మతంలో విప్లవ పతాకం | Mallepalli Laxmaiah writes on guru gobind singh | Sakshi
Sakshi News home page

మతంలో విప్లవ పతాకం

Published Thu, Dec 22 2016 1:37 AM | Last Updated on Mon, Oct 8 2018 9:06 PM

గురునానక్‌, గురు గోవింద్‌సింగ్‌ చిత్రపటాలు - Sakshi

గురునానక్‌, గురు గోవింద్‌సింగ్‌ చిత్రపటాలు

కొత్త కోణం
ప్రతివారూ అక్షరాస్యులు కావాలన్న గొప్ప ఆచారం కనిపిస్తుంది. పరాన్నజీవులుగా బతికే లక్షణం వీరికి లేదు. ఉపాధి కోసం ఏదో పనిచేసుకుంటూనే మత కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. అంతేతప్ప మత బోధనల కోసం ప్రత్యేక వర్గం ఉండదు. గురుద్వారాలలో, వ్యాపార పారిశ్రామిక రంగాలలో, వ్యవసాయరంగంలో–ఎక్కడైనా అధికారి, ఆసామి అనే ఆధిపత్య సంకేతాలు మచ్చుకైనా కనిపించవు. యుద్ధ సంప్రదాయాల నుంచి ఉద్భవించిన సిక్కు మతం అనుయాయులకు బాల్యం నుంచే ఆరోగ్యవంత మైన అలవాట్లను నూరిపోస్తుంది.

మనిషి నిత్యాన్వేషి. మనుగడ, అవసరాల కోసం మార్గాలను వెతుకుతూనే ఉంటాడు. కష్టాలను అధిగమించే వ్యూహాలను రచిస్తూనే ఉంటాడు. అటు వంటి అనుభవాలు చరిత్రలో ఎన్నో. అయితే కొన్ని మాత్రమే సమాజాన్ని సమూలంగా మార్చగలుగుతాయి. చిరకాలం ప్రభావితం చేస్తాయి. ఆ తాత్విక ఆలోచనలు శతాబ్దాల పాటు మార్గనిర్దేశనం చేస్తాయి. అటువంటి ఒక సామాజిక, సాంస్కృతిక జీవనధారే సిక్కిజం, లేదా సిక్కు మతం. గురునానక్‌ వేసిన తాత్విక పునాదులు ఉత్తర భారతాన్ని, ముఖ్యంగా పశ్చిమ భాగంలో ఉన్న విశాల భూభాగాన్ని చైతన్యవంతం చేశాయి. క్రీస్తుశకం 1469 సంవ త్సరంలో ఏప్రిల్‌ 15న జన్మించిన నానక్‌ ఆనాటి సామాజిక పరిస్థితులకు చలించి, సరికొత్త సమాజాన్ని నిర్మించాలనుకున్నాడు. వందల ఏళ్లు భారత దేశం మీద జరిగిన దురాక్రమణలకు, దాడులకు, యుద్ధాలకు పశ్చిమ భారత దేశం బలౌతూ వచ్చింది. దురాక్రమణదారులు సునాయాసంగా జయించారు కూడా. దురాక్రమణదారులు కేవలం భూభాగంపై పెత్తనం కోసమే కాక, తమ మతాల వ్యాప్తికీ యత్నించారు. మొఘలుల దాడులను అందులో భాగం గానే అర్థం చేసుకోవాలి.

గురు నానక్‌ జీవించిన కాలంలో రాజులు, రాజ ప్రతినిధులు ప్రధా నంగా ముస్లింలు. కింది స్థాయిలో వ్యాపారస్థులు, రైతులు, వృత్తి పనివారు హిందువులు. కులవ్యవస్థ హిందువుల ఐక్యతకు అవరోధంగా ఉంటూ, దురా క్రమణలను ఎదుర్కోవడానికి అడ్డంకిగా మారింది. అంతిమంగా కుల వ్యవస్థలోని కింది స్థాయి కులాలు మరింత దౌర్జన్యాలకూ, వివక్షలకూ బలయ్యేవి. వీటిని దగ్గరగా చూసిన నానక్‌ పరిష్కారాన్ని వెతకడానికి ప్రయత్నించాడు. హిందూమతంలో ఉన్న మూఢ నమ్మకాలను, వివక్షలను, అసమానతలను నిరసించి సమానత్వ ప్రాతిపదిక మీద సిక్కిజాన్ని స్థాపించాడు.

కవి, యుద్ధవీరుడు, తాత్వికుడు
సిక్కిజంను ప్రారంభించిన ఘనత గురు నానక్‌కు దక్కినప్పటికీ, ఆ మతాన్ని నిర్మాణాత్మకమైన వ్యవస్థగా తీర్చిదిద్దినవారు పదవ గురువు గురు గోవింద్‌ సింగ్‌. పాట్నాలో డిసెంబర్‌ 22, 1666న గురుతేజ్‌ బహదూర్, మాతా గుజ్రి లకు గురు గోవింద్‌సింగ్‌ జన్మించారు. ఆయనను మొదట గోవింద్‌రాయ్‌ అని పిలిచేవారు. గురు గోవింద్‌సింగ్‌ హిందీ, పర్షియన్, పంజాబీ భాషలలో ప్రావీణ్యం సంపాదించారు. ఆయన మత గురువు మాత్రమే కాదు. కవి, తత్వవేత్త. ఒక యుద్ధవీరుడు. సిక్కుల 9వ గురువు, గురు గోవింద్‌సింగ్‌ తండ్రి గురు తేజ్‌బహదూర్‌ను ఇస్లాం స్వీకరించడానికి నిరాకరించినందుకు ఉరితీశారు.

ఆ నేపథ్యంలో తొమ్మిదేళ్లlగోవింద్‌రాయ్‌ సిక్కుల పదవ మత గురువుగా బాధ్యతలు స్వీక రించాడు. సిక్కు మతానికి కొత్తరూపు ఇస్తూ గురు గోవింద్‌సింగ్‌ 1699లో స్థాపించినదే ఖాల్సా. అంటే అన్ని రకాల రుగ్మతలు, చెడుల నుంచి దూరంగా ఉంచే స్వచ్ఛమైన ప్రవర్తన. సిక్కు మతస్థులలో పురుషులు పేరు చివర ‘సింగ్‌’ అని, స్త్రీలు ‘కౌర్‌’ అని చేర్చుకోవాలని ఆయన ఆదేశించాడు. సింగ్‌ అంటే సింహమనీ, కౌర్‌ అంటే మహారాణీ అని అర్థం. ప్రతి సిక్కు ఐదు చిహ్నాలను ధరించాలని కూడా నిర్దేశించాడాయన. మొదటిది తలవెంట్రుకలను కత్తిరించ కూడదు, రెండవది ఎప్పుడూ దువ్వెన కలిగి ఉండాలి, అనుక్షణం ఖడ్గధారి అయి ఉండాలి, పొట్టి నిక్కర్, చేతికి లోహపు కడియం కూడా తప్పనిసరిగా ధరించాలని సూచించాడు. వీటినే పంచ ‘క’కారా లని అంటారు. ఇంకా తన రచనల ద్వారా అనేక విషయాలను సులభ శైలిలో వివరించే ప్రయత్నం చేశాడు. నానక్‌ బోధలకు గురు గోవింద్‌ సింగ్‌ మరింత శక్తిని జోడించి, ఆ మతాన్ని మరింత విస్తృతం చేశాడు.

కుటుంబం వీరమరణం
హిందూమతం చెప్పే చాలా విషయాలను సిక్కుమతం తిరస్కరించింది. బహు దేవతారా«ధన పేరుతో డబ్బును, సమయాన్ని వృథా చేస్తోన్న పద్ధతిని తిరస్కరిస్తూ దేవుడు ఒక్కడేనని ప్రకటించింది. భగవంతుడు నిరామయుడు, నిరాకారుడు, నిర్గుణుడు అని విశ్వసిస్తూ విగ్రహారాధనను వ్యతిరేకించింది. సిక్కులు ధరించే ఖడ్గం ఆత్మరక్షణకు మాత్రమేనని,  పగలకూ, ప్రతీకారా లకూ వాడకూడదని నిర్దేశించింది. మొఘలుల దాడులను ప్రతిఘటించడానికి గురు గోవింద్‌సింగ్‌ సైన్యాన్ని తయారుచేశాడు. అందులో సైనికులుగా చేరిన ఆయనlకుమారులు యుద్ధంలోనే ప్రాణాలు కోల్పోయారు. అయినా చెక్కు చెదరని ధైర్యంతో ఒక వైపు మతబోధనలనూ, రెండోవైపు యుద్ధాన్నీ కొన సాగించాడు గురు గోవింద్‌సింగ్‌. చివరికి మొఘలాయి కుట్రదారులు పన్నిన కుట్రతో నాందేడ్‌ సమీపంలో గోదారి ఒడ్డున వీరమరణం పొందాడు.

సిక్కుల చివరి గురువుగా కూడా పేర్గాంచిన గురు గోవింద్‌సింగ్‌ జీవితం ఆ వర్గాన్నే కాకుండా, పశ్చిమ భారతదేశం మొత్తాన్ని ప్రభావితం చేసింది. గురు నానక్‌తో ప్రారంభమై, గురు గోవింద్‌సింగ్‌ త్యాగంతో ఉన్నత స్థాయికి ఎదిగిన సిక్కుమతం భారత సామాజిక చరిత్రలో ఒక విప్లవం. ఆ మతం ప్రతిపాదించిన విషయాలే ఇందుకు నిదర్శనం. ముఖ్యంగా హిందూమతం లోని అవాంఛనీయతను అది తిరస్కరించింది. ‘నీ సామాజిక హోదాను చూసి గర్వపడరాదు. పరువు, ప్రతిష్టల వల్ల ఉపయోగం లేదు. దేవుడి ముందు అందరూ సమానులే’ అంటూ; ‘కులమనే సామాజిక హోదా మను షుల మధ్య అంతరాలను సృష్టించే అగాధం కారాద’ని సిక్కుల పవిత్ర గ్రంథం ‘గురుగ్రంథ సాహెబ్‌’ స్పష్టం చేస్తున్నది. కుల హోదాలతో సంబంధం లేకుండా మనుషులందరిలో భగవంతుని రూపం వెలుగుతుం టుందని చెబుతూనే, నీ మరణం తర్వాత కులం, అధికారం నీ వెంట రావని కూడా స్పష్టం చేసింది.

మిగతా మతాల మాట ఎలా ఉన్నా అణచివేత, వెనుక బాటుతనం పునాదులను పెకిలించుకు వచ్చే ఏ నూతన భావజాలమైనా పురోగామిగా ఉంటుంది. హిందువుల కర్మకాండలను సిక్కుతత్వం ఎండగట్టింది. ‘నువ్వు అర్పి స్తున్న గంగాజలం స్వర్గంలో ఉన్న నీ పితృదేవతలకు చేరడం నిజమైతే ఈ భూమ్మీదనే పంజాబ్‌లోని నా పొలాలకు ఎందుకు చేరదో చెప్పాలి’ అంటూ సిక్కు గురువులు హిందూ సమాజాన్ని ప్రశ్నించారు. మూఢ నమ్మకాల పేరుతో ప్రజలను అశక్తులుగా, సోమరులుగా తయారు చేస్తున్నారని, అంతి మంగా సమాజానికి ఉపయోగపడే వ్యక్తులు తయారు కావడం లేదని విమర్శించారు.

బౌద్ధానికి ప్రతిబింబం
దైవం ఎదుట ప్రజలంతా సమానమనే భావనకే సిక్కు మతం పరిమితం కాలేదు. కులమత భేదం లేకుండా అన్నార్తులకూ, పేదలకూ గురుద్వారాలు (సిక్కుల ప్రార్థనా మందిరాలు) ఆకలి తీర్చి, ఆశ్రయమిస్తా్తయి. దానినే లంగర్‌ అంటారు. అందుకే ఆ మతంలో యాచకులు ఉండరు. స్వశక్తితో జీవించే శక్తిని సిక్కు మతం కలిగిస్తున్నది. ఇదో సాంస్కృతిక విప్లవం. బహు దేవతారాధన లేదు. అందువల్ల హిందూమతంలో వలే యజ్ఞయాగాలు, జంతుబలులు నిషేధం. అన్నింటికన్నా ముఖ్యమైన అంశం– పూజారి వ్యవస్థ లేకపోవడం. అందువలన గొప్ప, తక్కువ, జ్ఞాని, అజ్ఞాని అనే భేదాలు ఏర్పడే అవకాశం లేదు. ఒక వర్గం మొత్తం సమాజం మీద పెత్తనాన్ని కలిగి ఉండే అవకాశం కూడా అక్కడ కనిపించదు. గురుగ్రంథ సాహెబ్‌ తెలిసిన ఎవరైనా మత బోధనలు చేయవచ్చు.

అంటే 2500 ఏళ్ల నాటి బౌద్ధం భావనలే సిక్కు మతంలోనూ ప్రతిబింబించినట్టు అర్థమవుతుంది. విదేశీదాడులను ఎదుర్కో వడానికీ, కుల అసమానతలను నిర్మూలించడానికీ ఆవిర్భవించిన సిక్కు మతం ఆర్థిక రంగాన్ని విశేషంగా ప్రభావితం చేసింది. దేశంలోని సంపన్న రాష్ట్రాలలో సిక్కులు ప్రధానంగా నివసించే పంజాబ్, çహరియాణాలే అభి వృద్ధిలో ముందు ఉండడం గమనించాలి. వ్యవసాయ రంగంలో అవి సాధించిన ప్రగతిని ఇప్పటికీ మిగతా రాష్ట్రాలు అందుకోలేకపోతున్నాయి. వ్యాపార వాణిజ్య రంగాల్లో కూడా వీరి పాత్ర తక్కువేం కాదు. వీటన్నింటితో పాటు, దాదాపు యాభైకి పైగా దేశాల్లో సిక్కులు స్థిరపడ్డారు. అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియా, ఆఫ్రికా, కెనడా లాంటి దేశాల్లో వీరు సాగిస్తున్న వ్యాపార వాణిజ్య కార్యకలాపాలు అబ్బురపరుస్తాయి. కెనడాలో హోటల్, రవాణా రంగాలలో వారే అగ్రస్థానంలో ఉన్నారు.

కష్టించే తత్వం వారి సొంతం
మూఢనమ్మకాలు లేకపోవడం వల్ల సిక్కులు స్వశక్తినే నమ్ముతారు. కష్టపడే తత్వం దేనినైనా సాధించగలిగే సత్తాను ఇస్తున్నది. వారి పోరాట పటిమకు అనుగుణంగానే క్రీడారంగంలోనూ, సైన్యంలోనూ సిక్కుల భాగస్వామ్యం అధికంగా కనిపిస్తుంది. ప్రతివారూ అక్షరాస్యులు కావాలన్న గొప్ప ఆచారం కనిపిస్తుంది. పరాన్నజీవులుగా బతికే లక్షణం వీరికి లేదు. ఉపాధి కోసం ఏదో పనిచేసుకుంటూనే మత కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. అంతేతప్ప మత బోధనల కోసం ప్రత్యేక వర్గం ఉండదు. గురుద్వారాలలో, వ్యాపార పారి శ్రామిక రంగాలలో, వ్యవసాయరంగంలో– ఎక్కడైనా అధికారి, ఆసామి అనే ఆధిపత్య సంకేతాలు మచ్చుకైనా కనిపించవు. యుద్ధ సంప్రదాయాల నుంచి ఉద్భవించిన సిక్కు మతం అనుయాయులకు బాల్యం నుంచే ఆరోగ్యవంత మైన అలవాట్లను నూరిపోస్తుంది. దేహదారు«ఢ్యం కోసం వ్యాయామం తప్పనిసరిగా చేసే మంచి ఆనవాయితీ ఆ మతంలో ఉంటుంది.

కానీ కొన్ని అసమానతలు సిక్కుమతాన్ని వెన్నాడుతూనే ఉన్నాయని అంగీకరించాలి. వారిలో అంటరాని కులాలు మజబీ సిక్కులు వివక్షనెదుర్కొంటూనే ఉన్నారు. ఈ వర్గంలో జన్మించిన సంత్‌ రవిదాస్‌ వివక్షారహిత సమాజాన్ని కాంక్షించిన విషయాన్ని గమనించాలి. ఇలాంటి కొన్ని పరిమితులు ఉన్నా  హిందూ  మతంలోని వివక్ష, అసమానతలను రూపుమాపడం వల్ల ఒక సమాజం ఎట్లా ప్రగతి సా«ధించిందో సిక్కు మతం నిరూపించింది.
(డిసెంబర్‌ 22వ తేదీ సిక్కుల పదవ గురువు గురు గోవింద్‌సింగ్‌ జయంతి)

- మల్లెపల్లి లక్ష్మయ్య
వ్యాసకర్త సామాజిక విశ్లేషకులు
మొబైల్‌ : 97055 66213

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement