సంపద, పేదరికం మధ్య ‘భారతం’ | Mallepally Laxmaiah Guest Column On Economic Differences In India | Sakshi
Sakshi News home page

సంపద, పేదరికం మధ్య ‘భారతం’

Published Thu, Jan 9 2020 12:28 AM | Last Updated on Thu, Jan 9 2020 12:28 AM

Mallepally Laxmaiah Guest Column On Economic Differences In India - Sakshi

భారతదేశంలో ఆర్థిక వ్యత్యాసాలు చాలా వేగంగా పెరుగుతూ వస్తున్నాయి. రాత్రికి రాత్రే కుబేరులు అపరకుబేరుల్లా మారుతోంటే, పేదవాడు మరింత పేదరికంలోకి కూరుకుపోతున్నాడన్న నానుడి అక్షరసత్యంగా మారింది. ఒక శాతం జనాభా చేతిలో దేశంలోని 73 శాతం సంపద పోగుపడి ఉంది. 67 కోట్లమంది ప్రజల చేతిలో కేవలం ఒకే ఒక్క శాతం సంపద ఉన్నదంటే, దేశంలో ఆర్థిక అంతరాలు ఏ స్థాయిలో కొనసాగుతున్నాయో అర్థం చేసుకోవచ్చు. 2050 నాటికి భారత్‌ ప్రపంచంలోనే రెండో శక్తివంతమైన దేశంగా వృద్ధి చెందనుందని అంతర్జాతీయ నివేదికలు చెబుతున్నా... సంపన్న ఇండియా, పేదరిక భారత్‌ మధ్య గీత చెరగకపోవడం వాస్తవం. ఇటువంటి పరిస్థితుల్లోనే సోషలిజం, సామాజిక న్యాయం కోసం ఉద్యమాలు ఊపిరిపోసుకుంటాయి. అసమానతల అంతానికి ప్రజాపోరాటాలు వెల్లువెత్తుతాయి.

‘‘రాబోయే ముప్ఫై సంవత్సరాల్లో అంటే 2050 నాటికి భారతదేశం ప్రపంచంలో రెండవ శక్తివంతమైన దేశంగా అభివృద్ధి చెందుతుంది. చైనా యథా వి«ధిగా మొదటి స్థానాన్ని నిలుపుకోగా, అమెరికాను వెనక్కినెట్టి భారత్‌ ఆ స్థానాన్ని కైవసం చేసుకోబోతున్నది’’ అంటూ ప్రైస్‌ వాటర్‌ హౌస్‌ కూపర్స్‌(పీడబ్లూ్ల్యసీ) సంస్థ తన నివేదికలో ప్రకటించింది. ఇది భారతదేశ ప్రగతిని సూచిస్తున్న ప్రకటన. కొనుగోలు శక్తి సూచిక ఆధారంగా ఈ రకమైన నిర్ధారణ చేసినట్టు ఆ సంస్థ తెలియజేసింది. ఇ–7 దేశాలైన బ్రెజిల్, చైనా, ఇండియా, ఇండోనేషియా, మెక్సికో, రష్యా, టర్కీ దేశాలు సరాసరి 3.5 శాతం వార్షిక ఆర్థికాభివృద్ధి జరు గుతూ, రాబోయే 30 సంవత్సరాల్లో ప్రపంచంలోనే అగ్రగామిగా నిలబడుతాయని, అందులో ఉన్న భారతదేశం మరింతగా మున్ముం దుకు వెళ్తుందని ఆ సంస్థ అభిప్రాయపడింది. ఇప్పటికే ప్రపంచంలో ఆర్థికంగా ధనిక దేశాలనిపించుకుంటున్న జి–7 దేశాలైన కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్,యునైటెడ్‌ కింగ్‌డమ్, అమెరికాలు తమ వార్షిక ఆర్థికాభివృద్ధి 1.6 కి తగ్గిపోయి వెనుకబడిపోతాయని కూడా ఆ సంస్థ స్పష్టం చేసింది. ఇ–7 దేశాలు ప్రపంచ స్థూల జాతీయోత్పత్తిలో 50 శాతాన్ని సొంతం  చేసుకుంటాయి, అయితే జి–7 దేశాల వాటా 20 శాతానికి పడిపోతుంది. ఇటువంటి అంచ నాలు భారతదేశంలో ఉన్న మనందరికీ ఆశాజనకంగా కనిపిస్తాయి.

కానీ భారతదేశంలో ఉన్న పరిస్థితులు మనకు మరో రకంగా దర్శనమిస్తున్నాయి. ఇటువంటి నివేదికను అందించిన పీడబ్ల్యూసీ సంస్థనే మరికొన్ని ఆసక్తికర విషయాలను బయటపెట్టింది. ఈ సంద ర్భంగా రాబోయే పరిస్థితులను వివరిస్తూ, ప్రపంచంలో శాస్త్ర, సాంకే తిక రంగాల్లో వస్తోన్న మార్పులు, పెరుగుతున్న ఆర్థిక అంతరాలు, రోజురోజుకీ రెట్టింపవుతోన్న పేదరికం ఆందోళన కలిగిస్తున్నమాట వాస్తవం. అంతే కాకుండా, ఉపాధి, ఉద్యోగ రంగాల్లో భవిష్యత్‌లో రాబోతున్న పరిణామాలు ప్రపంచ స్థితిగతులను మార్చివేసే ప్రమాదమున్నదనడంలో కూడా అతిశయోక్తి లేదు. అన్నింటికన్నా ముందుగా ఆందోళన కలిగిస్తున్న విషయాలు ఆర్థిక అంతరాలు. భార తదేశంలో ఈ ఆర్థిక వ్యత్యాసాలు చాలా వేగంగా పెరుగుతూ వస్తు న్నాయి. రాత్రికి రాత్రే కుబేరులు అపరకుబేరుల్లా మారుతోంటే, పేద వాడు మరింత పేదరికంలోకి కూరుకు పోతున్నాడన్న నానుడి అక్షర సత్యంగా మారింది. 2004లో దేశంలో 12 మంది బిలియనీర్లు ఉంటే 2012కి వచ్చేసరికి 46 మంది అయ్యారు.

2017 నాటికి ఆ సంఖ్య 101కి చేరింది. కార్మికుల, ఉద్యోగుల జీతాల పెరుగుదల 2 శాతం ఉంటే, పెట్టుబడిదారుల ఆస్తుల పెరుగుదల ఆరురెట్లు అధికంగా ఉంది. 1991 నుంచి ఈ వ్యత్యాసాలు అత్యంత వేగంగా, అనూ హ్యంగా పెరుగుతూ వచ్చాయి. గత సంవత్సరం ప్రతిరెండు రోజుల కోసారి ఒక బిలియనీర్‌ పెరిగాడని ఆక్స్‌ఫామ్‌ నివేదిక వెల్లడించడాన్ని బట్టి చూస్తే ధనిక, పేదల మధ్య నెలకొన్న ఆర్థిక అగాథాన్ని అంచనా వేసుకోవచ్చు. ఇంకా ఆశ్చర్య కరమైన విషయమేమిటంటే, భారత దేశంలో ఒక శాతం జనాభా చేతిలో దేశంలోని 73 శాతం సంపద పోగుపడి ఉంది. ఇదిలా ఉంటే, 67 కోట్ల జనాభా చేతిలో కేవలం ఒకే ఒక్క శాతం సంపద ఉన్నదంటే, దేశంలో ఆర్థిక అంతరాల స్థాయిని అర్థం చేసుకోవచ్చు. 

వ్యవసాయ రంగమైతే, తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నది. ఒకవైపు వ్యవసాయం లాభదాయంగా లేదని రైతులే ఆత్మహత్యలు చేసుకుంటుంటే, రెండోవైపు వ్యవసాయంలో పెరుగుతోన్న యాంత్రీ కరణ వల్ల దాదాపు సగానికిపైగా వ్యవసాయ కార్మికులు ఉపాధిని కోల్పోతున్నారు. 1977–78లో జరిగిన 32వ నేషనల్‌ శాంపిల్‌ సర్వే ప్రకారం 89 శాతం మంది వ్యవసాయం మీద ఆధారపడి జీవిస్తుంటే, 2017–18లో జరిగిన సర్వేలో అది 55 శాతానికి పడిపోయింది. ఇది 2050 నాటికి 25.7 శాతానికి పడిపోతుందనీ అంచనా. భవిష్యత్‌లో వ్యవసాయం ఇప్పుడున్న స్థితిలో ఉంటుందనే ఆశకూడా కనపడటం లేదు. కోట్లాదిమంది రైతుల స్థానంలో పదుల మంది వ్యవసాయ పెట్టు బడిదారులు అడుగుపెట్టే అవకాశం ఉంది. కార్పొరేట్‌ వ్యవసా యంలో మనుషుల జాడ కనిపించదు, పూర్తిగా యంత్రాలమయం అయిపోతుంది. ఇప్పటికే చాలా పంటల్లో మనుషుల ప్రమేయం తగ్గి పోయింది. కూలీలు ఎక్కువగా అవసరమయ్యే వరిపంట సాగులో అన్ని దశల్లో యంత్రాలు అడుగుపెట్టాయి. వ్యవసాయ సంక్షోభం ఇలాగే కొనసాగితే, చిన్న సన్నకారు రైతులు మాయం కావడం అనివార్యం. ఆ స్థానంలో కార్పొరేట్‌లు అడుగుపెడితే భూమి మీద పనిచేసే శ్రామికులు కంటికైనా కనిపించరు.

అదేవిధంగా పారిశ్రామిక రంగంలో రోజు రోజుకీ కార్మికుల సంఖ్య తగ్గిపోతున్నది. యాంత్రీకరణ స్థానంలో మరింత ఆధుని కమైన మార్పులు చోటు చేసుకుంటున్నాయి. గతంలో వంద మంది చేసే పనిని కేవలం ఒకరు, ఇద్దరితో చేయించుకోగలుగుతున్నారు. అత్యంత ఉన్నతమైన, నైపుణ్యం కలిగిన కార్మికులు అవసరం అవు తారు. దీనితో దేశంలో నిరుద్యోగం తీవ్రస్థాయికి చేరనుంది. కంప్యూ టర్‌ రంగంలో వస్తున్న మార్పులు ముఖ్యంగా ఆటోమేషన్‌ రోబోల రూపకల్పన మరింతగా ఉద్యోగ అవకాశాలను దెబ్బతీస్తున్నది. సేవా రంగంలో వైద్యం, విద్యా రంగాల్లో కొన్ని అవకాశాలు కనిపిస్తున్న ప్పటికీ 2050 నాటికి వచ్చే మార్పులు కూడా ఉద్యోగావకాశాల మీద ప్రభావాన్ని కలిగిస్తాయి. కొత్త ఉద్యోగ అవకాశాల విషయాన్ని వది లేస్తే, 2050 నాటికి దాదాపు 70 లక్షల మందికి ఉన్న ఉద్యోగాలు కనుమరుగవుతాయని ప్రహార్‌ గ్రూప్స్‌ అధ్యయనంలో తేలింది. ప్రస్తుతం కొనసాగుతోన్న ఉద్యోగాల కల్పన చూస్తే ఆ పరిస్థితి మనకు అర్థం అవుతుంది. 2011లో తొమ్మిదిలక్షల ఉద్యోగాల కల్పన జరిగితే, 2013లో అది 4.19 లక్షలకు పడిపోయింది. 2015లో 1.35 లక్షలకు ఉపాధికల్పన క్షీణించింది. లేబర్‌ బ్యూరో సమాచారం ప్రకారం దేశంలో ప్రతి రోజూ 550 మంది ఉద్యోగాలను  కోల్పోతున్నారు.

ఇటీవల వినపడుతున్న మరో మాట ‘ఆర్టిఫిషియల్‌ ఇంటెలి జెన్స్‌’ఇది భవిష్యత్‌లో మనుషుల మనుగడకు ప్రమాదకరంగా తయారు కాబోతున్నది. శాస్త్ర సాంకేతిక రంగాల్లో వస్తున్న ఆధునిక మైన మార్పులను ఆహ్వానించాల్సిందే. కానీ మనిషి మనుగడకే ప్రమాదం ఏర్పడితే దానిని మనం ఎట్లా చూడాలి? మొత్తం ఉత్పత్తి, సర్వీసు, ఇతర రంగాలన్నింటిలో వస్తోన్న మార్పుల వల్ల మనకు అత్యంత నైపుణ్యం కలిగిన ఉద్యోగులు కావాల్సి వస్తుంది. 2050 వరకు వంద కోట్ల మంది ఉద్యోగాలు చేయగలిగే వయస్సు వాళ్ళు ఉంటారు. అందులో 30 కోట్ల మందికి మాత్రమే ఉద్యోగాల కల్పన ఉంటుందని భావిస్తున్నారు. అంటే దాదాపు 70 కోట్ల మందికి ఉద్యో గాలు దొరకని దుర్భర పరిస్థితులు అత్యంత సమీపంలో ఉన్నాయి. జనాభాలో 60 శాతానికి పైగా ఎటువంటి ఉత్పత్తిలో పాల్గొనే అవ కాశం లేదు. ఇది చాలా తీవ్రమైన సమస్య.

దీనిని పరిష్కరించడం అంత సులువు కాదు. కానీ దీనిని రాజ కీయ సమస్యగా చూస్తున్నారు. దీనికి పరిష్కారంగా వృద్ధాప్య పెన్షన్‌లు, చౌకధరలకు బియ్యం సప్లయ్‌ చేస్తున్నారు. ప్రభుత్వాలు ప్రజల నుంచి తిరుగుబాటు రాకుండా ఉండడానికి ఉచితంగా ఆహారం, విద్య, వైద్యం లాంటి అవకాశాలను కల్పిస్తారని అధ్యయ నాలు అంచనా వేస్తున్నాయి. అంటే క్రమంగా మనిషిని ఉత్పత్తి నుంచీ, శ్రమ నుంచీ బయటకులాగి నిర్వీర్యం చేయాలనీ, మొత్తంగా ఉత్పాదక రంగంనుంచి మనిషిని విడదీయాలని చూస్తున్నారు. ఇది మానవ మనుగడనే ప్రశ్నార్థకంగా మారుస్తోంది. అయితే మరొక అభి ప్రాయం కూడా బలంగా వినిపిస్తోంది. దేశ సంపదలో, అభివృద్ధిలో భాగస్వాములు కాకుండా ఉన్న 60 శాతం మంది జనాభా ప్రభు త్వాల మీద తిరుగుబాటు చేస్తారనే అభిప్రాయం కూడా ఉంది. ప్రపంచంలో ఇటువంటి అనుభవాలు చాలా ఉన్నాయి. ప్రపంచంలో ఒకనాడు అత్యంత ధనికదేశమైన రోమన్‌ సామ్రాజ్యం ప్రజల ఆకలి కేకలకు భస్మమైపోయిన చరిత్రను కొంత మంది ప్రస్తావిస్తున్నారు.  

ప్రజలందరికీ సమాన అవకాశాలూ, ప్రజాస్వామిక హక్కులే లక్ష్యంగా ఏర్పాటయ్యే పార్టీలూ, సంస్థలకు భవిష్యత్‌లో ప్రజల ఆదరణ ఉంటుంది. ఇటువంటి పరిస్థితుల్లోనే సోషలిజం, సామాజిక న్యాయం కోసం ఉద్యమాలు ఊపిరి పోసుకుంటాయి. అసమానతల అంతానికి ప్రజాపోరాటాలు వెల్లువెత్తుతాయి. ఆర్థిక సామాజిక అంత రాలూ, దోపిడీ, అవినీతి, వివక్షలతో కూడిన ఈ సమాజంలో మార్పు కోసం మూకుమ్మడిగా ప్రజలు తిరగబడే రోజొకటొస్తుంది. అక్కడ క్కడ విసిరివేయబడినట్టుగా ఉన్న ఉద్యమాలు ఒక్కుమ్మడిగా మారిన ప్పుడు వర్గసమాజం పునాదులు కదులుతాయి.

మల్లెపల్లి లక్ష్మయ్య 
వ్యాసకర్త సామాజిక విశ్లేషకులు ‘ మొబైల్‌ : 81063 22077

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement