. భారత రాజ్యాంగ సభను ఏర్పాటు చేయాలని 1935లో జాతీయ కాంగ్రెస్ వలస పాలకుల్ని కోరింది. మే 1946 నాటి బ్రిటన్ కేబినెట్ మిషన్ ప్లాన్‌లో భాగంగా వలస పాలకులే ఎన్నికలు నిర్వహించి 389 మందితో భారత రాజ్యాంగ సభను ఏర్పాటు చేశారు. వీరిలో వివిధ రాష్ట్రాల నుంచి ఎన్నికయిన వారు 292 మంది, సంస్థానాల ప్రతినిధులు 93 మంది, చీఫ్ కమిషనర్ ప్రావిన్సెస్ నుంచి వచ్చిన వారు మరో నలుగురు. 1947లో భారత స్వాతంత్య్ర చట్టం వచ్చి దేశవిభజన జరగడంతో రాజ్యాంగ సభను భారత్– పాకిస్తాన్ మధ్య పునర్విభజించారు. సామాన్య ప్రజలతో ప్రత్యక్ష సంబంధం లేని రాజ్యాంగ సభకు సామాజిక విప్లవకర కోణాన్ని అందించిన ఘనత అంబేడ్కర్‌కే దక్కుతుంది. (70 ఏళ్ల ప్రస్థానంలో నిలుపే... గెలుపు)
రాజ్యాంగ సభలోనికి అంబేడ్కర్ ప్రవేశం కొన్ని నాటకీయ మలుపులతో సాగింది. 1946లో జరిగిన రాజ్యాంగ సభ ఎన్నికల్లో అంబేడ్కర్ షెడ్యూల్డ్ క్యాస్ట్స్ ఫెడరేషన్ (ఎస్‌సీఎఫ్) పార్టీ అభ్యర్థ్ధిగా బొంబాయి సెంట్రల్ నుంచి పోటీ చేసి ఓడిపోయాడు. ఆయనకు రాజ్యాంగ పరిషత్‌లోకి ప్రవేశించే మార్గం లేకుండాపోయింది. న్యాయ, రాజ్యాంగ, సామాజిక రంగాల్లో అంబేడ్కర్ చైతన్యాన్ని గుర్తించిన ముస్లిం లీగ్ ఆయన్ను ఎంపిక చేసి రాజ్యాంగ సభకు పంపింది. నాటి ముస్లిం లీగ్ నాయకులు ముహమ్మద్ అలీ జిన్నా, ఆగా ఖాన్ తూర్పుబెంగాల్ లోని జెస్సోర్ – ఖుల్నా నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న తమ పార్టీ అభ్యర్థి మహాప్రాణ్ జోగేంద్ర నాధ్ మండల్ చేత రాజీనామా చేయించారు. అక్కడి నుంచి అంబేడ్కర్ ను గెలిపించి రాజ్యాంగ సభకు పంపించారు. అంబేడ్కర్ కోసం రాజ్యాంగ సభలో తన ప్రాతినిధ్యాన్ని త్యాగం చేసిన జోగేంద్ర నాధ్ కూడా ప్రముఖ దళిత నేత, న్యాయకోవిదుడు. తరువాత పాకిస్తాన్ రాజ్యాంగ రచన బాధ్యతల్ని జోగేంద్ర నాథ్‌కే అప్పగించాడు జిన్నా. 30 ఆగస్టు 1947న జరిగిన సమావేశంలో అంబేడ్కర్ డ్రాఫ్టింగ్ కమిటి ఛైర్మన్‌గా ఎన్నికయ్యాడు.
సామాజిక, ఆర్థిక రంగాల్లో సమానత్వ ఆదర్శాలను మనుధర్మశాస్త్రం ఏ దశలోనూ ఆమోదించదని అంబేడ్కర్ విమర్శించాడు. సామాజిక అసమానత్వాన్ని, అణిచివేతను తీవ్రంగా వ్యతిరేకించే అంబేడ్కర్ 1927 డిసెంబర్ 25న మనుధర్మశాస్త్ర ప్రతిని బహిరంగంగా... మహాత్మా గాంధీ ఫొటో సాక్షిగా దహనం చేశాడు. రాజ్యాంగాన్ని రచించే అవకాశం తనకు దక్కినపుడు అంబేడ్కర్ నిర్ణయించుకున్న ప్రధాన కర్తవ్యం మనుధర్మశాస్త్రాన్ని బలహీనపరచడం. న్యాయం, స్వేచ్చ, సమానత్వం, సోదర భావాలను భారత రాజ్యాంగానికి నాలుగు పునాదిరాళ్ళుగా పేర్చి అంబేడ్కర్ తన లక్ష్యాన్ని సాధించాడు. రాజ్యాంగం తుది ప్రతిని రాజ్యాంగ సభాధ్యక్షుడు బాబూ రాజేంద్రప్రసాద్‌కు లాంఛనంగా అందజేశాక బొంబాయిలో జరిగిన ఒక బహిరంగ సభలో భారత సమాజంలో మనుస్మృతికి ఇక కాలం చెల్లిందని బాహాటంగా ప్రకటించాడు.
భారత రాజ్యాంగం తుది ప్రతిని 1949 నవంబరు 26న ఆమోదించారు. అంతకు ముందు రోజు అంటే నవంబరు 25న రాజ్యాంగ సభలో అంబేడ్కర్ ఒక చారిత్రాత్మక ఉపన్యాసం చేశాడు. నియంతల పాలనలో దేశమంతటా అరాచకం చెలరేగిపోయే సన్నివేశాన్ని బెర్తోల్ట్ బ్రెక్ట్ ‘గుడ్ వుమన్ ఆఫ్ షేజ్వాన్’ నాటకంలో చిత్రించాడు. ఆ నాటకంలో ప్రధాన పాత్ర ‘షిన్ టీ’ మూకోన్మాదంపై నిర్లిప్తంగా ఉన్న సమాజాన్ని సహించలేక ఆక్రోశిస్తుంది. ‘‘ఓరీ మొద్దుబారిపోయిన మనుషుల్లారా! మీ సోదరుడిపై మూకోన్మాదులు దాడి చేశారు. అతన్ని పొడిచి పారిపోయారు. మీరు కళ్లు మూసుకుని మౌనంగా వుండిపోయారు. ఇదేమి నగరం? మీరేమి మనుషులు? ఇలాంటి ఘోరం జరిగినపుడు మనుషులన్నవాళ్ళు రగిలిపోవాలి. నగరమంతటా నిరసనలు వెల్లువెత్తాలి. మనుషుల్లో అలాంటి తిరుగుబాటు రాకుంటే చీకటి పడడానికి ముందే ఆ నగరం మంటల్లో మాడి బూడిదై పోవాలి’’ అంటుంది. ఆ ప్రసంగంలో జాన్ స్టూవర్ట్ మిల్, డేనియల్ ఓ కానెల్ తదితరుల్ని ప్రస్తావించిన అంబేడ్కర్ బ్రెక్ట్ పేరును ప్రత్యేకంగా పేర్కొనలేదుగానీ ‘షిన్ టీ’ ఆవేశం అందులో కనిపిస్తుంది.
‘‘జనవరి 26, 1950న మనం ఒక వైరుధ్యాల జీవితంలోనికి ప్రవేశించబోతున్నాం. రాజకీయాల్లో మనకు సమానత్వం ఉంటుంది. కానీ సామాజిక ఆర్థిక జీవితంలో అసమానత్వం ఉంటుంది. రాజకీయాల్లో మనం ఒక మనిషికి ఒక ఓటు, ఒక ఓటుకు ఒక విలువ అనే సూత్రాన్ని గుర్తిస్తాం. మన సామాజిక ఆర్ధిక నిర్మాణం (లోని లోపం) కారణంగా సాంఘిక, ఆర్ధిక జీవితంలో ఒక మనిషికి ఒక విలువ అనే సూత్రాన్ని నిరాకరిస్తూనే ఉంటాం. మరి ఎన్నాళ్ళీ వైరుధ్యాల జీవితాన్ని కొనసాగిద్దాం? మన సాంఘిక, ఆర్థిక జీవితాల్లో సమానత్వాన్ని ఇంకా ఎన్నాళ్లు నిరాకరిద్దాం? సాధ్యమైనంత త్వరగా మనం ఈ వైరుధ్యాల్ని తొలగించి తీరాలి. అలా చేయకపోతే, ఈ రోజు ఈ రాజ్యంగ పరిషత్తు ఎంతో కష్టపడి నిర్మించిన రాజకీయ ప్రజాస్వామ్య నిర్మాణాన్ని సమాజంలోని అసమానత్వ బాధితులు అందరూ కలిసి పేల్చివేస్తారు’’ అంటాడు. ఈ హెచ్చరిక ఇప్పటికీ మన చెవుల్లో మోగుతూనే ఉంది.
వ్యాసకర్త రచయిత,
సీనియర్ పాత్రికేయులు,
సమాజ విశ్లేషకులు,
మొబైల్: 90107 57776
మనుస్మృతి స్థానంలో మనస్మృతి
Published Sun, Jan 26 2020 8:53 AM | Last Updated on Sun, Jan 26 2020 11:55 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment