క్యాష్‌లెస్ చిచ్చు కార్పొరేట్ల ఉచ్చు
కొత్త కోణం
పెద్ద నోట్ల రద్దు చర్చ జరుగుతుండగానే, దానికి కొనసాగింపుగా నగదురహిత లావాదేవీల అంశం తెరకెక్కింది. పెద్ద నోట్ల రద్దుతో పేద, మధ్య తరగతి ప్రజలు నిత్యం ఇబ్బందులు పడటం కనబడుతోంది. కానీ ప్రభుత్వం ప్రకటించినట్టు నల్లడబ్బు దాచుకున్న బడాబాబులు ఎవరూ గంటలు, రోజుల తరబడి క్యూలలో నిలబడటం కనబడదు. మంచి కార్యం జరగడానికి కష్టాలు తప్పవంటూ ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలను నమ్మిన ప్రజలు నల్ల డబ్బున్న సంపన్నులు కూడా తమ లాగే డబ్బులు లేకుండా గడపాల్సి వస్తుందనే భ్రమతో ఈ కష్టాలన్నిటినీ దిగమింగుకుంటున్నారు.
పెద్దనోట్ల వల్ల కలుగుతున్న కష్టాలను తీర్చడం మీది నుంచి ప్రభుత్వాలన్నీ ఇప్పుడు నగదు రహిత లావాదేవీలవైపు దృష్టిని మళ్లించాయి. పైసలు చేతుల్లో లేకుండానే ఉత్పత్తి, అమ్మకం, కొనుగోళ్లు చేయవచ్చని ప్రచారం చేస్తున్నాయి. భవిష్యత్‌లో ప్రపంచమంతా దీనినే అనుసరించాల్సి ఉంటుందని, అందువల్ల ఇది ఎప్పటికై నా తప్పని చర్యని పదే పదే నొక్కి చెబుతున్నారు. నగదురహిత లావాదేవీల వల్ల నల్లధనం, పన్నుల ఎగవేత మటుమాయమై, ఆర్థిక వ్యవహారాలన్నీ పారదర్శకంగా జరుగుతాయని కూడా అంటున్నారు. ఈ నేపథ్యంలో మనం నగదు రహిత లావాదేవీల అంశాన్ని అర్థం చేసుకోవాల్సిన అవసరమున్నది. అందుకోసం ఇప్పటికే నగదు రహిత లావాదేవీలను అనుసరిస్తున్న దేశాల అనుభవాలను పరిశీలించాల్సి ఉంది.
పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్టు
అభివృద్ధిచెందిన దేశాలలో నగదు రహిత లావాదేవీలు అధికంగా సాగుతున్నారుు. వినియోగదారుల వ్యయానికి సంబంధించి బెల్జియంలో 93 శాతం, ఫ్రాన్‌సలో 92 శాతం, కెనడాలో 90 శాతం, బ్రిటన్‌లో 89 శాతం, స్వీడన్‌లో 89 శాతం నగదు రహిత లావాదేవీలు జరుగుతున్నారుు. కాగా అది ఆస్ట్రేలియాలో 86 శాతం, అమెరికాలో 80 శాతం, జర్మనీలో 76 శాతంగా ఉంది. ఆసియా నుంచి కేవలం దక్షిణ కొరియాలోనే 70 శాతం నగదు రహిత లావాదేవీలు సాగుతున్నారుు. మన దేశంలో నగదు రహిత లావాదేవీలకు అలవాటుపడ్డ పట్టణ కుటుంబాలు 11 శాతానికి మించవు. గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద దాదాపు 5.2 కోట్ల మంది గ్రామీణులకు చెల్లింపులన్నీ నగదు రహితంగానే జరుగుతున్నాయి. అయినా వినియోగదారులుగా వారు చేసే వ్యయంలో నగదు రహితంగా సాగేది అసలు లెక్కలోకే రాదు. పెద్ద నోట్ల రద్దుకు ముందు వరకు దేశంలోని మొత్తం అన్ని రకాల లావాదేవీలలో కేవలం 2 శాతం మాత్రమే నగదు రూపంలో జరుగుతున్నాయి. అయినా మన దేశాన్ని నగదురహిత దేశంగా మార్చేస్తామని మోదీ ప్రభుత్వం అంటోంది.
క్యాష్‌లెస్‌తో దివాలా తీసిన నైజీరియా
మానవాభివృద్ధి సూచీలో భారత్ కంటే ఎంతో ముందుండి, అక్షరాస్యత, విద్యలో ఎంతో పురోగతిని సాధించిన అభివృద్ధి చెందిన దేశాలేవీ నగదు రహిత దేశాలుగా ప్రకటించుకోలేదు. యూరప్, అమెరికా, ఆస్ట్రేలియా ఇప్పటికే తమ ఆర్థిక వ్యవస్థలను, వ్యవసాయ రంగాన్ని కార్పొరేటీకరించాయి. అక్కడ చిన్న, మధ్య తరహా పరిశ్రమలు, వ్యాపారాలు, సంస్థలు చాలా తక్కువ. పైగా ఆ దేశాల్లో నగదు రహిత లావాదేవీల అభివృద్ధి క్రమక్రమంగా దీర్ఘకాలంలో సాగింది.
కానీ నగదు రహిత లావాదేవీలకు మొగ్గిన నైజీరియా 20 కోట్ల జనాభాగల వెనుకబడిన దేశం. ఇందులో 55 శాతం గ్రామీణ ప్రజలు, 45 శాతం పట్టణ ప్రజలు. 59 శాతం అక్షరాస్యత కలిగిన ఆ దేశంలో 30 శాతం వ్యవసాయం మీద ఆధారపడి జీవిస్తున్నవారు. దాదాపు 61 శాతం రోజుకు ఒక డాలరు ఆదాయంతో పేదరికంలో ఉన్నారు. వ్యవసాయం తీవ్ర సంక్షోభంలో ఉంది. తీవ్ర కరువు పరిస్థితులు నెలకొన్న ఈ దేశంలో ఎక్కువ భూములు సాగునీటి సౌకర్యంలేనివే. నీటి వసతి కల్పించడం భారీ వ్యయంతో కూడుకున్నది కాబట్టి సాధారణ రైతులెవరూ ఆ జోలికి పోరు. రైతులకు అందే వ్యవసాయ రుణాలలో బ్యాంకుల వాటా ఒక్క శాతమే. మిగతాదంతా వడ్డీ వ్యాపారులు సమకూర్చేదే. 2012 నుంచి నగదు రహిత లావాదేవీలు, రైతుల కోసం ఈ వ్యాలెట్‌లు ప్రవేశించాయి. ప్రధాన రుణ వనరైన వడ్డీ వ్యాపారుల నుంచి రుణాలు నిలచిపోగా సాధారణ రైతులు సాగును వదిలేయాల్సి వచ్చింది.
క్యాష్‌లెస్ అంటే కార్పొరేటీకరణ?
వ్యవసాయం గిట్టుబాటుకాని రైతులందరి భూములను కార్పొరేట్ సంస్థలు వ్యాపార భాగస్వామ్యం పేరుతో ఆక్రమించుకున్నాయి. కార్పొరేట్ల భాగస్వామ్యంతో నడిచే అగ్రికల్చరల్ డీలర్ పద్ధతిని ప్రవేశ పెట్టారు. దీనితో రైతులలో సగం మంది వాటాలను కొనుక్కొని తమ భూముల్లోనే కూలీలుగా మారారు. రుణ భారంతో రైతులు తమ భూములను కార్పొరేట్ కంపెనీలకే తాకట్టు పెట్టాల్సి వచ్చింది. దీంతో నైజీరియా వ్యవసాయరంగ స్వరూపం పూర్తిగా మారిపోయింది. నగదు రహిత లావాదేవీలు నైజీరియా వ్యవసాయరంగాన్ని కార్పొరేటీకరణ వైపు నెట్టింది. చిన్న, మధ్యతరగతి వ్యాపారాలు కూడా అలాగే పెద్ద ఎత్తున దెబ్బతిన్నాయి.
గ్రామీణ జనాభా సగానికిపైగా ఉండడం, 59 శాతం అక్షరాస్యతే ఉండటం ఈ విపరిణామాలకు కారణాలని అధ్యయనాల్లో తేలింది. నగదు రహిత లావాదేవీలకు సంబంధించిన సాంకేతికత పట్ల అవగాహన లేకపోవడం, ఐటీ వసతులు, ఏటీఎంలు, అందుబాటులో లేకపోవడం, ఆన్‌లైన్ లావాదేవీల పట్ల భయం, సందేహాలు, ఇంట ర్నెట్ వ్యయం భారంగా మారడం వల్ల చిన్న వ్యాపారులు సైతం నగదు రహిత లావాదేవీలవైపు వెళ్లలేక దెబ్బతిన్నారు. వారి స్థానంలో కొందరు పెద్ద వ్యాపారస్థులు ఈ అవకాశాలను అందిపుచ్చుకున్నారు. నైజీరియా స్థూలజాతీయోత్పత్తి వృద్ధి రేటు 6.4 నుంచి 2.7కి పడిపోరుుంది.
రైతాంగానికి, చిన్న వ్యాపారులకు పెనుగుండం
నైజీరియా నగదు రహిత లావాదేవీల కథను వింటుంటే రేపటి నగదు రహిత భారతదేశం సూక్ష్మ రూపంలో దర్శనమిచ్చినట్టు ఉంటుంది. చాలా వరకు అటువంటి సామాజిక ఆర్థిక పరిస్థితులే ఉన్న మన దేశంలో ఇప్పటికే సాంకేతికత, ఆధునికత, పారిశ్రామికీకరణ పేరుతో పేదలను, ముఖ్యంగా ఆదివాసీలను, దళితులను ఉత్పత్తి రంగం నుంచి, జాతీయ జీవన స్రవంతి నుంచి వెలివేశారు. మన దేశంలో ప్రారంభమైన నగదు రహిత లావాదేవీల అంతిమ పర్యవసానం పేదలు, రైతులు, చిన్న, మధ్యతరగతి వ్యాపారులు దెబ్బ తినిపోవడమే అని, పలువురు నిపుణుల అభిప్రాయం. వ్యవసాయరంగ కార్పొరేటీకరణ, చిన్న మధ్యతరగతి వ్యాపారాలన్నీ దెబ్బతిని బడా మాల్స్, సూపర్ మార్కెట్స్, పెద్ద దుకాణ సముదాయాలు విస్తరించడం తప్పదనిపిస్తుంది.
మన వ్యవసాయరంగం ఇప్పటికే తీవ్ర సంక్షోభంలో ఉంది. రైతులెవ్వరూ ఆర్థికంగా తమ సొంత కాళ్ళపై నిలబడి వ్యవసాయం చేసే స్థితిలో లేరు. పూర్తిగా రుణాలపైనే ఆధారపడాల్సిన దుస్థితి. బ్యాంకులు రైతుల రుణ అవసరాలలో 10 నుంచి 15 శాతం మాత్రమే తీర్చగలుగుతున్నాయి. మిగిలినవన్నీ ప్రైవేట్ వడ్డీ వ్యాపారులు, ఎరువులు, విత్తనాలు, పురుగు మందుల డీలర్ల నుంచి తీసుకుంటున్నవే. నగదు రహిత లావాదేవీలను ప్రభుత్వం అంటున్నట్టుగా విస్తరింపజేస్తే వడ్డీ వ్యాపారుల నుంచి రైతులకు రుణాలు అందవు. ఇప్పటికే దేశంలోని అన్ని రాష్ట్రాల్లో రబీ పంట వేసిన రైతులవద్ద నగదు లేక, అప్పు పుట్టక నానా ఇబ్బందులు పడుతున్నారు. ఇదే పరిస్థితి ఎక్కువ కాలం కొనసాగితే రెతులకు వ్యవసాయం మానుకోవడం తప్ప గత్యంతరం లేకపోవచ్చు. అదే అవకాశంగా కార్పొరేట్ కంపెనీలు వ్యవసాయ రంగాన్ని కార్పొరేటీకరిస్తాయని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇప్పటికే దేశంలో కొన్ని చోట్ల కార్పొరేట్ వ్యవసాయం జరుగుతోంది కూడా. ఈ నగదు రహిత లావాదేవీలవల్ల ఆర్థిక సాయం అందని రైతాంగం తమ భూములను కార్పొరేట్లకు దారాదత్తం చేయడం అనివార్యం కావచ్చని సైతం భావిస్తున్నారు.
నిజానికి నగదు రహిత లావాదేవీల వల్ల ఈ దేశ ఆర్థికాభివృద్ధి జరగాలంటే చిన్న, మధ్యతరగతి వ్యాపారులు, వ్యవసాయరంగంలోని రైతుల ప్రయోజనాల పరిరక్షణకు అవసరమైన చర్యలు తీసుకోవాలి. ముఖ్యంగా రైతులు, చిన్న వ్యాపారుల రుణ అవసరాలను పూర్తిగా బ్యాంకులే తీర్చే ఏర్పాటు చేయాలి. ఎరువులు, పురుగు మందులు, విత్తనాలూ డీలర్ల ద్వారా రైతులకు నేరుగా రుణాల రూపంలో అందజేసే సౌకర్యాలను కలిగించాలి. ఈ విషయంలో ప్రభుత్వాలు నిర్లక్ష్యం వహిస్తే దాదాపు నూటికి 70 శాతం మంది ప్రజలు ఉత్పత్తి రంగానికి, ఉపాధికి దూరమయ్యే పరిస్థితి కనిపిస్తున్నది. పెద్ద నోట్ల రద్దు, నగదురహిత లావాదేవీలు అంతిమంగా ప్రజలందరి అభివృద్ధికి ఉపయోగపడాలే తప్ప, కొన్ని కార్పొరేట్ కంపెనీల కొమ్ము కాయడానికి కారాదు అని ప్రభుత్వాలు గుర్తించాలి.
- మల్లెపల్లి లక్ష్మయ్య
వ్యాసకర్త సామాజిక విశ్లేషకులు
మొబైల్ : 97055 66213