‘పొత్తుల’ బాట వీడని కామ్రేడ్లు | 'Alliances' belief cpm(i) trail | Sakshi
Sakshi News home page

‘పొత్తుల’ బాట వీడని కామ్రేడ్లు

Published Thu, Apr 23 2015 12:13 AM | Last Updated on Mon, Oct 8 2018 9:06 PM

‘పొత్తుల’ బాట వీడని కామ్రేడ్లు - Sakshi

‘పొత్తుల’ బాట వీడని కామ్రేడ్లు

కొత్త కోణం
 
ఓట్లు, సీట్లు సంపాదించడం ప్రాతిపదికపై ఏర్పడే పొత్తులు ప్రజాస్వామ్య రాజకీయాలను, ప్రజల ఆకాంక్షలను ప్రతిబింబించలేవు. గత చరిత్ర అంతటా అదే రుజువైంది. పార్టీల నిర్మాణం కులాలకు అతీతంగా జరగలేదనే చారిత్రక సత్యాన్ని గుర్తిస్తేనే వ్యవస్థ సమూల మార్పునకు మార్గం సుగమం అవుతుంది. వామపక్ష ఐక్య సంఘటన రాజకీయ పార్టీల ఐక్యసంఘటనగా గాక, నిజమైన ప్రజాస్వామ్యం కోసం, దేశాన్ని ఆర్థికంగా తమ గుప్పిట్లో పెట్టుకుంటున్న కార్పొరేట్ శక్తులకు వ్యతిరేకంగా ఉద్యమించే బలమైన వామపక్ష శక్తుల సంఘటనగా మారాలి.
 
‘‘వామపక్షమంటే వామపక్ష పార్టీలు, సంస్థలు మాత్రమే కాదు. స్వయం ప్రతిపత్తి కోసం, సమాన అవకాశాల కోసం సాగుతున్న ఉద్యమాలు కూడా. తరచుగా ఈ శక్తులు చాలా సమరశీలమైనవి. కానీ ఏ పార్టీలోనూ, సంస్థ లోనూ సభ్యులుగా ఉండరు. ఈ శక్తులనే నేను సామాజిక వామపక్షం అంటాను. వామపక్ష పార్టీలు వీటితో ఏకమైనప్పుడు నిజమైన ప్రజాస్వామ్య కూటమి ఏర్పడుతుంది.’’ చిలీ మార్క్సిస్టు మేధావి మార్తా  హర్నేకర్ మాట లివి. మన దేశంలో వామపక్ష పార్టీల వైఖరి దీనికి భిన్నంగా ఉంది. మార్చిలో భారత కమ్యూనిస్టు పార్టీ జాతీయ మహాసభలు, ఏప్రిల్‌లో భారత కమ్యూ నిస్టు పార్టీ(మార్క్సిస్టు) జాతీయ మహాసభలు జరిగాయి. ఈ మహాసభల్లో ఆ పార్టీల భవిష్యత్తుకి సంబంధించిన పలు విషయాలతోపాటూ వివిధ పార్టీలతో ఐక్యసంఘటన అంశాన్ని కూడా లోతుగా చర్చించారు. వామపక్ష ప్రజాస్వామిక ఐక్యసంఘటన నిర్మాణానికి ప్రాధాన్యం ఇవ్వాలని రెండు పార్టీలూ నిర్ణయించాయి. చాలా కాలంగా ఆ పార్టీలు ఇలాంటి నినాదాలను ఇస్తూనే ఉన్నాయి. ఏదో కారణంతో కమ్యూనిస్టేతర పార్టీలకు మద్దతు నివ్వ డం, ఆ తర్వాత పశ్చాత్తాపం ప్రకటించడం చేస్తూనే ఉన్నాయి. ముఖ్యంగా ప్రాంతీయ పార్టీల విషయంలో సీపీఐ, సీపీఎంలు అనుసరిస్తున్న మెతక వైఖరి వారి రాజకీయ అవగాహనకే విరుద్ధంగా మారింది. వాటికి రాజకీ యంగా స్థిరమైన వైఖరి కొరవడటానికి మూలం వాటి సామాజిక అవగాహ నలోనే ఉన్న లోపమని అర్థం చేసుకోవాల్సి వస్తోంది.

ఉభయులదీ ఒకటే దారి    

రెండు పార్టీల కార్యక్రమం, రాజకీయ తీర్మానాల్లో కులం, దళిత, ఆదివాసీ సమస్యల ప్రస్తావన ఉంది. చరిత్రాత్మకంగా సమాజంపై కులం తీవ్ర ప్రభా వాన్ని కలుగజేస్తున్నదని కూడా పేర్కొన్నారు. దళితులు, ఆదివాసులపై తీవ్ర స్థాయిలో అత్యాచారాలు జరుగుతున్నాయనీ వివరించారు. వీరందరినీ సమీక రించాలని తీర్మానించారు. మతతత్వ పార్టీలకు, కార్పొరేట్లకు కొమ్ముగాసే పార్టీలకు వ్యతిరేకంగా ప్రజలను పోరాటాలకు సిద్ధం చేయాలని నిర్ణయిం చారు. ‘‘ప్రజా సమస్యలపైనా, దేశ సార్వభౌమత్వం, రాష్ట్రాల హక్కుల రక్షణ కోసమూ, సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగానూ పనిచేస్తున్న ఇతర ప్రజా తంత్రశక్తులు, కాంగ్రెసేతర లౌకిక పార్టీలతో కలిసి ఐక్య ఉద్యమాలు పెంపొం దించేందుకు కృషి’’ చేస్తుందని సీపీఎం రాజకీయ తీర్మానం పేర్కొంది. ఇక సీపీఐ రాజకీయ తీర్మానం... రాజకీయ బలం పెంచుకోవడం కోసం ఎన్నికల పొత్తులు తప్పనిసరి అవుతాయనీ, అందులో భాగంగానే ప్రాంతీయ పార్టీ లతో పొత్తులు పెట్టుకోవడం అనివార్యమవుతోందనీ, భవిష్యత్తులో దీనిని లోతుగా పునఃపరిశీలించాల్సి ఉందనీ పేర్కొంది.  ఏదేమైనా రెండు పార్టీలూ ఇప్పటికైతే ఏదో ఒక పేరుతో ప్రాంతీయ పార్టీలతో ఎన్నికల పొత్తులకు అను కూలమనేది స్పష్టమే.

కులం పునాదులను గుర్తించడంలో వైఫల్యం

కులం, అంటరానితనం సమస్యలను గురించి తీవ్రంగా చర్చించామని కమ్యూనిస్టు పార్టీలు కూడా చెప్పుకుంటున్నాయి. కానీ అవి కులాన్ని ఒక సాధారణ సమస్యగానే చూస్తున్నాయి. అంటరానితనాన్ని ఒక అత్యాచారం గానే నిర్వచిస్తున్నాయి. మన సామాజిక వ్యవస్థలో లోతుగా వేళ్లూనుకుని ఉన్న కులం పునాదులను గమనించడంలో విఫలమవుతున్నాయి. దేశంలోని అనేకానేక సమస్యల్లో కులం కూడా ఒకటి కాదు. కులం ఒక్కటే ఒక సమస్య. అది తరాల అంతరాల అగాధాలను మరింత పెంచే దుర్మార్గ సామా జిక జాడ్యం. వందల ఏళ్లుగా భారతీయులను వెంటాడుతున్న తిరోగమన భావజాలం. అందువల్లనే సీపీఐ, సీపీఎంల తీర్మానాలను సీరియస్‌గా తీసుకో వాల్సిన అవసరం ఉంది. వివిధ రాష్ట్రాల్లో ఉన్న ప్రాంతీయ పార్టీలు, వాటి నాయకత్వాలు ప్రగతిశీలమైనవా? వాటికి ఉన్న స్వభావమేమిటి? అనే అంశాన్ని చరిత్ర క్రమం నుంచి అర్థం చేసుకోవాలి. దేశవ్యాప్తంగా ఉన్న ప్రాం తీయ పార్టీల నాయకత్వాలన్నీ ఆయా రాష్ట్రాల్లోని ఆధిపత్య కులాల పార్టీలే.

స్వాతంత్య్రానికి ముందు ఈ కులాలు కూడా తమ హక్కుల కోసం పోరాడినవే. ముఖ్యంగా బ్రాహ్మణ, క్షత్రియ కులాల అధీనంలోని వనరులను పేదలకు పంచాలంటూ సాగిన పోరాటాల్లో వీరిది కీలక పాత్ర. నాయకత్వం వహించిందీ వారే. నాటి ఆ పోరాటాల్లో భూమే కీలకమైనది. అందుకే ‘దున్నే వానికే భూమి’ అప్పట్లో కమ్యూనిస్టుల కేంద్ర నినాదమైంది. ఆ పోరాటాల ద్వారా భూములను సంపాదించుకున్న కులాలు ఆర్థికంగా బలపడి వ్యాపార, వాణిజ్యాల్లోకి ప్రవేశించాయి. నేడు రాజకీయ ఆధిపత్యాన్ని గుప్పిట బంధిం చే స్థాయికి ఎదిగాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ దీనికి ప్రత్యక్ష ఉదాహరణ. కోస్తాంధ్రలో చల్లపల్లి జమీందారుకు వ్యతిరేకంగా పోరాటం నడిపిన మెజా రిటీ కమ్మ రైతాంగ సామాజిక వర్గం క్రమక్రమంగా కమ్యూనిస్టు పార్టీలను వీడింది. 1983 నాటికి స్వీయ ప్రయోజనాల కోసం తెలుగుదేశం పార్టీని స్థాపించుకుంది. అలాగే తెలంగాణలోని రెడ్డి వర్గం ప్రధానంగా కాంగ్రెస్‌లోకి వెళ్లింది. ఉత్తర భారతంలో కూడా ఇదే జరిగింది. భూస్వామ్య కులాలకు వ్యతి రేకంగా పోరాడిన శూద్ర కులాలు భూములపై, వనరులపై హక్కును సాధిం చుకున్నాయి. క్రమంగా ఆ కులాలు ప్రగతిశీల స్వభావాన్ని కోల్పోయి దోపిడీ, అణచివేత స్వభావాన్ని పెంపొందించుకున్నాయి. కర్ణాటకలో లింగాయతు లు, వక్కలిగలు కూడా ఒకనాడు జమీందార్లకు, సంస్థానాలకు వ్యతిరేకంగా పోరాడి, ఆ తర్వాత ప్రజావ్యతిరేక శిబిరంలో చేరినవారే.
 
పార్టీల నిర్మాణం కాదు కులానికి అతీతం

2,500 ఏళ్ల క్రితం నాటి బౌద్ధం సైతం వైదిక సాంప్రదాయ వ్యతిరేక ఉద్య మమే. ఆనాటి బ్రాహ్మణ వర్గం దోపిడీకి, అరాచకాలకు వ్యతిరేకంగా సాగి నదే. అయితే బ్రాహ్మణ వర్గం తన రూపాన్ని మార్చుకొని, బౌద్ధంలోని కొన్ని అంశాలను తనవిగా చేసుకొని బౌద్ధాన్ని ధ్వంసం చేసింది. అప్పటినుంచి నిరంతరాయంగా కుల వ్యతిరేక ఉద్యమాలు సాగుతూనే ఉన్నాయి. 12వ శతాబ్దంలో దక్షిణ భారతంలో వచ్చిన వీరశైవ, వీరవైష్ణవ ఉద్యమాలు నాటి రాజకీయ వ్యవస్థల పునాదులను కదిలించివేశాయి. వాటి ప్రభావం అనేక వృత్తి కులాల చైతన్యంలో కనిపిస్తాయి.  పర్యవసానంగా వృత్తి కులాలు, ఆర్థిక వ్యవస్థ కూడా అభివృద్ధి చెందాయి. తెలంగాణలోని కొన్ని కులాలు తమ పేరు చివర బ్రాహ్మణ అని తగిలించుకున్నది కూడా ఆ తర్వాతనే. ఆ ఉద్యమంలో ప్రధాన పాత్ర పోషించిన లింగాయతులు నేడు ప్రజావ్యతిరేక రాజకీయాలకు నాయకులుగా ఉన్నారు. ఒకప్పుడు ప్రగతిశీల భావాలు కలిగిన కులం, వర్గం మరొక సందర్భంలో ప్రజావ్యతిరేక స్వభావం కలిగి ఉంటుందని విస్మరించ రాదు.

రాజకీయ పార్టీలన్నీ ఆయా వర్గాల, శక్తుల ప్రయోజనాల కోసం పనిచే స్తున్నవే. అందుకే ఇప్పుడున్న సామాజిక, రాజకీయ, ఆర్థిక పరిస్థితుల్లో ఏఏ కులాలు, వర్గాలు సమూహాలు అణచివేతకు, దోపిడీకి గురవుతున్నాయో, ఏఏ కులాలు, వర్గాలు దోపిడీ వర్గాలుగా మారిపోయాయో అర్థం చేసుకోవ డం అవసరం. అప్పుడే మన దేశంలో ప్రజాస్వామ్య రాజకీయాల విజయం దేనిపై ఆధారపడి ఉంటుందో అర్థమవుతుంది. మన దేశంలో రాజకీయ పార్టీల నిర్మాణం కులాలకు అతీతంగా జరగలేదనేది తిరుగులేని చారిత్రక సత్యం. దీన్ని గుర్తిస్తేనే వ్యవస్థ సమూల మార్పునకు మార్గం సుగమం అవు తుంది. వామపక్ష ఐక్య సంఘటన రాజకీయ పార్టీల ఐక్యసంఘటనగా గాక, నిజమైన ప్రజాస్వామ్యం కోసం, దేశాన్ని ఆర్థికంగా తమ గుప్పిట్లో పెట్టుకుంటున్న కార్పొరేట్ శక్తులకు వ్యతిరేకంగా ఉద్యమించే బలమైన వామ పక్ష శక్తుల సంఘటనగా మారాలి.

పొత్తులు కాలేవు ప్రజాస్వామ్య సోపానాలు

ఎన్నికల్లో ఓట్లు, సీట్లు సంపాదించడం ప్రాతిపదికపై ఏర్పడే పొత్తులు ప్రజా స్వామ్య రాజకీయాలను, ప్రజల ఆకాంక్షలను ప్రతిబింబించలేవు. గత చరిత్ర అంతటా అదే రుజువైంది.  ఏఏ శక్తులైతే ప్రజల ఆకాంక్షల పేరుతో, అవస రాల పేరుతో భారత ఆర్థిక రంగాన్ని శాసిస్తున్న కార్పొరేట్ల కొమ్ముగాస్తు న్నాయో ఆ శక్తులన్నీ వివిధ రాజకీయ పక్షాలుగా సంఘటితమై ఉన్నాయి. తద్వారా ఆ శక్తులు కూడా తమ వాటాను తాము దక్కించుకుంటున్నాయి. అందుకోసం పేద ప్రజల ప్రయోజనాలను నిస్సిగ్గుగా తాకట్టు పెడుతు న్నాయి. ఈ  శక్తులన్నీ సామాజికంగా పై మెట్టున ఉన్న కులాలని విస్మరించ రాదు. ఈ సందర్భంగా భారత రాజ్యాంగ రచనను పరిపూర్తి చేసి, రాజ్యాంగ సభకు అందిస్తూ బాబా సాహెబ్ అంబేడ్కర్ చెప్పిన మాటలను మననం చేసుకోవడం సముచితం: ‘‘1950 జనవరి 26 నుంచి మనం ఒక వైరుధ్యం లోకి అడుగు పెడుతున్నాం. ఒక మనిషికి ఒక ఓటు అనే విలువ ద్వారా మనం రాజకీయ సమానత్వాన్ని సాధించాం. కానీ మన సమాజంలో ఆర్థిక, సామా జిక అసమానతలు కొనసాగుతూనే ఉన్నాయి. సాధ్యమైనంత త్వరలో వాటిని పరిష్కరించుకోకపోతే, మనం ఎంతో శ్రమపడి నిర్మించుకున్న ప్రజాస్వామ్య సౌధానికి ముప్పు వాటిల్లే అవకాశమున్నది. అందుకే దీనిని అత్యవసరంగా పరిష్కరించుకోవాలి.’’ కమ్యూనిస్టుల ఆశయాలకు, ఆచరణకు ప్రాతిపదిక కావాల్సినది ఇదే.
 (వ్యాసకర్త సామాజిక విశ్లేషకులు, మొబైల్: 97055 66213)
 
 మల్లెపల్లి లక్ష్మయ్య
 
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement