ప్రమాదకర క్రీడ
యాదృచ్ఛికమే అయినా ఈ దేశ రాజ్యాంగాన్ని అమల్లోకి తీసుకొచ్చిన గణతంత్ర దినోత్సవం రోజునే దాని స్ఫూర్తికి విరుద్ధమైన ఒక సిఫార్సుపై రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ సంతకం చేయాల్సివచ్చింది. అరుణాచల్ ప్రదేశ్‌లో రాష్ట్రపతి పాలనకు సిఫార్సుచేస్తూ కేంద్ర కేబినెట్ తీసుకున్న నిర్ణయానికి ఆయన ఆమోదం తెలపాల్సి వచ్చింది. వాస్తవానికి ఎన్డీయే సర్కారుకు కూడా ఇది ఇష్టం ఉండకపోవచ్చు. అందువల్లనే కావొచ్చు...గణతంత్ర దినోత్సవానికి రెండు రోజుల ముందే అందుకు సంబంధించిన ఫైలును ప్రణబ్‌కు పంపింది. కానీ ఆయన వెంటనే సంతకం చేయకుండా కొన్ని వివరణలడిగారు. చివరకు కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ వెళ్లి ఆయన సందేహాలు తీర్చాక అరుణాచల్‌లో రాష్ట్రపతి పాలనకు వీలు కల్పించే సిఫార్సుపై ప్రణబ్ సంతకం చేశారు. మంగళవారం గణతంత్ర దినోత్సవమనిగానీ, రాష్ట్రపతి పాలన ప్రయత్నాన్ని సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో అప్పటికే పిటిషన్ దాఖలైందన్న వాస్తవంతోగానీ నిమిత్తం లేకుండానే కేంద్ర ప్రభుత్వం అరుణాచల్ సర్కారును బర్తరఫ్‌చేసింది. ఆ రాష్ట్ర శాసనసభను సుప్తచేతనావస్థలో ఉంచింది.
విపక్షాల ఏలుబడిలో ఉండే రాష్ట్ర ప్రభుత్వాలను ఇబ్బంది పెట్టడం, వీలైతే వాటిని తొలగించి రాష్ట్రపతి పాలన విధించడం...తమకు అనుకూలురైనవారికి అధికారం కట్టబెట్టడం మన దేశంలో కొత్తగాదు. ఇలాంటి చేష్టల్లో కాంగ్రెస్ బాగా ఆరితేరింది. అయితే ఇది చూస్తుండగానే ముదిరి పాకానబడింది. ప్రజా ప్రభు త్వాలను కేంద్రంలోని పాలకులు అస్థిరపరుస్తున్న తీరును గమనించిన సర్వోన్నత న్యాయస్థానం ఈ మాదిరి చర్యలను నియంత్రించే పనికి పూనుకుంది. రాష్ట్రపతి పాలనకు వీలు కల్పించే రాజ్యాంగంలోని 356వ అధికరణపై కూలంకషంగా సమీక్షించి కొన్ని మార్గదర్శకాలను అమల్లోకి తెచ్చింది. ఆ అధికరణకింద రాష్ట్రపతికి సంక్రమించే అధికారం తిరుగులేనిదేమీ కాదని స్పష్టం చేసింది. ఒక ప్రభుత్వానికి బలం ఉన్నదో, లేదో తేలాల్సింది చట్టసభల్లోనే తప్ప రాజ్‌భవన్‌లలో కాదని చెప్పింది. అయితే, ఆ తర్వాత కూడా కేంద్రంలో అధికారం చలాయించిన వారు తమ పరిమితులు గుర్తెరిగి ప్రవర్తించలేదు. రాష్ట్ర ప్రభుత్వాలను ఇబ్బందుల పాలు చేయడం మానుకోలేదు. వాస్తవానికి రాజ్యాంగ నిర్మాత డాక్టర్ అంబేడ్కర్ ఈ అధికరణ మృతప్రాయమైన నిబంధనగా మిగిలిపోవాలని ఆకాంక్షించారు. అయితే ఇన్ని సంవత్సరాల ఆచరణనూ గమనిస్తే అందుకు భిన్నమైన పరిణామాలే చోటుచేసుకున్నాయని అర్ధమవుతుంది.
ఈ మాదిరి రాజకీయ క్రీడ నుంచి కనీసం సరిహద్దు రాష్ట్రాలనైనా మినహా యించాలన్న స్పృహ పాలకులకు ఉండటం లేదు. జమ్మూ-కశ్మీర్‌లో ప్రభు త్వాలను అస్థిరపరిచి, అక్కడ సంక్షోభం సృష్టించిన ఘనత కాంగ్రెస్‌దే. ఒక్కసారి కాదు...నాలుగైదు దఫాలు అలా చేయడంవల్లే ఆ రాష్ట్రంలో ఏ ప్రభుత్వం ఏర్పడినా సక్రమమైన పాలన అందించలేకపోయింది. ఫలితంగా ప్రజల మౌలిక సమస్యల పరిష్కారానికి దోహదపడే చర్యలు కరువయ్యాయి. నిరుద్యోగం ప్రబలడంవల్ల యువత మిలిటెన్సీవైపు మళ్లింది. దాన్నుంచి ఇప్పటికీ ఆ రాష్ట్రం కోలుకోలేకపోతున్నది. కళ్లముందు ఇన్ని అనుభవాలుండగా అరుణాచల్‌లో దాన్నే పునరావృతం చేయాలనుకోవడం క్షమార్హంకాని విషయం.
అరుణాచల్‌లో కాంగ్రెస్ ప్రభుత్వం స్వీయ తప్పిదాలవల్లే ఈ స్థితి ఏర్పడిందని బీజేపీ నేతలు చేస్తున్న వాదనలో నిజం లేకపోలేదు. ఆ రాష్ట్రంలో నిరుడు ఎన్నికలు జరిగి ముఖ్యమంత్రిగా రెండోసారి నబమ్ టుకీ బాధ్యతలు స్వీకరించారు. 60 స్థానాలున్న అసెంబ్లీలో కాంగ్రెస్ 42 సీట్లు కైవసం చేసుకున్నా సీఎంకు వ్యతిరేకంగా ఒక బలమైన వర్గం తయారైంది. 21 మందిని కూడగట్టుకుని 11మంది బీజేపీ ఎమ్మెల్యేలు మద్దతు కూడా పొందిన ఆ వర్గం టుకీని పదవీచ్యుతుణ్ణి చేయడానికి సిద్ధపడింది. ఈ నెల 14న మొదలు కావలసిన అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లో ఆ పని చేయాలని భావించింది. దీన్ని ముందే పసిగట్టిన టుకీ స్పీకర్ సాయంతో తిరుగుబాటు వర్గంలోని 14మందిపై గత నెల అనర్హత వేటు వేశారు. ఈ పరిణామాలపై ఆ రాష్ట్ర గవర్నర్ జ్యోతి రాజ్‌ఖోవా వ్యవహరించిన తీరు అభ్యంతరకరమైనది. జనవరి 14న అసెంబ్లీ సమావేశాల ఏర్పాటుకు నోటిఫికేషన్ జారీచేసిన గవర్నర్ దాన్ని డిసెంబర్ 16కు మార్చడం...ఆ సమావేశాలకు డిప్యూటీ స్పీకర్ అధ్యక్షత వహించాలని, స్పీకర్ తొలగింపు కోసం తిరుగుబాటు వర్గం ఇచ్చిన నోటీసుపై ముందుగా చర్చించి, ఓటింగ్ నిర్వహించాలని నిర్దేశించడం అందర్నీ ఆశ్చర్య పరిచింది.
రాజ్యాంగం ప్రకారం గవర్నర్‌కు స్వతంత్రంగా వ్యవహరించలేరు. రాష్ట్ర మంత్రివర్గం సలహాకు లోబడే ఆయన పనిచేయాలి. గవర్నర్ నిర్ణయా లపై స్పీకర్ దాఖలుచేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం పరిశీలిస్తున్నది. రాష్ట్రపతి పాలన యత్నంపై సోమవారం కాంగ్రెస్ మరో పిటిషన్ దాఖలు చేసింది. ఈలోగా రాష్ట్రపతి పాలన విధించడం ద్వారా తామూ కాంగ్రెస్ బాటలోనే నడుస్తున్నట్టు ఎన్డీయే సర్కారు నిరూపించుకుంది. అరుణాచల్ పరిణామాలు కాంగ్రెస్ అంతర్గత సంక్షోభం పర్యవసానమనీ, అందులో తమ బాధ్యత లేదని బీజేపీ పెద్దలు వాదించవచ్చు. కానీ కేంద్రం ఆశీస్సులు లేకుండా ఇలాంటివి చోటుచేసుకోవన్నది జగద్వితం. అరుణాచల్ ప్రదేశ్ చైనా సరిహద్దుల్లో ఉన్న అత్యంత సమస్యాత్మక రాష్ట్రం. అక్కడ తరచు ఏదో ఒక కవ్వింపు ఘటనకు పాల్పడటం చైనాకు అలవాటుగా మారింది. అలాంటిచోట అస్థిర పరిస్థితులకు తావిచ్చేలా ప్రవర్తించడం ప్రమాదకరం. జమ్మూ-కశ్మీర్‌లో ఏమైందో తెలుస్తూనే ఉన్నా అరుణాచల్‌నూ ఆ దోవకు నెట్టడం బాధ్యతారాహిత్యం. పార్టీ ప్రయోజనాలను కాక దేశ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకునేవారెవరూ ఇలా చేయరు.