
‘‘నైపుణ్యంతో కూడిన శక్తితో వ్యక్తులు, సమూహాలు, దేశాలు ప్రగతి పథంలో సుసంపన్నమైన భవిష్యత్తువైపు మరింత ముందుకెళతాయని విశ్వసిస్తున్నాం’’ అని ఐక్యరాజ్య సమితి 2014, నవంబర్‌లో ప్రకటించింది. ఆ సమయంలో జరిగిన జనరల్ అసెంబ్లీలో ప్రతి సంవత్సరం జూలై 15వ తేదీని ‘ప్రపంచ యువ నైపుణ్య దినోత్సవం’గా జరపాలని కూడా తీర్మానించింది. నిరుద్యోగాన్ని, ఉపాధి సమస్యలను అధిగ మించి, సామాజిక, ఆర్థిక అభివృద్ధి వైపు యువత అడుగులు వేయ డానికి, నైపుణ్య శిక్షణ చాలా అవసరమని గుర్తించారు. అప్పటి నుంచి ప్రతియేటా ఐక్యరాజ్య సమితితో పాటు సభ్య దేశాలన్నీ ఈ రోజుని ప్రపంచ యువ నైపుణ్య దినోత్సవంగా నిర్వహిస్తున్నాయి.
ఐక్యరాజ్య సమితి ఆశించిన విధంగా పరిస్థితుల్లో మార్పులు రావడం లేదు. ముఖ్యంగా అభివృద్ధి చెందుతున్న దేశాలు, వెనుకబడిన దేశాల్లోని యువతరం ఈ నాటికే నైపుణ్యానికి ఆమడ దూరంలో ఆగిపోయింది. ఇటీవల ‘ఐక్యరాజ్య సమితి బాలలనిధి’ (యూనిసెఫ్), గ్లోబల్ బిజినెస్ కో ఎవల్యూషన్ ఫర్ ఎడ్యుకేషన్ (జీబీసీఈ) సంస్థలు సంయుక్తంగా దక్షిణాసియా దేశాల్లో నిర్వహించిన సర్వేలో కొన్ని నిరా శాజనకమైన విషయాలు వెలుగులోకొచ్చాయి. రాబోయే పదిసంవత్స రాల్లో అంటే 2030 నాటికి భారతదేశంలోని యాభైశాతం యువత ఉద్యోగాలకు సరిపోయే విద్య, నైపుణ్యాలను అందుకోలేరని ఆ సర్వే తేల్చి చెప్పింది. అంటే వీరంతా పరిస్థితులకు అనుగుణమైన నైపు ణ్యాన్ని అందుకోలేక ఉద్యోగాలకు దూరమవుతారన్నమాట. వీరెవరికీ 21వ శతాబ్ది ఉద్యోగరంగంలో కావాల్సిన నైపుణ్యాలు లేవు. 2040 నాటికి దక్షిణాసియా నుంచి 180 కోట్ల మంది పాతికేళ్ళు నిండని యువత కార్మిక రంగంలోకి అడుగుపెట్టబోతున్నారు.
ఆ సంఖ్యలో తొంబై శాతానికి పైగా మన దేశానికి చెందిన యువ తరమే ఉండనున్నారన్నది ఒక వాస్తవం. అయితే రోజు రోజుకీ పెరిగే శాస్త్ర, సాంకేతిక ప్రగతి కార్మికులు, ఉద్యోగులు, ఇతర వృత్తి వర్గాల నుంచి ఎంతో నైపుణ్యాన్ని ఆశిస్తున్నది. గతంలో లాగా శారీరక శ్రమ ద్వారా జరిగే ఉత్పత్తి, నిర్మాణ, ఇతర అంశాలేవీ భవిష్యత్‌లో కనిపిం చవు. ఇప్పటికీ మన దేశంలో నైపుణ్యం కలిగిన కార్మికులు, ఉద్యోగులు చాలా తక్కువ. వృత్తి విద్య లాంటి ఇంజనీరింగ్ విద్యనభ్యసించిన యువతీ యువకుల్లో ప్రతి నలుగురిలో ఒకరు మాత్రమే నైపుణ్యం కలిగి ఉన్నారు. ఇక సాధారణ డిగ్రీలు పొందిన వాళ్ళలో ప్రతి పది మందిలో ఒకరు మాత్రమే ఉద్యోగ అర్హత కలిగి ఉన్నారు. మనకు సమీ పంలో ఉన్న చైనా, జపాన్, దక్షిణ కొరియా లాంటి దేశాల్లో నైపుణ్యం కలిగిన యువతీయువకుల సంఖ్య చాలా ఎక్కువ. ఈ దేశాల్లో తొంభైశాతం వరకు నిపుణులైన కార్మికులు, ఉద్యోగులున్నట్టు లెక్కలు చెబుతున్నాయి. అది మన దేశంలో చాలా తక్కువ. అందువల్లనే ఈ దేశాలు వస్తూత్పత్తి, ఆటోమొబైల్ రంగాల్లో గణనీయమైన ప్రగతిని సాధించాయి. జపాన్ సాంకేతిక విజ్ఞానంతో తయారైన కార్లు మన దేశంలోని మార్కెట్‌లో అత్యధిక భాగాన్ని ఆక్రమించుకున్న విషయం తెలిసిందే. కొరియా సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందిన ఎలక్ట్రిక్, ఎల క్ట్రానిక్ వస్తువులు అందరి ఇళ్ళలోనూ, ప్రపంచవ్యాప్తంగా అత్యధిక మంది చేతుల్లో దర్శనమిస్తున్నాయంటే అతిశయోక్తి కాదు.
అంతేకాకుండా, ఇక ఎంతమాత్రం పాత తరహాలో ఆర్థిక రంగం మనుగడ సాగించలేని స్థితి వచ్చింది. ఇంతకుముందు పేర్కొన్న జీబీసీఈ సంస్థ మరొక అధ్యయన నివేదికను రూపొందించింది. ‘ప్రిపేరింగ్ టుమారోస్ వర్క్ ఫోర్స్ ఫర్ ది ఫోర్త్ ఇండస్ట్రియల్ రివ ల్యూషన్’ పేరుతో రూపొందిన ఈ నివేదిక ఇప్పటికి మూడు పారి శ్రామిక విప్లవాలు వచ్చాయనీ, నాల్గవ పారిశ్రామిక విప్లవంలోకి అడుగుపెట్టామనీ ప్రకటించింది. అంటే గత మూడు పారిశ్రామిక విప్లవాలలో ఉన్న నైపుణ్యాలన్నీ మార్పు చెందుతాయని, అందుకు అనుగుణంగా ప్రస్తుత యువత మారాలని ఆ నివేదిక స్పష్టం చేసింది.
మొదటి పారిశ్రామిక విప్లవంలో యాంత్రీకరణ, ఆవిరి యంత్రాల ప్రభావం, రెండవ పారిశ్రామిక విప్లవంలో భారీ లాభాల రూపకల్పన అంచనాలను తలదన్నే ఉత్పత్తి, మూడవ పారిశ్రామిక విప్లవంలో ఇంటర్నెట్ సాంకేతిక పరిజ్ఞానం, పునరుత్పాదక శక్తి, సమాచార రంగంలో వచ్చిన పెనుమార్పులున్నాయని ఆ నివేదిక తెలియజేసింది. అయితే, నాలుగవ పారిశ్రామిక విప్లవంలో వాటన్నింటినీ జీర్ణించుకొని రోబోటిక్స్, కృత్రిమ మేధో పరిజ్ఞానం, డిజిటలైజే షన్, ఆటోమేషన్ నైపుణ్యాలు ప్రధాన పాత్ర వహించబోతున్నాయి. దానికిఅనుగుణంగానే అన్ని రంగాల్లో ఉన్న ఉద్యోగ, వృత్తి, స్వభావాలే మారిపోతున్నాయి. ఇటీవల చాలా జాతీయ, అంతర్జాతీయ సంస్థలు భవిష్యత్తులో మనుగడ సాగించే వృత్తులు, విద్యా కోర్సులు ఏవి ఉండ బోతున్నాయనే విషయాన్ని అంచనా వేశారు.
ఇంటర్నెట్, కంప్యూటర్ రంగంలో దాదాపు 20 వృత్తులను గుర్తిం చారు. అందులో క్లౌడ్ కంప్యూటరింగ్, యుఎక్స్ డిజైన్ డిజిటల్ జర్న లిజం లాంటి వాటికి భవిష్యత్తు ఉండనున్నట్టు వెల్లడయ్యింది. వ్యవ సాయ రంగంలోనూ, వ్యవసాయ పరిశోధన, ఫీల్డ్ ఆఫీసర్, బయో కెమిస్ట్, క్రాప్ సైన్స్ మేనేజర్, అగ్రికల్చరల్ ఎడ్యుకేటర్ ఉద్యోగాలకు డిమాండ్ ఉండబోతున్నది. అట్లాగే హెల్త్ కేర్‌లో నర్స్‌లకు, ఫిజికల్ థెరఫిస్ట్‌లకు, రెస్పిరేటరీ థెరపిస్ట్, మసాజ్ థెరపిస్ట్, డాక్టర్ లేని సమ యంలో చూసే మెడికల్ అసిస్టెంట్‌లకు అవకాశాలు ఉండబోతు న్నాయి. ఉత్పత్తి రంగంలో కూడా చాలా మార్పులు రాబోతున్నాయి. ఎక్కువగా ఆటో మేషన్ వైపు వస్తూత్పత్తి రంగం ప్రయాణించే అవకా శాలు మెండుగా ఉన్నాయి. అయితే కొన్ని ఉద్యోగాలు మనకు భవి ష్యత్తులో కనుమరుగయ్యే అవకాశాలూ కోకొల్లలు. అందులో మొదట వచ్చేది డ్రైవర్లు, కొరియర్, క్లర్క్‌లు, పైలట్స్, లైబ్రేరియన్‌లు ఇంకా కొన్ని మాయమైపోవడం స్పష్టమౌతోంది.
ఈ పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వాలు, విద్యా నిర్ణే తలు, ఆర్థిక నిపుణులు, రాజకీయ నాయకులు దేశ భవిష్యత్ కోసం యువతను నైపుణ్యం వైపు నడిపించడానికి సిద్ధం కావాలి. అయితే కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తోన్న స్కిల్ డెవలప్‌మెంట్ శిక్షణ ఒక తంతులాగా సాగుతున్నది. అందులో సాధించిన ఫలితాలు పాక్షికమే. అందుకే దీనిని పూర్తిగా సమీక్షించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గవర్నర్‌గా పనిచేసిన ప్రముఖ ఆర్థిక వేత్త.సి.రంగరాజన్ ఇటీవల ఒక సభలో మాట్లాడుతూ ‘నైపుణ్య శిక్షణ పాఠశాలలకు, కళాశాలలకు బయట జరగాల్సిందే. కానీ అది సరి పోదు. అది చేయిదాటిపోయినా దానిని సరిచేసుకోవడమే కానీ నిజంగా మన దేశం స్కిల్ ఇండియా కావాలంటే, నైపుణ్య శిక్షణ చదు వులో భాగం కావాలి. పాఠ్యాంశాలలోనే, అంటే పాఠశాల, కళాశాల చదువులోనే నైపుణ్య శిక్షణను భాగం చేయాలి’ అని సూచించారు.
చదువు ముగిసిన తర్వాత యువతీయువకులకు ఉద్యోగం కావాలని, స్థిరపడాలన్న తపన ఉంటుంది. అంతే తప్ప మళ్ళీ ఒక శిక్షణ నేర్చుకోవాలనే ఆసక్తి, జిజ్ఞాస తగ్గిపోతుంది. ఇది పాలకులకు అర్థం కావాలి. దాదాపు ఇరవై కోట్ల మంది డిగ్రీలు పుచ్చుకొని నడి వీధుల్లో ఉన్నారు. వాళ్ళందరికీ ఉద్యోగాలు కావాలి. కానీ తగిన నైపుణ్యం వారికి లేదు. దేశంలో వనరులున్నాయి. వాటిని అభివృద్ధి చేసుకునే నైపుణ్యం లేదు. ఇది వైరుధ్యం. దీనిని పరిష్కారం చేయ కుంటే, ఇంతకుముందు నాలుగవ పారిశ్రామిక విప్లవం స్థానంలో, ఎవ్వరూ ఊహించని అసంతృప్తి సెగలు యావత్ సమా జాన్ని చుట్టు ముట్టడం ఖాయం. ఉద్యోగం, ఉపాధి కరువైన కోట్లాది మంది తిండీ తిప్పలు లేకుండా మనుగడే ప్రశ్నార్థకంగా మారే స్థితి వస్తే, ఆ పరిస్థి తులు ఎలా ఉంటాయో ఊహించడం పెద్ద కష్టమేమీ కాదు.
మల్లెపల్లి లక్ష్మయ్య
వ్యాసకర్త సామాజిక విశ్లేషకులు
మొబైల్ : 81063 22077
(నేడు ప్రపంచ యువత నైపుణ్య దినోత్సవం)
Comments
Please login to add a commentAdd a comment