యుద్ధం కాదు శాంతే పరిష్కారం! | Guest Column By Mallepally Laxmaiah On India China Disputes | Sakshi
Sakshi News home page

యుద్ధం కాదు శాంతే పరిష్కారం!

Published Thu, Jul 2 2020 1:09 AM | Last Updated on Thu, Jul 2 2020 1:09 AM

Guest Column By Mallepally Laxmaiah On India China Disputes - Sakshi

యుద్ధం సమస్యను సృష్టిస్తుందే కానీ, సమస్యను పరిష్కరించదు. యుద్ధానికి చర్చలే పరిష్కారం కానీ, యుద్ధం దేనికీ పరిష్కారం కాజాలదు. అందుకే మహాత్మాగాంధీ యుద్ధం ఎటువంటి పరిస్థితుల్లో కూడా వాంఛనీయం కాదని తేల్చి చెప్పారు. అయితే ఏ దేశమైనా మరో దేశం దురాక్రమణను సహిం చాల్సిన అవసరం లేదు. నిజానికి రెండు వేల ఏళ్ళనాడే ఏ ఆయుధాలు లేకుండా ప్రేమతో భారత దేశం చైనాను గెలుచుకున్నది. ఇప్పుడు చైనా ప్రజలు మనలాగా తూర్పుకు తిరిగి దండం పెట్టరు. భారత దేశం వైపు నిలబడి నమస్కరిస్తారు. ఎందుకంటే గౌతమ బుద్ధుడు పుట్టిన దేశం, భారత దేశం వారికి పడమరవైపు ఉన్నది. అందుకే ప్రజల మధ్య ఐక్యతను ఏ యుద్ధాలూ వేరుచేయలేవు.

‘‘రెండు దేశాలు యుద్ధానికి తలపడు తోంటే, ఆపాల్సిన బాధ్యత శాంతిని, అహిం సను కోరుకునే వాళ్ళపైనే ఉంటుంది. ఇరు దేశాల పౌరులు కూడా ఆ కర్తవ్యాన్ని తీసుకోవాలి. వ్యక్తులకు ఆ అధికారం లేకపోవచ్చు. ఆ వ్యక్తికి అంత శక్తి కూడా ఉండకపోవచ్చు కూడా. అయినా ఆ ప్రయత్నం చేయాలి. చివరకు యుద్ధంలో పాల్గొంటోన్న సైనికుడు సైతం యుద్ధాన్ని ఎట్లా ఆపాలో ఆలోచించాలి. దానితో, తను మాత్రమే కాదు, తన దేశాన్నీ, తన ప్రజలనూ, యావత్‌ ప్రపంచాన్ని యుద్ధం నుంచి విముక్తి చేయాలి’’ భారత స్వాతంత్య్ర ఉద్యమ సారథి మహాత్మాగాంధీ అన్న మాటలివి. యుద్ధాలు చేసిన వాళ్ళు, యుద్ధాలు చూసిన వాళ్లు సైతం యుద్ధమంటే అసహ్యించుకున్నారు. యుద్ధాన్ని ప్రారంభించడానికి ముందు ఉన్న కోపం, ద్వేషం, యుద్ధం ముగిసిన తర్వాత వైరాగ్యంగా మారుతుంది. ఇది చరిత్ర పొడవునా కనిపించే కఠోర సత్యం. యుద్ధాన్ని ఆశించే వారు ఈ సజీవ సాక్ష్యాన్ని ఎరుగరు.

యావత్‌ ప్రపంచం కరోనాతో యుద్ధం చేస్తున్నది. మన దేశం కూడా రోజు రోజుకూ ప్రమాదపుటంచుల్లోకి వెళుతోంది. సరిగ్గా ఈ సమయంలోనే భారత్‌–చైనా సరిహద్దుల్లో జరిగిన అవాంఛనీయ ఘర్షణలో ఇరవైమంది భారత సైనికులు ప్రాణాలొదిలారు. కచ్చి తమైన సంఖ్య తెలియనప్పటికీ చైనా కూడా తగిన మూల్యం చెల్లిం చుకుంది. సరిహద్దుల్లో అప్పుడప్పుడు ఉద్రిక్తతలు తలెత్తడం, చిన్న చిన్న ఘర్షణలు జరగడం సర్వసాధారణం. కానీ ఈసారి అది భారీ నష్టానికి దారితీసింది. ప్రధాని నరేంద్ర మోదీ ఈ విషయమై అఖిల పక్ష సమావేశంలో మాట్లాడుతూ, చైనా మన భూభాగంలోకి చొచ్చు కురాలేదని, ఆందోళన అవసరం లేదని, ఒక వేళ చైనా వైపునుంచి ఎటువంటి దాడులు జరిగినా భారత ప్రభుత్వం ఊరుకోజాలదని హెచ్చరించారు.

దానికి అన్ని పక్షాలూ మద్దతు పలికాయి. ఇదిలా ఉండగా సమయంలోనే గత వారం అమెరికా విదేశాంగ శాఖా మంత్రి మైక్‌ పాంపియో జర్మనీలోని బ్రస్సెల్స్‌లో మాట్లాడుతూ తమ సైన్యాన్ని సగానికి పైగా జర్మనీ నుంచి తరలిస్తున్నట్టు ప్రకటించారు. అయితే ఈ సైన్యాన్ని ఎక్కడికి పంపిస్తున్నారు అని ఒక విలేకరి ప్రశ్నిం చగా, ఆయన చైనా చేస్తున్న దురాక్రమణ చర్యలను ఎదుర్కోవడానికి దక్షిణాసియాకు పంపిస్తున్నామని జవాబు చెప్పారు. ముఖ్యంగా ఇటీ వల భారత్‌–చైనా సరిహద్దుల్లో జరిగిన ఘర్షణను ఆయన ప్రత్యేకంగా ఉదహరించారు. అంతేకాకుండా దక్షిణ చైనా భూభాగంలో ఉన్న సము ద్రంపై కూడా చైనా హక్కులను ప్రకటించుకుంటున్నదని, అందువల్ల చైనా దక్షిణాసియాకు ప్రమాదకారిగా మారిందని ఆయన అభిప్రాయపడ్డారు.

గతంలో కాశ్మీర్‌ విషయంలో పాకిస్తాన్‌–భారత్‌ల మధ్య దౌత్యం నెరపుతానంటూ అమెరికా ఉవ్విళ్ళూరింది. అమెరికా జోక్యాన్ని భారత్‌ నిర్ద్వంద్వంగా తిరస్కరించింది. కాశ్మీర్‌ విషయంలో ఎవరి జోక్యం అక్కర్లేదని తేల్చి చెప్పింది. కానీ మైక్‌ పోంపియో చైనాకు వ్యతిరేకంగా, భారత్‌కు అనుకూలంగా ప్రకటన చేసి వారం దాటినప్పటికీ, భారత ప్రభుత్వం నుంచి స్పందన లేదు. పైగా చైనా యాప్‌లను నిషేధిస్తు న్నట్టు ప్రధాని ప్రకటించారు. దీనిని పత్రికలు డిజిటల్‌ స్ట్రైక్‌గా పేర్కొం టున్నాయి. అంతే కాకుండా చైనా వస్తువులను బహిష్కరించా లనే కొందరి డిమాండ్‌ కూడా బాగా ప్రచారంలో వుంది. చైనా యుద్ధా నికి కాలు దువ్వితే చేతులు ముడుచుకొని కూర్చోవాలని ఎవ్వరూ చెప్పరు. అది సరైంది కూడా కాదు. కానీ ఇక్కడ అమెరికా జోక్యం పలు అనుమానాలకు దారితీస్తున్నది.

ఈ రెండు దేశాల వైరం అమెరికా ఉపయోగించుకునే ప్రమాదం చాలా స్పష్టంగా కనిపిస్తోంది. తన వద్ద నిల్వ ఉన్న ఆయుధాలను అమ్ముకొనేందుకు కూడా అమెరికా యత్ని స్తోంది. అమెరికాని విశ్వసిస్తే మాత్రం మనం తప్పు చేసినవాళ్ళ మవుతాం. ఇప్పటికే మన దేశం కొన్నివేల కోట్లు ఖర్చుచేసి, ఆయుధా లను కొనుగోలు చేస్తున్నది. ప్రపంచంలో ఆయుధాల కొనుగోళ్ళలో మనం రెండవ స్థానంలో ఉన్నాం. భారత్‌–చైనా మధ్య యుద్ధం జరి గితే దాన్ని, అమెరికా తన వ్యాపారాభివృద్ధి కోసం ఉపయోగించు కోవడానికి సిద్ధంగా ఉంది. రెండో వైపు తన ఆధిపత్యాన్ని ఆసియా దేశాలకు విస్తరింపజేయడానికీ పథకం వేస్తున్నది.

వీటితో పాటు మరొక ముఖ్యమైన అంశం ఇందులో దాగి ఉన్నది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భారత్, చైనా దేశాలు బలమైన శక్తులుగా అవతరిస్తున్నాయి. అమెరికా తన మొదటి స్థానాన్ని ఎప్పుడో కోల్పో యింది. 2013వ సంవత్సరం నుంచే జాతీయ స్థూల ఆదాయంలో చైనా మొదటి స్థానంలోకి రాగా, అమెరికా రెండవ స్థానంలోకి దిగ జారింది. 2030 నాటికి ఆ రెండవ స్థానాన్ని భారత దేశం కైవసం చేసు కోబోతోంది. అమెరికా మూడవ స్థానంలోకి వెళ్ళబోతున్నది. ఇది అమె రికాకు మింగుడు పడని విషయం. ఒకవేళ భారత్‌–చైనాల మధ్య యుద్ధమే జరిగితే భారత్, చైనాలు రెండూ ఆర్థికంగా దెబ్బతింటాయి. ముఖ్యంగా భారత దేశం ఎక్కువగా నష్టపోయే ప్రమాదం ఉంది. ఇదే జరిగితే అమెరికా తన ఆర్థిక ఆధిక్యతను నిలబెట్టుకుని, తను కోరు కున్న స్థానాన్ని చేరుకుంటుంది. రెండు దేశాల మధ్య చిచ్చు పెట్టడానికి అమెరికా చేస్తున్న ప్రయత్నాలను ఇరు దేశాల పౌరులు, దేశభక్తులు గుర్తించాలి.

పదిహేడవ శతాబ్దానికి చెందిన కవి, నాటక రచయిత, తత్వవేత్త జాన్‌ డ్రైడన్‌ యుద్ధం గురించి చేసిన వ్యాఖ్యలు ఇక్కడ చక్కగా సరి పోతాయి. ‘యుద్ధం రాజులకు వ్యాపారం.  యుద్ధాలు అన్నీ కూడా సంపదల పంపకానికో, పెంపకానికో జరుగుతాయి. అన్ని యుద్ధాల వెనుకా కనిపించని కుట్రలెన్నో దాగుంటాయి’ అంటారాయన.  నిజా నికి భారత్‌–చైనాల మధ్య వైరం కన్నా స్నేహం చాలా బలమైనది. ప్రాచీనమైనది. క్రీస్తుపూర్వం 2వ శతాబ్దం నుంచి చైనా–భారత్‌ల మధ్య వ్యాపార, వాణిజ్య సంబంధాలు మొదలయ్యాయి. చైనాలో మొదలై రోమ్‌ వరకు సాగిన సిల్క్‌ రూట్‌ వ్యాపారం రెండు దేశాల ఉత్పత్తులను విశ్వవ్యాప్తం చేశాయి. చంద్రగుప్త మౌర్య కాలంలో కూడా చైనాతో భారత దేశానికి వ్యాపార, రాజకీయ సంబంధాలున్నాయి.

చైనా నుంచి ప్రపంచానికి దిగుమతి అయిన సిల్క్‌ వస్త్రాలు మన దేశంలో కూడా చాలా ప్రసిద్ధి. పట్టు పీతాంబరాలు, చీని చీనాంబరాల గురించి మన సాహిత్యంలో మనం ఎన్నో సార్లు చదివాం. అశోకుడు, కనిష్కుడు లాంటి బౌద్ధ చక్రవర్తుల కాలంలో భారత్‌–చైనా సంబం ధాలు మరింత విస్తరించాయి. భారత్‌ నుంచి బౌద్ధం ప్రపంచానికి ప్రత్యేకించి దక్షిణాసియాకు విస్తరించడానికి చైనా ఒక మార్గంగా పనిచేసింది. పల్లవ రాజకుమారుడైన బోధి ధర్మ చైనాలో మహాయాన బౌద్ధాన్ని విస్తృతపరిచాడు. కుమార జీవ అనే బౌద్ధ దార్శనికుడు ఎన్నో ముఖ్యమైన బౌద్ధ గ్రంధాలను చైనా భాషలోకి అనువదించి, అక్కడ ఆరాధ్యుడయ్యారు. బోధి ధర్మం నేర్పిన మార్షల్‌ ఆర్ట్స్‌ షావోలిన్‌ టెంపుల్‌ నిర్మాణానికి, అక్కడ యుద్ధ విద్యలకు ఉపయోగపడింది. అలాగే చైనా యాత్రికులైన షాహియాన్, హుయాన్‌త్సాంగ్‌లు భారత దేశంలో పర్యటించి ఆనాటి చరిత్రను నిక్షప్తం చేశారు.  

చైనా విప్లవంలో భారత దేశం నుంచి పాల్గొన్న డాక్టర్‌ ద్వారకా నాథ్‌ కొట్నిస్‌ను చైనా ప్రజలు ఇప్పటికీ గుండెల్లో పెట్టుకుంటారు. చైనా విప్లవాన్ని భారత ప్రజలు ఎంతగానో గౌరవిస్తారు. యుద్ధం సమస్యను సృష్టిస్తుందే కానీ, సమస్యను పరిష్కరించదు. చివరకు వాదాలు, వివాదాలు అన్నీ చర్చల ద్వారా పరిష్కారం కావాల్సిందే. నిజానికి యుద్ధానికి చర్చలే పరిష్కారం కానీ, యుద్ధం దేనికీ పరి ష్కారం కాజాలదు. అందుకే మహాత్మాగాంధీ యుద్ధం ఎటువంటి పరిస్థితుల్లో కూడా వాంఛనీయం కాదని తేల్చి చెప్పారు. అయితే ఏ దేశమైనా మరో దేశం దురాక్రమణను సహించాల్సిన అవసరం లేదు. ఒక వ్యక్తిని వేరొక వ్యక్తి, ఒక దేశాన్ని మరో దేశం దోపిడీ చేస్తోంటే, పీడిస్తోంటే దాన్ని సహించాల్సిన అవసరం అంతకన్నా లేదు.

అయితే ఆయా సందర్భాల్లో శాంతి కోసం జరిగే యుద్ధానికి ఓ అర్థం ఉంటుంది. కానీ ప్రభుత్వాల కన్నా ప్రజాభిప్రాయం బలమైనది. శక్తి వంతమైనది. ఆ మాటకొస్తే ప్రజలు ఎప్పుడు యుద్ధాన్ని కోరుకోరు. ఇది సత్యం. నిజానికి రెండు వేల ఏళ్ళనాడే ఏ ఆయుధాలు లేకుండా ప్రేమతో భారత దేశం చైనాను గెలుచుకున్నది. ఇప్పుడు చైనా ప్రజలు మనలాగా తూర్పుకు తిరిగి దండం పెట్టరు. భారత దేశం వైపు నిల బడి నమస్కరిస్తారు. ఎందుకంటే గౌతమ బుద్ధుడు పుట్టిన దేశం, భారతదేశం పడమరవైపు ఉన్నది. అందుకే ప్రజల మధ్య ఐక్యతను ఏ యుద్ధాలూ వేరుచేయలేవు.
వ్యాసకర్త: మల్లెపల్లి లక్ష్మయ్య,   సామాజిక విశ్లేషకులు ‘ మొబైల్‌ : 81063 22077 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement