
చాలామంది రచయితలు తమకు తోచిందేదో రాసుకుంటూ పోతారు. అలాగే చాలామంది సామాజిక కార్యకర్తలు ఏదో చేయాలనే దానితో చేసుకుంటూ పోతారు. కానీ.. అక్షరం, ఆచరణ ఒకేచోట పోతపోసినట్టు ఉండటం మహాశ్వేతాదేవి విషయంలో సాధ్యమైంది. ఆమె కుర్చీకి పరిమితమైన రచయిత కాదు. ప్రతి రచన వెనుక పరిశోధనా, కృషి ప్రతిబింబిస్తాయి. రచనా వ్యాసంగం కొనసాగిస్తూనే ఉద్యమ ప్రస్థానాన్ని సాగించారు. రచన, ఆచరణ జీవిత పర్యంతమూ జోడెడ్ల లాగా సాగిపోయాయి. ఆదిమ తెగల జీవితాలను మార్చడానికి నిర్దిష్టంగా, నిబద్ధతతో పనిచేశారు. వారికి ఒక అమ్మగా నిలిచారు. యావత్ దేశాన్ని తన సాహితీ చైతన్య స్రవంతిలో ఓలలాడించిన ఆమె అక్షరమక్షరం జనప్రేరితం.
అనుభవం, ఆవేదన, ఆలోచన, అన్వేషణ, అక్షరీకరణ, ఆచరణ ఒకేచోట పోతపోసినట్టు ఒకే మనిషిలో ఉండటం సాధారణమైన విషయం కాదు. కానీ మహా శ్వేతాదేవి విషయంలో అది సత్యసాధ్యమైంది. లక్షలాదిమంది తల్లుల పక్షాన పోరాడిన ‘ఒక తల్లి’ ఆమె. యావత్ దేశాన్ని తన సాహితీ చైతన్య స్రవంతిలో ఓలలాడించిన ఆమె అక్షరమక్షరం జనప్రేరితం. తొంభై ఏళ్ళ జీవితంలో ఆమె సాగించినది సాదాసీదా జీవనయానం కాదు. ఆమె జీవితం ఆద్యంతం ఆదివాసీల సొంతం.
మహాశ్వేతాదేవి 1926 జనవరి 14న నేటి బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో రచయితలైన మనీష్ ఘటక్, ధరిత్రీదేవి బిడ్డగా జన్మించారు. ప్రాథమిక విద్యాభ్యాసం కోసం ఢాకాలోని మాంటిస్సోరి పాఠశాలలో చేరారు. తదనంతరం వాళ్ల కుటుంబం మిడ్నాపూర్‌కు, ఆ తర్వాత కలకత్తాకు మారింది. కలకత్తాలోని శాంతినికేతన్‌లో హైస్కూల్ వరకు చదివారు. రవీంద్రనాథ్ టాగూర్ స్థాపించిన విశ్వభారతిలో బీఏ, కలకత్తా విశ్వవిద్యాలయంలో ఎంఏ చదివారు. ఆంగ్లసాహిత్యం మీద ఆమె తీసుకున్న డిగ్రీ ఆమెలోని సాహితీ జిజ్ఞాసకు అద్దం పడుతుంది.
అవార్డులు చిరుకానుకలు
వందకు పైగా నవలలు, 20 సంపుటాల కథలు ఆమె కలం నుంచి జాలువారాయి. అంతేకాకుండా సమకాలీన విషయాలపైన అనేక పత్రికలకు వ్యాసాలు రాసి, తన నిరసనను, అభిప్రాయాలను వ్యక్తపరి చారు. సాహితీ లోకానికి చేసిన సేవలకు గుర్తుగా, సామాజిక సేవకు ప్రతిఫలంగా జ్ఞానపీuŠ‡ అవార్డు, సాహిత్య అకాడమీ అవార్డు, సార్క్ లిటెరరీ అవార్డు ఆమెను వరించాయి. 2012లో నోబెల్ బహుమతికి కూడా నామినేట్ అయ్యారు. పద్మశ్రీ, పద్మవిభూషణ్, అంతర్జాతీయ సామాజిక కార్యకర్తలకు ఇచ్చే రామన్ మెగసెసె ఆమెకు చిరుకానుక లుగా మిగిలాయి.
ఆమె రచనలలో పాత్రధారులు ఆదివాసులు, మహిళలు, దళి తులు, ఇతర అణగారిన వర్గాల ప్రజలు. వారి జీవితాలను రచనలలో ప్రస్తావించి మాత్రమే ఊరుకోలేదు. ఆదివాసులకు ఒక అమ్మగా నిలిచింది. నక్సలైట్ ఉద్యమాన్ని ఆమె అక్షరీకరించిన తీరు అమోఘం. హజార్ చౌరాసీ కా మా, బషాయి టుడు ఆమెను రచయితగా మాత్రమే కాకుండా, మానవ హక్కుల ఉద్యమకార్యకర్తగా నిల బెట్టాయి. ఆ రెండింటినీ హైదరాబాద్ బుక్ ట్రస్ట్ తెలుగులో ప్రచురించింది. ఆదివాసుల మీద రాసిన ‘అటవీ హక్కులు’ పుస్తకం, ఆదివాసీ స్వాతంత్య్ర సమరయోధుడు బిర్సాముండా జీవితం ఆధా రంగా ఆదివాసుల చరిత్రను, జీవితాలను దేశానికి పరిచయం చేసింది. ఆమె మొదటి నవలగా వచ్చిన ఝాన్సీ రాణీ జీవిత చరిత్ర ఆమెను ప్రత్యేకంగా నిలబెట్టింది.
మహాశ్వేతాదేవి కుర్చీకి పరిమితమైన రచయిత కాదు. ప్రతి రచన వెనుక ఆమె పరిశోధనా, కృషి ప్రతిబింబిస్తాయి. ఝాన్సీ లక్ష్మీబాయిపై పుస్తకం రాసేందుకు ఉద్యుక్తమైనప్పుడు లక్ష్మీబాయి నివసించిన ప్రాంతం, యుద్ధం చేసిన భూమిని ప్రత్యక్షంగా దర్శించి, రచన కొన సాగించారు. ఏ రచన చేసినా క్షేత్రస్థాయిలో పరిశోధన చేయకుండా లేరు. ఆమె జీవితం, ఆచరణ, సాహిత్యం మూడూ ఒకదానికొకటి పెన వేసుకుపోయి ఉంటాయి.
ఒకవైపు రచనా వ్యాసంగం కొనసాగిస్తూనే రెండోవైపు ఉద్యమ ప్రస్థానాన్ని సాగించారు. 1942–44 మధ్యలో బెంగాల్‌ను పీడించిన కరువులో బాధితుల సహాయార్థం చేసిన కృషితో ఆమె సామాజిక చైతన్యం మొదలైంది. ఆ కరువులో మరణించిన శవాలను గుర్తించ డంలో, బతికున్న వాళ్లకు ఆహారం, నీళ్ళు అందించడంలో ఆమె సామా జిక సేవకు అంకురార్పణ జరిగింది. అప్పటికి ఆమె వయసు 16 సంవ త్సరాలే. ఆమె రచనలు ప్రారంభించింది 13 సంవత్సరాల వయ సులో. అంటే ఆమె రచన, ఆచరణ జోడెడ్ల లాగా సాగిపోయాయనడా నికి ఇవే నిదర్శనాలు.
ఆదివాసుల అమ్మ
పశ్చిమ బెంగాల్‌లోని పురులియా జిల్లాలో ఉన్న సబర్ ఆదిమ జాతి కోసం ఒక ప్రత్యేక సంస్థను ఏర్పాటు చేసి, వారికి అండదండగా నిలిచారు. ఆమెను ఆ ఆదివాసులు ఎంతో ప్రేమతో ‘సబర్స్ మదర్’ అని పిలుచుకున్నారు. ప్రభుత్వాలు, సంస్థలు ఇచ్చిన ఎన్నెన్నో అవా ర్డులకన్నా ఆదివాసుల అమ్మగా గుర్తింపబడటం ఆమెకు ఎంతో సంతో షాన్ని, సంతృప్తిని మిగిల్చాయి. ‘‘నేను రాసిన అరణ్యేర్ అధికార్ పుస్తకం నన్ను ఆదివాసులకు దగ్గర చేసింది. ఆదివాసుల నాయకుడు చేసిన తిరుగుబాటు దీని ఇతివృత్తం. దీనికి సాహిత్య అకాడమీ అవార్డు కూడా వచ్చింది. ఆదివాసుల తిరుగుబాట్లు, పోరాటాలు చరిత్రలో తగిన స్థానాన్ని పొందలేదు. మొదటిసారి ఇటువంటి విషయాలు సమాజంలోని ఇతర వర్గాలకు అందాయి’’ అంటూ మహాశ్వేతాదేవి ఆదివాసులకు ఒక ఆత్మీయురాలిగా ఎలా మారిందో వెల్లడించారు.
ఇక్కడ ఇంకో విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి. చాలామంది రచయితలు, సామాజిక కార్యకర్తలు తమ పనిలో ఫలితాలను చూడరు. ఏదో చేయాలనే దానితో చేసుకుంటూ పోతారు. మహా శ్వేతాదేవి పురులియా జిల్లాలోని సబర్ (సవర) ఆదిమ తెగల జీవి తాలను మార్చడానికి నిర్దిష్టంగా, నిబద్ధతతో పనిచేశారు. అందుకోసం పశ్చిమ బెంగాల్ బరావో సంక్షేమ సంఘాన్ని స్థాపించారు. సబర్ ఆదిమ తెగను బరావో అని కూడా పిలుస్తారు. అంతేకాకుండా, ఆదిమ తెగల ఐక్య సంస్థలను కూడా ఆమె ప్రారంభించారు. ఆదిమ తెగల్లో సబర తెగకు నేరపూరితమైన జాతిగా ముద్రపడింది. బ్రిటిష్ కాలంలో వారిని క్రిమినల్ ట్రయిబ్స్‌గా వర్గీకరించారు. సబర్ తెగ వేటమీద, ఆహార సేకరణ మీద ఆధారపడి జీవించే వాళ్ళు.
వ్యవసాయం, ఇతర వృత్తులు తెలియవు. బ్రిటిష్ వాళ్ళు అటవీ సంపదను దోచుకోవడానికి అన్ని ఆదిమ తెగలలాగానే వీళ్ళను కూడా అడవి నుంచి గెంటివేశారు. అంతేకాకుండా వీరిని దొంగలుగా, దోపిడీదారులుగా, హంతకులుగా ముద్ర వేశారు. దీనితో సమాజంలో వీరిని చిన్నచూపు చూడటం మొద లైంది. అటువంటి దయనీయ స్థితిలో, వివక్షకు, ద్వేషానికి గురవు తున్న సబర్ తెగ జీవన విధానంలో వెలుగు నింపడానికి మహాశ్వేతా దేవి నడుం కట్టారు. తనతో పాటు ఎంతో మందిని సమీకరించారు. ఉద్యోగులు, ఇతన మేధావులు ఆమె కృషికి అండగా నిలిచారు. ఈ మహత్తర కార్యక్రమంలో తమ వంతు ఆర్థికసాయాన్ని అందించి కోల్‌కత రెడ్‌లైట్ ఏరియా సెక్స్ వర్కర్లు తోడ్పడటం మరింత విశేషం.
పార్టీలు ముఖ్యం కాదు
మహాశ్వేతాదేవి భావజాలం రీత్యా కమ్యూనిస్టు. ఆమె మొదటి పోస్ట్ టెలిగ్రఫీ ఉద్యోగం. కానీ కమ్యూనిస్టు అనే కారణంతో ఆ ఉద్యోగం పోయింది. 1967లో ప్రారంభమైన నక్సలైట్ ఉద్యమం ఆమె సంఘీ భావాన్ని నక్సలైట్ భావాలవైపు మళ్ళేలా చేసింది. పశ్చిమ బెంగాల్‌లో జరిగిన భూసంస్కరణలు కేవలం ధనిక రైతులకే ఉపయోగపడ్డాయ నేది ఆమె అభిప్రాయం. అయితే నక్సలైట్ ఉద్యమంలో అన్ని విష యాలను తాను సమర్థించడం లేదని కూడా ఆమె ప్రకటించారు. అదేవిధంగా 2006 సంవత్సరంలో ఆనాటి పశ్చిమ బెంగాల్ వామపక్ష ప్రభుత్వం టాటా కంపెనీ కోసం రైతుల వద్ద పచ్చని పొలాలు స్వాధీనం చేసుకోవాలని తీసుకున్న నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిం చారు. ఆ నిర్ణయానికి వ్యతిరేకంగా ఉద్యమంలో భాగస్వాముల య్యారు. ఎంతో మంది రచయితలను, కళాకారులను సమీకరించారు. ఒకరకంగా వామపక్ష ప్రభుత్వం అధికారం కోల్పోవడానికి ఈ సంఘ టన ఒక కారణమైంది. ఆమెకు ప్రజలు, ప్రజల సంక్షేమమే ప్రధానం గానీ పార్టీలు, సంస్థలు కాదని ఈ సంఘటన రుజువు చేస్తున్నది.
2016 జూలై 28న తుదిశ్వాస విడిచేవరకు ఆమె నిత్యం ప్రజల శ్వాసగా బతికారు. ఆమె రచనలు బెంగాలీనుంచి ఇంగ్లిష్, జపనీస్‌తో పాటు దేశంలోని అన్ని భాషలలోకి అనువాదం అయ్యాయి. ముఖ్యంగా స్త్రీవాద రచయితలకు ఆమె ఒక మార్గదర్శిగా నిలిచారు. ఆమె మహిళా జీవితాల గురించి రాసిన రుడాలి, ఛోళీ కే పీచే, ద్రౌపది లాంటి రచనలు ఎందరినో ఉత్తేజపరిచాయి. ఒక మహిళగా తన జీవితాన్ని అడవి బిడ్డలకోసం అర్పించడం ఎందరినో ఉత్తేజపరిచింది. వ్యక్తి్తగత జీవితంకన్నా ఆమె తన సామాజిక కార్యాచరణకే ఎక్కువ ప్రాధాన్యతను ఇచ్చిందనేది వాస్తవం. తొంభై ఏళ్ళు మన మధ్య జీవిం చిన మహాశ్వేతాదేవి, ఈ దేశంలో సామాజిక అసమానతలు ఉన్నంత కాలం ఆమె చైతన్యం మనల్ని వెన్నంటే నడిపిస్తుంది.
మల్లెపల్లి లక్ష్మయ్య
(నేడు మహాశ్వేతాదేవి 94వ జయంతి)
వ్యాసకర్త సామాజిక విశ్లేషకులు
మొబైల్ : 81063 22077
Comments
Please login to add a commentAdd a comment