పారదర్శక పాలన మాది.. పెట్టుబడులతో రండి
కేంద్ర ప్రభుత్వ మద్దతు మాకుంది. తోటి తెలుగు రాష్ట్రమైన తెలంగాణతో, పక్కనే ఉన్న కర్ణాటక, తమిళనాడుతోనూ మంచి సంబంధాలుండడం మాకున్న బలాల్లో ఒకటి.
– సీఎం వైఎస్ జగన్
ఇప్పటికే పరిశ్రమలపై విధిస్తున్న కరెంటు చార్జీలు చాలా ఎక్కువగా ఉన్నాయి. వాటిపై ఇంకా భారం వేసే పరిస్థితి లేదు. అలా చేస్తే పరిశ్రమలను ఆకట్టుకునే విషయంలో మేం పోటీలో లేకుండా పోతాం. చార్జీల భారం మోపితే పెట్టుబడులను ఎలా ఆకర్షించగలుగుతాం.?
మీరు పరిశ్రమకు శంకుస్థాపన చేసేలోపు ఏయే రంగాల్లో
నిపుణులైన మానవ వనరులు అవసరమవుతాయో ఒక జాబితా ఇవ్వండి. ఎలాంటి అర్హతలున్న వారు కావాలో చెప్పండి. ఈ జాబితా ఇవ్వగానే నైపుణ్యం ఉన్న మానవ వనరులను అభివృద్ధి చేయడానికి మేం కలిసి పనిచేస్తాం. ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో ఒక ఇంజనీరింగ్ కాలేజీని దత్తత చేసుకుని, దాన్ని నైపుణ్యాభివృద్ధి కేంద్రంగా తయారు చేస్తాం. దీనికి మీరు నిధులు సమకూర్చాల్సిన పని లేదు. మా పిల్లలకు నైపుణ్యత నేర్పడానికి అవసరమయ్యే నిధులను మేమే ఖర్చు చేస్తాం.
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు పెట్టడానికి అవసరమైన వాతావరణం కల్పిస్తామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఉద్ఘాటించారు. రాష్ట్రంలో నిజాయతీ, పూర్తి పారదర్శకతతో కూడిన పరిపాలన అందిస్తున్నామని చెప్పారు. ప్రతి లావాదేవీలోనూ పారదర్శకత తప్పనిసరిగా ఉండాలనే లక్ష్యంతో తమ ప్రభుత్వం వచ్చిన 60 రోజుల్లో కొన్ని విప్లవాత్మకమైన మార్పులు చేపట్టామని పేర్కొన్నారు. శుక్రవారం విజయవాడలో దౌత్యవేత్తలు, విదేశీ ప్రతినిధుల (డిప్లొమాటిక్ ఔట్రీచ్) సదస్సులో జగన్మోహన్రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రధానోపన్యాసం చేశారు. దాదాపు అరగంట పాటు ఆయన మాట్లాడారు. కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సమన్వయంతో ఈ సదస్సు నిర్వహించారు. రాష్ట్రంలో వివిధ కీలక రంగాల్లో పెట్టుబడులకు అపారమైన అవకాశాలున్నాయని సీఎం వైఎస్ జగన్ వెల్లడించారు. పెట్టుబడులు పెట్టడానికి ముందుకు రావాలని విదేశీ ప్రతినిధులను, పారిశ్రామికవేత్తలను ఆహ్వానించారు. కలిసి పనిచేద్దామని సూచించారు. పరిశ్రమలకు ఎలాంటి సహకారం కావాలన్నా అందించడానికి సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. డిప్లొమాటిక్ ఔట్రీచ్ సదస్సులో వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇంకా ఏం మాట్లాడారంటే..
‘‘దేశ రాజధాని ఢిల్లీ వెలుపల ఇంత పెద్ద స్థాయిలో విదేశీ రాయబారులు, హైకమిషనర్లు, కాన్సులేట్ జనరల్‌లు సమావేశం కావడం బహుశా ఇదే తొలిసారి కావొచ్చు. సదస్సుకు 25 దేశాల నుంచి 50 మందికి పైగా ప్రతినిధులు హాజరయ్యారు. అందులో 16 దేశాల రాయబారులు ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ గురించి మీ అందరికీ తెలుసు. ఇది బాగా అభివృద్ధి చెందిన రాష్ట్రమని, వడ్డించిన విస్తరి అని చెప్పలేను. మాది పేద రాష్ట్రం. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై లాంటి పెద్ద నగరాలు మాకు లేవన్నది వాస్తవం. కానీ, వారసత్వంగా మాకు అనేక బలాలున్నాయి. 972 కిలోమీటర్ల మేర సముద్ర తీర ప్రాంతం, 4 నౌకాశ్రయాలు, 6 విమానాశ్రయాలు ఉండటమే మా బలాలు. వీటికి తోడు ఇంకో బలం కూడా ఉంది.
దేశవిదేశాల నుంచి భారీగా పెట్టుబడులను ఆకర్షించే సుస్థిరమైన పరిపాలన ఇక్కడ ఉందని సగర్వంగా చెప్పగలను. ప్రజలు మాకు బ్రహ్మాండమైన తీర్పునిచ్చారు. మొత్తం 175 అసెంబ్లీ సీట్లకు గాను, 86 శాతం సీట్లను ప్రజలు మాకు కట్టబెట్టారు. 151 స్థానాల్లో గెలిపించారు. ఎంపీ సీట్ల విషయంలో మాది లోక్‌సభలో నాలుగో పెద్ద పార్టీ అని చెప్పడానికి గర్విస్తున్నా. కేంద్ర ప్రభుత్వ మద్దతు మాకుంది. తోటి తెలుగు రాష్ట్రమైన తెలంగాణతో, పక్కనే ఉన్న కర్ణాటక, తమిళనాడుతోనూ మంచి సంబంధాలుండడం మాకున్న బలాల్లో ఒకటి. అవినీతి రహిత పాలనను అందించడానికి, పారదర్శక విధానాలను అమలు చేయడానికి ఈ రోజుల్లో ప్రభుత్వాలు చాలా ఇబ్బందులు పడుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో అవినీతి రహిత పాలనను అందించడానికి, పారదర్శక విధానాలను ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడానికి చిత్తశుద్ధితో కృషి చేస్తున్నాం.
మేం ఏం చేసినా నిజాయతీతో చేశాం..
పెట్టుబడులను ఆకర్షించాలంటే నిజాయతీతో కూడిన విధానాలు చాలా అవసరం. వీటిని అందించడానికి మేం సిద్ధంగా ఉన్నాం. అంతేకాదు, ఈ విషయంలో ఇతరులకు ఆదర్శంగా (రోల్‌మోడల్) నిలుస్తాం. ఉత్తమ పారదర్శక విధానాల కోసం దేశంలోనే తొలిసారిగా రాష్ట్ర అసెంబ్లీలో కొన్ని చట్టాలు చేశాం. ప్రతి లావాదేవీలోనూ పారదర్శకత తప్పనిసరిగా ఉండాలనే లక్ష్యంతో ఈ చట్టాలు తీసుకొచ్చాం. మా ప్రభుత్వం వచ్చిన 60 రోజుల్లో కొన్ని విప్లవాత్మకమైన మార్పులు చేపట్టాం. ఇవి కాస్త వివాదాస్పద అంశాలు కూడా. అవి ఏమిటన్నది మీ మదిలో ఉండే ఉంటాయి. మీలో విశ్వాసం, నమ్మకం కల్పించడానికి వీటి గురించి కొన్ని విషయాలు చెప్పదల్చుకున్నా. ఎవరైనా మా పట్ల విశ్వాసం చూపించాలంటే మేం చేసే పనుల్లో నిజాయతీ, చిత్తశుద్ధి, అంకితభావం ఉండాలి. మేం వాటిని చూపించకపోతే ఎవరూ మమ్మల్ని విశ్వసించరు. మాపై నమ్మకం ఉంచరు. మేం ఏం చేసినా నిజాయతీతో చేశాం. మీరు దినపత్రికల్లో చదివిన అంశాలు ఒకవైపు మాత్రమే ఉన్నాయి.
శుక్రవారం విజయవాడలో జరిగిన సదస్సుకు హాజరైన వివిధ దేశాల ప్రతినిధులు, పారిశ్రామిక వేత్తలు
ఆ కథనాల్లో అన్ని విషయాలు చెప్పారో లేదో నాకు తెలియదు. కానీ, మేము తీసుకున్న నిర్ణయాల్లో రెండోవైపు కోణాన్ని, రెండోవైపు కథనాన్ని మీకు వివరించదల్చుకున్నా. అందులో ఒకటి విద్యుత్ ఒప్పందాల పునఃసమీక్ష. ప్రైవేట్ సంస్థల నుంచి ఎక్కువ ధరలకు కరెంటు కొనుగోలు చేసేలా కుదుర్చుకున్న ఒప్పందాలను(పీపీఏ) పునఃసమీక్షించాలన్నదే మా నిర్ణయం. ఇది కాస్త వివాదాస్పదం అయినా ఇందులో ఉన్న కీలక అంశాన్ని చెప్పదల్చుకున్నా. విద్యుత్ పంపిణీ సంస్థలు(డిస్కం) కరెంటు కంపెనీలకు బకాయిలు చెల్లించలేని స్థితిలో ఉన్నప్పుడు విద్యుత్ కొనుగోలు ఒప్పందాల వల్ల ఏం ప్రయోజనం? నేను సీఎం అయి 2 నెలలే అయింది. ఈ పదవిలోకి రాగానే రాష్ట్రంలో విద్యుత్ రంగంపై, డిస్కంల పరిస్థితిపై సమీక్ష చేశాను. రూ.20 వేల కోట్ల బకాయిలు చెల్లించాల్సి ఉందని అధికారులు చెప్పారు. గత ప్రభుత్వం ఏడాది నుంచి ఏడాదిన్నర కాలంగా విద్యుత్ ఉత్పత్తి కంపెనీలకు బిల్లులు చెల్లించలేదని చెప్పారు.
అలాంటప్పుడు ఈ పీపీఏలతో ఏం చేసుకోవాలి? వీటికి ఎలాంటి విలువా ఉండదు. డిస్కంలు పూర్తిగా ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయాయి. ఇలాంటి పరిస్థితుల్లో మేమేం చేయాలి? వివాదాస్పదం అయినప్పటికీ కచ్చితంగా ఏదో ఒకటి చేయాల్సిన అవసరం ఉంది. ఈ విషయంలో ఉభయతారకంగా ఉండాలని నిర్ణయించాం. విద్యుత్ రంగంలో అంతర్జాతీయ సంస్థలు, వాటికి రుణాలు ఇచ్చిన బ్యాంకులు ఉన్నాయని తెలుసు. వాటికి నమ్మకం, విశ్వాసం కల్పించాల్సిన అవసరం ఉంది. అందుకే ఉభయతారకంగా ఉండేలా పీపీఏలను పునఃసమీక్షించాలని నిర్ణయించాం. అందుకే కంపెనీలకు వాస్తవ పరిస్థితులను తెలియజేశాం. ఆదాయాలు తక్కువగా ఉన్నాయి, మరోవైపు విద్యుత్ ఉత్పత్తి సంస్థలకు చెల్లించాల్సిన బిల్లులు చాలా ఎక్కువగా ఉన్నాయి.
శుక్రవారం విజయవాడలో జరిగిన డిప్లొమాటిక్ ఔట్రీచ్ సదస్సుకు హాజరైన వివిధ దేశాల దౌత్యవేత్తలు, ప్రతినిధులతో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి. చిత్రంలో మంత్రులు అనిల్‌కుమార్ యాదవ్, బుగ్గన రాజేంద్రనాథ్, ఆదిమూలపు సురేష్, వెలంపల్లి శ్రీనివాస్, కొడాలి నాని, బొత్స సత్యనారాయణ, ఏపీ సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం తదితరులు
ఇలాంటి పరిస్థితుల్లో డిస్కంల మనుగడ కష్టమవుతోందని చెప్పాం. ఏ డిస్కం కూడా బతికి బట్ట కట్టలేదని వివరించాం. మరోవైపు బహుశా ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా రైతులతో సహా మరికొన్ని రంగాలకు సబ్సిడీపై కరెంటు ఇస్తున్నాం. ఈ రంగాలు పెద్దగా చార్జీలు చెల్లించే పరిస్థితుల్లో లేవు. విద్యుత్ రంగంలో ఆదాయాలు ఏమైనా వస్తున్నాయంటే అవి పరిశ్రమల నుంచి మాత్రమే. ఇప్పటికే పరిశ్రమలపై విధిస్తున్న కరెంటు చార్జీలు చాలా ఎక్కువగా ఉన్నాయి. వాటిపై ఇంకా భారం వేసే పరిస్థితి లేదు. అలా చేస్తే పరిశ్రమలను ఆకట్టుకునే విషయంలో మేం పోటీలో లేకుండా పోతాం. చార్జీల భారం మోపితే పెట్టుబడులను ఎలా ఆకర్షించగలుగుతాం? అందుకే మేం ఈ నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది.
ఉద్యోగాలు వస్తాయనే విశ్వాసం కల్పించాలి
పరిశ్రమల్లో 75 శాతం ఉద్యోగాలను స్థానికులకే కేటాయిస్తూ చేసిన చట్టంపై వచ్చిన కథనాల్లో సంపూర్ణంగా అన్ని విషయాలూ చెప్పడం లేదు. అమెరికా లాంటి దేశంలో కూడా అక్కడి ప్రభుత్వం ప్రస్తుతం లోకల్ జాబ్స్ గురించి మాట్లాడుతోంది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు ఇలాంటి పరిస్థితే ఉంది. ఏ పరిశ్రమ అయినా, ఎక్కడ వచ్చినా సరే ఎంతో కొంత కాలుష్యం ఉంటోంది. తక్కువ, ఎక్కువ స్థాయిలో కావచ్చు. ఉద్యోగాలు వస్తాయనే ఆశ లేనçప్పుడు ఎవరైనా పరిశ్రమల కోసం ఎందుకు భూములు ఇస్తారు? అందుకే పరిశ్రమలకు అనుకూలమైన దిశలోనే ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నాం. భూములిచ్చిన వారికి ఉద్యోగాలు దొరుకుతాయనే విశ్వాసం కల్పించినప్పుడు మాత్రమే వారు పరిశ్రమలను మనస్ఫూర్తిగా స్వాగతించి సానుకూలంగా ఉంటారు.
విజయవాడలోని గేట్ వే హోటల్లో డిప్లొమాటిక్ ఔట్రీచ్ సదస్సును ప్రారంభిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి
ఐదేళ్లలో మరో నాలుగు పోర్టులు
మా రాష్ట్రంలోని 972 కిలోమీటర్ల తీర ప్రాంతంలో 4 నౌకాశ్రయాలు(పోర్టులు) ఉన్నాయి. 13 జిల్లాల్లో 6 జిల్లాలకు విమానాశ్రయాలు ఉన్నాయి. ఇప్పుడున్న పోర్టుల సంఖ్య పెంచుతాం. ఈ ఐదేళ్లు పూర్తయ్యే సరికి మరో నాలుగు కొత్త పోర్టులు వస్తాయి కనుక వాటి సంఖ్య ఎనిమిదికి చేరుకుంటుంది.
నదుల అనుసంధానం ఆవశ్యకం
నదులకు మేం చివరి భాగంలో ఉన్నాం. రాష్ట్రంలో నదులను అనుసంధానించాల్సిన ఆవశ్యకత ఉంది. సాగునీటి స్థిరీకరణకు, తాగు నీటికి గోదావరి–కృష్ణా నదుల అనుసంధానం అవసరం. ఈ ప్రాజెక్టు విషయంలో కలిసి రావాలని కోరుతున్నాం. డీజిల్ బస్సుల స్థానంలో ఎలక్ట్రిక్ బస్సులు ప్రవేశపెట్టాలన్నది మా అభిమతం. ఇందులో పెట్టుబడులకు ఎన్నో అవకాశాలున్నాయి. పరిశోధక యూనివర్సిటీలు, సీ పోర్టులు, విశాఖపట్నం, విజయవాడ–గుంటూరులో మెట్రోరైల్ ప్రతిపాదనలు ఉన్నాయి. మేము ప్రవేశపెట్టిన వినూత్న సంక్షేమ పథకాల్లో మీ సహకారం సైతం కోరుతున్నాం.
నైపుణ్యం ఉన్న మానవ వనరులను తయారు చేస్తాం
పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యం గల మానవ వనరులు రాష్ట్రంలో ఉన్నాయా? ప్రతిభ ఉందా? అనే ప్రశ్నలు మీ దగ్గరి నుంచి వస్తాయి. దీనికోసం ఒక స్పష్టమైన విధానంతో ఉన్నాం. మీరు పరిశ్రమ పెట్టేముందు, శంకుస్థాపన చేసే లోపు ఏయే రంగాల్లో నిపుణులైన మానవ వనరులు అవసరమవుతాయో ఒక జాబితా ఇవ్వండి. ఎలాంటి అర్హతలున్న వారు కావాలో చెప్పండి. ఈ జాబితా ఇవ్వగానే నైపుణ్యం ఉన్న మానవ వనరులను అభివృద్ధి చేయడానికి మేం కలిసి పనిచేస్తాం. ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో ఒక ఇంజనీరింగ్ కాలేజీని దత్తత చేసుకుని, దాన్ని నైపుణ్యాభివృద్ధి కేంద్రంగా తయారు చేస్తాం. దీనికి మీరు నిధులు సమకూర్చాల్సిన పని లేదు. మా పిల్లలకు నైపుణ్యత నేర్పడానికి అవసరమయ్యే నిధులను మేమే ఖర్చు చేస్తాం.
సదస్సులో దక్షిణ కొరియా, సింగపూర్, బోట్స్వానా దేశాల ప్రతినిధులతో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి
వారికి నైపుణ్యతను నేర్పించే విషయంలో బోధనా సహకారం మీ నుంచి ఉంటే సరిపోతుంది. మీకు అన్ని స్థాయిల్లోనూ అంగీకారమయ్యే రీతిలో మా పిల్లలను తయారు చేస్తాం. పరిశ్రమలు పెట్టే ప్రాంతాల్లోని ప్రజల గురించి ఆలోచించకపోతే అక్కడ అలజడే కనిపిస్తుంది. మీరు ఫ్యాక్టరీ పెట్టాక అలజడి ఉంటే, ప్రజల నుంచి సహకారం లభించకపోతే దానివల్ల ఫలితం ఏముంటుంది? ఈ పరిస్థితి ఒక్క ఈ రాష్ట్రంలోనే కాదు, దేశవ్యాప్తంగా ప్రతి రాష్ట్రంలోనూ ఉంది. ప్రతి రాష్ట్రం ఈ చిక్కును ఎదుర్కొంటోంది. అందుకే ఈ అంశాలపై దృష్టి సారించాలి. మేం తీసుకున్న నిర్ణయాల్లో నిజాయతీ ఉంది కనుక మీ సహకారం చాలా అవసరం.
ఆర్థిక వనరుల సమీకరణకు పెద్ద ఎత్తున ఆలోచనలు చేస్తున్నాం
ఆక్వా, ఆహార రంగాల్లో రాష్ట్రం నుంచి పెద్ద ఎత్తున ఉత్పత్తులు వస్తున్నాయి. ఈ రంగాల్లో మీ సహకారం చాలా అవసరం. ఈ రెండు రంగాల్లో అంతర్జాతీయ ప్రమాణాలను తీసుకురావాల్సి ఉంది. ఇప్పుడున్న ఉత్పత్తులు అంతర్జాతీయ స్థాయిలో ఉండాలి కనుక మీ సహాయం కోరుతున్నాం. మీతో కలిసి పని చేయడానికి సిద్ధంగా ఉన్నాం. మీరు ముందుకు రావాలి. రాష్ట్రంలో పంటల దిగుబడులు చాలా తక్కువగా ఉన్నాయి. రాష్ట్రంలో సగటున 2,500 కిలోల కాఫీ వస్తే వియత్నాంలో 7,000 నుంచి 8,000 కిలోల వరకూ వస్తోంది. మెరుగైన ఆలోచనలు, విధానాల ద్వారా ఉత్పత్తిని పెంచుకోవడానికి మీ సహాయ సహకారాలు అవసరం. పోర్టులు, రిఫైనరీలు, ఉక్కు కర్మాగారాలు, నీటి యాజమాన్య పద్ధతుల్లో పెట్టుబడులను ఆహ్వానిస్తున్నాం. రాష్ట్రానికి అవసరమైన ఆర్థిక వనరుల సమీకరణ కోసం మేం చాలా పెద్ద ఎత్తున ఆలోచనలు చేస్తున్నాం.
పరిపాలనలో ఒక ప్రమాణాన్ని నెలకొల్పుతాం
దేశంలో నిరక్షరాస్యత 26 శాతం అయితే, ఏపీలో 33 శాతం. గ్రాస్ ఎన్రోల్మెంట్ నిష్పత్తి (జీఈఆర్) రష్యాలో 81 శాతం ఉంటే చైనాలో 48 శాతం ఉంది. బ్రెజిల్లో 50 శాతం ఉంటే భారత్‌లో 25 శాతం మాత్రమే ఉంది. అందుకే అనేక సంక్షేమ పథకాలు చేపట్టాం. ఈ అంశాలన్నింటిలోనూ మీ సహకారం కోరుకుంటున్నాం. మాది వ్యవసాయ ప్రధాన రాష్ట్రం. 62 శాతం మంది వ్యవసాయంపైనే ఆధారపడి ఉన్నారు. రైతుల జీవన ప్రమాణాలు పెంచాలని మేం గట్టిగా ప్రయత్నిస్తున్నాం. పాఠశాలలు, ఆసుపత్రుల ఆధునీకరణ పనులు ప్రారంభించాం. ఈ కార్యక్రమాల్లో మీరు సముచిత పాత్ర పోషించాలని కోరుతున్నాం. మీతో కలిసి పని చేయడానికి మేం చిత్తశుద్ధితో ఉన్నాం. నిజాయతీ గల ప్రభుత్వం మాది. అత్యంత సానుకూలత ఉన్న బృందం మాది. అవినీతి రహిత, పారదర్శక పరిపాలన విషయంలో మేము కచ్చితంగా ఒక ప్రమాణాన్ని నెలకొల్పుతాం’’ అని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పష్టం చేశారు.