నైపుణ్యమే నేటి అవసరం | skilled youth required now a days | Sakshi
Sakshi News home page

నైపుణ్యమే నేటి అవసరం

Published Thu, Jun 2 2016 12:36 AM | Last Updated on Mon, Oct 8 2018 9:06 PM

నైపుణ్యమే నేటి అవసరం - Sakshi

నైపుణ్యమే నేటి అవసరం

కొత్త కోణం
తెలంగాణ ప్రభుత్వం సాగిస్తున్న రిక్రూట్‌మెంట్‌లో కనీసం ఒక్క శాతమైనా ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం చేపట్టడంలేదు. రాష్ట్రం విడిపోయి రెండు సంవత్సరాలు దాటిన తరువాత కూడా ఒక్క నోటిఫికేషన్‌ రాలేదు. ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగ యువత దాదాపు కోటి అని అంచనా. ఈ జనాభాను ఏవిధమైన ఉపాధిరంగంలోకి తీసుకెళతారన్నది అక్కడి ప్రభుత్వం ఎక్కడా స్పష్టం చేయలేదు. తెలుగుదేశం ఎన్నికల ప్రచారంలో ‘‘జాబు రావాలంటే, బాబు రావాలి’’ అన్న నినాదాన్నిచ్చారు. బాబు వచ్చాడు కానీ జాబు మాత్రం రాలేదు.

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర నూతన రాజధానిగా అమరావతి నిర్మాణం, అభివృద్ధి అక్కడి బీదా బిక్కీ వేలాదిమందిని నిర్వాసితులను చేసింది. ఎందరో వ్యవసాయ కూలీలు, కార్మికులు, వారి కుటుంబాలు దిక్కులేని వారయ్యారు. అలా కొలువూ, నెలవూ కోల్పోయిన 15 వేల మందికి వివిధ వృత్తుల్లో నైపుణ్యం అందించి, ఉపాధి కల్పించి, ఆయా కుటుంబాలను ఆదుకునేందుకు ఆంధ్రప్రదేశ్‌ అధికారులు ఒక పథకాన్ని రూపొందించారు. దీని పనితీరును గమనించిన తరువాత మిగతా జాల్లాలకు విస్తరింపజేయాలని నిర్ణయిం చారు. కానీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు దీనిని వ్యతిరేకించారు. అయితే వివిధ జిల్లాల్లో స్కిల్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించారు. వాటి పనితీరు సంతృప్తికరంగా లేదు.

యువత గురించి ఏవీ ప్రణాళికలు?
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ విడిపోయి రెండేళ్లు గడిచాయి. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్నాయి. కానీ జనాభాలో 40 శాతంగా ఉన్న యువతరం భవిష్యత్‌ మాత్రం త్రిశంకు స్వర్గంలోనే ఉంది. తెలంగాణ రాష్ట్రం కోసం జరిగిన పోరాటంలో యువత, విద్యార్థిలోకం పాత్ర కీలకమైనది. నీళ్లు, నిధులు, నియామకాలు ఉద్యమ ప్రాథమిక నినాదాలు కూడా. ఇందులో ఎక్కువమందిని ఉద్యమంలో భాగస్వాములను చేసినది నియామకాలే. తరత రాలుగా తాము కోల్పోయిందేదో కొత్త రాష్ట్రం తెచ్చిస్తుందని ఆశించారు. నూతన ప్రభుత్వం వెంటనే తెలంగాణ రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ను ఏర్పాటు చేసి ఉద్యోగాల కల్పనకు శ్రీకారం చుట్టింది. పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌ విభాగం, విద్యుత్‌ విభాగాలు విడివిడిగా నియామకాలు చేపట్టాయి. ఇప్పటికి 15 వేల నుంచి 20 వేల వరకు నియామకాలకు ప్రక్రియ కొనసాగుతున్నది. ఒకవేళ ప్రభుత్వం ఇదే పద్ధతిలో తన విధానాన్ని కొనసాగించి మిగిలిన ఖాళీలను భర్తీ చేస్తే అనుకున్న ఫలితాలు సాధించవచ్చు.

ప్రభుత్వం ఏర్పడిన కొత్తలో తెలంగాణలో లక్షా ఏడువేల ఖాళీలున్నట్టు ప్రకటించింది. అంటే ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉంటే లక్ష ఉద్యోగాలు వస్తాయి. కానీ అన్ని ఉద్యోగాలు లేవనే వాదన ఉన్నది. గరిష్టంగా లక్ష ఉద్యోగాలూ వస్తాయను కుందాం. తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ వెబ్‌సైట్‌లో వన్‌టైం రిజిస్టర్‌ చేసుకున్న ఉద్యోగార్థుల సంఖ్య దాదాపు 11 లక్షల యాభైవేలు. అంటే ప్రభుత్వం మొత్తం ఖాళీలను భర్తీ చేసినా ఇంకా మిగిలేది, రిజిస్టర్‌ చేసుకున్న గ్రాడ్యుయేషన్‌ ఆపై చదివిన వాళ్లు దాదాపు పది లక్షల యాభైవేలు. వీరి పరిస్థితి ఏమిటి? వీళ్లే కాదు, జనాభాలో యువకులు 40 శాతం. ఇందులో సగం మంది చదువుకుంటున్నవారనుకుంటే, మిగతా 20 శాతం అంటే నాలుగు కోట్ల జనాభాలో 80 లక్షలు ఉంటారు. వీళ్లలో లక్ష మందికి మాత్రమే ఉద్యోగాలు వస్తే, ఇంకా 79 లక్షలమంది నిరుద్యోగులుగానే ఉంటారు. తెలంగాణ ప్రభుత్వానికిది సవాల్‌.

తెలంగాణ ప్రభుత్వం సాగిస్తున్న రిక్రూట్‌మెంట్‌లో కనీసం ఒక్క శాతమైనా ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం చేపట్టడంలేదు. రాష్ట్రం విడిపోయి రెండు సంవత్సరాలు దాటిన తరువాత కూడా ఒక్క నోటిఫికేషన్‌ రాలేదు. ఆంధ్ర ప్రదేశ్‌లో నిరుద్యోగ యువత దాదాపు కోటి అని అంచనా. ఈ జనాభాను ఏవిధమైన ఉపాధిరంగంలోకి తీసుకెళతారన్నది అక్కడి ప్రభుత్వం ఎక్కడా స్పష్టం చేయలేదు. తెలుగుదేశం ఎన్నికల ప్రచారంలో ‘‘జాబు రావాలంటే, బాబు రావాలి’’ అన్న నినాదాన్నిచ్చారు. బాబు వచ్చాడు కానీ జాబు మాత్రం రాలేదన్న వాస్తవం యువతరంలో అసంతృప్తిని నింపింది. సామాజి కాభివృద్ధిలో మానవ వనరుల వినియోగం, వారి అభివృద్ధి ముఖ్యమైనది. జాతీయ స్థూలాదాయం పెరుగుదల అంకెలను చూపెట్టి దేశ ప్రగతి, రాష్ట్రాల ప్రగతిని కొలిస్తే ప్రయోజనం లేదు. ఒకటి వాస్తవం: భవిష్యత్‌ ఉపాధి కల్పన అంతా నైపుణ్యం ఆధారంగానే ఉంటుంది.

గ్రామాలూ, పట్టణాలూ ఒకటే
ఇటీవల కేంద్ర కార్మిక, ఉపాధి, మంత్రిత్వ శాఖ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో ఉన్న ఉద్యోగ, ఉపాధి పరిస్థితులపై ఒక సర్వే నిర్వహించింది. ఇందులో తెలంగాణ రాష్ట్రానికొస్తే గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతివంద మందిలో 49 శాతం మంది అంటే దాదాపు అర్థభాగం, నగరాల్లో అయితే 37 శాతం స్వయంఉపాధిలో ఉన్నారు. అరకొరగా పనులు చేస్తున్న వాళ్లు గ్రామీణ ప్రాంతాల్లో 42 శాతం, పట్టణాల్లో 17.1 శాతం ఉన్నారు. కాంట్రాక్టు తరహా ఉద్యోగాల్లో గ్రామీణ ప్రాంతాల్లో 1.6 శాతం, పట్టణాల్లో 5.7 శాతం మంది ఉన్నారు. భద్రత కలిగి, భరోసా కలిగిన వేతన జీవులు గ్రామీణ ప్రాంతాల్లో 7.3 శాతం ఉండగా, పట్టణాల్లో 39.8 శాతం ఉన్నారు.

ఆంధ్రప్రదేశ్‌లో స్వయంఉపాధి పొందుతున్న వారు, గ్రామీణ ప్రాంతాల్లో 36.7 శాతం, పట్టణాల్లో 40.2 శాతం ఉన్నారు. చిన్నాచితకా పనులు చేస్తున్న వాళ్లు 54.7శాతం గ్రామాల్లో 27.3 శాతం పట్టణాల్లో ఉన్నారు. కాంట్రాక్టు ఉద్యోగాలు చేస్తున్న వాళ్లు గ్రామాల్లో 1.1 శాతం, పట్టణాల్లో 3.3 శాతం ఉండగా, వేతనాలు పొందుతున్న వాళ్లు గ్రామాల్లో 7.1 శాతం, పట్టణాల్లో 28.1 శాతం ఉన్నారు. గణాంకాల ప్రకారం గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి భద్రత లేదని తెలుస్తున్నది. పట్టణాల్లో కూడా ఉపాధి, ఉద్యోగాలు ప్రధాన సమస్యగానే ఉన్నది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో్ల ఉద్యోగ, ఉపాధి పరిస్థితులు గమనిస్తే మనం ఏ స్థితిలో ఉన్నామో అర్థం కాగలదు. మొదటగా తెలంగాణలో చూస్తే, ప్రభుత్వం కానీ, ప్రైవేట్‌లో కానీ వేతనాలు పొందుతున్న వాళ్లు గ్రామీణ ప్రాంతాల్లో 8.9 శాతం మంది మాత్రమే. క్యాజువల్‌ లేబర్‌గా పనిచేస్తున్న వాళ్లు 42 శాతంగా ఉన్నట్టు ఆ నివేదిక పేర్కొన్నది. అంటే 42 శాతం మంది ఎటువంటి భద్రతలేని జీవితాలు గడుపుతున్నారు. పట్టణాల్లో ప్రభుత్వ, ప్రైవేట్‌ రంగాల్లో పనిచే స్తున్న వాళ్లు 45.5 శాతం. ఇక్కడ క్యాజువల్‌ లేబర్‌ 17.1 శాతం.

ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వం, ప్రైవేట్‌ రంగాల్లో వేతనజీవులు 8.5 శాతం మంది ఉంటే క్యాజువల్‌ లేబర్‌ 54.7 శాతం మంది ఉన్నారు. పట్టణాల్లో వేతనజీవులు 32.5 శాతం మంది. క్యాజువల్‌ లేబర్‌ 27.3 శాతం మంది ఉన్నారు. తెలంగాణతో పోలిస్తే పట్టణాల్లో ఆంధ్రప్రదేశ్‌ క్యాజువల్‌ లేబర్‌ 10 శాతం ఎక్కువ. గ్రామీణ ప్రాంతాల్లో నిరుద్యోగ సమస్య రెండు రాష్ట్రాల్లో చాలా ప్రమాదకర స్థాయిలో ఉన్నది. పట్టణాల్లో కూడా తక్కువేమీ కాదు. రెండు రాష్ట్రాల్లో స్వయం ఉపాధి మీద ఆధారపడిన వాళ్ల సంఖ్య చాలా ఎక్కువ. తెలంగాణలో గ్రామాల్లో 49 శాతం, పట్టణాల్లో 37.3 శాతం ఉంటే ఆంధ్రప్రదేశ్‌లో గ్రామీణ ప్రాంతాల్లో 36.7 శాతం, పట్టణ ప్రాంతాల్లో 40.2 శాతం ఉన్నారు. గ్రామాల్లో స్వయం ఉపాధి వ్యవసాయమనే చెప్పుకోవాలి. కానీ వ్యవసాయం సంక్షోభంలో ఉన్నది. పట్టణాల్లో చిన్న చిన్న వ్యాపారుల స్థితి కూడా అదే. పెరుగుతున్న భారీ మార్కెట్లు వారిని మింగుతున్నాయి. అంటే మొత్తంగా భద్రత కలిగిన వేతనాలు పొందుతున్న పది శాతం మినహా, మిగతా 90 శాతం అభద్రతలోనే జీవిస్తున్నారని లెక్కలు చెబుతున్నాయి.

నిపుణుల కొరతే సమస్య
ఈ పరిస్థితికి ఒక ప్రధాన కారణం నేటి యువకులలో నైపుణ్యం కొరవడటమే. ఇటీవల వ్యాపార, పారిశ్రామిక సంఘం ‘ఫిక్కి’ నిర్వహించిన సర్వేలో కొన్ని ఆసక్తికరమైన విషయాలు బయటపడ్డాయి. రెండు రాష్ట్రాల్లో 2012 – 17 సంవత్సరాల మధ్య 41.41 లక్షలమంది నిపుణుల అవసరం ఉండగా, కేవలం 2.85 లక్షల మంది అందుబాటులో ఉంటారని అంచనా. పరిమిత నైపుణ్యం కలిగిన వాళ్ళు 11.61 లక్షల మంది అవసరం ఉండగా, 2.25 లక్షల మంది మాత్రమే అందుబాటులో ఉంటారని కూడా ‘ఫిక్కి’ సర్వేలో వెల్లడైంది. అరకొర నైపుణ్యం కలిగిన వాళ్లకు సంబంధించి 9.75 లక్షల ఖాళీలుంటే, అందులో 32.87 శాతం మంది అర్హులే ఉంటారని భావిస్తు న్నారు. మిగతా లక్షలాది మంది నైపుణ్యం లేని యువతను సమాజం భరిం చాల్సి ఉంది. 2017–22 మధ్య 23.75 మంది నిపుణులు అవసరమవు తుండగా 1.25 లక్షల మంది మాత్రమే లభ్యం అవుతున్నారు. 13.80 లక్షల మంది పరిమిత నైపుణ్యం కలిగిన వాళ్ల అవసరం ఉండగా కేవలం 3.82 లక్షల మంది లభ్యమవుతున్నారని అంచనా. 10.03 లక్షల మంది అరకొర నైపుణ్యం కలిగిన వాళ్లు అవసరముంటే, 3.67 లక్షల మంది మాత్రమే అందుబాటులో ఉంటారు. ఎలాంటి నైపుణ్యంలేని లక్షల మంది నిరుద్యోగ సేనలో భాగం కాబోతున్నారు. భవిష్యత్‌లో ప్రభుత్వ రంగం, భారీ ప్రైవేట్‌ పరిశ్రమల్లో మాత్రమే కాక, చిన్న చిన్న యూనిట్లలో ఉద్యోగావకాశాలు ఎక్కువగా వస్తాయి. ఇందులో నైపుణ్యం ఉన్నవాళ్ళకే అవకాశం ఉంది.

ఒకవైపు లక్షల సంఖ్యలో నిరుద్యోగులు, రెండోవైపు నైపుణ్యం కలిగిన యువత కొరత. ఈ వైరుధ్యం ప్రస్తుతం దేశాన్ని, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలను నిలువునా కుంగదీస్తున్నది. కొత్తగా ఏర్పడిన ఈ రెండు రాష్ట్రాలు యువత ఉపాధి, ఉద్యోగాల పట్ల తీవ్రంగా ఆలోచించాల్సి ఉంది. రెండు రాష్ట్రాలూ జూన్‌ రెండవ తేదీని ముఖ్యమైన సందర్భంగానే భావిస్తున్నాయి. మిగతా అన్ని ప్రధాన విషయాలతో పాటు, యువత ఉపాధి, ఉద్యోగాలను తమ భవిష్యత్‌ ప్రాధాన్యతాంశంగా పరిగణించాలి. ఇందుకుగాను తక్షణ కార్యక్రమం, దీర్ఘకాలిక ప్రణాళికలు అవసరం. పేరుకు కొన్ని స్కిల్‌ డెవలప్‌ మెంట్‌ సెంటర్లు ఏర్పాటు చేసి లెక్కల్లో చూపించి చేతులు దులుపుకుంటే సమస్య పరిష్కారం కాదు. ప్రతియువకుడు ఏదో ఒక నైపుణ్యాన్ని సాధించి దేశ ఆర్థికాభివృద్ధిలో భాగమయ్యేట్టుగా ప్రభుత్వాలు పట్టుదలతో కృషి చేయాలి.  విద్యావిధానాన్ని సైతం పూర్తిగా సంస్కరించాలి. నిజానికి  విప్లవా త్మక మార్పులు చేపట్టాలి. నేటి విద్యావ్యవస్థ నైపుణ్యంలేని యువతను ఉత్పత్తి చేస్తున్న కర్మాగారంలా తయారయింది. ఈ పరిస్థితి భవిష్యత్‌లో కొనసాగకుండా ఉండాలంటే జూన్‌ 2వ తేదీన రెండు ప్రభుత్వాలు విద్యా, ఉపాధి రంగాల విషయంలో కఠోర నిర్ణయాలు చేపట్టాలి.

వ్యాసకర్త సామాజిక విశ్లేషకులు మల్లెపల్లి లక్ష్మయ్య
‘ మొబైల్‌: 97055 66213

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement