సాక్షి, అమరావతి బ్యూరో: ఐటీలో పెను మార్పులను ఇరవై ఏళ్ల కిందటే ఊహించి ఈ రంగానికి పునాది వేశానని సీఎం చంద్రబాబు చెప్పారు. ఆంధ్రప్రదేశ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అకాడమీ (ఏపీఐటీఏ)ఆ«ధ్వర్యంలో శనివారం విజయవాడ బందరు రోడ్డులోని ఏ–కన్వెన్షన్ సెంటర్‌లో జరిగిన మెగా జాబ్ మేళా వీడ్కోలు కార్యక్రమంలో చంద్రబాబు ప్రసంగించారు. వచ్చే మూడేళ్లలో అన్ని రంగాలలో కలిపి 15 లక్షల ఉద్యోగాలు వచ్చేలా కృషి చేస్తున్నట్లు చెప్పారు. మన యువతకు ఉన్న తెలివితేటలు ఇండియాలో ఎవరికీ లేవని, వారి తెలివినే తాను మార్కెటింగ్ చేస్తున్నానని చెప్పారు. ప్రతి నెలా ఒక్కో విభాగంలో కాన్ఫరెస్స్‌లు నిర్వహిస్తామని ప్రకటించారు. ఈ జాబ్ మేళా ద్వారా 1,087 మందికి ఉద్యోగాలు ఇస్తున్నందుకు సంతోషంగా ఉందన్నారు. వీరికి గరిష్ట వేతనం ఏడాదికి రూ.3.10 లక్షలు ఇస్తున్నారని తెలిపారు.
రాష్ట్రంలో గత మూడేళ్లలో 5.35 లక్షల ఉద్యోగాలిచ్చామని సీఎం చెప్పారు. రాబోయే రోజుల్లో 15 లక్షల ఉద్యోగాల కల్పన జరగనున్నట్లు తెలిపారు. శనివారం శాసనసభలో పెట్టుబడులు, యువజన విధానం, నిరుద్యోగ భృతిపై జరిగిన స్వల్ప కాలిక చర్చకు సీఎం చంద్రబాబు సమాధానమిచ్చారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 23, 24, 25వ తేదీల్లో విశాఖపట్నం కేంద్రంగా పెట్టుబడుదారుల భాగస్వామ్య సదస్సు నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు.
నిరుద్యోగ భృతిపై కమిటీల ఏర్పాటు
నిరుద్యోగ భృతిపై కేబినెట్ సబ్‌కమిటీ కొన్ని సిఫారసులు చేసిందని, విధి విధానాలు రూపొందించేందుకు మరింత లోతుగా అధ్యయనం చేయాల్సి ఉందని చంద్రబాబు చెప్పారు. దేశంలో ఎక్కడా నిరుద్యోగ భృతి విజయవంతం కాలేదన్నారు. అర్హులకే నిరుద్యోగ భృతిని అందించేందుకు కృషి చేస్తున్నామన్నారు. ప్రజా సాధికార సర్వే ద్వారా యువత వివరాలు, భూమి, రేషన్‌కార్డులు తదితర కేటగిరీల కింద సమగ్ర సమాచారం సేకరిస్తున్నామన్నారు. విధి విధానాల అడ్వయిజరీ కౌన్సిల్ ఛైర్మన్‌గా తాను, అమలుకు సీఎస్ ఛైర్మన్‌గా ఉంటారన్నారు. ఈ చర్చలో ఎమ్మెల్యేలు తలారి ఆదిత్య, రాధాకృష్ణ, చాంద్‌బాషా, ఆనందరావు, జీవీ ఆంజనేయులు, గణేష్‌లు పాల్గొనగా, మంత్రులు అమరనాధ్‌రెడ్డి, కొల్లు రవీంద్రలు సమాధానమిచ్చారు.
శాసనసభ నిరవధిక వాయిదా
చర్చపై సీఎం చంద్రబాబు ప్రసంగం అనంతరం శాసనసభను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ కోడెల శివప్రసాదరావు ప్రకటించారు. నవంబరు 10 నుంచి డిసెంబర్ 2 వరకు 12 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు జరిగాయన్నారు. సమావేశాల్లో 16 బిల్లులు ఆమోదం పొందాయని, రెండు బిల్లులు ఉపసంహరించుకున్నట్లు వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment