‘‘మనుగడ కోసం మానవజాతి నిరంతరం సంఘర్షణ జరుపుతూనే ఉంటుంది. అది కూడా మెరుగైన జీవితం కోసం తపనపడు తుంది’’ జీవపరిణామ సిద్ధాంతాన్ని ప్రతి పాదించిన ప్రపంచ ప్రఖ్యాత శాస్త్రవేత్త చార్లెస్ డార్విన్ చెప్పిన మాటలివి. పంతొమ్మిదవ శతాబ్ది తాత్వికవేత్త, హెర్బర్ట్ స్పెన్సర్ వ్యాఖ్య లను చార్లెస్ డార్విన్ మరింత పదునుగా చెప్పారు. ఆ తర్వాత మార్క్సిస్టు తాత్విక వేత్తలు కారల్ మార్క్స్, ఫ్రెడరిక్ ఎంగెల్స్‌లు ఆ అవగాహనను రాజ కీయాలకు అన్వయించారు. ఆ రణనినాదమే ‘స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్’.
నిరంతర సంఘర్షణ, నిత్య యోచన, సమాజానికి తనను తాను అర్పించుకోగల త్యాగనిరతి వెరసి సమాజ గతిని మార్చగలవు. ఆ సంఘర్షణే మానవాళి పురోభివృద్ధికి తోడ్పడగలదన్న విశ్వాసాన్ని పై వాక్యాలు ధ్రువ పరుస్తున్నాయి. అవి సామాజిక సమస్యలు కావచ్చు. ప్రకృతి వైపరీత్యాలూ కావచ్చు, లేదా మరెన్నో వినాశకర విపత్తులు నిత్యం సమాజాన్ని అతలాకుతలం చేస్తాయి. మనిషి మాత్రం ఆత్మ విశ్వాసాన్ని వదలకుండా, వాటిని అధిగమించేందుకు వ్యక్తిగతంగా, సామాజిక పరంగా ఎన్నో సాహసాలు చేస్తాడు. అది మానవజాతి మహోన్నత లక్షణం. అదే నేటి అభివృద్ధికి కొలమానం. కొన్ని విప త్తులు మనిషి మనుగడనే ప్రశ్నార్థకంగా మారుస్తాయి. ఊహించని నష్టాలు సంభవిస్తాయి. అయినా మనిషి విపత్తులను అధిగమించడా నికి తన జీవితాన్ని సైతం ఫణంగా పెట్టి త్యాగాలకు పూనుకుంటాడు. అయితే తన కోసం కాకుండా సమాజం మేలు కోసం తన ప్రాణాలను ఫణంగా పెట్టేవారు అతి కొద్దిమందే ఉంటారు. అటువంటి అరుదైన వారి వల్లనే ఈ సమాజం ఈనాటికీ మనుగడ కొనసాగిస్తోంది.
కరోనా లాంటి విలయతాండవాన్ని స్వయంగా అనుభవిస్తోన్న నేటి తరుణంలో చరిత్రపుటల్లో దాగిన, మానవజాతి మనుగడను శాసించే విపత్తులను అధిగమించి, సమాజం పురోగమించేందుకు యత్నించిన ఎందరో మహానుభావుల సాహస చర్యలు మనకళ్ళ ముందు కదలాడుతాయి. 1892 సంవత్సరం జూలై 18వ తేదీన ప్రపంచాన్ని ప్రత్యేకించి ఆసియా, యూరప్ ఖండాలను శవాల గుట్ట లుగా మార్చిన కలరా మహమ్మారికి విరుగుడుగా తాను కనుగొన్న వ్యాక్సిన్‌ను, మొదటగా తనమీద, తన సన్నిహితులు, మిత్రుల మీద ప్రయోగించి చూసుకున్న వ్లాదిమిర్ హాఫ్‌కైన్‌ను స్మరించుకోవడం సందర్భోచితం. తన ప్రాణం కన్నా సమాజ రక్షణ, కోట్లాదిమంది ప్రాణాలు ముఖ్యమని భావించడంవల్ల హఫ్‌కైన్ ఈ సాహసానికి దిగారు. ఆ ప్రయోగం ఎటువంటి అవరోధాలు లేకుండా విజయవంత మైంది. ఆ ప్రయోగం ఫలప్రదం అవడంతో వ్యాక్సిన్ ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. తత్ఫలితంగా కోట్లాది మంది ప్రాణాలను కాపాడగలిగారు.
కలరా మొదటిసారిగా 1817లో బెంగాల్‌లో ప్రబలింది. 1920 కల్లా భారతదేశమంతటా వ్యాపించింది. ఇందులో ఒక కోటి యాభై లక్షల మంది మరణించారు. మరో రెండు కోట్ల 30 లక్షల మంది 1865–1917 మధ్య కలరా వల్ల ప్రాణాలు కోల్పోయారు. అదే సమయంలో రష్యాలో 20 లక్షల మంది మరణించారు. 1817 నుంచి 1923 వరకు ఆరుసార్లు కలరా మహమ్మారి విజృంభించి ప్రపంచాన్ని వణికించింది. ఇందులో కొన్ని కోట్ల మంది ప్రాణాలు కోల్పోయారు. 1817–1824 మధ్య మొదటిసారి, 1829–1837 మధ్య రెండవసారి, 1840–1860 మధ్య మూడవసారి, 1863–75 మధ్య నాల్గవసారి, 1881–1896 మధ్య ఐదవసారి, 1899–1923 మధ్య ఆరవసారి, 1961–1975 మధ్య ఏడవసారి కలరా వచ్చింది.
ఇక్కడ ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. 1961–1975 మధ్య ఇండియాలో కలరా విజృంభించలేదు. 1899–1923 మధ్య కలరా విజృంభణ తర్వాత, భారత ప్రజలపైన కలరా అంతగా ప్రభావం చూపలేదు. 1865–1917 మధ్య వచ్చిన కలరా రెండు కోట్ల 30 లక్షల మందిని కబళిస్తే, 1965–1971 మధ్య వచ్చిన కలరా మనలను తాకలేకపోయింది. దీనికి ఏకైక కారణం వ్లాదిమిర్ హాఫ్‌కైన్ కృషి, పట్టుదల, త్యాగమే. వ్లాదిమిర్ హాఫ్‌కైన్ జీవితం చాలా సాదాసీదాగా ప్రారంభమైంది. రష్యాలోని ఉక్రెయిన్ ప్రాంతంలో ఉన్న ఓడరేవు పట్టణం ఒడిస్సాలోనే సాగింది. మలరొస్కికి విశ్వవిద్యాలయంలో నేచురల్ సైన్సెస్‌లో హాఫ్‌కైన్ పట్టా పొందారు. ఎలిమెచిన్ కాఫ్ అనే జీవశాస్త్రవేత్త ప్రభావం హాఫ్‌కైన్ మీద పడింది. ఎలిమెచిన్‌కు నోబెల్ బహుమతి లభించింది. అయితే ఆయన అదే విశ్వవిద్యాలయంలోని మ్యూజియంలో ఉద్యోగిగా చేరారు. జీవసంబంధమైన పరిశోధనలు చేసి, అయిదు పరిశోధనాత్మక పత్రాలను రూపొందించారు.
అయితే హాఫ్‌కైన్‌లో మరొక కోణం కూడా ఉంది. 1880 ప్రాంతంలో జార్ చక్రవర్తికి వ్యతిరేకంగా జరిగిన తిరుగుబాటు ఉద్యమాలలో హాఫ్‌కైన్ పాల్గొనేవాడు. అందుకుగాను మూడుసార్లు జైలుకెళ్ళాడు. రష్యా చక్రవర్తి రెండవ అలెగ్జాండర్‌ను విప్లవ తిరుగు బాటుదారులు హత్య చేసిన సందర్భంగా హాఫ్‌కైన్ కూడా నిర్బంధాన్ని ఎదుర్కోవాల్సి వచ్చింది. ఆయన ప్రత్యక్షంగా అందులో పాల్గొనక పోయినా ఆ సంబంధిత సంస్థతో ఉన్న సంబంధాల వల్ల జైలుకెళ్ళాల్సి వచ్చింది. అయితే జీవశాస్త్ర పరిశోధనలలో ఉన్న ఆసక్తి వల్ల ఆయన 1888లో రష్యాను వదిలిపెట్టాల్సి వచ్చింది.
ఆ తర్వాత స్విట్జర్లాండ్ జెనీవాలోని విశ్వవిద్యాలయంలో అధ్యా పకుడిగా చేరారు. వ్యాక్సిన్‌లకు పితామహుడిగా పేరొందిన లూయీస్ పాశ్చర్ పారిస్‌లో స్థాపించిన పాశ్చర్ ఇన్‌స్టిట్యూట్‌లో చేరారు. అప్ప టికే ప్రపంచాన్ని వణికిస్తోన్న కలరాపైన పరిశోధనలో భాగస్వామి అయ్యారు. కలరా వైరస్‌కు విరుగుడు కనిపెట్టడంలో హాఫ్‌కైన్ విజయం సాధించారు. ప్రతివారం జరిగే పారిస్ బయోలజీ సొసైటీ సమావేశం సందర్భంగా 1892లో హాఫ్‌కైన్ ఈ విషయాన్ని ప్రక టించారు. ఆ తర్వాత హాఫ్‌కైన్ కుందేళ్ళు, పావురాళ్ళపైన ప్రయోగం చేసి వ్యాక్సిన్‌ను రుజువు చేశారు. ఆ తర్వాత వెంటనే అంటే 1892వ సంవత్సరం జూలై 18వ తేదీన మనుషులలో ఈ వ్యాక్సిన్ ప్రయోగం చేయాలనుకున్నప్పుడు ప్రయోగానికి తనను, తన రాజకీయ మిత్రు లను హాఫ్‌కైన్ ఎంచుకున్నారు. ఆ తర్వాతనే ఆయన ఇతరుల మీద ప్రయోగం చేశారు.
ఈ వ్యాక్సిన్ పరిశోధనకు సంబంధించిన విషయాలన్నింటినీ బ్రిటిష్ మెడికల్ జర్నల్‌లో ప్రచురించారు. దీనిని ప్రజలకు అందించ డానికి హాఫ్‌కైన్ రష్యాతో సహా ఇతర దేశాలను అభ్యర్థించారు. అయితే కేవలం బ్రిటిష్ ప్రభుత్వం నుంచి మాత్రమే సానుకూల స్పందన లభించింది.
అప్పటికి భారతదేశంలో కలరా విజృంభించి, లక్షలాది మంది ప్రాణాలను బలితీసుకొని, విలయతాండవం సృష్టించింది. అందువల్ల దీని క్షేత్ర ప్రయోగం కోసం కలకత్తాను ఎంచుకోవాలని పారిస్‌లోని బ్రిటిష్ దౌత్యవేత్త లార్డ్ ఫ్రెడరిక్ సూచనతో మార్చిలో కలకత్తాలోని ప్రెసిడెన్సీ హాస్పిటల్‌లో బ్యాక్టీరియాలజిస్ట్‌గా చేరారు. అయితే కలకత్తాలోని డాక్టర్లు, హాఫ్‌కైన్ ప్రయోగాలను అపహాస్యం చేశారు. ఇది అసాధ్యమని పెదవి విరిచారు. చివరకు కొంతమంది హాఫ్‌కైన్‌ను హత్య చేయడానికి ప్రయత్నించారు. అయితే ఆ తర్వాత ఆగ్రాలో నూతనంగా స్థాపించిన బాక్టీరియాలాజికల్ లేబొరేటరీ బాధ్య తలు తీసుకొని సైన్యంలోని సిబ్బందిపై, ఇతర పౌరులపై దానిని ఉప యోగించాలని కోరారు. దాదాపు 37,000 మంది భారతీయులపై, 5 వేల మంది బ్రిటిష్ సిబ్బందిపై ఈ వ్యాక్సిన్ ప్రయోగం జరిగింది. దానిశక్తి సామర్థ్యాలపై బ్రిటిష్ ప్రభుత్వం సంతృప్తిని వ్యక్తం చేసింది.
1896 సెప్టెంబర్ చివరలో బొంబాయిలో ప్లేగు వ్యాపించింది. బ్రిటిష్ ప్రభుత్వం హాఫ్‌కైన్‌ను అక్కడికి పంపించింది. ప్లేగ్‌కు కూడా ఆయన మందును తయారుచేసి, ఎంతోమంది ప్రాణాలను కాపా డారు. 1896లోనే హాఫ్‌కైన్ ఇండియన్ సివిల్ సర్వీసులో చేరారు. అయినప్పటికీ సమాజాన్ని అతలాకుతలం చేస్తోన్న మహమ్మారి రోగాలకు మందులను కనుగొనడంలో తన అవిశ్రాంత కృషిని కొన సాగిస్తూనే వచ్చారు. తన ఈ సర్వీసులో కూడా ఎన్నోరకాల ఔషధా లను కనుగొన్నారు. ఆయన పరిశోధించి కనుగొన్న ప్రతి వ్యాక్సిన్‌ను మొదట తన మీదనే ప్రయోగం చేసుకోవడం తప్పనిసరి అలవాటుగా మార్చుకోవడం ఆయనలోని దృఢచిత్తానికి నిదర్శనం.
1897లో ఆగాఖాన్ అనే ముస్లిం సంపన్నుడు బొంబాయిలోని ఖుస్సో లాడ్జి భవనాన్ని హాఫ్‌కైన్ నివాసంగా ఇచ్చాడు. దీనిని కూడా ప్లేగ్ పరిశోధనా కేంద్రంగా మార్చారు. పారిస్‌లోని పాశ్చర్ ఇన్‌స్టి ట్యూట్ తరహాలో బొంబాయిలో ఒక సంస్థను నెలకొల్పాలని హాఫ్‌కైన్ ఆగాఖాన్‌ను కోరారు. అది స్థాపించడం మాత్రమే కాకుండా, ఆ తర్వాతి కాలంలో దానినే హాఫ్‌కైన్ ఇన్‌స్టిట్యూట్‌గా పేరు మార్చారు. ఆయన భారతదేశంలో 20 ఏళ్లు గడిపి కలరాపై పరిశోధనల్లో విశేష కృషి చేశారు. 1927లో ఆయనను రష్యాలో గొప్పగా సత్కరించారు. రష్యా సోషలిస్టు విప్లవం తర్వాత ఆయన రష్యాలో అడుగుపెట్టారు. ఇజ్రాయెల్ ప్రభుత్వం ఆయన పేరు మీద ఒక స్టాంప్‌ను విడుదల చేసి తమ కృతజ్ఞతను ప్రకటించుకుంది. రష్యా ప్రభుత్వం ఆయనను ‘‘మానవాళి రక్షకుడు’’గా ప్రకటించింది.
కరోనాను ఎదుర్కోవడానికి కూడా ఎంతోమంది శాస్త్రవేత్తలు, సంస్థలు వ్యాక్సిన్‌ను తయారు చేయడానికి ప్రయత్నిస్తున్నారు. అప్పటి కన్నా ఇప్పుడు శాస్త్ర, సాంకేతిక రంగాల్లో ఎన్నో ఉన్నతమైన మార్పులు వచ్చాయి. లూయీస్ పాశ్చర్, వ్లాదిమిర్ హాఫ్‌కైన్‌ల స్ఫూర్తితో సాగు తున్న ఈ పరిశోధనలు, ప్రయోగాలు విజయవంతం అవుతాయని ఆశిద్దాం.
హాఫ్‌కైన్ లాంటి ఒక శాస్త్రయోధుడినే కాదు, ప్రపంచ జనావళిని ఆదుకునేందుకు ఎందరో, ఎందరెందరో శాస్త్రయోధులను సృష్టించు కోవాల్సిన తక్షణ అవసరం ప్రపంచం ముందుంది. ప్రపంచ చరిత్రలో నిలిచిపోయే మరెందరో హాఫ్‌కైన్‌లు పుట్టుకురావాలని మనసారా కోరుకుందాం. (జూలై 18, హాఫ్‌కైన్ తనను తాను వ్యాక్సిన్ ప్రయోగానికి సమర్పించుకున్నరోజు)
మల్లెపల్లి లక్ష్మయ్య,
వ్యాసకర్త సామాజిక విశ్లేషకులు
మొబైల్ : 81063 22077
Comments
Please login to add a commentAdd a comment