మంచుసీమలో మనువాద సెగ | mallepally laxmaiah write article on dalits in nepal | Sakshi
Sakshi News home page

మంచుసీమలో మనువాద సెగ

Published Thu, Feb 1 2018 1:20 AM | Last Updated on Thu, Feb 1 2018 4:39 AM

mallepally laxmaiah write article on dalits in nepal - Sakshi

బుద్ధుని జన్మస్థలి లుంబిని

కొత్త కోణం

నేపాల్‌ దేశ జనాభాలో దళితులు 13.6 శాతం. కానీ ఈ గణాంకాలు వాస్తవం కాదనీ, వారు అంతకన్నా ఎక్కువేననీ దళిత సంఘాల వాదన. భౌగోళిక ప్రాంతాల వారీగా, మదేశి (తరాయి) హిల్‌(కొండలు), మౌంటెన్స్‌(పర్వతాలు)లలో దళితులు విస్తరించి ఉన్నారు. భారతదేశానికి ఆనుకొని ఉన్న తరాయి ప్రాంతంలోనే వీరు అధికంగా నివసిస్తున్నట్టు లెక్కలు చెపుతున్నాయి. దళితుల్లో అక్షరాస్యత తక్కువ. జాతీయ సగటు అక్షరాస్యత 65.9 శాతం ఉండగా, దళితుల అక్షరాస్యత 52.40 శాతం.

మంచుకొండల మధ్య నేపాల్‌ ప్రజల జీవితం ప్రశాంతంగానే కనిపిస్తుంది దూరం నుంచి చూసేవారికి. కానీ పదేళ్ల క్రితం అక్కడ జరిగిన సాయుధ తిరుగుబాటు ఇంకో విషయం చెబుతుంది. నాటి నెత్తుటి వరదలను చూసిన వారికి ప్రజలెదుర్కొన్న అణచివేత, దోపిడీ, పీడనల తీవ్రత గుర్తుకు వస్తాయి. మావోయిస్టుల నాయకత్వంలో రాచరికానికి వ్యతిరేకంగా జరిగిన యుద్ధంలో పేద ప్రజల భాగస్వామ్యం చరిత్రాత్మకమైనది. అందులో దళితుల భాగస్వామ్యాన్ని ప్రత్యేకించి చెప్పుకోవాలి. ఆ సాయుధ తిరుగుబాటులో పాల్గొన్న దాదాపు 19 వేల మంది సైన్యంలో, 7వేలకు పైగా అంటరాని కులాల వారే. వీరిలో 1100 మంది ప్రాణాలు కోల్పోయారు. నిరాశ్రయులైనవారు, నేటికీ ఆచూకీ లేనివారు వందల మంది ఉన్నారు. 

2006లో ముగిసిన ఆ ప్రజాయుద్ధంలో దళితుల పాత్ర ప్రముఖమైనది. ఆ యుద్ధంలో పాల్గొన్న దళితులం దరూ మంచి సమాజం కోసం కలలుగన్నారు. అయితే యుద్ధం ముగిసినా నేటికీ స్థిరమైన రాజకీయ ప్రభుత్వం ఏర్పడలేదు. ఇంతటి స్తబ్దతలో కూడా నేపాలీలు రాజ్యాంగాన్ని రూపొందించుకోగలిగారు. వారం క్రితం గౌతమ బుద్ధుని జన్మస్థలి లుంబిని (నేపాల్‌) వెళ్లిన సందర్భంగా కొంతమంది దళిత మేధావులతో మాట్లాడినప్పుడు అనేక విషయాలు తెలిశాయి. కుల వివక్ష, అంటరానితనపు వికృత రూపాలు అర్థమయ్యాయి. లోకానికి తెలియని వివక్ష ఎన్నో రూపాలలో వేళ్లూనుకొని ఉంది. జనాభాలో దళితులు దాదాపు 15 శాతం. తరతరాలుగా ఎదుర్కొంటోన్న అణచివేత, దోపిడీ, వివక్ష, అంటరానితనం వారిచేత ఆయుధాలను పట్టించింది. చిన్న చిన్న పోరాటాల రూపంలో ప్రారంభమై, అంతిమంగా సాయుధ పోరాట రూపం దాల్చింది.

భారత్‌ నమూనాలోనే
నేపాల్‌ కుల సమాజం ఆవిర్భావానికీ, భారతదేశ కులాల పుట్టుకకూ దగ్గరి సంబంధం ఉంది. నేపాల్‌ భారతదేశానికి కొనసాగింపు, ఒక నమూనా మాత్రమే. మనుస్మృతిని ఇక్కడ తు.చ. తప్పకుండా అమలు చేశారు. బ్రాహ్మణ, చెత్రి(క్షత్రియ), నెవారి కులాలను జంధ్యం ధరించే ద్విజులుగాను; దాహం తీర్చుకోవడానికి నీరు కూడా పుచ్చుకోకూడని కులాలను నిమ్నకులాలుగా, ఆ తర్వాత అంటరాని కులాలుగా ప్రకటించారు. ఈ అంతరాలను చట్టబద్ధం చేస్తూ 1854లో అప్పటి ప్రధానమంత్రి జంగ్‌ బహుదూర్‌ రాణా ఒక పౌర చట్టాన్ని తీసుకొచ్చారు. అలా మతపరంగా ఉన్న కుల కట్టుబాట్లు, చట్టబద్ధ రూపాన్ని తీసుకున్నాయి. ఆపై దాదాపు వందేళ్ల తర్వాత నేపాల్‌ దళిత ఉద్యమానికి రూపకల్పన జరిగింది. 

భారత దేశంలో రగిలిన దళిత చైతన్యం, అంబేడ్కర్‌ ఆలోచనా విధానం అక్కడి విద్యావంతులైన అతి కొద్దిమంది దళితులకు ఒక స్ఫూర్తి. 1946లో సర్బజిత్‌ బిశ్వకర్మ బిశ్వ సర్బజన్‌ సంఘ్‌ను, నేపాల్‌ సమాజ్‌ సుదార్‌ సంఘ్‌ను, సద్‌బిర్‌ బిశ్వకర్మ, సహర్షనాథ్‌ నాయకత్వంలో 1947లో మరొక సంఘాన్ని స్థాపించి కుల వివక్షకు సవాలు విసిరారు. 1950 సంవత్సరం వచ్చేనాటికల్లా నేపాల్‌ అంటరాని కులాల్లో చైతన్యం రగిలి, ప్రజాస్వామిక ఉద్యమానికి అంకురార్పణ జరిగింది. ఈ సంఘాల నాయకత్వంలో మొట్టమొదటిసారిగా 1952లో ఖట్మాండులోని పశుపతినాథ దేవాలయంలో దళితుల ప్రవేశం కోసం ఆందోళన జరిగింది. ఈ క్రమంలోనే మరిన్ని సంఘాలు, సంస్థలు ఈ ఉద్యమంలో చేరాయి. 

ఆ సంస్థలలో సమాజ్‌ సుదార్‌ సంఘ్‌ నేపాల్‌ రాష్ట్రీయ దళిత్‌ జన బికాస్‌ పరిషత్‌గా పేరు మార్చుకున్నది. 1972లో మొదటి మహాసభ జరిపి దళితులకు రిజర్వేషన్లు అనే అంశంపై వాణిని వినిపించింది. 1990 నుంచి నేపాల్‌ దళితుల ఉద్యమం నూతన శకంలోకి అడుగుపెట్టింది. ఆ ప్రయాణమే 1996 నుంచి 2006 వరకు మావోయిస్టు ప్రజాయుద్ధంగా కొనసాగింది. మావోయుస్టులు బలంగా ఉన్న ప్రాంతంలో దళితుల ఆత్మగౌరవాన్ని నిలబెట్టుకోవడానికి ప్రయత్నించారనీ, కొన్ని ప్రాంతాల్లో భూములను కూడా దక్కించుకున్నారనీ నివేదికలున్నాయి. నేపాల్‌ అంతర్యుద్ధం ముగిసి, శాంతి ఒప్పందాలు జరిగి, రాజ్యాంగం ఏర్పాటయ్యే వరకు కూడా దళిత సంఘాలు, సంస్థలు, మేధావులు తమ హక్కుల కోసం కృషి చేశారు. దాని ఫలితంగానైతేనేమి, ప్రపంచ వ్యాప్తంగా, మరీ ముఖ్యంగా భారతదేశంలో అంబేడ్కర్‌ రూపొం దించిన రాజ్యాంగం ఇచ్చిన స్ఫూర్తితో వల్లనైతేనేమి– నేపాల్‌ రాజ్యాంగంలో ప్రజాస్వామిక హక్కులు భాగమయ్యాయి. అప్పటి వరకు అధికారికంగా హిందూదేశంగా ఉన్న నేపాల్‌ లౌకికదేశమైంది. ఇది గొప్ప విజయం. ఈ విజయం వెనుక నేపాల్‌ దళిత జాతుల రక్తతర్పణం కూడా ఉన్నదన్న వాస్తవం విస్మరించలేనిది.

కొత్త రాజ్యాంగంతో ఊరట
నూతన రాజ్యాంగం కోసం 2007లో ప్రారంభమైన ప్రక్రియ 2015 వరకు సాగింది. 2015, సెప్టెంబర్‌ 20న నేపాల్‌ రాజ్యాంగం అధికారికంగా ఆవిర్భవించింది. దీనికి ఒక సుదీర్ఘ పీఠికను రాసుకున్నారు. స్వేచ్ఛగా పాలించుకునే స్వతంత్రదేశంగా నేపాల్‌ రూపొందుతుందనీ, అన్ని రకాల వివక్షలను నిర్మూలిస్తుందనీ, ప్రజాస్వామిక విలువలపై ఆధారపడి సోషలిజాన్ని నిర్మించుకునే కార్యక్రమానికి అంకితమవుతామనీ పీఠిక గర్వంగా ప్రకటించింది. ప్రజాస్వామ్య, రిపబ్లిక్, ఫెడరల్‌ విధానాల ద్వారా సుపరిపాలనను అందించడమే లక్ష్యంగా నిర్దేశించుకున్నది. 

రాజ్యాంగంలోని మూడవ విభాగంలో ప్రాథమిక హక్కులను పొందుపరిచారు. గౌరవప్రదంగా జీవించే హక్కు, స్వేచ్ఛ, సమానత్వ హక్కు, సమాచార హక్కు, న్యాయాన్ని పొందే హక్కులతో పాటు అంటరానితనం, వివక్షను వ్యతిరేకించే హక్కులను ఇందులో పొందుపరిచారు. దళిత హక్కుల గురించి 40వ ఆర్టికల్‌ ప్రస్తావిస్తున్నది. విద్య, ఉద్యోగ సంబంధమైన అవకాశాలను కల్పించే నిబంధనలను కూడా ఇందులో చేర్చారు. భూమిలేని దళితులకు భూవసతి కల్పించే అంశానికి కూడా ఇందులో చోటు ఇచ్చారు. 40వ ఆర్టికల్‌ను ప్రాథమిక హక్కులలో భాగం చేయడం విశేషం. అయితే రాజ్యాంగం ఇచ్చేది హక్కులు మాత్రమే. వీటి అమలుకు మళ్లీ ప్రత్యేక చట్టాలు కావాలి. సామాజిక అసమానతల వికృత రూపాలను నిర్మూలించడానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేయాలి.

నేపాల్‌ దేశ జనాభాలో దళితులు 13.6 శాతం. కానీ ఈ గణాంకాలు వాస్తవం కాదనీ, వారు అంతకన్నా ఎక్కువేననీ దళిత సంఘాల వాదన. భౌగోళిక ప్రాంతాల వారీగా, మదేశి(తరాయి)హిల్‌(కొండలు), మౌంటెన్స్‌ (పర్వతాలు)లలో దళితులు విస్తరించి ఉన్నారు. భారతదేశానికి ఆనుకొని ఉన్న తరాయి ప్రాంతంలోనే వీరు అధికంగా నివసిస్తున్నట్టు లెక్కలు చెపుతున్నాయి. దళితుల్లో అక్షరాస్యత తక్కువ. జాతీయ సగటు అక్షరాస్యత 65.9 శాతం ఉండగా, దళితుల అక్షరాస్యత 52.40 శాతం. పదవ తరగతి చేరుకున్న వాళ్లు 1.6 శాతం, డిగ్రీ చేసిన వాళ్లు 0.8 శాతం మాత్రమే. దళితుల్లో మరింత వెనుకబాటుతనానికీ, వివక్షకూ గురవుతున్న ముషాహర్, డోమ్‌ కులాల్లో అక్షరాస్యత 17 శాతమే. దళిత బాలబాలికల పట్ల ఉపాధ్యాయులు చూపిస్తున్న వివక్ష కూడా వీరిని విద్యకు దూరం చేస్తున్నది. ఇప్పటికీ దళిత బాలబాలికలను ప్రత్యేకంగా కూర్చోబెడుతున్న పరిస్థితి. నీటి కుండల నుంచి, కుళాయిల నుంచి నీటిని తాగే హక్కు దళితులకు లేదు. అదేవిధంగా పిల్లలను హీనంగా చూడడం, మాట్లాడడం వల్ల చాలా మంది విద్యార్థులు మధ్యలోనే చదువు మానేస్తున్నట్టు లెక్కలు చెబుతున్నాయి. 

యాభై శాతం దారిద్య్ర రేఖకు దిగువనే...
జీవనాధారమైన భూమి కూడా వీరికి చాలా తక్కువ. అరకొర భూమి కలిగిన వాళ్లను వదలిపెడితే దాదాపు 50 శాతానికిపైగా ఎటువంటి భూమీ దళితుల చేతిలో లేదని తేలింది. దానితో వీళ్లందరూ కూడా రోజు కూలీలుగా బతుకుతున్నారు. అంతే కాకుండా గల్ఫ్‌ దేశాలకు, ఇండియాకు కూలీలుగా వలసపోయి దుర్భర దారిద్య్రంలో కొట్టుమిట్టాడుతున్నారు. దాదాపు దళితులంతా దారిద్య్రరేఖకు దిగువన జీవిస్తున్నారు. ప్రతి అయిదుగురిలో ముగ్గురు కటిక దారిద్య్రంలో, పౌష్టికాహార లోపంతో కుంగి కృశించి పోతున్నారు. కులవృత్తులకు ఆదరణలేక, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంలో ప్రవేశం లేక ఉపా«ధి, ఉద్యోగం కరువైపోయాయి. ఇప్పటి వరకు ప్రభుత్వోద్యోగాల్లో రిజర్వేషన్లు లేకపోవడంతో. 

దీనితో ఆధిపత్య కులాలే నూటికి నూరు శాతం ఉద్యోగాలు అనుభవిస్తున్నారు. ఆరోగ్యరంగంలో కూడా దళితులు తీవ్రమైన అవస్థలు భరిస్తున్నారు. దళితులకు వైద్య సౌకర్యాలు అందించే సమయంలో కూడా అవమానాలు, వివక్షలు ఎదురవుతున్నాయి. మరుగుదొడ్ల లాంటి సౌకర్యాలు గగన కుసుమమే. భారతదేశంలో వలెనే దళిత మహిళలు మూడు రకాల వివక్షలకు గురవుతున్నారు. మహిళగా కుటుంబంలో, దళితురాలిగా, దళిత మహిళగా సమాజంలో వివక్షను, అణచివేతను భరిస్తున్నారు. ఇప్పటికీ దళితుల్లో ఉన్న పేదరికాన్ని ఆసరాచేసుకొని వీరిని సెక్సువర్కర్లుగా మారుస్తున్నారు. ఇతర దేశాలకు అక్రమ రవాణా చేస్తున్నారు. 

మదేశి, తరాయి ప్రాంతంలోని దళితులు మరింత వివక్షకు గురవుతున్నారు. గ్రామాల్లో, పట్టణాల్లో గానీ హోటళ్లకు వెళితే, దళితులకు విడిగా గ్లాసులు, పళ్లాలు ఉంటాయి. బస్సుల్లో, ఆటోల్లో కూడా వీరికి అవమానాలే ఎదురవుతుంటాయి. వీళ్లు బస్సుల్లో ఎక్కి కూర్చుంటే ఆధిపత్య కులాల వాళ్లు వస్తే లేచి నిలబడాలి. లేదంటే దిగి వెళ్లిపోవాలి. ఒకవేళ ఎవరైనా ధైర్యంగా అలాగే కూర్చుంటే, ప్రాణం తీసేవరకు ఆధిపత్య కులాలు వెనకాడవు. కులాంతర వివాహాలు చేసుకున్న వాళ్లను ప్రాణాలతో వదిలిపెట్టరు. కానీ, 2015లో అమలులోనికి వచ్చిన రాజ్యాంగం దళితులకు కొంత ఊరట. 

ఈ రాజ్యాంగం సరిగా అమలు కావాలన్నా మళ్లీ దళితులు నూతన ఉద్యమాన్ని ప్రారంభించాల్సిందే. అందుకోసమే నేపాల్‌ దళితులు ప్రయత్నాలు ప్రారంభించారు. అందుకు బాబాసాహెబ్‌ అంబేడ్కర్‌ ఆలోచనలను కరదీపికగా మార్చుకోవాలని చూస్తున్నారు. గౌతమ బుద్ధుని జన్మస్థలమైన లుంబినిలో అంబేడ్కర్‌ సోషల్‌ ఫౌండేషన్‌ను స్థాపించి, దాని నాయకత్వంలో దళితుల్లో సామాజిక, రాజకీయ చైతన్యాన్ని కల్పించి, రాజ్యాంగం ఆధారంగా అనేక అంశాలపై ప్రత్యేక చట్టాల కోసం పోరాడాలని భావిస్తున్నారు. ఆ విధంగా నేపాల్‌ దళిత రాజకీయ ఉద్యమంలో అంబేడ్కర్‌ సోషల్‌ ఫౌండేషన్‌ మైలురాయి అవుతుందని వారి విశ్వాసం.

- మల్లెపల్లి లక్ష్మయ్య
వ్యాసకర్త సామాజిక విశ్లేషకులు ‘ 97055 66213  

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement