
న్యాయమైన నష్టపరిహారం చెల్లించాలి
మల్లవల్లి (హనుమాన్‌జంక్షన్ రూరల్) : మల్లవల్లి ప్రభుత్వ భూముల సాగుదారుల జాబితాను తక్షణమే విడుదల చేయాలని, భూ సేకరణ చట్టం 2013 ప్రకారం నష్ట పరిహారం అందజేయాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు డిమాండ్ చేశారు. బాపులపాడు మండలం మల్లవల్లిలోని రీసర్వే నంబరు 11లో ఉన్న 1460 ఎకరాల భూమిలో పరిశ్రమల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం భూసేకరణ చేపట్టిన నేపథ్యంలో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు గురువారం గ్రామంలో పర్యటించారు. సాగుదారులతో ముఖాముఖి మాట్లాడి వారి అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. మధు మాట్లాడుతూ తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం సాగుదారుల జాబితాను గ్రామసభ ద్వారా బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు. సాగుదారులంతా ఐక్యంగా ఉండి న్యాయమైన నష్టపరిహారం కోసం పోరాటం చేయాలని సూచించారు. భూసేకరణ చట్టం ప్రకారం మార్కెట్ ధరకు నాలుగు రెట్లు నష్ట పరిహారాన్ని సాగుదారులకు చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ నెల 23వ తేదీ అఖిలపక్ష నేతలతో గ్రామంలో సాగుదారుల సమావేశం నిర్వహించనున్నట్లు తెలిపారు. న్యాయమైన నష్టపరిహారం ప్రకటించే వరకు సాగుదారుల పక్షాన సీపీఎం ఉద్యమిస్తుందని చెప్పారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు వై.వెంకటేశ్వరరావు, జిల్లా కార్యదర్శి ఆర్.రఘు, జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు వై.నరసింహారావు, వెంకటేశ్వరరావు, అబ్దుల్ బారి తదితరులు పాల్గొన్నారు.