బౌద్ధస్థూప సందర్శనకు విదేశీ ప్రతినిధులు
⇒ 40 దేశాలకు చెందిన
⇒ 63 మంది రేపు కొండపల్లికి రాక
నేలకొండపల్లి: నేలకొండపల్లిలోని బౌద్ధమహాస్థూపం సందర్శనకు వివిధ దేశాలకు చెందిన ప్రతినిధులు ఆదివారం ఉదయం 9 గంటలకు రానున్నారు. తెలంగాణ చరిత్రను చాటి చెప్పేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అంతర్జాతీయ బౌద్ధ మహాసభలను నిర్వహిస్తోంది. దీనిలో భాగంగా 40దేశాలకు చెందిన 63మంది ప్రతినిధులు, మాంకులూ, బుద్ధవనం ప్రత్యేక అధికారి మల్లేపల్లి లక్ష్మ య్య సారథ్యంలో 100మంది వివిధ సంస్థల ప్రతి నిధు లు, అధికారులు బౌద్ధ మహాస్థూపాన్ని సందర్శించనున్నారు. నేలకొండపల్లి బౌద్ధస్థూపం దక్షిణ భారతంలోనే అతిపెద్ద స్థూపంగా పేరొందింది. నేలకొండపల్లి.. దేశానికి బౌద్ధ విగ్రహాలను సరఫరా చేసిన ఉత్పత్తి కేంద్రంగా విలసిల్లింది. గతంలో బౌద్ధ విశ్వవిద్యాలయం ఇక్కడే నిర్వహించారు.
ఇక్కడ తొమ్మిది నిలువెత్తు పాలరాతి బుద్ధ విగ్రహాలు, అతి విలువైన పంచలోహ విగ్రహం, అనేక బౌద్ధ అవశేషాలు, పురాతన కాలం నాటి అతిపెద్ద నూనె కర్మాగారం, చైత్యాలు, వెలుగు చూసిన చారిత్రక పట్టణం నేలకొండపల్లి. దీని సందర్శనకు వస్తున్న చైనా, హాంకాంగ్, మలేషియా, జపాన్, బ్రిటన్, శ్రీలంక, ఇండోనేషియా తదితర దేశాల ప్రతినిధులకు ఘనంగా స్వాగతం పలికేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు.
ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సిద్ధార్థ యోగ విద్యాలయం చైర్మన్ డాక్టర్ కె.వై.రామచందర్‌రావు కోరారు. శుక్రవారం ఆయన విలేకర్లతో మాట్లాడారు. మన జాతి ప్రాచీన చరిత్రపై మమకారం ఉన్న ప్రతి ఒక్కరూ బౌద్ధమహాస్థూపం వద్దకు చేరుకోవాలన్నారు. సమావేశంలో యోగ విద్యాలయం డైరెక్టర్ డాక్టర్ ఎన్.జి.పద్మ, చిర్రా రవి, మంకెనపల్లి క్రాంతికిరణ్ పాల్గొన్నారు.