హడావుడిగా హైకోర్టును విభజించారు | Chandrababu Comments On High Court bifurcation | Sakshi
Sakshi News home page

హడావుడిగా హైకోర్టును విభజించారు

Published Sun, Dec 30 2018 4:28 AM | Last Updated on Sun, Dec 30 2018 4:28 AM

Chandrababu Comments On High Court bifurcation - Sakshi

కలెక్టర్ల సదస్సులో మాట్లాడుతున్న సీఎం చంద్రబాబు

సాక్షి, అమరావతి: సమయం ఇవ్వకుండా హైకోర్టును హడావుడిగా విభజించారని సీఎం చంద్రబాబునాయుడు పునరుద్ఘాటించారు. శనివారం ఉండవల్లిలోని ప్రజావేదిక సమావేశ మందిరంలో నిర్వహించిన కలెక్టర్ల సదస్సులో ఆయన మాట్లాడారు. హైకోర్టు ఉద్యోగులు వచ్చేందుకు సంసిద్ధంగా లేకుండానే విభజించారని చెప్పారు. అయినా తాము సిద్ధంగానే ఉన్నామన్నారు. కోర్టులు వస్తున్నందున సరిపడా విమానయాన సర్వీసులు వెంటనే కల్పించాలని అందరూ కోరుతున్నారని తెలిపారు. కాంక్రీట్‌ విభాగంలో అత్యుత్తమ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి సచివాలయం ర్యాఫ్ట్‌ పనులకు రెండు రోజుల కిందట శ్రీకారం చుట్టామని గుర్తు చేశారు. విశాఖపట్నంలో ఎయిర్‌షో చివరి నిమిషంలో రద్దు చేసి కేంద్రం కక్ష పూరితంగా వ్యవహరించిందని చంద్రబాబు విమర్శించారు. కేంద్రం డబ్బులు సకాలంలో ఇస్తే పోలవరం ప్రాజెక్టును వేగంగా నిర్మించవచ్చని, 2019లో పోలవరం ప్రాజెక్టు నుంచి కాలువల ద్వారా నీళ్లు అందిస్తామన్నారు.

ఇళ్ల నిర్మాణాల పర్యవేక్షణ డ్వాక్రా మహిళలకు..
అధికారులు ఏం చేసైనా సంక్షేమ పథకాల అమలు తీరుపై ప్రజల్లో 90 శాతంపైగా సంతృప్త స్థాయి తీసుకురావాలని అధికారులను సీఎం ఆదేశించారు. వచ్చే నెల 2 నుంచి నిర్వహించనున్న ‘జన్మభూమి మా ఊరు’ కార్యక్రమాన్ని పండగ వాతావరణంలో నిర్వహించాలన్నారు. కొత్త రేషన్‌ కార్డులు అర్హులందరికీ ఇవ్వాలని, అదేవిధంగా కార్డుల విభజనను అడిగిన వారందరికీ ఇవ్వాలని సూచించారు. రేషన్‌ డీలర్లకు కమీషన్‌ వెంటనే ఇచ్చేలా చర్యలు తీసుకోవాలన్నారు. రేషన్‌ షాపు పరిధిలోని రేషన్‌ కార్డుల సంఖ్యలో 5 శాతం కార్డులకు డీలర్‌ వేలి ముద్రతో సరుకులు తీసుకొని వేలి ముద్రలు పడని లబ్ధిదారులకు ఇచ్చేలా అనుమతి ఇవ్వాలని పౌరసరఫరాల కమిషనర్‌ బి.రాజశేఖర్‌కు సీఎం ఆదేశించారు. దీనిపై కమిషనర్‌ మాట్లాడుతూ.. ఆ విధంగా అనుమతి ఇస్తే అవినీతిని ప్రోత్సహించినట్లు అవుతుందని చెప్పారు. ఇళ్ల నిర్మాణాల్లో ఇటు గ్రామీణ అటు పట్టణాల్లో నిర్మిస్తున్న వాటిపై సరైన లెక్కలు లేవని, 4 లక్షల ఇళ్ల వరకు తేడాలు కన్పిస్తున్నాయని సీఎం చెప్పారు. ఇళ్ల నిర్మాణాల పర్యవేక్షణను డ్వాక్రా గ్రూపు సభ్యులకు అప్పగించాలని సూచించారు. దీనికి వారికి పారితోషికం ఇవ్వాలన్నారు. ఇళ్లు అడిగిన వారికి మొదట జన్మభూమి పత్రాలు ఇవ్వాలని, ఇళ్లు ఎప్పుడు నిర్మించాలనేది తర్వాత చూద్దామని చెప్పారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు, ఇతర ప్రయోజనాల వివరాలన్నీ ఒక స్టిక్కర్‌ రూపంలో తయారు చేసి ఇళ్ల వాకిళ్లకు అతికించేలా చర్యలు తీసుకోవాలన్నారు.  

కేంద్రంసహకరించకున్నా 10.52 శాతం గ్రోత్‌...
కేంద్రం సహకరించకున్నా 10.52 శాతం గ్రోత్‌ రేటు సాధించామని చంద్రబాబు చెప్పారు.  రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేశామన్నారు. ఇచ్చిన కొద్ది నీటితోనే అనంతపురం జిల్లా రైతులు ఉద్యానవన రంగంలో అద్భుత ఫలితాలు సాధించి ప్రథమ స్థానంలో నిలిచారని చెప్పారు. సాంకేతికతతో అవినీతిని చాలావరకు నియంత్రించగలిగామన్నారు. అవినీతి నిర్మూలనలో రాష్ట్రం 3 స్థానంలో ఉందన్నారు. నాలుగేళ్లుగా వృద్ధి ఫలితాలలో ఆంధ్రప్రదేశ్‌ అగ్రస్థానంలో ఉందని, 2014 నుంచి జాతీయస్థాయి కంటే ఎక్కువగా వృద్ధి ఫలితాలను సాధిస్తూ వస్తున్నామని తెలిపారు.  

రూ. 2864 కోట్ల పంట నష్టం...
రాష్ట్రంలోని 347 మండలాల్లో ఖరీఫ్‌లో రూ. 2,864 కోట్లు పంటనష్టం జరిగిందని కేంద్రానికి నివేదిక పంపినట్లు తెలిపారు. నష్టపోయిన రైతులకు రూ.1,900 కోట్లు ఇన్‌పుట్‌ సబ్సిడి ఇవ్వాల్సి ఉందని అధికారులు సీఎంకు వివరించారు.

చుక్కల భూముల సమస్యపై సబ్‌ కమిటీ
రాష్ట్రంలో ఉన్న చుక్కల భూములు, గ్రామ కంఠక భూముల సమస్యలను పరిష్కరించేందుకు ముగ్గురు మంత్రులతో సబ్‌ కమిటీ వేస్తున్నట్లు సీఎం చంద్రబాబు వెల్లడించారు. కమిటీలో ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి, మంత్రులు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, కాల్వ శ్రీనివాసులు ఉంటారని తెలిపారు. ఈ సమస్యలకు వెంటనే పరిష్కారం చూపేలా చర్యలు తీసుకోవాలని శనివారం కలెక్టర్ల సమావేశంలో ఆదేశించారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement