నలభై రోజులు క్వారెంటైన్‌లో ఉన్నాడు బుద్ధుడు! జీవితానికి దూరంగా బోధివృక్షం కింద ఉన్నాడు.వైశాఖ పూర్ణిమ రోజు సత్యాన్వేషణ ఫలించింది! దుఃఖ కారణం.. దుఃఖ నిరోధం రెండూ కనుగొన్నాడు. దుఃఖ నిరోధానికి ఎనిమిది మార్గాలు. అందులో ఒకటి.. జీవకారుణ్యం కలిగి ఉండటం. ఈ లాక్‌డౌన్ దుఃఖంలో ఇప్పుడది మరీ మరీ అవసరం. చార్‌ధామ్‌లో మూగజీవాలను చేరదీస్తున్నారు. ఈరోజు వైశాఖ పౌర్ణమి. బుద్ధపౌర్ణమి కూడా. మన మదిలోనూ ఒక కారుణ్య మందిరం ఉండాలి.
ఆలయ ద్వారాలు తెరుచుకున్నాయి. దర్శనాలే లేవు. గంగోత్రి, యమునోత్రిలో ఏప్రిల్ 26న, కేదార్‌నాథ్‌లో ఏప్రిల్ 29న దీపాలు వెలిగాయి. బద్రీనాథ్ మే 15న దేదీప్యం అవుతుంది. పూజలు ఉంటాయి. కానీ యాత్రికులే ఉండరు. లాక్‌డౌన్ లేకుంటే ఇక్కడి దృశ్యాలు ఇంకోలా ఉండేవి. ఈ హిమశ్రేణుల్లో భక్తుల బారులు, వారిని మోసుకొచ్చే మూగప్రాణులు కనిపించేవి. అక్టోబర్–నవంబర్ వరకు ఉత్తరాఖండ్ ఈ దేవస్థలికి ఒక ‘బేక్‌క్యాంప్’లా ఉండేది. అన్ని రాష్ట్రాలవారు, అన్ని దేశాలవారు అక్కడికి చేరుకుని ఆలయదర్శన యాత్ర ప్రారంభించేవారు.
గంగోత్రికి గోముఖి నుంచి, యుమునోత్రికి హనుమాన్ ఛెట్టి నుంచి, కేదార్‌నాథ్‌కి గౌరీకుంద్ నుంచి, బద్రీనాథ్‌కి గోముఖి, గౌరీకుంద్‌ల నుంచి పర్వతయానం. పైకి పదీ పదిహేను కి.మీ.ల ఎత్తు! నడవగలిగిన వాళ్లకు నడక. ‘ఎగరగలిగిన’ వాళ్లకు హెలీకాప్టర్. నడవలేని, ఎగరలేని వాళ్లకు గుర్రాలు, గార్ధభాలు! భక్తులకు,భగవంతునికి ఏడాదిలో ఆరునెలలు వారధిగా ఉండే ఈ మూగప్రాణులు ఇప్పుడు తిండి దొరక్క, ఎండిన డొక్కలతో, లోతుకు పోయిన కళ్లతో ఉత్తరాఖండ్ వీధులలో నీరసంగా తిరుగుతున్నాయి. తిరిగే ఓపిక లేనివి ఒక వైపు పడి ఉంటున్నాయి. జీవకారుణ్యాన్ని ప్రబోధించిన గౌతమ బుద్ధుని ఆత్మను బాధించే విషయం ఇది. మనిషి బాధ్యతను గుర్తుచేసే సందర్భం కూడా.
కరోనా లాక్‌డౌన్‌తో ఈ ఏడాది చార్‌ధామ్ యాత్ర రద్దయింది. యాత్రంటే భక్తి మాత్రమే కాదు. కొందరికి భుక్తి కూడా. నాలుగు భక్తిమార్గాలను మూసేయడంతో యాత్రికుల్ని మోసుకెళ్లే జీవవాహన దారుల భుక్తి మార్గం కూడా మూసుకుపోయింది. ఉత్తరాఖండ్‌లోని డెహ్రాడూన్, హల్ద్వానీ, యు.ఎస్.నగర్ ప్రాంతాలలో ఈ ‘పుణ్యజీవాలు’ అనాథ ప్రాణులై ఎండలకు వగరుస్తున్నాయి. దాణాకు డబ్బులేక యజమానులు వాటిని వీధిపాలు చేశారు. గంగోత్రి మార్గంలో గార్థభాలే ప్రధాన వాహనాలు. అవన్నీ ఇప్పుడు డెహ్రాడూన్, చుట్టుపక్కల పట్టణ వీధుల్లో కనిపిస్తున్నాయి! వీటితోపాటు వీధి శునకాలు, పట్టించుకోకుండా వదిలిన ఆవులు. అవి ఇళ్లముందు దొరికే ఆహారంతో ప్రాణాలను నిలుపుకోగలవు. కానీ గార్ధభాలకు, ముఖ్యంగా కొండపైకి బరువులు మోయడానికి అలవాటు పడిన వాటికి ఎక్కువ శక్తినిచ్చే ప్రత్యేకమైన ప్రొటీన్ ఆహారం ఉండాలి.
యాత్రికులు వస్తూ ఉంటే కనుక వాటి యజమానుల చేతుల్లో నాలుగు డబ్బులు ఆడి వాటికి బలమైన ఆహారం లభించేది. ఇప్పుడా పరిస్థితి లేదు. కొన్ని గార్ధభాలైతే పదీ పదిరోజులుగా తిండి లేక బక్కచిక్కి ఉండటాన్ని గమనించిన ‘పీపుల్ ఫర్ యానిమల్స్’ (పి.ఎఫ్.ఎ.) ఉత్తరాఖండ్ కార్యదర్శి గౌరీ మౌలేఖిని ఇప్పటికే విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. ప్రాణాలు కళ్లల్లోకి వచ్చిన ప్రాణుల్ని మూగ జీవుల పునరావాస కేంద్రాలకు తరలించారు. గౌరిని ప్రధానంగా కలవరపెట్టిన విషయం.. చార్‌ధామ్ యాత్ర రద్దవడంతో అందులో భాగమైన మూగజీవాలు అకస్మాత్తుగా వీధులపాలు అవడం! పి.ఎఫ్.ఎ.తో పాటు ఉత్తరాఖండ్‌లోని జంతు జీవ హక్కుల పరిరక్షణ సంస్థలూ ప్రభుత్వానికి ఈ వారం రోజుల్లోనే అనేక లేఖలు రాశాయి. ప్రభుత్వం తీయించిన లెక్కలు కూడా ఆ లేఖల్లోని వివరాలతో సరిపోలాయి. నిరుడు వీధి జీవాల సంఖ్య 5,800 ఉంటే, ఈ ఏడాది ఆ సంఖ్య 8000కు పెరిగింది! ఉత్తరాఖండ్ స్త్రీ, శిశు సంక్షేమ, పశు సంవర్థక శాఖల మంత్రి రేఖా ఆర్య మంగళవారం విధాన సభలో జరిగిన జంతు సంక్షేమ బోర్డు సమావేశం లో అన్ని జిల్లాలోని అనాథ జంతువుల కోసం 2 కోట్ల 50 రూపాయలు కేటాయించారు. అందులో 2 కోట్ల 30 లక్షలు వాటి ఆహారానికి, మిగిలిన మొత్తం వాటి సంరక్షణకు.
‘పీపుల్ ఫర్ యానిమల్స్’ శాఖలు అన్ని రాష్టాల్లోనూ ఉన్నాయి. ఆ సంస్థ వ్యవస్థాపకురాలు మేనకాగాంధీ. అలాగే జంతు జీవ హక్కుల పరిరక్షణ సంస్థలు కూడా దేశంలో అన్ని చోట్లా ఉన్నాయి. ఈ లాక్‌డౌన్‌లో ఆలనా పాలన లేక వీధిపాలైన మూగ ప్రాణులు లక్షల్లోనే ఉంటాయి. వాటిని సంరక్షించేందుకు ఆ సంస్థలతో పాటు, మనకూ చేతనైనంతలో వాటికి నీడనివ్వాలి. మాడే వాటి కడుపులకు ఇంత ఆహారం పెట్టాలి. భక్తి యాత్రలే కాదు, నిస్సహాయ జీవులను చేరదీయడం కూడా పుణ్యకార్యమే. ఆచరణకు ఈ బుద్ధపౌర్ణమిని ఒక ఆరంభంగా చేసుకోవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment