భారత నేతలు లాహోర్ వేదికగా జనవరి 26, 1930న కాంగ్రెస్ పార్టీ జాతీయ సమావేశంలో తొలిసారిగా సంపూర్ణ స్వరాజ్యం తీర్మానం చేశారు. ఆ రోజున నెహ్రూ సారథ్యంలో రావీ నది ఒడ్డున త్రివర్ణ పతాకం ఎగురవేసి భారతీయుల స్వాతంత్ర్య సంకల్పాన్ని బ్రిటిషర్లకు గట్టిగా వినిపించారు. అంతటి చారిత్రక ప్రాధాన్యం ఉన్న జనవరి 26వ తేదీకి చిరస్థాయి కల్పించాలన్నసదుద్దేశంతో నవభారత నిర్మాతలు రాజ్యాంగ రచన 1949లో పూర్తయినా, మరో రెండు నెలలు ఆగి 1950 జనవరి 26నే దాన్ని అమల్లోకి తెచ్చారు. అలా జవరి 26, 1950న మన భారత్ గణతంత్ర దేశంగా అవతరించింది. అదే రిపబ్లిక్ డే లేదా గణతంత్ర దినోత్సవం.
అంటే జనవరి 26, 1950తో బ్రిటిష్ కాలం నాటి భారత ప్రభుత్వ చట్టం -1935 రద్దయ్యింది. ఈ దినోత్సవం అనేది నాటి మేధావులు వారి దూరదృష్టితో భారత రాజ్యంగా రచనకు ఎలా పాటుపడ్డారు, ఏవిధంగా రూపొందించారు అనేదానికి ప్రాముఖ్యతనిచ్చే రోజు. ఈ భారత రాజ్యంగం అమలులోకి వచ్చి నేటి 75 ఏళ్లు పూర్తి అయ్యాయి. ఈ సందర్భంగా మన రాజ్యంగ రచనలో పాల్గొన్న మహిళలు, వారి నేపథ్యం గురించి తెలుసుకుందామా..!.
భారత రాజ్యాంగాన్ని రాసిన మహిళలు
అమ్ము స్వామినాథన్
ఆమె కేరళలోని ఒక ఉన్నత హిందూ కుటుంబంలో జన్మించారు. భారతదేశ స్వాతంత్ర్య ఉద్యమంలో మహిళా హక్కుల కోసం న్యాయవాదిగా మారారు. ఆమె 1917లో ఉమెన్స్ ఇండియా అసోసియేషన్‌ను సహ-స్థాపించారు.
దాక్షాయణి వేలాయుధన్
ఆమె భారతదేశంలో పట్టభద్రులైన మొదటి దళిత మహిళ. 1946లో రాజ్యాంగ సభకు ఎన్నికయ్యారు. ఆమె షెడ్యూల్డ్ కులాల హక్కుల గురించి చర్చలలో చురుకుగా పాల్గొనేవారు.
బేగం ఐజాజ్ రసూల్
రాజ్యాంగ సభలో ఏకైక ముస్లిం మహిళ. అసెంబ్లీలో ప్రతిపక్ష ఉప నాయకురాలిగా పనిచేశారు ఆ తర్వాత ఆమె ఉత్తరప్రదేశ్ శాసనసభకు, రాజ్యసభకు ఎన్నికయ్యారు. ఆమె మైనారిటీ హక్కులు, విద్యకు గణనీయమైన కృషి చేశారు.
దుర్గాబాయి దేశ్‌ముఖ్
చిన్న వయసులోనే సహాయ నిరాకరణ, ఉప్పు సత్యాగ్రహ ఉద్యమాలలో చేరిన స్వాతంత్ర్య సమరయోధురాలు. విద్య, సంక్షేమం ద్వారా మహిళలకు సాధికారత కల్పించడానికి ఆమె ఆంధ్ర మహిళా సభను స్థాపించారు. ఆ తర్వాత రాజ్యాంగ సభ సభ్యురాలిగా ఎన్నికయ్యారు. ఆమె హిందూస్థానీని జాతీయ భాషగా ప్రతిపాదించారు, కుటుంబ కోర్టుల ఏర్పాటు కోసం వాదించారు. ఇక ఆ తర్వాత ఆమె ప్రణాళికా సంఘానికి మొదటి మహిళా చైర్పర్సన్ అవ్వడమే గాక సామాజిక సంక్షేమ చట్టాలను రూపొందించడంలో కీలక పాత్ర పోషించారు.
హంసా మెహతా
ఆమె సంస్కర్త, రచయిత్రి, విద్యావేత్త. బరోడాలోని ప్రగతిశీల కుటుంబంలో జన్మించారు. గాంధీ సూత్రాలకు అనుగుణంగా పనిచేసిన స్వాతంత్ర్య సమరయోధురాలు. ఆమె బాంబే శాసనసభలో పనిచేశారు, మహిళల హక్కుల కోసం అవిశ్రాంతంగా పనిచేశారు. అలాగే ఐక్యరాజ్యసమితిలో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించారు. ఆమె మానవ హక్కుల సార్వత్రిక ప్రకటనను రూపొందించడంలో కీలక పాత్ర పోషించారు.
కమలా చౌదరి
ఆమె శాసనోల్లంఘన ఉద్యమంలో చేరడానికి సంప్రదాయాన్ని ధిక్కరించారు. 1946లో ఉత్తరప్రదేశ్ నుంచి రాజ్యాంగ సభకు ఎన్నికయ్యారు. తర్వాత ఆమె తాత్కాలిక పార్లమెంటు, లోక్‌సభలో పనిచేశారు.
లీలా రాయ్
భారతదేశంలోని తొలి మహిళా పత్రిక సంపాదకురాలు. ఆమె జయశ్రీ అనే పత్రిక ఎడిటర్. లీలారాయ్ స్వాతంత్ర్య ఉద్యమంలో చురుకుగా పాల్గొని మహిళల అభ్యున్నతికి కృషి చేశారు. ఆమె సుభాష్ చంద్రబోస్‌కు కూడా అత్యంత సన్నిహితురాలు.
మాలతి చౌదరి
ఆమె ఉప్పు సత్యాగ్రహం సమయంలో భారత జాతీయ కాంగ్రెస్‌లో చేరి గ్రామీణ వర్గాలకు విద్యను అందించడానికి తన భర్తతో కలిసి పనిచేశారు. సామాజిక సంస్కరణల కోసం అవిశ్రాంత న్యాయవాదిగా పనిచేశారు. భారతదేశ స్వాతంత్ర్య పోరాటంలో అట్టడుగు ఉద్యమాలను సమీకరించడంలో చౌదరి చేసిన ప్రయత్నాలు కీలకమైనవి.
పూర్ణిమ బెనర్జీ
ఆమె సత్యాగ్రహం, క్విట్ ఇండియా ఉద్యమాలలో పాల్గొన్న స్వాతంత్ర్య సమరయోధురాలు. రాజ్యాంగ సభలో ఆమె లౌకిక విద్య గురించి మాట్లాడటమే గాక ప్రజల సార్వభౌమత్వాన్ని నొక్కి చెప్పారు.
రాజకుమారి అమృత్ కౌర్
ఆమె భారతదేశపు మొట్టమొదటి ఆరోగ్య మంత్రి, రాజ్యాంగ సభలో యూనిఫాం సివిల్ కోడ్, సార్వత్రిక ఓటు హక్కు కోసం వాదించారు. ఆమె ఎయిమ్స్, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ చైల్డ్ వెల్ఫేర్‌ను స్థాపించడంలో కూడా కీలక పాత్ర పోషించారు.
రేణుకా రే
ఆమె మహిళల చట్టాల్లోని లోపాలను ఎండగడుతూ ఒక డాక్యుమెంట్‌ని రచించారు. ఆమె రాజ్యాంగ సభల సభ్యురాలుగా కీలక పాత్ర పోషించారు. తర్వాత పశ్చిమ బెంగాల్ సహాయ, పునరావాస మంత్రిగా, లోక్‌సభ ఎంపీగా పనిచేశారు.
సరోజిని నాయుడు
భారతదేశపు కోకిలగా పిలువబడే సరోజిని నాయుడు ఒక కవయిత్రి, స్వాతంత్ర్య సమరయోధురాలు. భారత జాతీయ కాంగ్రెస్‌కు అధ్యక్షత వహించిన తొలి మహిళ. ఆమె భారత స్వాతంత్ర్య ఉద్యమంలో కీలక పాత్ర పోషించింది. మహిళల హక్కులు, సామాజిక సంస్కరణల కోసం వాదించింది. అలాగే రాజ్యాంగ సభ సభ్యురాలిగా ఎన్నికైంది. అంతేగాదు ఆమె లౌకికవాదం, సార్వత్రిక ఓటు హక్కుకు మద్దతుదారుగా భారతదేశ చరిత్రలో చెరగని ముద్ర వేసింది.
సుచేతా కృపలాని
ఆమె భారత రాజ్యాంగాన్ని రూపొందించడంలో సహాయపడింది. 1942 క్విట్ ఇండియా ఉద్యమంలో కీలక పాత్ర పోషించింది. పండిట్ నెహ్రూ "ట్రైస్ట్ విత్ డెస్టినీ" ప్రసంగానికి ముందు స్వాతంత్ర్య సమావేశంలో ఆమె వందేమాతరం కూడా పాడింది.
విజయ లక్ష్మీ పండిట్
పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ సోదరి. ఆమె స్వాతంత్య్ర పూర్వ భారతదేశంలో మొట్టమొదటి మహిళా క్యాబినెట్ మంత్రి. 1937లో స్థానిక స్వపరిపాలన, ప్రజారోగ్య మంత్రి పదవిని నిర్వహించారు.
అన్నీ మస్కరీన్
ఆమె రాజ్యాంగ ముసాయిదాకు దోహదపడింది. హిందూ కోడ్ బిల్లుపై పనిచేసింది. 1949లో ట్రావెన్కోర్-కొచ్చిన్ ప్రభుత్వంలో ఆరోగ్యం, విద్యుత్ మంత్రిగా పనిచేసిన తొలి మహిళ మస్కరీన్.
(చదవండి: సర్వ ఆహార సమ్మేళనం..!)
Comments
Please login to add a commentAdd a comment