వివక్షకు విరుగుడు ప్రశ్నించడమే! | Mallepalli Laxmaiah Article On Caste Discrimination | Sakshi
Sakshi News home page

ప్రశ్ననే అస్త్రం.. ఎక్కుపెట్టిన ప్రశ్నారూపమే ‘జై భీమ్‌’

Published Thu, Dec 2 2021 2:43 AM | Last Updated on Tue, Dec 7 2021 1:20 PM

Mallepalli Laxmaiah Article On Caste Discrimination - Sakshi

ఎన్నిసార్లు మాట్లాడినా ఎంతోకొంత మిగిలిపోయే అంశం – కుల వివక్ష. అది దేశమంతా వేళ్లూనుకుని ఉన్న జాడ్యం. దాన్ని తెగ నరకాలంటే ఆధిపత్య కులాలు తమ ధోరణిని పరిశీలించుకోవాలి. అణిచివేతకు గురయ్యే వాళ్లు ప్రశ్ననే అస్త్రంగా మలుచుకోవాలి. అలా ఎక్కుపెట్టిన ఒక ప్రశ్నారూపమే ‘జై భీమ్‌’. అయితే విమర్శకులనూ, ప్రేక్షకులనూ ఏకరీతిలో స్పందింపజేసిన ఈ సినిమా తమిళనాడులోని ఒక వర్గాన్ని మాత్రం ఆగ్రహానికి గురిచేసింది.

నిజ జీవిత సంఘటనల ఆధారంగా తీసిన ఈ చిత్రం మీద రాజకీయంగా శక్తిమంతులైన వణ్ణియర్ల కుల సంఘం లేవనెత్తిన అభ్యంతరాల వల్ల... ఆదివాసీ ఇరుళ తెగ, ఇంకా అలాంటి సామాజిక వెలివేతకు గురవుతున్నవారి జీవితం గురించి చేయాల్సిన ఆలోచన పక్కదారి పడుతోంది.

అది కీరపాక్కం గ్రామం. తమిళనాడులోని చెంగల్‌పట్‌ జిల్లాలోని ఒక పల్లెటూరు. ఆ ఊరికి దగ్గర ఒక గుడిసెల సముదాయం. గుడిసెలపై కప్పి ఉన్న పాలిథీన్‌ కవర్లు, ప్లాస్టిక్‌ పేపర్లు వాళ్ళ కటిక దారిద్య్రాన్ని విప్పి చెబుతున్నాయి. ఆ ఇళ్ళల్లోని ఒక ఇంట్లో నాగమ్మ అనే యాభై ఐదేళ్ళ మహిళ ఉంటున్నది. ఆ గూడెం ఊరిలో భాగం కాదు. అక్కడికి వెళ్ళ డానికి రోడ్డు పెద్ద మాట, ఎటువంటి దారీ తెన్నూ లేని వారి జీవితంలానే ఉంటుంది తొవ్వ. 

ఒక రోజు కొందరు వ్యక్తులు ఏడుపులు, పెడబొబ్బలతో ఒక మనిషిని మోసుకొచ్చారు. ఆ వ్యక్తి చావుకు దగ్గరవుతున్నట్టు వాళ్ళ ఏడుపులని బట్టి అర్థం చేసుకోవచ్చు. ఆ గుంపు నాగమ్మ గుడిసె ముందు ఆగింది. నాగమ్మకు వెంటనే విషయం అర్థమైంది. మోసు కొచ్చిన వ్యక్తిని పట్టుకొని చూసింది. పాము కాటు వేసినట్టు గమనించింది. దగ్గర్లో ఉన్న పొదల్లోకి వెళ్ళి ఆకులను తీసుకొచ్చింది.

తన వద్ద ఉన్న కొన్ని వేళ్ళు, బెరడులు, ఆకుల్ని కలిపి నూరింది. పసరు పాము కాటు వేసిన చోట పిండింది. నూరిన ముద్దను గాయంపైన కట్టింది. అట్లా రెండు మూడుసార్లు చేసిన తర్వాత ఆ వ్యక్తి కళ్ళు తెరిచాడు. ఈ వైద్యం చేసింది తమిళనాడులోని ఇరుళ ఆదివాసీ తెగకు చెందిన మహిళ. తమిళనాడులో ఉన్న ప్రాచీన ఆదివాసీ తెగలలో ఇది ఒకటి.

తమిళనాడులో ముఖ్యంగా యాక్షన్‌ సినిమాల్లో రాణిస్తున్న సూర్య తీసిన ‘జై భీం’ చిత్రం ఇటీవల ఒక సంచలనాన్ని సృష్టించిన విషయం తెలిసిందే. మానవత్వం ఉన్న ప్రతి మనిషీ ఈ సినిమాను ఇష్టపడ్డారు. ఆ సినిమాలో ఒక ఆదివాసీ వ్యక్తిపై, దొంగతనం నేరం మోపి, పోలీ సులు చిత్రహింసలు పెట్టి చంపేశారు. అయితే ఇది కథ కాదు. నిజంగా జరిగింది. ఆ వ్యక్తి పేరు రాజాకన్నన్‌. ఆయన ఇరుళ తెగకు చెందిన వాడు. జై భీం చిత్రం కొందరికి కొరకరాని కొయ్యగా కూడా తయారయ్యింది.

కోడిగుడ్డుపైన ఈకలు పీకినట్టు ఏదో చేయాలని ప్రయత్నం చేశారు. కొన్ని సన్నివేశాలు, పేర్లు తమ ప్రతిష్టను దెబ్బతీశాయనీ, ఐదు కోట్ల పరువునష్టం చెల్లించాలనీ కోర్టును ఆశ్ర యించారు. వాళ్ళే వణ్ణియర్‌ కుల సంఘం పెద్దలు. ఆ కుల సంఘానికి మరో పేరు పీఎంకే. పాట్టాళి మక్కళ్‌ కట్చి. దాని నాయకుడు ఎస్‌. రామదాసు. ఆయన కూడా ఈ చిత్రంపైన విరుచుకుపడ్డారు.

వణ్ణియర్‌ కుల ప్రతిష్టకూ ఈ చిత్రానికీ ఉన్న సంబంధం ఏమిటి? నిజానికి దీనిని ఎవ్వరూ అంతగా గమనించలేదు. సినిమాలో ఒక పోలీస్‌ ఇన్‌స్పెక్టర్‌ ఉన్నాడు. ఆయన పేరు సినిమాలో గురుమూర్తి. ఆ పేరు పెట్టడమే వాళ్ళ తొలి అభ్యంతరం. గురుమూర్తి అనే పేరు వాళ్ల ఒక నాయకుడిని గుర్తు చేస్తుందన్నది వాళ్ళ వాదన. అయితే వాళ్ళ నాయకుడి పేరు జె.గురు. ఆ ఇన్‌స్పెక్టర్‌ క్రూరంగా ప్రవర్తిస్తాడు. అందువల్ల తమ నాయకుడి జ్ఞాపకాలు వస్తాయని ఆ సంఘం ఆరోపణ. జె. గురు అనే నాయకుడు రెండుసార్లు శాసనసభ్యుడు.

అరియాబారు జిల్లా, జయకొండు నియోజకవర్గం నుంచి పీఏంకే నుంచి ఎన్నికయ్యారు. ఆయనది వణ్ణియర్‌ సంఘంలో కీలక భూమిక. వీళ్లు ఉత్తర తమిళనాడులో అత్యధిక సంఖ్యలో ఉన్న బీసీ సామాజిక వర్గం. జె.గురు అనే వ్యక్తి పదుల కొద్దీ దాడుల్లో పాల్గొన్నాడనడానికి ఆయన మీద నమోదైన కేసులే సాక్ష్యం.

ఈ చిత్రంపై వణ్ణియర్‌ సంఘం చేసిన రెండో ఆరోపణ... సిని మాలో పోలీస్‌ ఇన్‌స్పెక్టర్‌ గురుమూర్తి మాట్లాడుతున్నప్పుడు ఆయన వెనుక ఒక క్యాలెండర్‌ ఉందనీ, అందులో తమ కుల చిహ్నమైన కలశం ఉన్నదనీ (దీన్ని ఇటీవల సినిమా నుంచి తొలగించారు). నిజా నికి ఈ రెండు విషయాలను ప్రేక్షకులను గమనించనే లేదు. కానీ ఈ సంఘం ఈ చిత్రాన్ని ఎందుకు టార్గెట్‌ చేసింది అంటే అందుకు తమిళనాడు కుల చరిత్రను తడిమి చూడాల్సిందే. తమిళనాడులో జరుగుతున్న కుల ఘర్షణలు, దళితుల, ఆదివాసులపైన దాడులు చాలా కిరాతకంగా ఉంటున్నాయి. ఉత్తర తమిళనాడులో వణ్ణియర్లు సామాజిక, రాజకీయ ఆధిపత్యాన్ని కలిగివున్నారు. 

వణ్ణియర్లు అధికంగా ఉన్నచోటే ఇరుళ ఆదివాసీ తెగ కూడా ఉంది. ఇరులు అత్యంత వెనుకబడిన ఆదివాసీ తెగ. ఈ తెగ దేశానికీ, సమాజానికీ ఎంతో మేలు చేసిన విషయం ఎవరికీ తెలియదు. పాము కాటుకు విరుగుడు ఇంజెక్షన్‌ తయారు చేయడానికి ప్రాథమికమైన ముడిపదార్థం పాము విషం. పామును పట్టుకొని, ప్రాణాలకు తెగించి పాము కోరల నుంచి పాము విషాన్ని తీసి ఇస్తే, దానిని వివిధ పద్ధతుల ద్వారా ప్రాసెస్‌ చేసి, విషం విరుగుడు ఇంజక్షన్‌ తయారు చేస్తారు.

అంతేకాకుండా, ఈ తెగ గొప్ప వైద్య సాంప్రదాయాన్ని ప్రకృతి నుంచి పుణికి పుచ్చుకుంది. దాదాపు 300 రకాల మందులను తయారు చేసే జ్ఞానం వీరి సొంతం. అయితే ఇప్పటికీ వీరు గ్రామాల్లో నివాసముండరు. నూటికి తొంభై మందికి చదువులేదు. సరైన జీతాలు లేని పద్ధతుల్లో, ఇటుక బట్టీల్లో, రైస్‌ మిల్లుల్లో పని చేస్తున్నారు. ఇవన్నీ పోను గ్రామాల్లో ఎక్కడ దొంగతనమైనా ముందు ఇరుళ సామాజిక వర్గం వారిని పట్టుకొచ్చి, హింసించడం తమిళనాడులో పాతుకు పోయిన కులాధిపత్యానికి తార్కాణం.

ప్రతి సంవత్సరం కొన్ని వందల కేసులు వీళ్ళ మీద నమోదవుతుంటాయి. మగ వాళ్ళ కోసం వచ్చిన పోలీసులు మహిళలను పోలీస్‌ స్టేషన్‌కి తీసుకెళ్ళి అత్యా చారాలు జరిపిన ఘటనలు కూడా ఉన్నాయి. ఇది జై భీం సినిమాలో కూడా చూశాం. ఇరుళ ఆదివాసీ హక్కుల సంఘాలు ఈ విషయాలను ఎన్నోసార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాయి. ఒకవైపు పోలీసులు, రెండో వైపు పల్లెల్లోని ఆధిపత్య కులాలు ఇరుళ తెగ ప్రజలను పెడుతున్న హింస చెప్పనలవి కానిది. 

వణ్ణియర్‌ సంఘం నాయకులు ఎటువంటి భయ సంకోచాలు లేకుండా, చట్టాలను, రాజ్యాంగాన్ని బహిరంగంగానే విమర్శిస్తున్నారు. పదేళ్ళ క్రితమే పీఏంకే అధ్యక్షుడు రామదాసు ‘కులాంతర వివాహాలను జరగనివ్వం. ఎవరైనా వణ్ణియర్‌ కులం పిల్లలతో సంబంధాలు పెట్టుకుంటే తగిన శిక్ష అనుభవిస్తారు’ అని ప్రకటించారు. ఈ సంవత్సరం, సెప్టెంబర్‌ పదవ తేదీన ఇరుళ తెగకు చెందిన రమేష్, వణ్ణియర్‌ కులానికి చెందిన మోహన ప్రేమ వివాహం చేసుకున్నారు.

ధర్మపురి జిల్లాలోని ఒక గ్రామంలో ఈ సంఘటన జరిగింది. అయితే అమ్మాయి తల్లిదండ్రులకు ఈ విషయం తెలిసి, అబ్బాయి తల్లిదండ్రులను పట్టుకొని ఊరికి తీసుకొచ్చి, అబ్బాయి తండ్రిమీద ఆ ఊరిలోని ఆ కులపోళ్ళు బహిరంగంగా మూత్రం పోసిన దారుణ ఘటన సభ్యసమాజాన్ని తలదించుకునేలా చేస్తోంది. ధర్మపురి పోలీసులు కేసు కూడా నమోదు చేశారు. అంటే జై భీం చిత్రంలో మనం చూసింది ఒక్క ఘటన మాత్రమే. ఈ చిత్రం వల్ల తాము చేసిన ఎన్నో దురంతాలు ప్రజల మెదళ్లలోకి వెళతాయని భయపడిన కులోన్మాదులు ఈ చిత్రాన్ని అడ్డుకోవాలని చూస్తున్నారు. 

నిజానికి తమిళనాడులో పంటలను దెబ్బతీస్తున్న ఎలుకలను, గ్రామాల్లో ప్రజల ప్రాణాలకు హానికరంగా మారిన పాములను పట్టుకొని తరతరాలుగా రైతులకు మిత్రులుగా ఉన్న ఇరుళ తెగ మీద జరుగుతున్న దాడులు, దౌర్జన్యాలు, హత్యలు, అత్యాచారాలు వెలుగులోకి రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రజాస్వామ్యాన్ని కాంక్షించే వాళ్ళు కుల మతోన్మాదాన్ని తుదముట్టించాలి. మానవీయతకు ప్రాణం పోయాలని తపిస్తున్న వాళ్లంతా మరొక్కసారి దళితులు, ఆదివాసీలు ఈ దేశానికీ, సమాజానికీ చేసిన నిస్వార్థమైన సేవలను, అని తరసాధ్యమైన త్యాగాలను గుర్తించాలి.


- మల్లెపల్లి లక్ష్మయ్య
సామాజిక విశ్లేషకులు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement