న్యూఢిల్లీ: భారత్, చైనాలు విభేదాలను పరిణతి, సున్నితత్వంతో పరిష్కరించుకుంటున్నాయని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. సరిహద్దుల్లో నెలకొన్న శాంతియుత పరిస్థితులే ఈ విషయాన్ని ప్రస్ఫుటం చేస్తున్నాయని పేర్కొన్నారు. ప్రపంచ శాంతికి భారత్–చైనా సంబంధాలు కీలకమన్న మోదీ..ఇరు దేశాల మధ్య ఇటీవల ఉన్నతస్థాయిలో సంప్రదింపులు పెరగడాన్ని కొనియాడారు. చైనా రక్షణ మంత్రి వెయ్ ఫెంగె మంగళవారం తనతో భేటీ అయిన సందర్భంగా మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు.
‘భారత్, చైనాలు తమ మధ్యనున్న విభేదాలు వివాదాలుగా మారకుండా పరిపక్వతతో వ్యవహరిస్తున్నాయి. సరిహద్దుల్లో నెలకొన్న శాంతియుత వాతావరణం ఈ విషయాన్ని స్పష్టంచేస్తోంది’ అని ప్రధాని కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. ఇటీవల చైనా ప్రధాని జిన్‌పింగ్‌తో జరిగిన సమావేశాలను మోదీ గుర్తుచేసుకున్నారు. గతేడాది చోటుచేసుకున్న డోక్లాం ప్రతిష్టంభన నేపథ్యంలో చైనా రక్షణ మంత్రి భారత్‌లో పర్యటించడం ఇరు దేశాల మిలిటరీ సంబంధాల పునరుద్ధరణకు దోహదపడుతుందని భావిస్తున్నారు.
రేపు నిర్మలా సీతారామన్‌తో భేటీ..
భారత రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్‌తో ఫెంగె గురువారం సమావేశం కానున్నారు. విభేదాలు పరిష్కరించుకుని, రెండు దేశాల సైన్యాల మధ్య సమన్వయాన్ని పెంపొందించడంపై ఇద్దరు నేతలు చర్చిస్తారని అధికారిక వర్గాలు తెలిపాయి.
Comments
Please login to add a commentAdd a comment