Gautama Buddha
-
Global Buddhist Summit: భవ్య ప్రగతికి బుద్ధుని బోధనలే మార్గదర్శకాలు
న్యూఢిల్లీ: గౌతమ బుద్ధుని బోధనలను ఆచరించి సుస్థిరాభివృద్ధిని సాధించవచ్చని ప్రధాని మోదీ అభిలషించారు. నేడు ప్రపంచం ఎదుర్కొంటున్న ఎన్నో సమస్యలకు బుద్ధుడి బోధనలు చక్కని పరిష్కారాలు చూపగలవని మోదీ వ్యాఖ్యానించారు. గురువారం ఢిల్లీలో గ్లోబల్ బుద్ధిస్ట్ సమ్మిట్ సెషన్లో మోదీ ప్రారంభోపన్యాసం చేశారు. ‘ యుద్ధాలు, ఆర్థిక అస్థిరత, ఉగ్రవాదం, మత అతివాదం, వాతావరణ మార్పులు.. ఇలా ఎన్నో అంతర్జాతీయ సమస్యలు ప్రపంచాన్ని పట్టిపీడిస్తున్నాయి. వీటికి గౌతముని సద్గుణ బోధనలు పరిష్కార మార్గాలు చూపుతాయి’ అని అన్నారు. పర్యావరణ మార్పు సమస్యకు సంపన్న దేశాలే కారణమంటూ విమర్శించారు. బుద్ధుడు చూపిన మార్గం భవిష్యత్, సుస్థిర పథం. గతంలోనే ఆయన చూపిన మార్గంలో వెళ్లిఉంటే ఇప్పుడీ ప్రపంచానికి ప్రకృతి విపత్తులు దాపురించేవే కాదు. సంకుచిత భావన నుంచి విస్తృత సమ్మిళిత ప్రపంచ భావన దిశగా మళ్లడం అత్యావశ్యకం. బుద్ధుని నుంచే భారత్ స్ఫూర్తి గౌతముడి ఉపదేశాలను భారత్ ఆచరిస్తోంది. పెను భూకంపంతో కుప్పకూలిన తుర్కియేసహా పలు దేశాలకు ఆపన్నహస్తం అందించింది. బుద్ధుడు చూపిన మార్గాన్ని అనుసరించడమంటే సమస్యల నుంచి సమాధానం వైపునకు పయనించడమే’ అని అన్నారు. సదస్సుకు 30 దేశాల నుంచి బౌద్ధ సన్యాసులు తదితరులు వచ్చారు. -
గౌతమ బుద్ధుడి విగ్రహావిష్కరణ
మదనపల్లె : మదనపల్లె మండలం అంకిశెట్టిపల్లె వద్ద బుద్ధునికొండపై అంబేడ్కర్ సమాజ్, భారతీయ అంబేడ్కర్ సేవ ఆధ్వర్యంలో మహోత్సవాలు వైభవంగా జరిగాయి. ఆది, సోమవారాల్లో రెండు రోజుల పాటు జరిగిన ఉత్సవాల్లో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే నవాజ్‌బాషా పాల్గొన్నారు. ఆంధ్ర, తెలంగాణ, కర్నాటక, తమిళనాడు రాష్ట్రాల నుంచి వచ్చిన బౌద్ధ భిక్షువులు, బౌద్ధ ఉపాసకులతో కలిసి తథాగతుడు గౌతమబుద్ధుని విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజ హితం కోసం సర్వ సుఖాలను త్యాగం చేసిన మహోన్నతుడు గౌతమ బుద్ధుడని కొనియాడారు. మానవ వికాసానికి హేతుబద్ధమైన గొప్ప జీవన మార్గాన్ని ఆయన ప్రపంచానికి అందించారని కీర్తించారు. ధార్మికసేవ పురస్కారాలు బాస్ సంస్థల వ్యవస్థాపకుడు పీటీఎం శివప్రసాద్ అధ్యక్షతన జరిగిన ధర్మపునరుద్ధరణ సభలో వివిధ రంగాల్లో సేవలందిస్తున్న పలువురికి ధార్మిక సేవా పురస్కారాలు అందజేశారు. ఈ పురస్కారాలు అందుకున్న వారిలో విజయ భారతి హైస్కూల్ కరస్పాండెంట్ డాక్టర్ సేతు, సీనియర్ మున్సిపల్ కౌన్సిలర్ మార్పురి నాగార్జున బాబు అలియాస్ గాంధీ, ఫోర్డు సంస్థ చైర్మన్ లలితమ్మ, హెల్పింగ్ మైండ్స్ వ్యవస్థాపకుడు అబూబకర్, గ్రామజ్యోతి సంస్థ అధ్యక్షురాలు సుభద్ర, హెడ్‌కానిస్టేబుల్ రామ్మూర్తి, కుబా సంస్థ అధ్యక్షుడు రోషన్, ధౌత్రి ఫౌండేషన్ అధ్యక్షురాలు స్వామి, ఏపీయూఎస్‌ఎఫ్ అధ్యక్షుడు ప్రణయ్, సేదా సంస్థ అధ్యక్షుడు పఠాన్ ఖాదర్‌ఖాన్ తదితరులు ఉన్నారు. ఈ కార్యక్రమంలో బుద్ధ అంబేడ్కర్ సమాజ్ ప్రతినిధులు చాట్ల బయన్న, సోనగంటి రెడ్డెప్ప, నీరుగొట్టి రమణ, భారతీయ అంబేడ్కర్ సేన నాయకులు శ్రీచందు, రమణ, గణపతి, మోహన్, చంద్రయ్య తదితరులు పాల్గొన్నారు. -
కారుణ్య మందిరం
నలభై రోజులు క్వారెంటైన్లో ఉన్నాడు బుద్ధుడు! జీవితానికి దూరంగా బోధివృక్షం కింద ఉన్నాడు.వైశాఖ పూర్ణిమ రోజు సత్యాన్వేషణ ఫలించింది! దుఃఖ కారణం.. దుఃఖ నిరోధం రెండూ కనుగొన్నాడు. దుఃఖ నిరోధానికి ఎనిమిది మార్గాలు. అందులో ఒకటి.. జీవకారుణ్యం కలిగి ఉండటం. ఈ లాక్డౌన్ దుఃఖంలో ఇప్పుడది మరీ మరీ అవసరం. చార్‌ధామ్‌లో మూగజీవాలను చేరదీస్తున్నారు. ఈరోజు వైశాఖ పౌర్ణమి. బుద్ధపౌర్ణమి కూడా. మన మదిలోనూ ఒక కారుణ్య మందిరం ఉండాలి. ఆలయ ద్వారాలు తెరుచుకున్నాయి. దర్శనాలే లేవు. గంగోత్రి, యమునోత్రిలో ఏప్రిల్ 26న, కేదార్‌నాథ్‌లో ఏప్రిల్ 29న దీపాలు వెలిగాయి. బద్రీనాథ్ మే 15న దేదీప్యం అవుతుంది. పూజలు ఉంటాయి. కానీ యాత్రికులే ఉండరు. లాక్డౌన్ లేకుంటే ఇక్కడి దృశ్యాలు ఇంకోలా ఉండేవి. ఈ హిమశ్రేణుల్లో భక్తుల బారులు, వారిని మోసుకొచ్చే మూగప్రాణులు కనిపించేవి. అక్టోబర్–నవంబర్ వరకు ఉత్తరాఖండ్ ఈ దేవస్థలికి ఒక ‘బేక్‌క్యాంప్’లా ఉండేది. అన్ని రాష్ట్రాలవారు, అన్ని దేశాలవారు అక్కడికి చేరుకుని ఆలయదర్శన యాత్ర ప్రారంభించేవారు. గంగోత్రికి గోముఖి నుంచి, యుమునోత్రికి హనుమాన్ ఛెట్టి నుంచి, కేదార్‌నాథ్‌కి గౌరీకుంద్ నుంచి, బద్రీనాథ్‌కి గోముఖి, గౌరీకుంద్‌ల నుంచి పర్వతయానం. పైకి పదీ పదిహేను కి.మీ.ల ఎత్తు! నడవగలిగిన వాళ్లకు నడక. ‘ఎగరగలిగిన’ వాళ్లకు హెలీకాప్టర్. నడవలేని, ఎగరలేని వాళ్లకు గుర్రాలు, గార్ధభాలు! భక్తులకు,భగవంతునికి ఏడాదిలో ఆరునెలలు వారధిగా ఉండే ఈ మూగప్రాణులు ఇప్పుడు తిండి దొరక్క, ఎండిన డొక్కలతో, లోతుకు పోయిన కళ్లతో ఉత్తరాఖండ్ వీధులలో నీరసంగా తిరుగుతున్నాయి. తిరిగే ఓపిక లేనివి ఒక వైపు పడి ఉంటున్నాయి. జీవకారుణ్యాన్ని ప్రబోధించిన గౌతమ బుద్ధుని ఆత్మను బాధించే విషయం ఇది. మనిషి బాధ్యతను గుర్తుచేసే సందర్భం కూడా. కరోనా లాక్‌డౌన్‌తో ఈ ఏడాది చార్ధామ్ యాత్ర రద్దయింది. యాత్రంటే భక్తి మాత్రమే కాదు. కొందరికి భుక్తి కూడా. నాలుగు భక్తిమార్గాలను మూసేయడంతో యాత్రికుల్ని మోసుకెళ్లే జీవవాహన దారుల భుక్తి మార్గం కూడా మూసుకుపోయింది. ఉత్తరాఖండ్‌లోని డెహ్రాడూన్, హల్ద్వానీ, యు.ఎస్.నగర్ ప్రాంతాలలో ఈ ‘పుణ్యజీవాలు’ అనాథ ప్రాణులై ఎండలకు వగరుస్తున్నాయి. దాణాకు డబ్బులేక యజమానులు వాటిని వీధిపాలు చేశారు. గంగోత్రి మార్గంలో గార్థభాలే ప్రధాన వాహనాలు. అవన్నీ ఇప్పుడు డెహ్రాడూన్, చుట్టుపక్కల పట్టణ వీధుల్లో కనిపిస్తున్నాయి! వీటితోపాటు వీధి శునకాలు, పట్టించుకోకుండా వదిలిన ఆవులు. అవి ఇళ్లముందు దొరికే ఆహారంతో ప్రాణాలను నిలుపుకోగలవు. కానీ గార్ధభాలకు, ముఖ్యంగా కొండపైకి బరువులు మోయడానికి అలవాటు పడిన వాటికి ఎక్కువ శక్తినిచ్చే ప్రత్యేకమైన ప్రొటీన్ ఆహారం ఉండాలి. యాత్రికులు వస్తూ ఉంటే కనుక వాటి యజమానుల చేతుల్లో నాలుగు డబ్బులు ఆడి వాటికి బలమైన ఆహారం లభించేది. ఇప్పుడా పరిస్థితి లేదు. కొన్ని గార్ధభాలైతే పదీ పదిరోజులుగా తిండి లేక బక్కచిక్కి ఉండటాన్ని గమనించిన ‘పీపుల్ ఫర్ యానిమల్స్’ (పి.ఎఫ్.ఎ.) ఉత్తరాఖండ్ కార్యదర్శి గౌరీ మౌలేఖిని ఇప్పటికే విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. ప్రాణాలు కళ్లల్లోకి వచ్చిన ప్రాణుల్ని మూగ జీవుల పునరావాస కేంద్రాలకు తరలించారు. గౌరిని ప్రధానంగా కలవరపెట్టిన విషయం.. చార్ధామ్ యాత్ర రద్దవడంతో అందులో భాగమైన మూగజీవాలు అకస్మాత్తుగా వీధులపాలు అవడం! పి.ఎఫ్.ఎ.తో పాటు ఉత్తరాఖండ్‌లోని జంతు జీవ హక్కుల పరిరక్షణ సంస్థలూ ప్రభుత్వానికి ఈ వారం రోజుల్లోనే అనేక లేఖలు రాశాయి. ప్రభుత్వం తీయించిన లెక్కలు కూడా ఆ లేఖల్లోని వివరాలతో సరిపోలాయి. నిరుడు వీధి జీవాల సంఖ్య 5,800 ఉంటే, ఈ ఏడాది ఆ సంఖ్య 8000కు పెరిగింది! ఉత్తరాఖండ్ స్త్రీ, శిశు సంక్షేమ, పశు సంవర్థక శాఖల మంత్రి రేఖా ఆర్య మంగళవారం విధాన సభలో జరిగిన జంతు సంక్షేమ బోర్డు సమావేశం లో అన్ని జిల్లాలోని అనాథ జంతువుల కోసం 2 కోట్ల 50 రూపాయలు కేటాయించారు. అందులో 2 కోట్ల 30 లక్షలు వాటి ఆహారానికి, మిగిలిన మొత్తం వాటి సంరక్షణకు. ‘పీపుల్ ఫర్ యానిమల్స్’ శాఖలు అన్ని రాష్టాల్లోనూ ఉన్నాయి. ఆ సంస్థ వ్యవస్థాపకురాలు మేనకాగాంధీ. అలాగే జంతు జీవ హక్కుల పరిరక్షణ సంస్థలు కూడా దేశంలో అన్ని చోట్లా ఉన్నాయి. ఈ లాక్డౌన్లో ఆలనా పాలన లేక వీధిపాలైన మూగ ప్రాణులు లక్షల్లోనే ఉంటాయి. వాటిని సంరక్షించేందుకు ఆ సంస్థలతో పాటు, మనకూ చేతనైనంతలో వాటికి నీడనివ్వాలి. మాడే వాటి కడుపులకు ఇంత ఆహారం పెట్టాలి. భక్తి యాత్రలే కాదు, నిస్సహాయ జీవులను చేరదీయడం కూడా పుణ్యకార్యమే. ఆచరణకు ఈ బుద్ధపౌర్ణమిని ఒక ఆరంభంగా చేసుకోవచ్చు. -
మంచుసీమలో మనువాద సెగ
కొత్త కోణం నేపాల్ దేశ జనాభాలో దళితులు 13.6 శాతం. కానీ ఈ గణాంకాలు వాస్తవం కాదనీ, వారు అంతకన్నా ఎక్కువేననీ దళిత సంఘాల వాదన. భౌగోళిక ప్రాంతాల వారీగా, మదేశి (తరాయి) హిల్(కొండలు), మౌంటెన్స్(పర్వతాలు)లలో దళితులు విస్తరించి ఉన్నారు. భారతదేశానికి ఆనుకొని ఉన్న తరాయి ప్రాంతంలోనే వీరు అధికంగా నివసిస్తున్నట్టు లెక్కలు చెపుతున్నాయి. దళితుల్లో అక్షరాస్యత తక్కువ. జాతీయ సగటు అక్షరాస్యత 65.9 శాతం ఉండగా, దళితుల అక్షరాస్యత 52.40 శాతం. మంచుకొండల మధ్య నేపాల్ ప్రజల జీవితం ప్రశాంతంగానే కనిపిస్తుంది దూరం నుంచి చూసేవారికి. కానీ పదేళ్ల క్రితం అక్కడ జరిగిన సాయుధ తిరుగుబాటు ఇంకో విషయం చెబుతుంది. నాటి నెత్తుటి వరదలను చూసిన వారికి ప్రజలెదుర్కొన్న అణచివేత, దోపిడీ, పీడనల తీవ్రత గుర్తుకు వస్తాయి. మావోయిస్టుల నాయకత్వంలో రాచరికానికి వ్యతిరేకంగా జరిగిన యుద్ధంలో పేద ప్రజల భాగస్వామ్యం చరిత్రాత్మకమైనది. అందులో దళితుల భాగస్వామ్యాన్ని ప్రత్యేకించి చెప్పుకోవాలి. ఆ సాయుధ తిరుగుబాటులో పాల్గొన్న దాదాపు 19 వేల మంది సైన్యంలో, 7వేలకు పైగా అంటరాని కులాల వారే. వీరిలో 1100 మంది ప్రాణాలు కోల్పోయారు. నిరాశ్రయులైనవారు, నేటికీ ఆచూకీ లేనివారు వందల మంది ఉన్నారు. 2006లో ముగిసిన ఆ ప్రజాయుద్ధంలో దళితుల పాత్ర ప్రముఖమైనది. ఆ యుద్ధంలో పాల్గొన్న దళితులం దరూ మంచి సమాజం కోసం కలలుగన్నారు. అయితే యుద్ధం ముగిసినా నేటికీ స్థిరమైన రాజకీయ ప్రభుత్వం ఏర్పడలేదు. ఇంతటి స్తబ్దతలో కూడా నేపాలీలు రాజ్యాంగాన్ని రూపొందించుకోగలిగారు. వారం క్రితం గౌతమ బుద్ధుని జన్మస్థలి లుంబిని (నేపాల్) వెళ్లిన సందర్భంగా కొంతమంది దళిత మేధావులతో మాట్లాడినప్పుడు అనేక విషయాలు తెలిశాయి. కుల వివక్ష, అంటరానితనపు వికృత రూపాలు అర్థమయ్యాయి. లోకానికి తెలియని వివక్ష ఎన్నో రూపాలలో వేళ్లూనుకొని ఉంది. జనాభాలో దళితులు దాదాపు 15 శాతం. తరతరాలుగా ఎదుర్కొంటోన్న అణచివేత, దోపిడీ, వివక్ష, అంటరానితనం వారిచేత ఆయుధాలను పట్టించింది. చిన్న చిన్న పోరాటాల రూపంలో ప్రారంభమై, అంతిమంగా సాయుధ పోరాట రూపం దాల్చింది. భారత్ నమూనాలోనే నేపాల్ కుల సమాజం ఆవిర్భావానికీ, భారతదేశ కులాల పుట్టుకకూ దగ్గరి సంబంధం ఉంది. నేపాల్ భారతదేశానికి కొనసాగింపు, ఒక నమూనా మాత్రమే. మనుస్మృతిని ఇక్కడ తు.చ. తప్పకుండా అమలు చేశారు. బ్రాహ్మణ, చెత్రి(క్షత్రియ), నెవారి కులాలను జంధ్యం ధరించే ద్విజులుగాను; దాహం తీర్చుకోవడానికి నీరు కూడా పుచ్చుకోకూడని కులాలను నిమ్నకులాలుగా, ఆ తర్వాత అంటరాని కులాలుగా ప్రకటించారు. ఈ అంతరాలను చట్టబద్ధం చేస్తూ 1854లో అప్పటి ప్రధానమంత్రి జంగ్ బహుదూర్ రాణా ఒక పౌర చట్టాన్ని తీసుకొచ్చారు. అలా మతపరంగా ఉన్న కుల కట్టుబాట్లు, చట్టబద్ధ రూపాన్ని తీసుకున్నాయి. ఆపై దాదాపు వందేళ్ల తర్వాత నేపాల్ దళిత ఉద్యమానికి రూపకల్పన జరిగింది. భారత దేశంలో రగిలిన దళిత చైతన్యం, అంబేడ్కర్ ఆలోచనా విధానం అక్కడి విద్యావంతులైన అతి కొద్దిమంది దళితులకు ఒక స్ఫూర్తి. 1946లో సర్బజిత్ బిశ్వకర్మ బిశ్వ సర్బజన్ సంఘ్‌ను, నేపాల్ సమాజ్ సుదార్ సంఘ్‌ను, సద్‌బిర్ బిశ్వకర్మ, సహర్షనాథ్ నాయకత్వంలో 1947లో మరొక సంఘాన్ని స్థాపించి కుల వివక్షకు సవాలు విసిరారు. 1950 సంవత్సరం వచ్చేనాటికల్లా నేపాల్ అంటరాని కులాల్లో చైతన్యం రగిలి, ప్రజాస్వామిక ఉద్యమానికి అంకురార్పణ జరిగింది. ఈ సంఘాల నాయకత్వంలో మొట్టమొదటిసారిగా 1952లో ఖట్మాండులోని పశుపతినాథ దేవాలయంలో దళితుల ప్రవేశం కోసం ఆందోళన జరిగింది. ఈ క్రమంలోనే మరిన్ని సంఘాలు, సంస్థలు ఈ ఉద్యమంలో చేరాయి. ఆ సంస్థలలో సమాజ్ సుదార్ సంఘ్ నేపాల్ రాష్ట్రీయ దళిత్ జన బికాస్ పరిషత్గా పేరు మార్చుకున్నది. 1972లో మొదటి మహాసభ జరిపి దళితులకు రిజర్వేషన్లు అనే అంశంపై వాణిని వినిపించింది. 1990 నుంచి నేపాల్ దళితుల ఉద్యమం నూతన శకంలోకి అడుగుపెట్టింది. ఆ ప్రయాణమే 1996 నుంచి 2006 వరకు మావోయిస్టు ప్రజాయుద్ధంగా కొనసాగింది. మావోయుస్టులు బలంగా ఉన్న ప్రాంతంలో దళితుల ఆత్మగౌరవాన్ని నిలబెట్టుకోవడానికి ప్రయత్నించారనీ, కొన్ని ప్రాంతాల్లో భూములను కూడా దక్కించుకున్నారనీ నివేదికలున్నాయి. నేపాల్ అంతర్యుద్ధం ముగిసి, శాంతి ఒప్పందాలు జరిగి, రాజ్యాంగం ఏర్పాటయ్యే వరకు కూడా దళిత సంఘాలు, సంస్థలు, మేధావులు తమ హక్కుల కోసం కృషి చేశారు. దాని ఫలితంగానైతేనేమి, ప్రపంచ వ్యాప్తంగా, మరీ ముఖ్యంగా భారతదేశంలో అంబేడ్కర్ రూపొం దించిన రాజ్యాంగం ఇచ్చిన స్ఫూర్తితో వల్లనైతేనేమి– నేపాల్ రాజ్యాంగంలో ప్రజాస్వామిక హక్కులు భాగమయ్యాయి. అప్పటి వరకు అధికారికంగా హిందూదేశంగా ఉన్న నేపాల్ లౌకికదేశమైంది. ఇది గొప్ప విజయం. ఈ విజయం వెనుక నేపాల్ దళిత జాతుల రక్తతర్పణం కూడా ఉన్నదన్న వాస్తవం విస్మరించలేనిది. కొత్త రాజ్యాంగంతో ఊరట నూతన రాజ్యాంగం కోసం 2007లో ప్రారంభమైన ప్రక్రియ 2015 వరకు సాగింది. 2015, సెప్టెంబర్ 20న నేపాల్ రాజ్యాంగం అధికారికంగా ఆవిర్భవించింది. దీనికి ఒక సుదీర్ఘ పీఠికను రాసుకున్నారు. స్వేచ్ఛగా పాలించుకునే స్వతంత్రదేశంగా నేపాల్ రూపొందుతుందనీ, అన్ని రకాల వివక్షలను నిర్మూలిస్తుందనీ, ప్రజాస్వామిక విలువలపై ఆధారపడి సోషలిజాన్ని నిర్మించుకునే కార్యక్రమానికి అంకితమవుతామనీ పీఠిక గర్వంగా ప్రకటించింది. ప్రజాస్వామ్య, రిపబ్లిక్, ఫెడరల్ విధానాల ద్వారా సుపరిపాలనను అందించడమే లక్ష్యంగా నిర్దేశించుకున్నది. రాజ్యాంగంలోని మూడవ విభాగంలో ప్రాథమిక హక్కులను పొందుపరిచారు. గౌరవప్రదంగా జీవించే హక్కు, స్వేచ్ఛ, సమానత్వ హక్కు, సమాచార హక్కు, న్యాయాన్ని పొందే హక్కులతో పాటు అంటరానితనం, వివక్షను వ్యతిరేకించే హక్కులను ఇందులో పొందుపరిచారు. దళిత హక్కుల గురించి 40వ ఆర్టికల్ ప్రస్తావిస్తున్నది. విద్య, ఉద్యోగ సంబంధమైన అవకాశాలను కల్పించే నిబంధనలను కూడా ఇందులో చేర్చారు. భూమిలేని దళితులకు భూవసతి కల్పించే అంశానికి కూడా ఇందులో చోటు ఇచ్చారు. 40వ ఆర్టికల్‌ను ప్రాథమిక హక్కులలో భాగం చేయడం విశేషం. అయితే రాజ్యాంగం ఇచ్చేది హక్కులు మాత్రమే. వీటి అమలుకు మళ్లీ ప్రత్యేక చట్టాలు కావాలి. సామాజిక అసమానతల వికృత రూపాలను నిర్మూలించడానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేయాలి. నేపాల్ దేశ జనాభాలో దళితులు 13.6 శాతం. కానీ ఈ గణాంకాలు వాస్తవం కాదనీ, వారు అంతకన్నా ఎక్కువేననీ దళిత సంఘాల వాదన. భౌగోళిక ప్రాంతాల వారీగా, మదేశి(తరాయి)హిల్(కొండలు), మౌంటెన్స్ (పర్వతాలు)లలో దళితులు విస్తరించి ఉన్నారు. భారతదేశానికి ఆనుకొని ఉన్న తరాయి ప్రాంతంలోనే వీరు అధికంగా నివసిస్తున్నట్టు లెక్కలు చెపుతున్నాయి. దళితుల్లో అక్షరాస్యత తక్కువ. జాతీయ సగటు అక్షరాస్యత 65.9 శాతం ఉండగా, దళితుల అక్షరాస్యత 52.40 శాతం. పదవ తరగతి చేరుకున్న వాళ్లు 1.6 శాతం, డిగ్రీ చేసిన వాళ్లు 0.8 శాతం మాత్రమే. దళితుల్లో మరింత వెనుకబాటుతనానికీ, వివక్షకూ గురవుతున్న ముషాహర్, డోమ్ కులాల్లో అక్షరాస్యత 17 శాతమే. దళిత బాలబాలికల పట్ల ఉపాధ్యాయులు చూపిస్తున్న వివక్ష కూడా వీరిని విద్యకు దూరం చేస్తున్నది. ఇప్పటికీ దళిత బాలబాలికలను ప్రత్యేకంగా కూర్చోబెడుతున్న పరిస్థితి. నీటి కుండల నుంచి, కుళాయిల నుంచి నీటిని తాగే హక్కు దళితులకు లేదు. అదేవిధంగా పిల్లలను హీనంగా చూడడం, మాట్లాడడం వల్ల చాలా మంది విద్యార్థులు మధ్యలోనే చదువు మానేస్తున్నట్టు లెక్కలు చెబుతున్నాయి. యాభై శాతం దారిద్య్ర రేఖకు దిగువనే... జీవనాధారమైన భూమి కూడా వీరికి చాలా తక్కువ. అరకొర భూమి కలిగిన వాళ్లను వదలిపెడితే దాదాపు 50 శాతానికిపైగా ఎటువంటి భూమీ దళితుల చేతిలో లేదని తేలింది. దానితో వీళ్లందరూ కూడా రోజు కూలీలుగా బతుకుతున్నారు. అంతే కాకుండా గల్ఫ్ దేశాలకు, ఇండియాకు కూలీలుగా వలసపోయి దుర్భర దారిద్య్రంలో కొట్టుమిట్టాడుతున్నారు. దాదాపు దళితులంతా దారిద్య్రరేఖకు దిగువన జీవిస్తున్నారు. ప్రతి అయిదుగురిలో ముగ్గురు కటిక దారిద్య్రంలో, పౌష్టికాహార లోపంతో కుంగి కృశించి పోతున్నారు. కులవృత్తులకు ఆదరణలేక, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంలో ప్రవేశం లేక ఉపా«ధి, ఉద్యోగం కరువైపోయాయి. ఇప్పటి వరకు ప్రభుత్వోద్యోగాల్లో రిజర్వేషన్లు లేకపోవడంతో. దీనితో ఆధిపత్య కులాలే నూటికి నూరు శాతం ఉద్యోగాలు అనుభవిస్తున్నారు. ఆరోగ్యరంగంలో కూడా దళితులు తీవ్రమైన అవస్థలు భరిస్తున్నారు. దళితులకు వైద్య సౌకర్యాలు అందించే సమయంలో కూడా అవమానాలు, వివక్షలు ఎదురవుతున్నాయి. మరుగుదొడ్ల లాంటి సౌకర్యాలు గగన కుసుమమే. భారతదేశంలో వలెనే దళిత మహిళలు మూడు రకాల వివక్షలకు గురవుతున్నారు. మహిళగా కుటుంబంలో, దళితురాలిగా, దళిత మహిళగా సమాజంలో వివక్షను, అణచివేతను భరిస్తున్నారు. ఇప్పటికీ దళితుల్లో ఉన్న పేదరికాన్ని ఆసరాచేసుకొని వీరిని సెక్సువర్కర్లుగా మారుస్తున్నారు. ఇతర దేశాలకు అక్రమ రవాణా చేస్తున్నారు. మదేశి, తరాయి ప్రాంతంలోని దళితులు మరింత వివక్షకు గురవుతున్నారు. గ్రామాల్లో, పట్టణాల్లో గానీ హోటళ్లకు వెళితే, దళితులకు విడిగా గ్లాసులు, పళ్లాలు ఉంటాయి. బస్సుల్లో, ఆటోల్లో కూడా వీరికి అవమానాలే ఎదురవుతుంటాయి. వీళ్లు బస్సుల్లో ఎక్కి కూర్చుంటే ఆధిపత్య కులాల వాళ్లు వస్తే లేచి నిలబడాలి. లేదంటే దిగి వెళ్లిపోవాలి. ఒకవేళ ఎవరైనా ధైర్యంగా అలాగే కూర్చుంటే, ప్రాణం తీసేవరకు ఆధిపత్య కులాలు వెనకాడవు. కులాంతర వివాహాలు చేసుకున్న వాళ్లను ప్రాణాలతో వదిలిపెట్టరు. కానీ, 2015లో అమలులోనికి వచ్చిన రాజ్యాంగం దళితులకు కొంత ఊరట. ఈ రాజ్యాంగం సరిగా అమలు కావాలన్నా మళ్లీ దళితులు నూతన ఉద్యమాన్ని ప్రారంభించాల్సిందే. అందుకోసమే నేపాల్ దళితులు ప్రయత్నాలు ప్రారంభించారు. అందుకు బాబాసాహెబ్ అంబేడ్కర్ ఆలోచనలను కరదీపికగా మార్చుకోవాలని చూస్తున్నారు. గౌతమ బుద్ధుని జన్మస్థలమైన లుంబినిలో అంబేడ్కర్ సోషల్ ఫౌండేషన్‌ను స్థాపించి, దాని నాయకత్వంలో దళితుల్లో సామాజిక, రాజకీయ చైతన్యాన్ని కల్పించి, రాజ్యాంగం ఆధారంగా అనేక అంశాలపై ప్రత్యేక చట్టాల కోసం పోరాడాలని భావిస్తున్నారు. ఆ విధంగా నేపాల్ దళిత రాజకీయ ఉద్యమంలో అంబేడ్కర్ సోషల్ ఫౌండేషన్ మైలురాయి అవుతుందని వారి విశ్వాసం. - మల్లెపల్లి లక్ష్మయ్య వ్యాసకర్త సామాజిక విశ్లేషకులు ‘ 97055 66213 -
మనసుకు సమయం ఇవ్వండి
గౌతమ బుద్ధుడు, ఆయన శిష్యులు ఒక గ్రామం నుంచి ఇంకో గ్రామానికి వెళ్తున్నారు. దారి మధ్యలో ఒక సరస్సు వచ్చింది. గౌతముడు తన అనుచరులలో ఒకరిని పిలిచి, ‘నాకు దాహంగా ఉంది ఆ కొలను నుంచి మంచినీరు తేగలవా?’ అని అడిగాడు. శిష్యుడు కొలను దగ్గరికి వెళ్లాడు. సరస్సులో ఒక గట్టు మీద కొందరు బట్టలు ఉతుకుతున్నారు. అప్పుడే ఒక ఎడ్లబండి సరస్సును దాటుకుంటూ పోతోంది. నీళ్లన్నీ మురిగ్గా, బురదగా, నలకలు తేలుతూ ఉన్నాయి. ‘ఈ నీళ్లను నేను గురువుగారికి ఎలా ఇవ్వగలను?’ అనుకున్నాడు. వెనక్కి తిరిగి వచ్చి, ‘గురువర్యా.. ఆ నీళ్లు తాగేందుకు వీలుగా లేవు’ అని చెప్పాడు. ‘సరే, ఇక్కడే కొద్దిసేపు సేదతీరి బయల్దేరుదాం’ అని చెప్పి, అక్కడ ఉన్న ఒక చెట్టు కింద విశ్రమించాడు గౌతముడు. కొంత సమయం గడచింది. సరస్సు నుంచి మంచినీళ్లు తెమ్మని మళ్లీ ఆ శిష్యుడిని పంపించాడు బుద్ధుడు. శిష్యుడు వెళ్లాడు. ఈసారి సరస్సులోని నీళ్లు స్వచ్ఛంగా, తేటగా ఉన్నాయి! శిష్యుడు ఆశ్చర్యపోయాడు. పాత్రలోకి నీరు నింపుకుని గురువు దగ్గరికి వచ్చాడు. గౌతముడు ఆ నీటిని శిష్యులకు చూపించాడు. ‘బురద నీటిని అలా వదిలేస్తే.. కొద్దిసేపటి తర్వాత బురద తనంతట అదే అడుగుకు చేరుతుంది. తేట నీరు మిగులుతుంది’ అని చెప్పాడు. ఆయన అంతర్యం శిష్యులకు అర్థమైంది. మనమూ అర్థం చేసుకోవాలి. మనసు అలజడిగా ఉన్నప్పుడు అదే పనిగా ఆలోచించకూడదు. దానిని కొద్దిసేపు అలా వదిలేయాలి. అప్పుడు మనసు దానంతట అదే కుదుటపడుతుంది. -
బౌద్ధవాణి: మీలో మీరు వెతుక్కోండి!
ఒకసారి బుద్ధుడు నిరంజన నదీతీరంలో ఒక వనంలో ఉన్నాడు. ఆ సమయంలో అక్కడికి దగ్గరలో ఉన్న ఒక పట్టణం నుండి ముప్ఫైమంది యువకులు తమ భార్యలతో సహా ఆ వనానికి విలాసయాత్రకు వచ్చారు. వీరిలో ఒక యువకునికి భార్యలేదు. మిగిలిన వారంతా కలసి ఒక గణిక (వెలయాలు)ను వెంట తెచ్చుకోమన్నారు. అతను అలాగే చేశాడు. వారంతా ఆ రోజు వనంలో విహరించి, విలాసంగా గడిపారు. పొద్దుపోయేదాకా ఆటలతో, పాటలతో ఆనందంగా గడిపారు. అర్ధరాత్రికి నిద్రలోకి జారుకున్నారు. తెల్లారి లేచి చూస్తే, ఆ గణిక కనిపించలేదు. అంతేకాదు, వారందరి దగ్గరా ఉన్న విలువైన వస్తువులు, ఆభరణాలూ కనిపించలేదు. వారు భార్యలని ఇళ్లకి పంపి, ఆ గణిక కోసం వెతకడం ప్రారంభించారు. దారిలో బుద్ధుడు కనిపిస్తే, ఆయన దగ్గరకు వెళ్లి విషయమంతా చెప్పి ‘‘భంతే! మేము మోసపోయాం. విలువైన సంపద పోగొట్టుకున్నాం. వాటికోసమే వెతుకుతూ ఇటు వచ్చాం. ఆ స్త్రీ ఇటేమైనా వచ్చిందా?’’ అనడిగారు. అప్పుడు బుద్ధుడు ‘‘యువకులారా! మిమ్మల్ని ఎవరూ మోసగించలేదు. మిమ్మల్ని మీరే మోసగించుకున్నారు. మీరు పోగొట్టుకున్న సంపదకంటే విలువైన సంపదనే పోగొట్టుకున్నారు. అది శీలసంపద. మీరు ఆ శీలసంపదకోసం వెతుక్కోండి. అది వనాల్లో దొరకదు. మీలోనే దొరుకుతుంది. మీలో మీరు వెతుక్కోండి. మీ కోసం మీరు వెతుక్కోండి. శీలసంపద కోసం వెతుక్కోండి’’ అని ప్రబోధించాడు. బుద్ధుని ప్రవచనం విన్న వారికి తాము ఏమి పోగొట్టుకున్నామో తెలిసింది. ఆ తర్వాత వారు శీలసంపన్నులై ధర్మమార్గంలో నడిచారు. – డాక్టర్ బొర్రా గోవర్ధన్ -
రాహులుడు బౌద్ధ సుతుడు
గౌతమ బుద్ధుడు ధర్మమార్గంలో నడిచాడు. తన కుమారుడైన రాహులుడికి ధర్మమార్గాన్ని ప్రబోధించాడు. బుద్ధుడంటే బుద్ధి కలిగిన వాడు.. బుద్ధిని ఇచ్చేవాడు. ఆయన తన వారసుడైన రాహులుడికి ధర్మాన్నే ఆస్తిగా పంచి ఇచ్చాడు. మనందరం బుద్ధుని బిడ్డలమే! ఆ ఆస్తికి మనం కూడా అర్హులమే! బుద్ధపూర్ణిమ సందర్భంగా ఆయన తన కుమారుడికి బోధించిన మార్గంలో నడుద్దాం.. బుద్ధిమంతులుగా ఉందాం... ఆకాశం పండువెన్నెల్ని కుమ్మరిస్తోంది. ఇరవై తొమ్మిదేళ్ల యువరాజు సిద్ధార్థుడు మెల్లగా మేడమెట్లు ఎక్కి ఒక గది ముందు ఆగాడు. గడియ తీసి తలుపు మెల్లగా తోసి గదిలోని మంచం దగ్గరకు వెళ్లాడు. సిద్ధార్థుని భార్య యశోధర నిద్రలో కూడా ఆనందపడు తున్నట్టుగా పడుకుని ఉంది. ఆమె ఎడమ చేతి పొత్తిలిలో వెన్నెల చిరునవ్వులాంటి పసికందు తల్లి చేతిని తలగడగా చేసుకుని నవ్వుకుంటున్నాడు. అతడే రాహులుడు. దోమతెరను మెల్లగా పక్కకు తీసిన సిద్ధార్థుడు వారిద్దరి మోములు తేరిపార చూశాడు. ప్రేమించి, స్వయంవరంలో తనకు జీవితభాగస్వామిగా మారిన అందమైన ఇల్లాలు... వివాహమైన పన్నెండేళ్లకు లేకలేక కలిగిన సంతానం... అనంత ఐశ్వర్యం... అఖండ సామ్రాజ్య వారసత్వం... ముఖ్యంగా కొడుకు. తన వైజ్ఞానిక తృష్ణ తీర్చుకోవడానికీ, ఈ ప్రపంచ ప్రజలందరి దుఃఖం దూరం చేయడానికి సాగే తన ప్రయాణానికి ఆఖరి అడ్డంకి అతడు. అందుకే బిడ్డ పుట్టాడని తెలియగానే ‘నాకు రాహులుడు (అడ్డంకి) కలిగాడు’ అన్నాడు. చివరికి అదే బిడ్డకు నామమైపోయింది. చివరిసారి బిడ్డను ముద్దాడాలని, ప్రియురాలి నుదుటిని చుంబించాలని వంగాడు. అలా చేస్తే... వారు లేస్తే.. తనకు మరలా అడ్డంకి అవుతారనుకొని దయాదృక్కులతో చూస్తూ మెల్లగా లేచి.. గది దాటి... మెట్లు దిగి.. పెరటిలోకి వెళ్లాడు. ఆ రోజు చంద్రగ్రహణం. అప్పటికి సంపూర్ణ గ్రహణం పట్టింది. చీకటి ఆవహించింది. ఆ చీకటిలో కలిసిపోయి కపిలవస్తు నగరాన్ని దాటిపోయాడు. ఆ కటిక చీకట్లను పారద్రోలి కాంతి రేఖల్ని కనుగొనడానికి. ఆయనే మీ నాన్నగారు... అలా వెళ్లిన సిద్ధార్థుడు ఆరేళ్లు ధ్యానం చేశాడు. బోధివృక్షం కింద జ్ఞానం పొంది బుద్ధుడయ్యాడు. ఆనాటి మగధ దేశానికి రాజధాని అయిన ‘రాజగృహ’లో ఉంటున్నాడు. ఒకరోజు తన తండ్రి శుద్ధోధనుడి నుండి కబురు వచ్చింది ఆ బోధలు తమ నగరంలో చేయమంటూ. దాంతో ఏడేళ్ల తర్వాత తిరిగి కపిలవస్తు చేరాడు. ముందు బుద్ధుడు. చేతిలో భిక్షాపాత్ర. ఆ వెనక వందలాది మంది భిక్షువులు- ఆ దృశ్యం మేడ మీద నుంచి చూసింది యశోధర. మహారాజులా సైన్యం వెంటరాగా రథం మీద తిరగాల్సిన భర్త ఇలా భిక్షువులా యాచిస్తూ రావడం చూసి ఆమె హృదయం బరువెక్కింది.‘అమ్మా! ఆయన ఎవరమ్మా’ రాహులుని ప్రశ్న. యశోధర గుండె మరింత బరువెక్కింది. ‘చెప్పమ్మా! ఎవరమ్మా!?’ ‘నాయనా. సూర్యబింబంలా ప్రకాశించే మోము, తామరల కన్నా మెత్తనైన ఆ హస్తాలు, నీలి రత్నాల్లాంటి ఆ నేత్రాలు, ఇంద్రధనువులా వంగిన ఆ కనుబొమలు, మత్తగజంలాంటి ఆ నడక, పున్నమి చంద్రునిలాంటి వెన్నెల రూపు, సాగర గంభీరుడు, శాక్యకుమారుడు, సుమ సుకుమారుడు, దేవమానవ పూజనీయుడు వారే.. వారే నాన్నా మీ నాన్నగారు’... ఆ బిడ్డ ఆలోచనలో పడ్డాడు. ఇంతకాలం తాతగారి పెంపకంలో ఉన్నాడు. ఆయన్నే ‘నాన్నా!’ అంటూ పిలుస్తున్నాడు. ఇప్పుడు ‘వీరా నా నాన్నగారు’ అనుకొన్నాడు. ‘నాన్నగారూ’ అంటూ కేకవేశాడు. కేక వీధిదాకా చేరలేదు. వెంటనే బిడ్డను దగ్గరకు తీసుకుంది యశోధర. తండ్రి సామ్రాజ్య వారసత్వంబుద్ధుడు కపిలవస్తుకు వచ్చిన ఏడోరోజు తన భిక్షుగణంతో ఊరి చివరన ఉన్న ఆరామం కేసిపోతున్నాడు. ‘నాన్నగారూ! ఆగండి’ అంటూ ఏడేళ్ల రాహులుడు వెంటపడ్డాడు. యశోధర తన బిడ్డను అలా వెళ్లమని చెప్పింది. ‘నాయనా! మీ నాన్నగారి దగ్గరకు వెళ్లు. వారి దగ్గర నుండి నీకు రావాల్సిన వారసత్వాన్ని అందుకో. నీ వాటా నీకు ఇమ్మని కోరు. వెళ్లిరా’అని చెప్పి పంపింది. అందుకే రాహులుడు బుద్ధుని వెనకాల పడ్డాడు. ఎండ తీవ్రంగా ఉంది. బుద్ధుని నీడ ఒక పక్కగా నేలమీద పడుతోంది. ఆ నీడలోకి వచ్చి- ‘ఆగండి! మీ నీడ నాకు ఎంతో హాయిగా ఉంది. సుఖాన్నిస్తోంది’ అన్నాడు రాహులుడు. ‘నాయనా ఎవరు?’ అడిగాడు బుద్ధుడు. ‘నేను మీ కుమారుణ్ణి. రాహులుణ్ణి. మీ దగ్గర నుండి నాకు రావాల్సిన వారసత్వాన్ని తెచ్చుకోమంది అమ్మ’ ‘అలాగా! నాయనా!’ అంటూ ఆ పక్కన ఉన్న ధర్మసేనాపతి సారిపుత్రుణ్ణి పిలిచి ‘సారిపుత్రా! రాహులునికి భిక్షు దీక్ష ఇవ్వు’అని చెప్పి- ‘రాహులా! నాది ధర్మసామ్రాజ్యం. ఇదే నా ఆస్తి’ అంటూ కొడుకు చేతులకు భిక్షాపాత్ర అందించాడు బుద్ధుడు. అలా తన ఏడోఏటనే రాహులుడు బాలభిక్షువుగా మారాడు. బౌద్ధ చరిత్రలో తొలి బాల భిక్షువు రాహులుడు. బాలభిక్షువుల్ని శ్రామణేరులు అంటారు. ఆ విషయం తెలిసి శుద్ధోధనుడు తల్లడిల్లాడు. దుఃఖాన్ని ఆపుకోలేక ‘ఇక నాకెందుకు రాజ్యం. నన్నూ నీ బౌద్ధ సంఘంలో చేర్చుకో’ అన్నాడు. చివరికి బుద్ధుని తల్లి గౌతమి, తండ్రి శుద్ధోధనుడు, భార్య యశోధర కూడా భిక్షు సంఘంలో చేరారు. అలా తన యావత్ వంశాన్ని ధర్మం బాటలోనే నడిచేట్టు చేశాడు బుద్ధుడు. యువభిక్షువు రాహులుడికి పద్ధెనిమిదేళ్లు వచ్చే వరకూ ఇద్దరు గురువుల దగ్గరే పెరిగాడు. సారిపుత్రుడు ధర్మంలో శిక్షణ ఇస్తే, మహా మౌద్గల్యాయనుడు నడవడికలో శిక్షణ ఇచ్చారు. ‘నా తండ్రి బుద్ధుడు’ అని ఎప్పుడూ గర్వపడేవాడు కాదు. అవినయంగా ప్రవర్తించేవాడూ కాదు. ఒక్కోసారి కటికనేల మీద, మరుగుదొడ్ల పక్కన కూడా నిద్రించేవాడు. తనకు ప్రత్యేక సౌకర్యాలు కావాలని ఎప్పుడూ కోరుకోలేదు. బౌద్ధ ధర్మంలో ఎంతో నిష్ణాతుడయ్యాడు. బుద్ధుడు అతనికిచ్చిన ప్రత్యేక ప్రబోధాలు బౌద్ధ సారస్వతంలో ‘రాహులో వాద సుత్త’గా ప్రసిద్ధి. ధర్మమార్గంలో ‘రాహులా! ఇటురా’అని ఒక అద్దం ముందుకు తీసుకుపోయి ‘అద్దంలోకి చూడు ఎవరున్నారో’ అని అడిగాడు బుద్ధుడు.‘భగవాన్! నా ప్రతిబింబమే ఉంది’ ‘మనం మన ముఖం మీద ఉన్న మరకల్ని చెరుపుకోవడానికి, లోపాల్ని సరిచేసుకోవడానికి అద్దం ఎలా ఉపయోగపడుతుందో మన ప్రవర్తనా దోషాల్ని సరిచేసుకోవడానికి మన మనస్సు, ఆలోచన అలా ఉపయోగపడాలి’ అని చెప్పాడు బుద్ధుడు. ‘రాహులా! నీవు చేసే పని గురించి ముందే ఆలోచించు. మంచిది కాదనిపించితే చేయకు. లేదా చేస్తున్నప్పుడైనా ఆలోచించు. మంచిది కాకుంటే అప్పుడైనా విరమించు. అప్పుడు కుదరకపోతే చేసిన తరువాత వచ్చిన ఫలితాన్ని బట్టైనా ఆలోచించు. అప్పటికైనా ఆ చెడు పనుల్ని విరమించు. ఇలా ప్రతిదశలో నీవు చేసే పనుల గురించి నీకు నీవే సమీక్షించుకో. ఎప్పుడూ తప్పులు చేయవు’ అని కూడా చెప్పాడు. అలా.. బుద్ధుని ధర్మమార్గంలో ఉంటూ అర్హంతుడు అంటే పరిపూర్ణమైన భిక్షువు కాగలిగాడు రాహులుడు. ఆయన ఎక్కువకాలం రాజగృహం దగ్గరి ఆమ్రరత్న వనంలో జీవించాడు. రాహులుడు ఎప్పుడు మరణించాడో తెలియదు. కానీ, చాలా తక్కువ వయసులో యువకునిగా ఉన్నప్పుడే మరణించాడు. తండ్రి అడుగుజాడల్లో నడిచి తండ్రి ధర్మాన్ని నడిపించిన ధర్మయువ రథసారథి రాహుల థేరుడు. - డా. బొర్రా గోవర్ధన్ -
కాలం కత్తుల వంతెనపై త్యాగాల నడక
పద్యానవనం త్యాగము నిశ్చయముగ నొక యాగంబీ జగతియం దనాదిగ గానన్ త్యాగము కల్గిన జనులకు కాగలవు శుభంబులెల్ల కర్మల నార్యా! ‘కుచ్ పానేకే లియె కుచ్ కోనా జరూరీ!’ అనే మాట హిందీలో ఉంది. ఏదైనా పొందాలంటే, ఇంకేదైనా కోల్పోవాల్సిందే అని. వస్తువుకు మరొక వస్తువే అన్నట్టుగా ఇది వస్తుమార్పిడి విధానం కాకపోవచ్చు! ఇంకో రకంగా చెప్పాలంటే, ఒక రూపంలో మనం లబ్ది పొందడానికి మరో రూపంలో ఏదైనా త్యజించడమో, త్యాగం చేయాల్సిన పరిస్థితో అన్న మాట! ‘ఎంతో కొంత త్యాగానికి సిద్ధపడకుండా నాయకులు కాలేరు’ అంటారు. కొందరు ఐహిక సుఖాలను త్యజించమంటారు. ఇంకొందరు, కేవలం మిథ్య కనుక ఆముష్మిక సుఖాలపై ఆశను వదిలేయమంటారు. గౌతమ బుద్ధుడు కోర్కెలని త్యజిస్తే జీవితం అనందమయమన్నాడు. నిజమే, ఏదో త్యజించడం త్యాగం. త్యాగం అనేది లోకంలో ఒక యాగమే, అంటే యజ్ఞమే అంటాడు ఈ పద్యం రాసిన డాక్టర్ కపిలవాయి లింగమూర్తి. నూరుకు పైగా పుస్తకాలు రాసిన లింగమూర్తి నిరంతర పరిశోధకుడు. తెలుగువిశ్వవిద్యాలయం డాక్టరేట్‌తో సత్కరించిన ఆయనకు ఇటీవలే వట్టికోట ఆళ్వార్‌స్వామి పురస్కారం లభించింది. తేలికైన మాటలతో జీవన సత్యాల్ని వివరిస్తూ ఆర్యశతకం రాశారు. యజ్ఞంలో త్యాగం అంటే వితరణమే ప్రధానం. ఏదైనా ఇచ్చుకోవడం. వితరణలేని యజ్ఞం ఎంత గొప్పగా చేసినా అది ఫలాన్నివ్వదంటారు. త్యాగం అనే పదం పలికేప్పుడు కాస్త గంభీరంగా కనిపించినా, సౌమ్యంగా ఆలోచించి సరళంగా చూస్తే క్షమాగుణంలో ఉంటుంది. ‘ఇచ్చి పుచ్చుకోవడం’ అన్న సులభ సమీకరణంలోనూ ఉంటుంది అంతర్లీనంగా. ప్రపంచంలో ఎంతటి జఠిలమైన సమస్య అయినా చర్చలు, సంప్రదింపుల ద్వారా పరిష్కరించుకోవచ్చునంటారు ప్రజాస్వామ్యవాదులు. ఎలా సాధ్యమౌతుంది? అంటే, ఇచ్చిపుచ్చుకునే ధోరణి వల్లే. పరస్పరం సంప్రదింపులు జరుపుతున్నపుడు ఎక్కడో ఓ చోట, ఎవరో ఒకరు ఒకడుగు వెనక్కి తగ్గి అంగీకారానికి రావడం, అది చూసి అవతలి వాళ్లు కూడా అంతకన్నా ఎక్కువో, అంతేనో, అంతకు తక్కువో... తామూ వెనక్కి తగ్గడం, ఇలా సయోధ్యకు దారి ఏర్పడుతుంది. సమస్యకు పరిష్కారమూ లభిస్తుంది. ఇందులో త్యాగం ఇరువైపుల నుంచీ ఉన్నట్టే! త్యాగాలకు సిద్ధపడ్డవారి కర్మలకు సాఫల్యం ఉంటుంది. ఒకరి త్యాగాల వల్ల ఎదుటి వారికి తక్షణ ప్రయోజనం కనిపించినా, దీర్ఘకాలంలో అది త్యాగం చేసిన వారికిగానీ, విశాల సమాజ హితంలో గానీ కచ్చితమైన ప్రయోజనం కలిగిస్తుందని చరిత్ర నిరూపించింది. వేదాలు, పురాణాలు, ఉపనిషత్తులు, ఇతిహాసాలు... ఇలా మన ప్రాచీన సాహిత్యమంతా త్యాగనిరతి ఔన్నత్యాన్ని కీర్తించడమే కాకుండా సదరు సత్ఫలితాలను సాపేక్షంగా, సోదాహరణంగా వివరించాయి. శిబి, బలి, దదీచుడు, కర్ణుడు, సోక్రటీస్, జీసస్, గాంధీ వంటి మహనీయుల త్యాగాలు మానవేతిహాస గమనాన్ని ఉద్విగ్నభరితం చేశాయి. మత్స్యగంధితో పెళ్లి జరిపి తండ్రి శంతనుడి ఇచ్ఛ తీర్చడానికి గాంగేయుడు (భీష్ముడు) పలు త్యాగాలకు సిద్ధం కావాల్సి వచ్చింది. ఈ పరిణామమే, అంటే త్యాగాలతో కూడిన భీష్మ ప్రతిజ్ఞ, దరిమిలా ఉత్పన్నమైన పరిస్థితులే మహాభారత కథా గమనాన్ని మలుపులు తిప్పాయి. కైకేయి కోర్కెల ఫలితంగా తలెత్తిన పరిస్థితుల్లో దశరథుడు, కౌసల్య, రామ-సీత-లక్ష్మణుల త్యాగాలు రామాయణాన్నే రసవత్తరంగా నడిపాయి. కడకవి దుష్ట శిక్ష-శిష్ఠ రక్షణకు కారణమయ్యాయి. సమసమాజం కోసం, అస్తిత్వం కోసం, జాతుల మనుగడ కోసం... విశాల జనహితం కోరి జరిపే సాయుధపోరాటాల్లో ప్రాణాలర్పించే యోధుల త్యాగాలూ చరిత్ర పుటలే! కాలం కత్తుల వంతెనపై త్యాగాల నెత్తుటి నడకలెన్నో! సామ్రాజ్యవాదుల ఉక్కు సంకెలల నుంచి దేశాలకు విముక్తి లభించినా, వర్ణ-జాత్యాహంకారుల నుంచి విభిన్న జాతులకు స్వేచ్ఛావాయువులు దొరికినా... అది, ప్రాణాల్ని పణంగా పెట్టిన ఎందరెందరి త్యాగాల ఫలమో! పోరాటాలే కాదు క్షమలోనూ ఉంది ఔన్నత్యం. మనిషి లక్షణాల్లో అత్యంత ఉత్కృష్ఠమైనది క్షమాగుణం అంటారు. క్షమాగుణానికి త్యాగమే కన్నతల్లి. ప్రతి త్యాగాన్ని మనసారా ప్రశంసిద్దాం. మరిన్ని త్యాగాలకు మనమూ సిద్ధమౌదాం! - దిలీప్‌రెడ్డి -
భావోద్వేగాల భోజనం
బౌద్ధ వాణి బుద్ధుడు కోపానికి, ఆవేశానికి, ఆగ్రహానికి లోనవలేదు. పెపైచ్చు ఎంతో శాంతంగా మాట్లాడి ఆ భావోద్వేగాల భోజనాన్ని గృహస్థునే భుజించమని చెప్పి వెళ్లాడు. ఓ గృహస్థు ఒకనాడు గౌతమ బుద్ధుడిని తన ఇంటికి భోజనానికి ఆహ్వానించాడు. బుద్ధుడు వెళ్లాడు. వెళ్లాక ఆయనకు తెలిసింది ఏమిటంటే ఆ గృహస్థు తనను పిలిచింది భోజనానికి కాదనీ, తనను విమర్శించడానికి, దూషించడానికి అని అర్థమైంది. బుద్ధుడు అతడి తిట్లన్నీ భరించాడు. అతడి ఆరోపణలనన్నింటినీ భరించాడు. అతడి విమర్శలన్నిటికీ చిరునవ్వునే సమాధానంగా ఇచ్చాడు. అయినప్పటికీ ఆ గృహస్థు బుద్ధుడిని దూషించడం మానలేదు. చివరికి బుద్ధుడు అడిగాడు, ‘‘మిత్రమా... నీ ఇంటికి తరచు భోజన సందర్శకులు వస్తుంటారా?’’ ‘‘అవును. వస్తుంటారు’’ అని చెప్పాడు గృహస్థు. ‘‘వారి కోసం నువ్వు ఏమి సిద్ధం చేస్తుంటావు?’’ ‘‘పెద్ద విందునే సిద్ధం చేస్తాను’’ ‘‘ఒకవేళ భోజనానికి వస్తానన్న వారు చివరి నిమిషంలో రాకపోతే, వారి కోసం వండించిన పదార్థాల మాటేమిటి?’’ ‘‘ఏముందీ, మేమే భుజిస్తాం’’ అన్నాడు గృహస్థు. ‘‘సరే, నువ్వు నన్ను భోజనానికి పిలిచావు. కానీ తిట్లు, పరుష పదాలు వడ్డించావు. అంటే నువ్వు నాకోసం సిద్ధం చేసిన పదార్థాలు దూషణలు, విమర్శలు మాత్రమే. కానీ వాటిని నేను తినదలచుకోలేదు. కాబట్టి నువ్వే వాటిని స్వీకరించు’’ అని, అక్కడి నుంచి వెళ్లిపోయాడు బుద్ధుడు. చూడండి, ఇక్కడ బుద్ధుడు ఏం చేశాడో! మాటకు మాట అనకుండా, ప్రతి విమర్శలు చెయ్యకుండా, అసలు కోపానికే తావివ్వకుండా, తనకు రావలసిన కోపాన్ని ఆ గృహస్థుకే తిరిగి ఇచ్చేశాడు. అంటే బుద్ధుడు కోపానికి, ఆవేశానికి, ఆగ్రహానికి లోనవలేదు. పెపైచ్చు ఎంతో శాంతంగా మాట్లాడి ఆ భావోద్వేగాల భోజనాన్ని గృహస్థునే భుజించమని చెప్పి వెళ్లాడు. ఇదంతా గమనించిన శిష్యులకు బుద్ధుడు ఇలా చెప్పాడు. ‘‘ఎప్పుడూ కూడా, ఎవరి మీద కూడా ప్రతీకారం తీర్చుకోకండి. ద్వేషం అనేది ద్వేషంతో చల్లారకపోగా, మరింత ద్వేషానికి దారి తీస్తుంది’’. మనం కూడా జీవితంలో ఇలాంటి అకారణ దూషణలకు, విమర్శలకు గురవుతుంటాం. కొన్ని మాటలు మరీ కఠినంగా, హృదయాన్ని బాధించే విధంగా కూడా ఉంటాయి. అలాంటప్పుడు మనం కోపంతో ఊగిపోకూడదు. ఒకటికి రెండు తిట్లు తిట్టి అవతలి వారి కన్నా దిగజారి పోకూడదు. మనలోని ఆవేశాన్ని, ఆగ్రహాన్ని రెచ్చగొట్టేందుకు అవతలి వ్యక్తులు చేసే ప్రయత్నాలను సఫలం కానీయకూడదు. అప్పుడేం జరుగుతుంది? వాళ్ల మాటలు తిరిగి వాళ్లకే తగులుతాయి. వాళ్ల కోపం తిరిగి వారినే చేరుతుంది. మనం స్వీకరిస్తేనే కదా వారి నుంచి మనకు వచ్చేది. ఆ ‘బహుమతి’ని మనం ఎందుకు తీసుకోవడం? వాళ్ల దగ్గరే ఉండనిద్దాం. మనం మౌనంగా, మనశ్శాంతిగా ఉందాం. చివరికి వారే తెలుసుకుంటారు, తమ వల్ల జరిగిన తప్పేమిటో! ఇసుమంత కూడా కోపం తెచ్చుకోని మన వ్యక్తిత్వాన్ని వారు గౌరవించి తీరుతారు. అయితే మరీ మౌనంగా ఉండిపోతే వారు తమ విమర్శలు సరైనవేనని నమ్మే ప్రమాదం ఉంది. మనలో తప్పు ఉంది కాబట్టే మనం మౌనంగా ఉండిపోయామని అనుకునే అవకాశమూ ఉంది. అందుకే వారిని సహనంగా అడగాలి, ‘‘మీ మాటల్లో వాస్తవముందా?’’ అని అడగాలి. ఒకవేళ వాళ్ల వైపు నుండి వాస్తవం ఉన్నట్లయితే అప్పుడు మనల్ని మనం మార్చుకునే ప్రయత్నం చేయాలి. వాస్తవం లేనట్లయితే సహజంగానే మనకు కోపం వస్తుంది. అప్పుడు వాదించీ, వారించీ లాభం లేదు. వాళ్ల మాటల్లోని కోపాన్ని మనలోకీ తెచ్చుకుని అరచి, ఆగ్రహం చెందీ ప్రయోజనం లేదు. ప్రశాంతతతో కూడిన చిరునవ్వుతోనే మనం అలాంటి వారికి అడ్డుకట్ట వెయ్యాలి. సాధారణంగా ఆధ్యాత్మిక లక్ష్యాలను సాధించే ప్రయత్నంలో ఇలాంటి మౌనమే మనకు తోడ్పడుతుంది.