నేడు అంబేద్కర్ జయంతి. ప్రతి సంవత్సరం ఏప్రిల్ 14న రాజ్యంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతిని దేశవ్యాప్తంగా నిర్వహిస్తారు. అంబేద్కర్‌ను భారత రాజ్యాంగ పితామహుడు అని కూడా అంటారు. అంబేద్కర్ 1891, ఏప్రిల్ 14న మధ్యప్రదేశ్‌లోని మోవ్‌లో ఒక దళిత మహర్ కుటుంబంలో జన్మించారు.
స్వాతంత్ర్యం తరువాత దేశాన్ని సరైన దిశలో ముందుకు తీసుకెళ్లడంలో అంబేద్కర్ కీలకపాత్ర పోషించారు. అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆయన జీవితంలోని కొన్ని ముఖ్య ఘట్టాలను తెలుసుకుందాం.
1947లో భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత బి ఆర్ అంబేద్కర్ దేశానికి తొలి న్యాయ మంత్రి అయ్యారు. తన పదవీకాలంలో సామాజిక, ఆర్థిక సమస్యలను పరిష్కరించడానికి వివిధ చట్టాలు, సంస్కరణలను రూపొందించడంలో కీలక పాత్ర పోషించారు.
1947 ఆగస్టు 29న రాజ్యాంగ పరిషత్ ముసాయిదా కమిటీకి అధ్యక్షునిగా డాక్టర్ అంబేద్కర్ నియమితులయ్యారు. కొత్త రాజ్యాంగాన్ని రూపొందించే బాధ్యత ఈ కమిటీదే.
నిజానికి అంబేద్కర్ ఇంటిపేరు అంబావ్డేకర్ (మహారాష్ట్రలోని రత్నగిరి జిల్లాలోని ఆయన స్వగ్రామం ‘అంబవాడే’ పేరు నుండి వచ్చింది). అయితే అతని గురువు మహదేవ్ అంబేద్కర్ ఇంటిపేరును ‘అంబావ్డేకర్’ నుండి ‘అంబేద్కర్’గా పాఠశాల రికార్డులలో మార్చారు.
అంబేద్కర్ మన దేశంలో కార్మిక చట్టాలకు సంబంధించి అనేక మార్పులు చేశారు. 1942లో ఇండియన్ లేబర్ కాన్ఫరెన్స్ 7వ సెషన్‌లో పనివేళలను 12 గంటల నుంచి 8 గంటలకు తీసుకొచ్చారు.
బాబా సాహెబ్ విదేశాల్లో ఎకనామిక్స్‌లో డాక్టరేట్ పట్టా పొందిన మొదటి భారతీయుడు. అలాగే దక్షిణాసియాలో ఎకనామిక్స్‌లో తొలి డబుల్ డాక్టరేట్ హోల్డర్ కూడా. అతని తరంలో అత్యంత విద్యావంతులైన భారతీయులలో ఒకనిగా పేరుగాంచారు.
పార్లమెంటులో హిందూ కోడ్ బిల్లు కోసం అంబేద్కర్ పోరాటం సాగించారు. వివాహం, వారసత్వ విషయాలలో మహిళలకు సమాన హక్కులు కల్పించడం ఈ బిల్లు లక్ష్యం. బిల్లు ఆమోదం పొందకపోవడంతో న్యాయశాఖ మంత్రి పదవికి రాజీనామా చేశారు.
కొలంబియా యూనివర్శిటీలో ఉన్న మూడేళ్లలో, అంబేద్కర్ ఆర్థికశాస్త్రంలో 29, చరిత్రలో 11, సోషియాలజీలో ఆరు, ఫిలాసఫీలో ఐదు, హ్యుమానిటీస్‌లో నాలుగు, పాలిటిక్స్‌లో మూడు, ఎలిమెంటరీ ఫ్రెంచ్, జర్మన్‌లలో ఒక్కొక్కటి చొప్పున కోర్సులు అభ్యసించారు.
1995లో అంబేద్కర్ రాసిన ‘థాట్స్ ఆన్ లింగ్విస్టిక్ స్టేట్స్’ పుస్తకంలో ఆయన మధ్యప్రదేశ్, బీహార్‌లను విభజించాలని సూచించారు. ఈ పుస్తకాన్ని రాసిన దాదాపు 45 సంవత్సరాల తరువాత 2000లో ఈ ప్రాంతాల విభజన జరిగింది.
డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 64 సబ్జెక్టులలో మాస్టర్. హిందీ, పాళీ, సంస్కృతం, ఇంగ్లీష్, ఫ్రెంచ్, జర్మన్, మరాఠీ, పర్షియన్, గుజరాతీ తదితన తొమ్మిది భాషల్లో అంబేద్కర్‌కు పరిజ్ఞానం ఉంది. ఇంతేకాదు ఆయన సుమారు 21 సంవత్సరాల పాటు ప్రపంచంలోని అన్ని మతాలను తులనాత్మక అధ్యయనం చేశాడు.
బుద్ధ భగవానుడు కళ్లు తెరిచి చూస్తున్న మొదటి చిత్రాన్ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రూపొందించారు. అంతకు ముందు బుద్ధ భగవానునికి చెందిన పలు చిత్రాలు కళ్లు మూసుకున్న తీరులో ఉండేవి.
Comments
Please login to add a commentAdd a comment