బౌద్ధవాణి: మీలో మీరు వెతుక్కోండి! | borra govardhan devotional column | Sakshi
Sakshi News home page

బౌద్ధవాణి: మీలో మీరు వెతుక్కోండి!

Published Sat, Apr 8 2017 11:50 AM | Last Updated on Tue, Sep 5 2017 8:22 AM

బౌద్ధవాణి: మీలో మీరు వెతుక్కోండి!

బౌద్ధవాణి: మీలో మీరు వెతుక్కోండి!

ఒకసారి బుద్ధుడు నిరంజన నదీతీరంలో ఒక వనంలో ఉన్నాడు. ఆ సమయంలో అక్కడికి దగ్గరలో ఉన్న ఒక పట్టణం నుండి ముప్ఫైమంది యువకులు తమ భార్యలతో సహా ఆ వనానికి విలాసయాత్రకు వచ్చారు. వీరిలో ఒక యువకునికి భార్యలేదు. మిగిలిన వారంతా కలసి ఒక గణిక (వెలయాలు)ను వెంట తెచ్చుకోమన్నారు. అతను అలాగే చేశాడు.

వారంతా ఆ రోజు వనంలో విహరించి, విలాసంగా గడిపారు. పొద్దుపోయేదాకా ఆటలతో, పాటలతో ఆనందంగా గడిపారు. అర్ధరాత్రికి నిద్రలోకి జారుకున్నారు.

తెల్లారి లేచి చూస్తే, ఆ గణిక కనిపించలేదు. అంతేకాదు, వారందరి దగ్గరా ఉన్న విలువైన వస్తువులు, ఆభరణాలూ కనిపించలేదు. వారు భార్యలని ఇళ్లకి పంపి, ఆ గణిక కోసం వెతకడం ప్రారంభించారు.

దారిలో బుద్ధుడు కనిపిస్తే, ఆయన దగ్గరకు వెళ్లి విషయమంతా చెప్పి ‘‘భంతే! మేము మోసపోయాం. విలువైన సంపద పోగొట్టుకున్నాం. వాటికోసమే వెతుకుతూ ఇటు వచ్చాం. ఆ స్త్రీ ఇటేమైనా వచ్చిందా?’’ అనడిగారు.  

అప్పుడు బుద్ధుడు ‘‘యువకులారా! మిమ్మల్ని ఎవరూ మోసగించలేదు. మిమ్మల్ని మీరే మోసగించుకున్నారు. మీరు పోగొట్టుకున్న సంపదకంటే విలువైన సంపదనే పోగొట్టుకున్నారు. అది శీలసంపద. మీరు ఆ శీలసంపదకోసం వెతుక్కోండి. అది వనాల్లో దొరకదు. మీలోనే దొరుకుతుంది. మీలో మీరు వెతుక్కోండి. మీ కోసం మీరు వెతుక్కోండి. శీలసంపద కోసం వెతుక్కోండి’’ అని ప్రబోధించాడు.

బుద్ధుని ప్రవచనం విన్న వారికి తాము ఏమి పోగొట్టుకున్నామో తెలిసింది. ఆ తర్వాత వారు శీలసంపన్నులై ధర్మమార్గంలో నడిచారు.
– డాక్టర్‌ బొర్రా గోవర్ధన్‌

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement