
భారతదేశవ్యాప్తంగా ఈరోజు(డిసెంబర్ 26)న వీర్ బాల్ దివస్ జరుపుకుంటున్నారు. సిక్కుల పదవ గురువైన గురు గోవింద్ సింగ్ కుమారులు సాహిబ్జాదా జోరావర్ సింగ్, సాహిబ్జాదా ఫతే సింగ్‌ల ధైర్యసాహసాలు, త్యాగానికి గుర్తుగా ప్రతీయేటా డిసెంబర్ 6న వీర్ బాల్‌దివస్ నిర్వహిస్తుంటారు.
మతం, మానవత్వాలను రక్షించేందుకు తమ ప్రాణాలను త్యాగం చేసిన సమయంలో సాహిబ్జాదా జోరావర్ సింగ్ వయసు తొమ్మిదేళ్లు, సాహిబ్జాదా ఫతే సింగ్ వయసు ఆరేళ్లు కావడం విశేషం. 2022లో జనవరి 9న గురుగోవింద్ సింగ్(Guru Gobind Singh) ప్రకాష్ పర్వ్ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ ఈ బాలవీరుల త్యాగానికి గుర్తుగా దేశవ్యాప్తంగా వీర్‌బాల్ దివస్ నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు.
మొఘలుల పాలనలో..
సిక్కుల పదవ గురువు గోవింద్ సింగ్‌కు అజిత్ సింగ్, జుజార్ సింగ్, జోరావర్ సింగ్, ఫతే సింగ్ అనే నలుగురు కుమారులున్నారు. 1699లో గోవింద్ సింగ్ ఖాల్సా పంత్‌ను స్థాపించారు. 1705లో పంజాబ్ మొఘలుల పాలనలో ఉంది. ఆ సమయంలో గురుగోవింద్ సింగ్‌ను పట్టుకునేందుకు మొఘలులు తమ శాయశక్తులా ప్రయత్నించారు. అయితే గురు గోవింద్ వారికి చిక్కలేదు. అతని భార్య మాతా గుజ్రీతో పాటు వారి కుమారులు బాబా జోరావర్ సింగ్, బాబా ఫతే సింగ్‌లో ఒక రహస్య ప్రదేశం(Secret place)లో దాక్కున్నారు. అయితే వారింటిలోని వంటవాడు గంగు వారి గురించి సిర్హింద్ నవాబ్ వజీర్ ఖాన్‌కు తెలియజేశాడు. అప్పటికే గురుగోవింద్ సింగ్ కుమారులు బాబా అజిత్ సింగ్, బాబా జుజార్ సింగ్ మొఘలులతో జరిగిన యుద్ధంలో వీరమరణం పొందారు.
చిన్నారుల బలిదానం
నవాబ్ వజీర్ ఖాన్ గురుగోవింద్ సింగ్ భార్య గుజ్రీని, కుమారులు సాహిబ్జాదా జోరావర్ సింగ్, సాహిబ్జాదా ఫతే సింగ్‌లను హింసించాడు. మతం మారాలంటూ వారిపై ఒత్తిడి తీసుకువచ్చాడు. తరువాత వజీర్ ఖాన్ సాహిబ్జాదాస్ చిన్నారులిద్దరినీ గోడలో పూడ్చిపెట్టాడు. ఈ విషయం తెలుసుకున్న వారి తల్లి గుజ్రీ ప్రాణత్యాగం చేశారు. ఆ చిన్నారుల బలిదానాన్ని పురస్కరించుకుని భారత ప్రభుత్వం 2022లో ప్రతీయేటా డిసెంబర్ 26ను వీర్ బాల్ దివస్(Veer Bal Diwas)గా జరుపుకుంటున్నట్లు ప్రకటించింది. బాబా జోరావర్ సింగ్, బాబా ఫతే సింగ్‌లు 1705, డిసెంబర్ 26న అమరులయ్యారు. వీర్ బాల్ దివస్ భారతదేశ చరిత్రలోని ఒక అపూర్వ అధ్యాయాన్ని గుర్తు చేస్తుందని, రాబోయే తరాలకు సత్యధర్మాలకున్న ప్రాముఖ్యతను తెలియజేస్తుందని ప్రదాని మోదీ గతంలో పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి: Year Ender 2024: దుమ్మురేపిన 100 మంది డిజిటల్ స్టార్స్..
Comments
Please login to add a commentAdd a comment