సాక్షి, అమరావతి: పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యంగా 30కిపైగా దేశాల రాయబారులు, హై కమిషనర్లు, కాన్సుల్ జనరల్స్‌తో శుక్రవారం విజయవాడలో నిర్వహించిన డిప్లొమాటిక్ ఔట్ రీచ్ కార్యక్రమానికి అనూహ్య స్పందన వచ్చింది. దక్షిణ కొరియా, బ్రిటన్, సింగపూర్, పోలండ్, బల్గేరియా, శ్రీలంక, ఆస్ట్రేలియా, ఇండోనేషియాలతోపాటు మొత్తం 15 దేశాల ప్రతినిధులతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ముఖాముఖి చర్చలు జరిపారు. షెడ్యూల్ కంటే అదనంగా మరో గంటకుపైగా సమయం కేటాయించి విదేశీ ప్రతినిధుల సందేహాలను నివృత్తి చేశారు. పెట్టుబడులకు ఆంధ్రప్రదేశ్ అత్యంత అనుకూలమని, పరిశ్రమలు పెట్టేవారికి పాలనాపరంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తామని భరోసా ఇచ్చారు. పరిశ్రమలు స్థాపించేవారికి జిల్లా స్థాయిలోనే సింగిల్ విండో విధానంలో అనుమతులు మంజూరు చేస్తున్నామని, ఏదైనా పరిశ్రమ ఏర్పాటు చేయదలచినవారు కేవలం ఒకే ఒక దరఖాస్తు చేస్తే సరిపోతుందన్నారు. అనుమతుల కోసం సుదీర్ఘంగా వేచి చూడాల్సిన అవసరంలేదని, ఏ చిన్న సమస్య వచ్చినా వెంటనే పరిష్కరిస్తామని, అనుమతులపై ముఖ్యమంత్రి కార్యాలయం స్వయంగా పర్యవేక్షించి పూర్తి సహాయ సహకారాలు అందిస్తుందని తెలిపారు.
ఎల్‌ఈడీ ప్లాంట్ ఏపీలో..
పోలండ్ రాయబారి ఆడం బురాకోవిస్కి సీఎంతో ముఖాముఖి చర్చల్లో పాల్గొన్నారు. ఎల్‌ఈడీ బల్బుల తయారీకి పోలండ్ ప్రసిద్ధి చెందిందని వివరించారు. ఏపీలో ప్లాంట్ నెలకొల్పడానికి ముందుకు రావాలని సీఎం కోరారు.
ఇ–గవర్నన్స్‌లో పెట్టుబడులు
డెన్మార్క్ తరఫున బెంగళూరులోని కాన్సులేట్ జనరల్ జెట్టీ బెర్రూం ముఖ్యమంత్రితో చర్చించారు. పోర్టులు, లాజిస్టిక్స్, తీర ప్రాంతాల అభివృద్ధి, ఇ గవర్నెన్స్ రంగాల్లో పెట్టుబడులకు ఆసక్తితో ఉన్నామని తెలిపారు. ఏపీలోని నగరాలతో భాగస్వామ్య ఒప్పందాలకు సిద్ధమని చెప్పారు. పీపీపీ ప్రాజెక్టుల్లో పెట్టుబడులకు ఆసక్తితో ఉన్నట్లు తెలిపారు.
తక్కువ ఖర్చుకే విద్యుత్
ఇండోనేషియా తరఫున కాన్సులేట్ జనరల్ అదే సుకేందర్ సీఎంతో ముఖాముఖి చర్చలు జరిపారు. తమ దేశంలో బొగ్గు నిల్వలు అపారంగా ఉన్నాయని తెలిపారు. ఏపీలోని థర్మల్ విద్యుత్ కేంద్రాలకు బొగ్గును సరఫరా చేస్తే తక్కువ ఖర్చుకే విద్యుత్ వస్తుందని, ప్రాజెక్టుల్లో భాగస్వామ్యాన్ని కూడా పొందవచ్చని సీఎం వారికి సూచించారు.
బంధాల బలోపేతం దిశగా..
సింగపూర్ హైకమిషనర్ లిమ్ థాన్ బృందం సీఎంతో ముఖాముఖి చర్చల్లో పాల్గొంది. వివిధ రంగాల్లో ఇప్పటికే రూ.20 వేల కోట్ల పెట్టుబడులు పెట్టామని, థర్మల్, సోలార్, వైమానిక రంగాల్లో పెట్టుబడులకు ఆసక్తిగా ఉన్నట్లు బృందం తెలిపింది. ఏపీతో సంబంధాలు బలోపేతం కావాలని ఆకాంక్షిస్తున్నట్టు పేర్కొనగా రాష్ట్రం తరఫున పూర్తి సహకారం అందిస్తామని సీఎం చెప్పారు.
ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటుకు ఆసక్తి
దక్షిణ కొరియా రాయబారి షిన్, కాన్సులేట్ జనరల్ క్యుంగ్‌సూ కిమ్ ముఖ్యమంత్రి జగన్‌తో మొదట ముఖాముఖి చర్చలు జరిపారు. ప్రపంచంలోనే రెండో అతిపెద్ద ఉక్కు ఉత్పత్తి కంపెనీ పోస్కో ఏపీలో ప్లాంట్ పెట్టేందుకు ఆసక్తిగా ఉందని దక్షిణ కొరియా బృందం ముఖ్యమంత్రికి తెలిపింది. కడపలో ప్లాంటు ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి వారికి విజ్ఞప్తి చేశారు. కియా కార్ల తయారీ ప్లాంట్ ఉన్న ప్రాంతంలో విడిభాగాల తయారీ, అనుబంధ పరిశ్రమలను నెలకొల్పడానికి సంపూర్ణ సహకారం అందిస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. చైనాలో కొన్ని సమస్యల కారణంగా అక్కడున్న కంపెనీలను తరలించే ఆలోచనలో ఉన్నట్లు కొరియా బృందం ముఖ్యమంత్రికి తెలిపింది. అనంతపురం జిల్లాను పరిశీలించాల్సిందిగా సీఎం వారిని కోరారు.
ఎలక్ట్రిక్ వాహనాల తయారీపై..
ఎలక్ట్రిక్ వాహనాల తయారీపై ఆసక్తిగా ఉన్నట్లు యునైటెడ్ కింగ్‌డమ్ డిప్యూటీ హైకమిషనర్ ఆండ్రూ ఫ్లెమింగ్ సీఎంకు చెప్పారు. రాష్ట్రంలో డీజిల్ బస్సుల స్థానంలో క్రమంగా ఎలక్ట్రిక్ వాహనాలను ప్రవేశపెట్టే ప్రయత్నాలు చేస్తున్నామని సీఎం తెలిపారు.
బ్రాండెక్స్ విస్తరణ
బ్రాండెక్స్ విస్తరణపై పరిశీలించాలని శ్రీలంక హైకమిషనర్ ఆస్టిన్ ఫెర్నాండో సీఎంని కోరారు.
పరిశోధక రంగాల్లో సహకారం
బల్గేరియా రాయబారి ఎలనోరా దిమిత్రోవా సీఎం జగన్‌తో ముఖాముఖి చర్చల్లో పాల్గొన్నారు. ఏపీ విద్యార్థులకు శిక్షణ, నైపుణ్యాభివృద్ధి, పరిశోధక రంగాల్లో సహకారం అందిస్తామని ప్రతిపాదించారు. ఏపీలో వ్యవసాయ ఉత్పత్తులు ఉండేలా తగిన సహకారం అందించాలని సీఎం బల్గేరియా రాయబారికి విజ్ఞప్తి చేశారు.
పర్యాటకంపై చర్చ
బౌద్ధ పర్యాటకం, వ్యవసాయ రంగంలో సహకారంపై మయన్మార్ రాయబారి మోయ్ అంగ్ సీఎం జగన్‌తో చర్చించారు.
పరిశ్రమలకు సహకారం
చెన్నైలోని ఆస్ట్రేలియా కాన్సులేట్ జనరల్ సుసాన్ గ్రేస్ ముఖ్యమంత్రితో ముఖాముఖి చర్చల్లో పాల్గొన్నారు. ఇండస్ట్రియల్ ప్రమోషన్ అండ్ మానిటరింగ్ అథారిటీ ద్వారా పరిశ్రమలకు సహాయ సహకారాలు అందిస్తామని సీఎం చెప్పారు. మాల్టా దేశానికి చెందిన ప్రతినిధులు కూడా సీఎంతో ముఖాముఖి చర్చలు జరిపారు.
పెట్టుబడులకు సిద్ధం
ఆస్ట్రియా అంబాసిడర్ బ్రిజెట్టి సీఎంతో ముఖాముఖి చర్చించారు. తమ దేశంలో దాదాపు 150 హైటెక్ ఇండస్ట్రీస్‌ను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఏపీలో పెట్టుబడులకు ఆసక్తితో ఉన్నామని చెప్పారు.
వ్యవసాయంలో పెట్టుబడులు
వ్యవసాయం, ఎరువులు, టెక్స్‌టైల్స్ రంగాల్లో పెట్టుబడులకు సిద్ధంగా ఉన్నట్లు తుర్క్‌మెనిస్థాన్ రాయబారి షలర్ సీఎంకు తెలిపారు.
మా దేశంలో పర్యటించండి
తమ దేశంలో పర్యటించాల్సిందిగా దేశాధ్యక్షుడి తరపున కిర్గ్ రాయబారి అసేన్ ఇసయేవ్ ముఖ్యమంత్రి జగన్‌ను ఆహ్వానించారు. వ్యవసాయం, హార్టీకల్చర్‌పై కలసి పనిచేయడానికి తాము సిద్ధమన్నారు.
అభయారణ్యాల పరిరక్షణలో సాయం
బొగ్గు, వజ్రాల గనులకు తమ దేశం ప్రసిద్ధి చెందిందని ఆఫ్రికాలోని బోట్స్‌వానా హైకమిషనర్ లెసెగో ఇ మొట్సుమి సీఎం జగన్‌కు తెలిపారు. వజ్రాల పాలిషింగ్ యూనిట్ల దిశగా ఆలోచన చేయాలని ముఖ్యమంత్రిని కోరారు. అభయారణ్యాల పరిరక్షణలో సహకారం అందిస్తామని చెప్పారు. ఏపీలో ఉన్న నిపుణులైన వైద్యుల సేవలు తమ దేశానికి చాలా అవసరమని సీఎంకు నివేదించారు.
Comments
Please login to add a commentAdd a comment