క్యాష్‌లెస్ లావాదేవీలపై చంద్రబాబుకు షాక్
చాలామంది మంత్రులు, అధికారులు నగదురహిత లావాదేవీలు చేయకపోవడంతో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు షాక్ తిన్నారు. విజయవాడలో రెండు రోజుల పాటు నిర్వహిస్తున్న కలెక్టర్ల కాన్ఫరెన్సు వద్ద ఐడీఎఫ్‌సీ బ్యాంకు ఆధార్ ఆధారిత కొనుగోలు సెంటర్‌ను ఏర్పాటుచేసింది. కొంతమంది మంత్రులు, పలువురు ఐఏఎస్ అధికారులు జీడిపప్పు, బిస్కట్లను కొనుగోలు చేశారు. ఈ సందర్భంగా క్యాష్‌లెస్ లావాదేవీలపై మంత్రులను, ఐఏఎస్ అధికారులను సీఎం చంద్రబాబు ప్రశ్నించారు.
కానీ, చాలామంది ఏటీఎం కార్డులతోనే లావాదేవీలు నిర్వహిస్తున్నారు తప్ప మొబైల్ బ్యాంకింగ్, ఆన్‌లైన్ యాప్‌ను వినియోగించలేదని తెలిసింది. దీంతో ఒక్కసారిగా చంద్రబాబు షాక్ తిన్నారు. 40 శాతం కూడా క్యాష్‌లెస్ లావాదేవీలు నిర్వహించకపోవడంతో ఆయన అసహనం వ్యక్తం చేశారు. 40 రోజుల నుంచి చెబుతున్నా మీరే చేయకపోతే ఎలాగని మండిపడ్డారు. అయితే తమ బ్యాంకు ఖాతాలకు ఆధార్ సీడింగ్ లేదని, అందుకే ఆన్‌లైన్ వ్యవహారం జరగడం లేదని మంత్రి అచ్చెన్నాయుడు చెప్పారు. తాము ఏటీఎం కార్డుల ద్వారా లావాదేవీలు చేయగలుగుతున్నామని ఆయన అన్నారు.