cashless system
-
Her Payment Digital: నగదు రహిత వ్యవస్థ బాటలో భారత్!
ముంబై: నగదు రహిత వ్యవస్థ ఆవిష్కరణ దిశలో భారత్ వేగంగా అడుగులు వేస్తోంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ప్రధాన కార్యాలయంలో డిజిటల్ చెల్లింపుల అవగాహన వారోత్సవాన్ని (డీపీఏడబ్ల్యూ) 2023 గవర్నర్ శక్తికాంతదాస్ సోమ వారం ప్రారంభించారు. ‘హర్ పేమెంట్ డిజిటల్’ (డిజిటల్లోనే ప్రతి చెల్లింపు) పేరుతో కీలక చొరవకు శక్తికాంతదాస్ శ్రీకారం చుట్టారు. బ్యాంకులు, సంబంధిత అన్ని వర్గాలూ ఆన్లైన్ చెల్లింపులకు అధిక ప్రాధాన్యత ఇచ్చి, వాటి ప్రయోజనాల గురించి అవగాహన కల్పించాలని అభ్యర్థించారు. యూపీఐ (యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్) పేమెంట్ వ్యవస్థ పట్ల ప్రస్తుతం జరుగుతున్న జీ20 దేశాల సమావేశాల్లోసహా పలు దేశాలు ఎంతో ఆసక్తి ప్రదర్శిస్తున్నాయన్నారు. ఈ వ్యవస్థతో సహకారానికి ప్రత్యేకించి ఆయా దేశాల చెల్లింపు ప్లాట్‌ఫారమ్‌లతో యూపీఐను అనుసంధానం చేయడానికి ముందడుగులు వేస్తున్నట్లు వెల్లడించారు. ప్రస్తుతం ఈ దేశాలతో..: యూపీఐ వ్యవస్థ ప్రస్తుతం సింగపూర్, యూఏఈ, ఒమన్, సౌదీ అరేబియా, మలేషియా, ఫ్రాన్స్, బెల్జియం, నెదర్లాండ్స్, లక్సెంబర్గ్, స్విట్జర్లాండ్లలో అందుబాటులో ఉంది. యూపీఐ స్వీకరించాలనుకునే 13 దేశాలతో భారత్ అవగాహన ఒప్పందాలపై సంతకం చేశాయని సమాచారం. ‘యూపీఐ’ – సింగపూర్ భాగస్వామి ‘పేనౌ’ మధ్య లింకేజీలు యాక్టివేట్ అయినప్పటి నుండి, చెల్లింపుల విషయంలో చాలా దేశాలు అటువంటి సహకారంలోకి ప్రవేశించడానికి ఆసక్తిని వ్యక్తం చేశాయని దాస్ తెలిపారు. యూపీఐ విస్తరణ వేగం.. యూపీఐ ద్వారా చెల్లింపులు గత 12 నెలల్లో విపరీతంగా పెరిగాయని గవర్నర్ శక్తికాంతదాస్ పేర్కొన్నారు. రోజువారీ లావాదేవీలు 36 కోట్లు దాటాయని అన్నారు. ఫిబ్రవరి 2022లో 24 కోట్లతో పోలిస్తే 50 శాతం పెరిగినట్లు పేర్కొన్నారు. విలువ పరంగా చూస్తే, యూపీఐ లావాదేవీల విలువ 2022 ఫిబ్రవరిలో రూ.5.36 లక్షల కోట్లయితే, 2023 ఫిబ్రవరిలో ఈ విలువ రూ. 6.27 లక్షల కోట్లకు పెరిగినట్లు తెలిపారు. ఫిబ్రవరి 2022లో రూ. 5.36 లక్షల కోట్ల నుండి 17 శాతం వృద్ధిని నమోదు చేశాయని చెప్పారు. గత మూడు నెలల్లో మొత్తం నెలవారీ డిజిటల్ చెల్లింపు లావాదేవీలు ప్రతి నెలా రూ. 1,000 కోట్ల మార్కును దాటాయని కూడా ఆయన చెప్పారు. -
క్యాష్‌లెస్ 30 శాతమే !
మోర్తాడ్(బాల్కొండ) /నిజామాబాద్‌అర్బన్: జిల్లాలోని 25 ఎస్బీఐ శాఖలను క్యాష్‌లెస్ బ్యాంకింగ్ కోసం పైలెట్ ప్రాజెక్టు కింద ఎంపిక చేశారు. అందులో మోర్తాడ్ మండలంలోని సుంకెట్, తిమ్మాపూర్, కమ్మర్పల్లి మండలంలోని చౌట్పల్లి, కిసాన్‌నగర్, తొర్లికొండ ఎస్బీఐ శాఖలతో పాటు మరో 20 ఎస్బీఐ శాఖలు ఉన్నాయి. ఈ బ్యాంకుల పరిధిలో క్యాష్‌ను అసలే వినియోగించకూడదని పూర్తిగా డిజిటల్ లావాదేవీలనే నిర్వహించాలని ఉన్నతాధికారులు సూచించారు. బ్యాంకు శాఖ పరిధిలోని వ్యాపారులకు స్వైప్ యంత్రాలను అందించి క్యాష్‌లెస్ లావాదేవీలను నిర్వహించేలా చూడాలని సూచించారు. కాని స్వైప్ యంత్రాలను ఆశించిన విధంగా సరఫరా చేయకపోవడంతో నగదు రహితం నామమాత్రమే అయ్యింది. కాగా గ్రామీణ ప్రాంతాల్లో 30 శాతం క్యాష్‌లెస్ లావాదేవీలను నిర్వహించడం ఆహ్వానించదగ్గ విషయం అని బ్యాంకర్లు చెబుతున్నారు. నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించడంతో బ్యాంకుల్లో కాగితాలతో పని లేకుండా పోయిందని బ్యాంకర్లు చెబుతున్నారు. ఇది ఇలా ఉండగా నగదు కొరత వల్ల బ్యాంకుల్లో తక్కువ మొత్తంలో డ్రా చేసుకోవడానికే అధికారులు అనుమతి ఇస్తున్నారు. ప్రజలు మాత్రం తమకు అవసరమైన నగదును డ్రా చేసుకోవడానికి రోజుల తరబడి బ్యాంకుల చుట్టూ తిరగాల్సి వస్తోంది. మరోవైపు పెద్ద నోట్లు రద్దయి ఏడాది పూర్తియినా ప్రజలకు ఇంకా నోట్ల కష్టాలు తప్పలేదు. జిల్లాలో 268 బ్యాంకులు ఉన్నాయి. ఇందులో 33 ప్రెయివేటు బ్యాంకులు ఉన్నాయి. 245 ఏటీఎంలు అందుబాటులో ఉన్నాయి. ఏటీఎంలలో నగదు అందుబాటులో ఉండకపోవడం తరచుగా తలెత్తుతున్న సమస్య. ప్రస్తుతం ఏటీఎంలలో రెండువేల నోట్లు కొన్నిసార్లు మాత్రమే అందుబాటులోకి వస్తున్నాయి. ఏటీఎంలలో ఐదు వందల నోట్లు అందుబాటులో ఉంచుతున్నారు. వరుసగా సెలవులు వస్తే, పండుగల సందర్భాలలో ఏటీఎంలలో డబ్బులు అందుబాటులో ఉండటం లేదు. కొన్ని ప్రాంతాలలో ఏటీఎంలు నోట్ల రద్దు తర్వాత పని చేయడం లేదు. నోట్ల రద్దు తర్వాత ఆర్బీఐ కొత్తగా రూ.200, రూ. 50 కొత్త నోట్లు తీసుకువచ్చింది. మొదట్లో స్వైపింగ్ యంత్రాల హడావుడి సాగినా.. ప్రస్తుతం నగదు రహిత లావాదేవీలు తగ్గిపోయాయి. కొద్ది మంది మాత్రమే కొన్ని చోట్ల స్వైపింగ్ విధానాన్ని కొనసాగిస్తున్నారు. నగదురహిత లావాదేవీల కోసం ప్రభుత్వ అవగాహన కార్యక్రమాలు అంతగా ప్రయోజనాన్ని ఇవ్వలేదు. పట్టణ ప్రాంతాల్లో సైతం నగదురహిత లావాదేవీలు చాలా వరకు తగ్గుముఖం పట్టాయి. స్వైపింగ్యంత్రాల ద్వారా కొనుగోలు చేస్తే వినియోగదారుడికే పన్నుభారం పడటంతో కొనుగోలు చేపట్టడం లేదు. సాక్షి, కామారెడ్డి: కామారెడ్డి జిల్లాలోని ఉగ్రవాయి గ్రామంలో 409 కుటుంబాలు ఉండగా మొత్తం జనాభా 1374 ఉన్నారు. పిల్లలుపోను మిగతా 1,156 మందికి బ్యాంకు ఖాతాలు ఇచ్చారు. కామారెడ్డి పట్టణంలోని ఆంధ్రాబ్యాంకు, స్టేట్‌బ్యాంక్‌లలో వారి ఖాతాలు ఉన్నాయి. నగదు రహిత లావాదేవీల గురించి గ్రామంలో పలుమార్లు సమావేశాలు నిర్వహించి అవగాహన కల్పించే ప్రయత్నం చేశారు. గ్రామంలో కిరాణ దుకాణాలు, మెడికల్ షాప్, హోటళ్లు, కల్లు దుకాణాలు.. ఇలా మొత్తంగా 17 మంది వద్ద స్వైప్ మిషన్లు ఏర్పాటు చేయడానికి అధికారులు బ్యాంకర్లకు ప్రతిపాదనలు పంపించారు. అయితే కిరాణ దుకాణం నిర్వహించే రాచర్ల చంద్రం, హోటల్ నిర్వాహకుడు చంద్రాగౌడ్, రేషన్ డీలర్ లావణ్య, గ్రామ పంచాయతి, వాటర్ ప్లాంట్ నిర్వాహకులు మాత్రమే స్వైపింగ్ మిషన్లు తీసుకున్నారు. గ్రామంలో చాలా మంది క్యాష్‌లెస్ ట్రాన్జాక్షన్స్కు దూరంగా ఉన్నారు. చదువురాదని కొంద రు, ఖాతాలో సొమ్ము దాచుకునే స్థోమత లేక ఇంకొందరు.. పాతపద్ధతిలోనే లావాదేవీలు జ రిపారు. 70 నుంచి 80 మంది మాత్రం నూతన విధానాన్ని అనుసరించారు. ఏటీఎం కార్డులతో లావాదేవీలు జరిపారు. రెండు మూడు నెలలు క్యాష్‌లెస్ లావాదేవీలు జరిగాయి. అయితే కొత్తనోట్ల చలామణి పెరగడంతో నగదు కష్టాలు తగ్గాయి. దీంతో ప్రజలు క్రమంగా క్యాష్‌లెస్ ట్రాన్జాక్షన్స్కు దూరమయ్యారు. -
క్యాష్‌లెస్ లావాదేవీలపై చంద్రబాబుకు షాక్
చాలామంది మంత్రులు, అధికారులు నగదురహిత లావాదేవీలు చేయకపోవడంతో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు షాక్ తిన్నారు. విజయవాడలో రెండు రోజుల పాటు నిర్వహిస్తున్న కలెక్టర్ల కాన్ఫరెన్సు వద్ద ఐడీఎఫ్సీ బ్యాంకు ఆధార్ ఆధారిత కొనుగోలు సెంటర్‌ను ఏర్పాటుచేసింది. కొంతమంది మంత్రులు, పలువురు ఐఏఎస్ అధికారులు జీడిపప్పు, బిస్కట్లను కొనుగోలు చేశారు. ఈ సందర్భంగా క్యాష్‌లెస్ లావాదేవీలపై మంత్రులను, ఐఏఎస్ అధికారులను సీఎం చంద్రబాబు ప్రశ్నించారు. కానీ, చాలామంది ఏటీఎం కార్డులతోనే లావాదేవీలు నిర్వహిస్తున్నారు తప్ప మొబైల్ బ్యాంకింగ్, ఆన్లైన్ యాప్‌ను వినియోగించలేదని తెలిసింది. దీంతో ఒక్కసారిగా చంద్రబాబు షాక్ తిన్నారు. 40 శాతం కూడా క్యాష్‌లెస్ లావాదేవీలు నిర్వహించకపోవడంతో ఆయన అసహనం వ్యక్తం చేశారు. 40 రోజుల నుంచి చెబుతున్నా మీరే చేయకపోతే ఎలాగని మండిపడ్డారు. అయితే తమ బ్యాంకు ఖాతాలకు ఆధార్ సీడింగ్ లేదని, అందుకే ఆన్లైన్ వ్యవహారం జరగడం లేదని మంత్రి అచ్చెన్నాయుడు చెప్పారు. తాము ఏటీఎం కార్డుల ద్వారా లావాదేవీలు చేయగలుగుతున్నామని ఆయన అన్నారు. -
క్యాష్‌లెస్ చిచ్చు కార్పొరేట్ల ఉచ్చు
కొత్త కోణం పెద్ద నోట్ల రద్దు చర్చ జరుగుతుండగానే, దానికి కొనసాగింపుగా నగదురహిత లావాదేవీల అంశం తెరకెక్కింది. పెద్ద నోట్ల రద్దుతో పేద, మధ్య తరగతి ప్రజలు నిత్యం ఇబ్బందులు పడటం కనబడుతోంది. కానీ ప్రభుత్వం ప్రకటించినట్టు నల్లడబ్బు దాచుకున్న బడాబాబులు ఎవరూ గంటలు, రోజుల తరబడి క్యూలలో నిలబడటం కనబడదు. మంచి కార్యం జరగడానికి కష్టాలు తప్పవంటూ ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలను నమ్మిన ప్రజలు నల్ల డబ్బున్న సంపన్నులు కూడా తమ లాగే డబ్బులు లేకుండా గడపాల్సి వస్తుందనే భ్రమతో ఈ కష్టాలన్నిటినీ దిగమింగుకుంటున్నారు. పెద్దనోట్ల వల్ల కలుగుతున్న కష్టాలను తీర్చడం మీది నుంచి ప్రభుత్వాలన్నీ ఇప్పుడు నగదు రహిత లావాదేవీలవైపు దృష్టిని మళ్లించాయి. పైసలు చేతుల్లో లేకుండానే ఉత్పత్తి, అమ్మకం, కొనుగోళ్లు చేయవచ్చని ప్రచారం చేస్తున్నాయి. భవిష్యత్‌లో ప్రపంచమంతా దీనినే అనుసరించాల్సి ఉంటుందని, అందువల్ల ఇది ఎప్పటికై నా తప్పని చర్యని పదే పదే నొక్కి చెబుతున్నారు. నగదురహిత లావాదేవీల వల్ల నల్లధనం, పన్నుల ఎగవేత మటుమాయమై, ఆర్థిక వ్యవహారాలన్నీ పారదర్శకంగా జరుగుతాయని కూడా అంటున్నారు. ఈ నేపథ్యంలో మనం నగదు రహిత లావాదేవీల అంశాన్ని అర్థం చేసుకోవాల్సిన అవసరమున్నది. అందుకోసం ఇప్పటికే నగదు రహిత లావాదేవీలను అనుసరిస్తున్న దేశాల అనుభవాలను పరిశీలించాల్సి ఉంది. పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్టు అభివృద్ధిచెందిన దేశాలలో నగదు రహిత లావాదేవీలు అధికంగా సాగుతున్నారుు. వినియోగదారుల వ్యయానికి సంబంధించి బెల్జియంలో 93 శాతం, ఫ్రాన్‌సలో 92 శాతం, కెనడాలో 90 శాతం, బ్రిటన్‌లో 89 శాతం, స్వీడన్లో 89 శాతం నగదు రహిత లావాదేవీలు జరుగుతున్నారుు. కాగా అది ఆస్ట్రేలియాలో 86 శాతం, అమెరికాలో 80 శాతం, జర్మనీలో 76 శాతంగా ఉంది. ఆసియా నుంచి కేవలం దక్షిణ కొరియాలోనే 70 శాతం నగదు రహిత లావాదేవీలు సాగుతున్నారుు. మన దేశంలో నగదు రహిత లావాదేవీలకు అలవాటుపడ్డ పట్టణ కుటుంబాలు 11 శాతానికి మించవు. గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద దాదాపు 5.2 కోట్ల మంది గ్రామీణులకు చెల్లింపులన్నీ నగదు రహితంగానే జరుగుతున్నాయి. అయినా వినియోగదారులుగా వారు చేసే వ్యయంలో నగదు రహితంగా సాగేది అసలు లెక్కలోకే రాదు. పెద్ద నోట్ల రద్దుకు ముందు వరకు దేశంలోని మొత్తం అన్ని రకాల లావాదేవీలలో కేవలం 2 శాతం మాత్రమే నగదు రూపంలో జరుగుతున్నాయి. అయినా మన దేశాన్ని నగదురహిత దేశంగా మార్చేస్తామని మోదీ ప్రభుత్వం అంటోంది. క్యాష్‌లెస్‌తో దివాలా తీసిన నైజీరియా మానవాభివృద్ధి సూచీలో భారత్ కంటే ఎంతో ముందుండి, అక్షరాస్యత, విద్యలో ఎంతో పురోగతిని సాధించిన అభివృద్ధి చెందిన దేశాలేవీ నగదు రహిత దేశాలుగా ప్రకటించుకోలేదు. యూరప్, అమెరికా, ఆస్ట్రేలియా ఇప్పటికే తమ ఆర్థిక వ్యవస్థలను, వ్యవసాయ రంగాన్ని కార్పొరేటీకరించాయి. అక్కడ చిన్న, మధ్య తరహా పరిశ్రమలు, వ్యాపారాలు, సంస్థలు చాలా తక్కువ. పైగా ఆ దేశాల్లో నగదు రహిత లావాదేవీల అభివృద్ధి క్రమక్రమంగా దీర్ఘకాలంలో సాగింది. కానీ నగదు రహిత లావాదేవీలకు మొగ్గిన నైజీరియా 20 కోట్ల జనాభాగల వెనుకబడిన దేశం. ఇందులో 55 శాతం గ్రామీణ ప్రజలు, 45 శాతం పట్టణ ప్రజలు. 59 శాతం అక్షరాస్యత కలిగిన ఆ దేశంలో 30 శాతం వ్యవసాయం మీద ఆధారపడి జీవిస్తున్నవారు. దాదాపు 61 శాతం రోజుకు ఒక డాలరు ఆదాయంతో పేదరికంలో ఉన్నారు. వ్యవసాయం తీవ్ర సంక్షోభంలో ఉంది. తీవ్ర కరువు పరిస్థితులు నెలకొన్న ఈ దేశంలో ఎక్కువ భూములు సాగునీటి సౌకర్యంలేనివే. నీటి వసతి కల్పించడం భారీ వ్యయంతో కూడుకున్నది కాబట్టి సాధారణ రైతులెవరూ ఆ జోలికి పోరు. రైతులకు అందే వ్యవసాయ రుణాలలో బ్యాంకుల వాటా ఒక్క శాతమే. మిగతాదంతా వడ్డీ వ్యాపారులు సమకూర్చేదే. 2012 నుంచి నగదు రహిత లావాదేవీలు, రైతుల కోసం ఈ వ్యాలెట్లు ప్రవేశించాయి. ప్రధాన రుణ వనరైన వడ్డీ వ్యాపారుల నుంచి రుణాలు నిలచిపోగా సాధారణ రైతులు సాగును వదిలేయాల్సి వచ్చింది. క్యాష్‌లెస్ అంటే కార్పొరేటీకరణ? వ్యవసాయం గిట్టుబాటుకాని రైతులందరి భూములను కార్పొరేట్ సంస్థలు వ్యాపార భాగస్వామ్యం పేరుతో ఆక్రమించుకున్నాయి. కార్పొరేట్ల భాగస్వామ్యంతో నడిచే అగ్రికల్చరల్ డీలర్ పద్ధతిని ప్రవేశ పెట్టారు. దీనితో రైతులలో సగం మంది వాటాలను కొనుక్కొని తమ భూముల్లోనే కూలీలుగా మారారు. రుణ భారంతో రైతులు తమ భూములను కార్పొరేట్ కంపెనీలకే తాకట్టు పెట్టాల్సి వచ్చింది. దీంతో నైజీరియా వ్యవసాయరంగ స్వరూపం పూర్తిగా మారిపోయింది. నగదు రహిత లావాదేవీలు నైజీరియా వ్యవసాయరంగాన్ని కార్పొరేటీకరణ వైపు నెట్టింది. చిన్న, మధ్యతరగతి వ్యాపారాలు కూడా అలాగే పెద్ద ఎత్తున దెబ్బతిన్నాయి. గ్రామీణ జనాభా సగానికిపైగా ఉండడం, 59 శాతం అక్షరాస్యతే ఉండటం ఈ విపరిణామాలకు కారణాలని అధ్యయనాల్లో తేలింది. నగదు రహిత లావాదేవీలకు సంబంధించిన సాంకేతికత పట్ల అవగాహన లేకపోవడం, ఐటీ వసతులు, ఏటీఎంలు, అందుబాటులో లేకపోవడం, ఆన్లైన్ లావాదేవీల పట్ల భయం, సందేహాలు, ఇంట ర్నెట్ వ్యయం భారంగా మారడం వల్ల చిన్న వ్యాపారులు సైతం నగదు రహిత లావాదేవీలవైపు వెళ్లలేక దెబ్బతిన్నారు. వారి స్థానంలో కొందరు పెద్ద వ్యాపారస్థులు ఈ అవకాశాలను అందిపుచ్చుకున్నారు. నైజీరియా స్థూలజాతీయోత్పత్తి వృద్ధి రేటు 6.4 నుంచి 2.7కి పడిపోరుుంది. రైతాంగానికి, చిన్న వ్యాపారులకు పెనుగుండం నైజీరియా నగదు రహిత లావాదేవీల కథను వింటుంటే రేపటి నగదు రహిత భారతదేశం సూక్ష్మ రూపంలో దర్శనమిచ్చినట్టు ఉంటుంది. చాలా వరకు అటువంటి సామాజిక ఆర్థిక పరిస్థితులే ఉన్న మన దేశంలో ఇప్పటికే సాంకేతికత, ఆధునికత, పారిశ్రామికీకరణ పేరుతో పేదలను, ముఖ్యంగా ఆదివాసీలను, దళితులను ఉత్పత్తి రంగం నుంచి, జాతీయ జీవన స్రవంతి నుంచి వెలివేశారు. మన దేశంలో ప్రారంభమైన నగదు రహిత లావాదేవీల అంతిమ పర్యవసానం పేదలు, రైతులు, చిన్న, మధ్యతరగతి వ్యాపారులు దెబ్బ తినిపోవడమే అని, పలువురు నిపుణుల అభిప్రాయం. వ్యవసాయరంగ కార్పొరేటీకరణ, చిన్న మధ్యతరగతి వ్యాపారాలన్నీ దెబ్బతిని బడా మాల్స్, సూపర్ మార్కెట్స్, పెద్ద దుకాణ సముదాయాలు విస్తరించడం తప్పదనిపిస్తుంది. మన వ్యవసాయరంగం ఇప్పటికే తీవ్ర సంక్షోభంలో ఉంది. రైతులెవ్వరూ ఆర్థికంగా తమ సొంత కాళ్ళపై నిలబడి వ్యవసాయం చేసే స్థితిలో లేరు. పూర్తిగా రుణాలపైనే ఆధారపడాల్సిన దుస్థితి. బ్యాంకులు రైతుల రుణ అవసరాలలో 10 నుంచి 15 శాతం మాత్రమే తీర్చగలుగుతున్నాయి. మిగిలినవన్నీ ప్రైవేట్ వడ్డీ వ్యాపారులు, ఎరువులు, విత్తనాలు, పురుగు మందుల డీలర్ల నుంచి తీసుకుంటున్నవే. నగదు రహిత లావాదేవీలను ప్రభుత్వం అంటున్నట్టుగా విస్తరింపజేస్తే వడ్డీ వ్యాపారుల నుంచి రైతులకు రుణాలు అందవు. ఇప్పటికే దేశంలోని అన్ని రాష్ట్రాల్లో రబీ పంట వేసిన రైతులవద్ద నగదు లేక, అప్పు పుట్టక నానా ఇబ్బందులు పడుతున్నారు. ఇదే పరిస్థితి ఎక్కువ కాలం కొనసాగితే రెతులకు వ్యవసాయం మానుకోవడం తప్ప గత్యంతరం లేకపోవచ్చు. అదే అవకాశంగా కార్పొరేట్ కంపెనీలు వ్యవసాయ రంగాన్ని కార్పొరేటీకరిస్తాయని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇప్పటికే దేశంలో కొన్ని చోట్ల కార్పొరేట్ వ్యవసాయం జరుగుతోంది కూడా. ఈ నగదు రహిత లావాదేవీలవల్ల ఆర్థిక సాయం అందని రైతాంగం తమ భూములను కార్పొరేట్లకు దారాదత్తం చేయడం అనివార్యం కావచ్చని సైతం భావిస్తున్నారు. నిజానికి నగదు రహిత లావాదేవీల వల్ల ఈ దేశ ఆర్థికాభివృద్ధి జరగాలంటే చిన్న, మధ్యతరగతి వ్యాపారులు, వ్యవసాయరంగంలోని రైతుల ప్రయోజనాల పరిరక్షణకు అవసరమైన చర్యలు తీసుకోవాలి. ముఖ్యంగా రైతులు, చిన్న వ్యాపారుల రుణ అవసరాలను పూర్తిగా బ్యాంకులే తీర్చే ఏర్పాటు చేయాలి. ఎరువులు, పురుగు మందులు, విత్తనాలూ డీలర్ల ద్వారా రైతులకు నేరుగా రుణాల రూపంలో అందజేసే సౌకర్యాలను కలిగించాలి. ఈ విషయంలో ప్రభుత్వాలు నిర్లక్ష్యం వహిస్తే దాదాపు నూటికి 70 శాతం మంది ప్రజలు ఉత్పత్తి రంగానికి, ఉపాధికి దూరమయ్యే పరిస్థితి కనిపిస్తున్నది. పెద్ద నోట్ల రద్దు, నగదురహిత లావాదేవీలు అంతిమంగా ప్రజలందరి అభివృద్ధికి ఉపయోగపడాలే తప్ప, కొన్ని కార్పొరేట్ కంపెనీల కొమ్ము కాయడానికి కారాదు అని ప్రభుత్వాలు గుర్తించాలి. - మల్లెపల్లి లక్ష్మయ్య వ్యాసకర్త సామాజిక విశ్లేషకులు మొబైల్ : 97055 66213 -
నగదు రహిత జీవితం
విశ్లేషణ పెద్ద నోట్ల రద్దు ప్రకటించి దాదాపు నెల రోజులవుతోంది. మీ డబ్బు ఉన్నట్లుండి చిత్తుకాగితంగా మారిపోయింది. మీ ఏటీఎం నుంచి కానీ, మీరు ఖాతా తెరిచిన బ్యాంకు నుంచి కానీ డబ్బు తీసుకోలేరు. నగదు లేని జీవితం విభిన్నంగానూ, భయంకరమైన అసౌకర్యంగాను ఉంటుంది కాబట్టి ఎంతో కొంతల మొత్తాన్ని తీసుకోవడానికి ఎవరైనా ఘర్షించవలసిందే. మీ నిర్ణయం తప్పు అని నరేంద్రమోదీకి చెప్పడానికి కూడా మీరు సిద్ధం. కొద్దికాలంపాటు నగదు లేని జీవితానికి అలవాటుపడిన వారికి మల్లే.. ఉన్నట్లుండి నగదు లేకపోవడం అనే స్థితిని పోల్చలేం. మీ పనిమనిషి, డ్రైవర్, వంటమనిషి, వ్యవసాయ కూలీ, వడ్రంగి, తోలుపనివాడు మొదలైనవారికి నెలలో రెండోభాగం ప్రారంభం అయ్యే సమయానికి పెద్దగా తేడా కనిపించలేదు కాని జీవితం మరింత భారమవడం ప్రారంభమైంది. వారి జీతాలను చెల్లించారు కానీ వారు రూ. 2,000ల బ్యాంకు నోటును ఉపయోగించలేరు. చిన్న నోట్ల కొరత తీవ్రం కావడంతో వారు కోరుకున్న వాటిని ఆ పెద్ద నోటు అందించలేదు. సులభ లావాదేవీలకు రూ. 100, రూ. 50, రూ. 10ల నోట్లు తగినంతగా లేవు. వారి చిన్న చిన్న అవసరాలను ఒకే చోట కొనుక్కోలేరు. వారున్న ప్రాంతంలో చెల్లాచెదురుగా ఉండే షాపులనుంచే వారు కొంటుంటారు. తమ మొబైల్ బిల్స్‌ని వారు ప్లాస్టిక్ డబ్బుతో చెల్లించలేరు. సేవారంగంలోని ఈ తక్కువ జీతం సంపాదించేవారు ప్రస్తుతం నగదు రహిత స్థితిపై మీ కలవరాన్ని చూసి సంతోషిస్తుంటారు. ఎందుకంటే ప్రతి నెలా 10వ తేదీ తర్వాత వారి చేతుల్లో డబ్బు ఉండటం అనేది అసాధారణ విషయంగానే ఉంటుంది. నెల పొడవునా తగి నంత డబ్బు వారు ఎన్నడూ చూడలేరు. గత వారంలో రూ. 2,000 బ్యాంకు నోట్ల రూపంలో వారికి చెల్లించిన జీతాలు కంటికి కనిపిస్తాయి కానీ అంత సులభంగా వారు ఆ నోట్లను ఉపయోగించలేరు. అది కాస్త ఇబ్బంది పెడుతుంది. కానీ వారెలాగోలా ఓర్చుకుంటారు. ఎందుకంటే వారికి జీవితమంటేనే కష్టాలతో కూడుకున్నది. ఇది మరొక కష్టం మాత్రమే. సాధారణంగా మీకు అప్పులివ్వడానికి వ్యతిరేకించే కిరాణా కొట్టు యజమాని మీ క్రెడిట్ కార్డు లేదా డెబిట్ కార్డును ఆమోదించడానికి సిద్ధపడవచ్చు. వారిలో కొందరు నిర్దయులు ఈ సౌకర్యం కల్పించినందుకు గాను మీ బిల్లుపై 2-3 శాతం రుసుము విధించవచ్చు. అనేక లావాదేవీల్లో పెద్ద నోట్లకు చిల్లర పొందడానికి మీరు అవసరానికి మించి కొనుగోలు చేయవలసి రావచ్చు. మీ అవసరాల కొనుగోలుకు రూ.350లు చాలుననుకుంటే, మీరు రూ. 700లకు కొనుగోలు చేస్తే తప్ప మీకు రూ.1,300ల చిల్లర లభించకపోవచ్చు. జీవితం ఉన్నట్లుండి నూతన సాధారణ స్థితికి చేరుతోంది. తమ ఖర్చులు ఎలా తగ్గిపోయాయి అనే విషయంపై ప్రజలు మాట్లాడుతున్నారు. నవంబర్ నెల అక్టోబర్ నెలలా లేదు. గత నెల తొలి వారం తర్వాత పెద్ద నోట్ల రద్దు ఉనికిలోకి వచ్చింది. డబ్బులు డ్రా చేసి ఎప్పటిలాగే ఖర్చుపెట్టుకున్నారు. కానీ సంకట స్థితి మాత్రం అనుభవంలోకి వచ్చేసింది. చిన్న నాణేలు పిల్లల హుండీల్లోకి వెళ్లిపోయాయి. మీరు రూ.10ల కాగితం ఇచ్చినా సరే.. దుకాణాదారులు దానికి కూడా చిల్లర లేదని చెప్పేస్తున్నారు. మీ ప్యాంట్ జేబులో లేక మీరు పట్టుకెళ్లే బ్యాగుల్లో బరువుగా అనిపించే 1, 2, 5, 10 రూపాయల నాణేలకు ఆ మరుసటి దినమే ఉన్నట్లుండి ఇంత ప్రాముఖ్యత ఏర్పడుతుందని ఎవరు భావించారు? రూ. 2,000లకు తక్కువ విలువ ఉన్న ద్రవ్యాన్ని దేన్నైనా బ్యాంకు అందిస్తోందా అంటే అవి రూ.10 ల నాణేలు మాత్రమే.. అవే ఇప్పుడు గౌరవనీయమైనవిగా మారారుు. ఇవి ఉన్నవారు జాగ్రత్తగా ఖర్చుపెడుతున్నారు. కరెన్సీ నోట్ల సరఫరా ఎప్పుడు మెరుగుపడుతుందో ఎవరికి తెలుసు? ఈ పరిస్థితి మధ్యతరగతి ఖర్చులను తగ్గిస్తోంది. ఇది తాత్కాలికం మాత్రమే. బ్యాంకులు సెల్ఫ్ పేరిట రాసిన చెక్కును గౌరవించాల్సిందే. ప్రజలు కొనుగోళ్లను పూర్తిగా వదిలేయలేదు కానీ వాయిదా వేసుకున్నారు. ప్రస్తుత పరిస్థితి కాస్త తగ్గుముఖం పట్టాక, జీవితం యధాస్థితికి రావచ్చు. కానీ చాలామందికి అది గతంలోలాగే ఉంటుంది. ఇంతవరకు బ్యాంకు ఖాతాలు లేని వారు తాము గతంలో జనధన్ బ్యాంకు ఖాతాలు తెరవనందుకు ఇప్పుడు పశ్చాత్తాపపడుతుంటారు. అక్రమార్జనపరులు జనధన్ ఖాతాల్లో తమ నగదును బదిలీ చేసి ఉంటే, ఆ నగదు పేదల ఖాతాల్లోనే కొనసాగించేలా చూస్తానని ప్రధాని మోదీ ఇటీవలే ప్రకటించారు. జనధన్ ఖాతాల్లోకి వచ్చి పడిన ఈ అదనపు నగదు ఎవరో ఒక పన్ను ఎగవేతదారు అక్రమార్జనే అయి ఉంటుంది కనుక దాన్ని ఖాతాదారులు తిరిగి వెనక్కు ఇవ్వవద్దని మోదీ సూచించారు. కానీ పేదల విషయానికి వస్తే తర్వాత వారికి దక్కే నగదు కంటే ఇప్పుడు వారికి దక్కే నగదే చాలా ఉత్తమమైనదిగా కనిపిస్తుంది. భవిష్యత్తులో వచ్చి పడే దానికంటే ఇప్పుడు తమ చేతికి దక్కేదాని పట్లే వారికి ఆకర్షణ ఉంటుంది. - మహేష్ విజాపృకర్ వ్యాసకర్త సీనియర్ పాత్రికేయులు ఈ-మెయిల్ : mvijapurkar@gmail.com