తమ భావాలు, రాజకీయాలూ, సిద్ధాంతాలూ మాత్రమే సరైనవనీ, ఇతరుల అభిప్రాయాలన్నీ తప్పేనన్న భావన సమాజాన్ని ఎంతటి తిరోగమనంలోకి నెడుతుందో అర్థం చేసుకోలేకపోతే ఏ ప్రభుత్వమూ ఎంతో కాలం మనుగడ సాగించలేదు. ప్రభుత్వాల మీద ప్రజలు తమ అభిప్రాయాలను చెప్పే స్వేచ్ఛ ఉంటే, అది ప్రజల కన్నా ప్రభుత్వాలకే ఎక్కువ ప్రయోజనకరం. ఎవరైనా ప్రభుత్వాన్ని, అధికార వ్యవస్థలను విమర్శిస్తే అది రాజద్రోహమని భావిస్తే అది అధికారంలో ఉన్న వారికే చేటు అవుతుంది. వ్యవస్థలపై విమర్శలను అణచివేతతో ఎదుర్కోవాలని భావిస్తే, ప్రజాస్వామ్య పాలనకు బదులు అది పోలీస్ రాజ్యంగా మారిపోగలదు. ఎప్పుడైనా నిరసనను, కోపాన్ని అణచివేస్తే, పెరిగి పెరిగి అది ఒక అగ్నిపర్వతంలా మారుతుంది. అప్పుడు మనల్ని మనం పరిరక్షించుకోవడానికి ఏ చిన్న అవకాశం కూడా మిగలని రోజొకటొస్తుంది.
‘‘అధికార యంత్రాంగం, న్యాయవ్యవస్థ, శాసన వ్యవస్థ, సైనిక బలగాలపై చేసే విమర్శలను రాజద్రోహ నేరంగా పరిగణించకూడదు. అది దేశ ద్రోహం కూడా కాదు. ఒకవేళ ఈ వ్యవస్థలపై విమర్శలను అణచి వేతతో ఎదుర్కోవాలని భావిస్తే, ప్రజాస్వామ్య పాలనకు బదులు అది పోలీస్ రాజ్యంగా మారిపోగలదు’’ అని సుప్రీంకోర్టు న్యాయ మూర్తి జస్టిస్ దీపక్‌గుప్తా అన్న మాటలు ఈ రోజు దేశంలోని ప్రజా స్వామ్య వ్యతిరేకుల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. గత శనివారం అహ్మదాబాద్‌లో జరిగిన న్యాయవాదుల సదస్సులో ఆయన మాట్లా డుతూ ‘‘పాత ఆలోచనలలో ఉన్న లోపాలను వ్యతిరేకించడం వల్లనే నూతన అభిప్రాయాలకు పురుడుపోసిన వాళ్లమవుతాం. పాత విధా నాలను కొనసాగించినట్లయితే, నూతన వ్యవస్థలకు అంకురార్పణ జరగనే జరగదు’’ అంటూ ప్రజాస్వామ్య మూలాలను తడిమిచూసే కీలకమైన తాత్విక చర్చకు తెరతీశారు.
గత కొన్నేళ్ళుగా, భిన్నాభిప్రాయాలను, భిన్నమైన ఆలోచనలను జాతి ద్రోహంగా, దేశ ద్రోహంగా పరిగణించి, అణచివేత పద్ధతులను అనుసరించడం తీవ్రతరమైంది. అలా ఆలోచించిన వాళ్ళకు ఈ దేశంలో నివసించే హక్కే లేదనే దురాభిప్రాయం సమాజంలోని ఒక వర్గంవారు బలంగా ముందుకుతెస్తున్నారు. ఇటీవల కర్ణాటకకు చెందిన శశికాంత్ సెంథిల్ అనే ఐఏఎస్ అధికారి తన ఉద్యోగానికి రాజీనామా చేశారు. ప్రజాస్వామ్య వ్యవస్థ స్వేచ్ఛగా ఇక్కడ అమలు జరగడంలేదని, ఈ దేశంలో ప్రజాస్వామ్య మనుగడ కష్టతరంగా మారిందనీ, రాజీపడుతోన్న పరిస్థితిలో ఉన్నదనీ అందువల్ల తాను ఈ హోదాలో కొనసాగడంలో అర్థం లేదని తేల్చి చెప్పారు. అదే కారణంతో తన పదవిని తృణప్రాయంగా భావిస్తూ, ఒకే ఒక్క కలంపోటుతో తన ఉద్యోగానికి రాజీనామా చేశారు. ఇది శశికాంత్ సెంథిల్ వ్యక్తిగత అభిప్రాయం. ఎవరికైనా నచ్చకపోతే, దాని మీద చర్చచేయవచ్చు. తమ అభిప్రాయాలను కూడా స్వేచ్ఛగా ప్రకటించు కోవచ్చు.
ఇందులో తప్పేమీలేదు. కానీ కేరళకు చెందిన బీజేపీ నాయ కుడు ఒకరు, దీని మీద స్పందిస్తూ, శశికాంత్ సెంథిల్‌కి ఎవరెవరితో సంబంధాలున్నాయో విచారణ జరిపించాలనీ, ఇటువంటి వ్యక్తి పాకిస్తాన్‌కు వెళ్ళి పోవాలని ప్రకటించడం శాంతాన్ని ప్రబోధించిన బుద్ధుడు నడయాడిన నేలలో ముంచుకొస్తోన్న అశాంతికీ, అసహ నానికి నిదర్శనం. ఎవరైనా భిన్నాభిప్రాయాలను వ్యక్తం చేస్తే అది దేశద్రోహంగా ప్రకటించడమంటే పూర్తిగా ఒక నియంతృత్వ ధోరణిని ప్రదర్శించడమే తప్ప మరొకటి కాదు. అంతేకాకుండా భిన్నమైన రాజకీయాభిప్రాయాలను కలిగి ఉన్నందుకు, ప్రభుత్వ విధానా లను తప్పు పట్టినందుకు, ఎంతో మంది రచయితలపై, విద్యార్థి నాయకు లపై, మే«ధావులపై రాజద్రోహం కేసులు నమోదు చేస్తున్నారు. ఇది ప్రజాస్వామ్య స్ఫూర్తికి పూర్తిగా విరుద్ధమైనది. రకరకాల కారణాలను చూపి, ప్రభుత్వాలు తమ చర్యలను సమర్థించుకునే ప్రయత్నం చేస్తు న్నాయి. ఇవన్నీ భారత రాజ్యాంగంలో పొందుపరుచుకున్న ప్రాథ మిక హక్కులను సంపూర్ణంగా ఉల్లంఘించడమే తప్ప మరొకటి కాదు.
రాజద్రోహం పేరుతో రాజకీయ ప్రత్యర్థులను అణచివేయడానికి ఉపయోగిస్తున్న చట్టాలు బ్రిటిష్ కాలం నాటివి. బ్రిటిష్ పాలకులు తమ పాలనకు వ్యతిరేకంగా పోరాటాలూ, తిరుగుబాట్లూ చేయ కుండా నిరోధించడానికి రాజద్రోహం అనే చట్టాన్ని తీసుకొచ్చారు. ఈ చట్టాలు హింసను ప్రేరేపించే వారి పైన ప్రయోగిస్తామని చెప్పినప్పటికీ, ఈ నిర్బంధ చట్టాలు ఎంతో మంది రచయితలపైనా, రాజకీయ కార్యకర్తలపైనా ప్రయోగించారు. దేశ స్వాతంత్య్ర పోరా టాన్ని శాంతియుతంగా, సత్యాగ్రహాల ద్వారా నిర్వహిస్తానని ప్రక టించిన మహత్మాగాంధీపైనే ఈ రాజద్రోహ నేరం మోపి జైలుకి పంపారు. ఆ సందర్భంగా మహాత్మాగాంధీ మాట్లాడుతూ ‘‘ఎవరి కైనా ఒక వ్యక్తి పట్ల, వ్యవస్థ పట్ల అసమ్మతి ఉంటే, ఆ వ్యక్తి తన నిర సనను తెలియజేయడానికి సంపూర్ణ అవకాశముండాలి అన్నారు.
కానీ బ్రిటిష్ పాలకులకు కావాల్సింది ప్రజాస్వామ్యం కాదు, వ్యక్తి గత స్వేచ్ఛ అంతకన్నా కాదు. వారి పాలనను రక్షించు కోవడానికి మాత్రమే ఆ చట్టాలను విచ్చలవిడిగా వినియోగించారు. ఎంతో మంది స్వాతంత్య్ర పోరాట వీరులను ఇదే చట్టంకింద జైళ్ళల్లో నిర్బం ధించారు. వీరి కోసమే అండమాన్‌లాంటి చోట్ల ప్రత్యేక జైళ్ళనే నిర్మిం చారు. అయితే వీటికి వ్యతిరేకంగా ఎన్నో ఉద్యమాలు వెల్లువెత్తాయి. గాం«ధీ నాయకత్వంలో శాసనోల్లంఘన, సత్యాగ్రహం లాంటి నిరస నలు అందులో భాగమే. భగత్‌సింగ్ లాంటి విప్లవ వీరులు బ్రిటిష్ పాలకుల నిర్బంధాన్ని ప్రతిఘటించడానికే ప్రాణత్యాగం చేశారు.
ఈ నేపథ్యంలోనే భారతదేశంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలు ఒకచోట చేరి స్వాతంత్య్రంతో కూడిన ప్రజాస్వామ్య రాజ్యాంగం కావాలని తీర్మానించాయి. ఇప్పుడు మనం రాజ్యాంగంలో పొందు పరుచుకున్న ప్రాథమిక హక్కులలో ఎక్కువభాగం ఆ రోజు రూపొం దించినవే. మన రాజ్యాంగంలో చేర్చిన ఆర్టికల్ 19 సారాంశం నెహ్రూ కమిటీ నివేదికలో చేర్చారు. నెహ్రూ కమిటీ నివేదికలో నాలుగవభా గంలో నాలుగవ సెక్షన్‌లో భావప్రకటనా స్వేచ్ఛ సమావేశం హక్కు, సంఘం నిర్మాణం చేసుకునే హక్కులను స్పష్టంగా పేర్కొన్నారు. బ్రిటిష్ పాలకులు భారత ప్రజల స్వేచ్ఛను, జీవించే హక్కును హరి స్తుంటే, దానిని ప్రతిఘటించడానికి, నిరోధించడానికి నూతన రాజ్యాంగం ఇటువంటి హక్కులను ప్రతిపాదించింది.
ఆ తర్వాత బాబాసాహెబ్ అంబేడ్కర్ నాయకత్వంలో రూపొందించిన రాజ్యాం గంలో ఇటువంటి హక్కులన్నింటినీ మరింత శక్తిమంతంగా మార్చారు. భారత రాజ్యాంగం పీఠికలోనే స్వేచ్ఛ, సమానత్వం గురించి ఒక నూతన భారత ప్రజాస్వామ్య వ్యవస్థకు పునాదులు వేశారు. ఈ రోజు మనం రాజ్యాంగంలో చేర్చుకున్న ఆర్టికల్ 19పైన ఎంతో మంది రాజ్యాంగసభ సభ్యులు సుదీర్ఘంగా చర్చించి స్వేచ్ఛ, స్వాతంత్య్రాల రక్షణ కోసం ప్రాథమిక హక్కులను చేర్చారు. ఆర్టికల్ 21 ద్వారా జీవించే హక్కును ఆర్టికల్ 25 ద్వారా ఏ మతమైనా అనుసరించడానికి, ప్రచారం చేయడానికి పౌరులకు హక్కు ఉంటుం దని పేర్కొన్నారు. ఇది కూడా స్వాతంత్య్ర పోరాట కాలంలో వచ్చిన అనుభవాల సారమే.
అటువంటి చరిత్ర కలిగిన ప్రజాస్వామ్య చట్టాలు ఈ రోజు ప్రమాదంలో పడడం అందరినీ ఆందోళనకు గురిచేస్తోంది. నిజానికి సమాజం ముందుకు సాగాలన్నా, ప్రగతిని సాధించాలన్నా ప్రశ్నించే స్వభావం, విభేదించే స్వాతంత్య్రం ఉండాలి. సోక్రటీస్ లాంటి వాళ్ళు ప్రశ్నించడం నేర్వకపోయి వుంటే ప్రజాస్వామ్య వ్యవస్థకు పునాదులు పడేవా? చర్చల ద్వారానే ప్రజలు శాంతిగా ఉంటారని భావించి అందుకోసం గౌతమ బుద్ధుడు ఇల్లు వదిలి పెట్టకపోతే భారత దేశం అరాచకంలో అంతమై ఉండేది కాదా? అలాగే అరిస్టాటిల్, ప్లేటో, జీసస్, మహమ్మాల్, గురునానక్, కార్ల్ మార్క్స్, మహాత్మాగాంధీ, అంబేడ్కర్ లాంటి వారు లేకపోతే సమాజ గమనం ఏ తీరాలకు చేరేదో ఊహించలేం. చైనా విప్లవ నాయకులు మావోసేటుంగ్ చెప్పి నట్టు వంద భావాలు ఘర్షణపడనీయండి, వందపూలు వికసించనీ యండి అనే భావన ఇప్పటికీ ఎప్పటికీ ప్రజాస్వామ్యానికి మూల సూత్రం కావాలి.
తమ భావాలు, రాజకీయాలూ, సిద్ధాంతాలూ మాత్రమే సరైనవనీ, ఇతరుల అభిప్రాయాలన్నీ తప్పేనన్న భావన సమాజాన్ని ఎంతటి తిరోగమనంలోకి నెడుతుందో అర్థం చేసుకో లేకపోతే ఏ మతం, ఏ ప్రభుత్వం ఎంతో కాలం మనుగడ సాగించడం సాధ్యం కాదు. ప్రభుత్వాల మీద ప్రజలు తమ అభిప్రాయాలను చెప్పే స్వేచ్ఛ ఉంటే, అది ప్రజల కన్నా ప్రభుత్వాలకే ఎక్కువ ప్రయో జనకరం. కనీసం ఎప్పటికప్పుడు తమ తప్పును తెలుసుకొని కొన్నిం టినైనా సరిదిద్దుకొని ముందుకు సాగే అవకాశం ఉంటుంది. చివరకు రాచరిక పాలనలో సైతం ప్రజల అభిప్రాయాలను తెలుసుకునేం దుకు రాజులు మారువేషాల్లో తిరిగే వారని చదివాం. అది నిజమైనా, అబద్ధమైనా దాని స్ఫూర్తిని మాత్రం విస్మరించకూడదు. అంతే తప్ప ఎవరైనా ప్రభుత్వాన్ని, అధికార వ్యవస్థలను విమర్శిస్తే అది రాజ ద్రోహమని భావిస్తే అది అధికారంలో ఉన్న వారికే చేటు అవుతుంది. ఎప్పుడైనా నిరసనను, కోపాన్ని అణచివేస్తే, పెరిగి పెరిగి అది ఒక అగ్నిపర్వతంలా మారుతుంది. అప్పుడు మనల్ని మనం పరిరక్షించు కోవడానికి ఏ చిన్న అవకాశం కూడా మిగలని రోజొకటొస్తుంది.
వ్యాసకర్త: మల్లెపల్లి లక్ష్మయ్య,
సామాజిక విశ్లేషకులు ‘ మొబైల్ : 81063 22077
Comments
Please login to add a commentAdd a comment