గౌతమ బుద్ధుడు, ఆయన శిష్యులు ఒక గ్రామం నుంచి ఇంకో గ్రామానికి వెళ్తున్నారు. దారి మధ్యలో ఒక సరస్సు వచ్చింది. గౌతముడు తన అనుచరులలో ఒకరిని పిలిచి, ‘నాకు దాహంగా ఉంది ఆ కొలను నుంచి మంచినీరు తేగలవా?’ అని అడిగాడు. శిష్యుడు కొలను దగ్గరికి వెళ్లాడు. సరస్సులో ఒక గట్టు మీద కొందరు బట్టలు ఉతుకుతున్నారు. అప్పుడే ఒక ఎడ్లబండి సరస్సును దాటుకుంటూ పోతోంది. నీళ్లన్నీ మురిగ్గా, బురదగా, నలకలు తేలుతూ ఉన్నాయి.
‘ఈ నీళ్లను నేను గురువుగారికి ఎలా ఇవ్వగలను?’ అనుకున్నాడు. వెనక్కి తిరిగి వచ్చి, ‘గురువర్యా.. ఆ నీళ్లు తాగేందుకు వీలుగా లేవు’ అని చెప్పాడు. ‘సరే, ఇక్కడే కొద్దిసేపు సేదతీరి బయల్దేరుదాం’ అని చెప్పి, అక్కడ ఉన్న ఒక చెట్టు కింద విశ్రమించాడు గౌతముడు. కొంత సమయం గడచింది. సరస్సు నుంచి మంచినీళ్లు తెమ్మని మళ్లీ ఆ శిష్యుడిని పంపించాడు బుద్ధుడు. శిష్యుడు వెళ్లాడు. ఈసారి సరస్సులోని నీళ్లు స్వచ్ఛంగా, తేటగా ఉన్నాయి! శిష్యుడు ఆశ్చర్యపోయాడు.
పాత్రలోకి నీరు నింపుకుని గురువు దగ్గరికి వచ్చాడు. గౌతముడు ఆ నీటిని శిష్యులకు చూపించాడు. ‘బురద నీటిని అలా వదిలేస్తే.. కొద్దిసేపటి తర్వాత బురద తనంతట అదే అడుగుకు చేరుతుంది. తేట నీరు మిగులుతుంది’ అని చెప్పాడు. ఆయన అంతర్యం శిష్యులకు అర్థమైంది. మనమూ అర్థం చేసుకోవాలి. మనసు అలజడిగా ఉన్నప్పుడు అదే పనిగా ఆలోచించకూడదు. దానిని కొద్దిసేపు అలా వదిలేయాలి. అప్పుడు మనసు దానంతట అదే కుదుటపడుతుంది.
Comments
Please login to add a commentAdd a comment