పెట్టుబడులకు అనుకూలం | CM YS Jagan Meeting with Entrepreneurs In the America Tour | Sakshi
Sakshi News home page

పెట్టుబడులకు అనుకూలం

Published Sun, Aug 18 2019 3:06 AM | Last Updated on Sun, Aug 18 2019 12:47 PM

CM YS Jagan Meeting with Entrepreneurs In the America Tour - Sakshi

వాషింగ్టన్‌ డీసీలో భారత రాయబారి విందు సందర్భంగా జరిగిన సమావేశంలో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌

వాషింగ్టన్‌ డీసీ: నీతివంతమైన పాలన, కాంట్రాక్టుల్లో పారదర్శక విధానాలే లక్ష్యంగా తమ ప్రభుత్వం పనిచేస్తోందని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తెలిపారు. రాష్ట్రంలో పెట్టుబడులకు అనువైన వాతావరణం కల్పించేందుకు కృత నిశ్చయంతో కట్టుబడి ఉన్నామని, అవకాశాన్ని అందిపుచ్చుకోవాలని కోరారు. అమెరికా పర్యటనలో ఉన్న సీఎం వైఎస్‌ జగన్‌ అమెరికాలో భారత రాయబారి హర్షవర్థన్‌ శ్రింగ్లా వాషింగ్టన్‌ డీసీలో ఇచ్చిన విందులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా 60 మందికిపైగా సీనియర్‌ అధికారులు, వ్యాపార, వాణిజ్యవేత్తలను ఉద్దేశించి సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రసంగించారు. పెట్టుబడిదారులకు అవసరమైన అన్ని అంశాలను ఒకేచోట సుహృద్భావ వాతావరణంలో కల్పిస్తామని చెప్పారు. 

కొత్త అవకాశాలున్నాయ్‌...
రెండు అతి పెద్ద ప్రజాస్వామిక దేశాల మధ్య వివిధ రంగాల్లో వ్యూహాత్మక భాగస్వామ్యం పరిఢవిల్లేలా అమెరికాలోని భారతీయ అధికారులు గట్టి పునాదులు వేశారని వైఎస్‌ జగన్‌ ప్రశంసించారు. ఆంధ్రప్రదేశ్‌లో వ్యాపారాలు, పెట్టుబడులకు కొత్త అవకాశాలున్నాయన్నారు. ఏపీ, అమెరికాల మధ్య సంబంధాలను ఇవి మరింత పెంచడమే కాకుండా వ్యాపార, వాణిజ్య, ఇంధన రంగంలో సహకారం, సాంస్కృతిక రంగాల్లో పరస్పరం భాగస్వామ్యాలకు ఉపకరిస్తుందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ఇందుకు అవసరమైన మానవ వనరులు రాష్ట్రంలో సిద్ధంగా ఉన్నాయని వివరించారు. 


ముఖ్యమంత్రి దూరదృష్టితో అభివృద్ధి పథంలో ఏపీ
ముఖ్యమంత్రి జగన్‌ దూరదృష్టి, స్థిర సంకల్పం, పారదర్శక విధానాలు ఏపీని అభివృద్ధి పథం వైపు నడిపిస్తున్నాయని, పెట్టుబడులను ఆకర్షిస్తున్నాయని అమెరికాలో భారత రాయబారి హర్షవర్థన్‌ పేర్కొన్నారు. ముఖ్యమంత్రి నాయకత్వ పటిమను ఈ సందర్భంగా ఆయన ప్రశంసించారు. ఈ విందులో పాల్గొన్న అమెరికా ప్రభుత్వ సీనియర్‌ డైరెక్టర్‌(ప్రభుత్వ వ్యవహారాలు) క్లాడియో లిలిన్‌ ఫీల్డ్‌ మాట్లాడుతూ వ్యర్థ పదార్థాల నిర్వహణ, పట్టణాభివృద్ధి, నగర ప్రణాళికలు, జల నిర్వహణ, మురుగునీటి శుద్ధి, పరిశ్రమల్లో విద్యుత్‌ సామర్థ్యం పెంపు, వ్యవసాయం, పాడి పరిశ్రమ, ఉద్యానవన పంటలు తదితర రంగాల్లో తాము పూర్తి సహకారం అందిస్తామని ప్రకటించారు.

స్మార్ట్‌ సిటీలు, లైటింగ్‌ ఉత్పత్తులతో సహా పలు రంగాల్లో సహాయ సహకారాలు అందించేందుకు వ్యాపారవేత్తలు సంసిద్ధత వ్యక్తం చేశారు. కార్యక్రమంలో భారత రాయబార కార్యాలయ సీనియర్‌ అధికారులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి జగన్‌ ఈ సందర్భంగా పలువురు ప్రముఖులను కలుసుకున్నారు. హైదరాబాద్‌లో యూఎస్‌ కాన్సులేట్‌ జనరల్‌ జోయల్‌ రిచర్డ్స్‌ రీఫ్‌ మ్యాన్, భారత్, బంగ్లాదేశ్, నేపాల్, శ్రీలంక, భూటాన్‌ వ్యవహారాల డిప్యూటీ అసిస్టెంట్‌ సెక్రటరీ థామస్‌ ఎల్‌ వాజ్దా, గ్లోబల్‌ సస్టెయినబిలిటీ అండ్‌ ఇండస్ట్రీ వైస్‌ ప్రెసిడెంట్‌ క్లే నెస్లర్‌ సహా పలువురిని సీఎం కలిశారు. 

డల్లాస్‌కు చేరుకున్న సీఎం జగన్‌
ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శనివారం మధ్యాహ్నం 2.11 గంటలకు (భారత కాలమానం ప్రకారం శనివారం అర్ధరాత్రి 12.30 గంటలకు డల్లాస్‌ విమానాశ్రయానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా హచ్‌సన్‌ కన్వెన్షన్‌ సెంటర్‌లో ప్రముఖులతో తేనీటి విందులో పాల్గొననున్నారు. ఆ తర్వాత సాయంత్రం ఆరు గంటలకు (భారత కాలమానం ప్రకారం ఆదివారం తెల్లవారు జామున 4.30 గంటలకు) ఇక్కడే నార్త్‌ అమెరికా తెలుగు వారితో జరిగే ఆత్మీయ సమ్మేళనంలో జగన్‌ పాల్గొననున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement