కాపాడుకోవాల్సిన లౌకిక కాంక్ష | Mallepalli Laxmaiah Guest Columns On Sahir Ludhianvi Death Anniversary Special | Sakshi
Sakshi News home page

Published Thu, Oct 25 2018 12:59 AM | Last Updated on Thu, Oct 25 2018 12:59 AM

Mallepalli Laxmaiah Guest Columns On Sahir Ludhianvi Death Anniversary Special - Sakshi

‘‘నేను ఇస్లామిక్‌ పాకిస్తాన్‌లో బతకను. లౌకిక భారత దేశంలో జీవిస్తాను’’ అన్న సాహిర్‌ లూథియాన్వీ ప్రకటన ఆయనలోని అద్భుతమైన లౌకిక కాంక్షాపరుడిని మనకు పరిచయం చేస్తుంది. ఆయన ప్రతి అక్షరం అణచివేతపై ఎక్కుపెట్టిన విల్లంబే. ఆయన ప్రేమగీతాల్లో సైతం స్త్రీల పక్షపాత ధోరణి గోచరిస్తుంది. మొత్తంగా చెప్పాలంటే ఆయనొక వర్గదృక్పథాన్ని పుణికి పుచ్చుకున్న కమ్యూనిస్టు, స్త్రీల అస్తిత్వాన్ని చాటిచెప్పిన ఫెమినిస్టు. ఈనాటి సమాజానికి సాహిర్‌ లూథియాన్వీ వదిలివెళ్ళిన లౌకిక అభ్యుదయ, ప్రజాస్వామ్య వారసత్వాన్ని మనం కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

‘‘తూ హిందూ బనేగాన ముసల్‌మాన్‌ బనేగా ఇన్‌సాన్‌కీ అవులాద్‌ హై ఇన్‌సాన్‌ బనేగా’’ దాదాపు ఆరు దశాబ్దాల క్రితం ఈ పాట యావత్‌ భారతదేశాన్నీ ఓ కుదుపు కుదిపింది. ‘దూల్‌ కా ఫూల్‌’ అనే హిందీ చిత్రంలో ప్రముఖ ఉర్దూ కవి సాహిర్‌ లూథియాన్వీ కలం నుంచి జాలువారిన సినీగీతమిది. ఇదే పాటలో మాలిక్‌నే హర్‌ ఇన్‌సాన్‌ కో/ఇన్‌సాన్‌ బనాయా హమ్‌నే ఉసే హిందూ యా ముసల్‌మాన్‌ బనాయా/ కుద్‌రత్‌ నే తో హమే బక్సీ థీ ఏకీ ధర్తీ హమ్‌ నే కహీ భారత్‌ /కహీ ఇరాన్‌ బనాయా!

ఈ గేయం కవి సాహిర్‌ లూథియాన్వీలోని గొప్ప మానవీయ దృక్పథానికి అద్దం పడుతుంది. దూల్‌ కా ఫూల్‌ చిత్రం 1959లో అప్పటికి భారత దేశంలోనూ, పాకిస్తాన్‌లోనూ అల్లర్లు జరిగి చేదు జ్ఞాపకాలను మూటగట్టుకున్న సందర్భంలోనిది. లక్షలాది మంది ప్రజలు, వేలాది కుటుంబాలు ఉన్న ఇళ్లనీ, కన్న తల్లుల్నీ వదిలి కొంపాగోడూ వెతుక్కుంటూ దేశాన్ని వీడి వెళ్లాల్సి వచ్చింది. ఆ సమయంలోనే దూల్‌ కా ఫూల్‌ చిత్రం తీసారు. ఈ చిత్రం ఇద్దరు ప్రేమికుల మధ్య జరిగిన సంఘర్షణ.

పెళ్ళి కాకముందే తల్లి అయిన ప్రేమికురాలు తన ప్రేమను అంగీకరించి ఇరువురికీ పుట్టిన బిడ్డను తమ బిడ్డగా అంగీకరించి స్వీకరించాల్సిందిగా ప్రియుడిని కోరుతుంది. అతను నిరాకరించడంతో ఆమె సమాజానికి భయపడి తన ఆరు నెలల పసికందును పట్టణం సమీపంలోని ఓ చిట్టడివిలో వదిలి వెళుతుంది. అదే తోవలో వెళుతోన్న ఒక ముస్లిం వ్యక్తి ఆ పసివాడిని వెంటతీసుకువెళ్లి కంటికి రెప్పలా కాపాడుకొని పెంచి పెద్దచేస్తాడు. కులమేదో, మతమేదో కూడా తెలియని ఆ అనాథ బాలుడిని పెంచుకున్నందుకు అతడిని ఇస్లాం మత పెద్దలు వెలివేస్తారు.

వెలివేతను లెక్కచేయని ఆ ముస్లిం వ్యక్తి ఆ పిల్లవాడిని తనతో తీసుకెళతాడు. పైగా ఆ పిల్లవాడికి రోషన్‌ అనే హిందూ పేరు పెట్టి అల్లారుముద్దుగా పెంచుకుంటాడు. ఆ సందర్భంలోనే చిత్రీకరించిన పాట ఇది. హిందూ ముస్లిం అనేవి మనుషులు గీసుకున్న విభజన రేఖలేననే సందేశాన్ని ఈ పాటలో కవి లూథియాన్వీ వెలిబుచ్చుతాడు.  

ఇప్పటికీ ఈ మతాల విభజనరేఖని చెరపలేని సమాజానికి అరవైయేళ్ళ క్రితమే సర్వమానవ సౌభ్రాతృత్వ సందేశాన్నిచ్చిన లూథియాన్వీ జీవితం కూడా సరిగ్గా ఇదే ఒరవడిలోంచి రావడం యాదృచ్ఛికమే కావచ్చు. నాటికీ, నేటికీ లూథియాన్వీ... ప్రేమకూ, ప్రేమికులకూ పాటల పట్టాభిషేకం కట్టినవాడు. అటువంటి సాహిర్‌ లూథియాన్వీ జీవితం గురించి తెలిసిన వారు బహుతక్కువనే చెప్పాలి. లూథి   యాన్వీ అసలు పేరు అబ్దుల్‌ హయీ. సాహిర్‌ లూథి  యాన్వీ ఆయన కలంపేరు. ఆయన లూథియానాలో జన్మించడం వల్ల లూథియాన్వీ అయ్యాడు. కవిత్వం రాయడం వల్ల సాహిర్‌ అయ్యాడు.

సాహిర్‌ లూథి    యాన్వీగా మారిన అబ్దుల్‌ హయీ మార్చి 8, 1921న జన్మించాడు. తల్లి సర్దార్‌ బీబీ. ఆయన తండ్రి ఫజల్‌ మహమ్మద్‌. ఫజల్‌ మహమ్మద్‌ అత్యంత సంపన్న కుటుంబానికి చెందిన వాడు. తన సంపదకు వారసుడు కావాలనే కారణంతో 11 పెళ్లిళ్ళు చేసుకున్నాడు. అందులో సాహిర్‌ లూథియాన్వీ తల్లి సర్దార్‌ బీబీ ఒకరు. లూథియాన్వీ తల్లి సామాజిక, ఆర్థిక నేపథ్యం ఫజల్‌ మహమ్మద్‌ కుటుంబానికి నచ్చలేదు. దాంతో తమ వివాహ సంబంధాన్ని ఫజల్‌ మహమ్మద్‌ నిరాకరించాడు. దాంతో సర్దార్‌ బీబీ కోర్టుకు వెళ్ళింది. కోర్టుకి వెళ్ళకముందే ఫజల్‌ ద్వారా సర్దార్‌ బీబీ గర్భందాల్చింది. కింది కోర్టులో ఆమె వీగిపోయింది. లూథియాన్వీని తన కొడుకుగా ఫజల్‌ మహమ్మద్‌ అంగీకరించలేదు. బీబీ మాత్రం తన పట్టువదల్లేదు.

లాహోర్‌లోని ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. పై కోర్టు ఫజలుద్దీన్‌ సాహిర్‌ లూథియాన్వీకి తండ్రి అని నిర్ధారించింది. సాహిర్‌ ఫజలుద్దీన్‌కు నిజమైన వారసుడని ప్రకటించింది. తల్లి అయిన సర్దార్‌ బీబీని సాహిర్‌ సంరక్షకురాలిగా ఉండాలని ఆదేశించింది. సాహిర్‌ లూథియాన్వీని చంపడానికి సైతం ప్రయత్నిస్తారు. దీంతో సర్దార్‌ బీబీ తన కొడుకు సాహిర్‌ లూథియాన్వీని తీసుకొని బతుకుదెరువుకోసం అజ్ఞాత జీవితంలోకి వెళుతుంది. అందుకే సాహిర్‌ లూథియాన్వీ కవిత్వం తన తల్లి జీవితంలో అనుభవించిన కష్టాలతో పాటు వేనవేల స్త్రీల జీవి తాల్లో ముసురుకున్న సవాలక్ష సమస్యల్ని ప్రతిబింబిస్తుంది.

సాహిర్‌ లూథియానాలో తన చదువుని కొనసాగించారు. కాలేజీ రోజుల్లోనే 1947 సంవత్సరంలో బ్రిటిష్‌ పాలకులకు వ్యతిరేకంగా నిలబడినందుకు కాలేజీ నుంచి యాజమాన్యం బహిష్కరించింది. లూథియానాలోని సతీష్‌ చందర్‌ ధావన్‌ ప్రభుత్వ కళాశాలలో ఆయన ఒక రోజు ఇచ్చిన ఉపన్యాసం ఆయన జీవితాన్ని మార్చివేసింది. చదువుని మధ్యలోనే ఆపివేసిన సాహిర్‌ తననూ, తన తల్లినీ పోషిం చుకోవడానికి చిన్నా చితకా ఉద్యోగాలెన్నో చేసాడు. కానీ ఆయన తన కవితాకాంక్షను మాత్రం వదులుకోలేదు. చేదుజ్ఞాపకాలు(బిట్టర్‌నెస్‌) పేరుతో కవితా సంపుటిని ప్రచురించారు. ఈ కవితా సంపుటి ప్రచురణతో సాహిర్‌ లూథియాన్వీ సాహితీ ప్రపంచంలోకి అడుగుపెట్టారు. ఆయన నాలుగు ఉర్దూ పత్రికలకి ఎడిటర్‌గా పనిచేసారు.

అందులో ఆదాబ్‌ యే లతీఫ్, సహకార్, ప్రిత్‌లరీ, సవేరా పత్రికలు ఈయన సంపాదకత్వంలో విజయవంతంగా నడిచాయి. ఆ సందర్భంలోనే భారత కమ్యూనిస్టు పార్టీ అనుబంధ సంస్థ అయిన అభ్యుదయ రచయితల సంఘంలో సభ్యుడిగా చేరారు. కమ్యూనిస్టు భావజాల ప్రభావంతో రాసిన రాతలు అప్పటి పాకిస్తాన్‌ ప్రభుత్వానికి కంట గింపుగా మారాయి. 1949లో ఆయనను అరెస్టు చేయడానికి పోలీసులు వారంట్‌తో వచ్చారు. దాంతో సాహిర్‌ ఢిల్లీ పారిపోయాడు. ఆ సందర్భంలోనే ‘‘నేను ఇస్లామిక్‌ పాకిస్తాన్‌లో బతకను. లౌకిక భారత దేశంలో జీవిస్తాను’’ అన్న సాహిర్‌ లూథియాన్వీ ప్రకటన ఆయనలోని అద్భుతమైన లౌకిక కాంక్షాపరుడిని మనకు పరి చయం చేస్తుంది. 

సాహిర్‌ లూథియాన్వీ సినీగేయ రచయితగానే ప్రపంచానికి పరిచయం. అయితే ఆయనలో పరవళ్ళు తొక్కిన అభ్యుదయ ప్రజాకవిత్వం గురించి మాత్రం కొందరికే తెలుసు. ఆయన ఢిల్లీ నుంచి ముంబాయికి మారినప్పుడు, సినిమాలలో పాటలు రాయాలని నిర్ణయించుకున్నప్పుడు అభ్యుదయ రచయితల సంఘంలోని ఆయన మిత్రులు ఆయనపై విమర్శల వర్షం కురిపించారు. అయితే చిత్రపరిశ్రమకు బయట ఆయన రాసిన కవిత్వం మాత్రమే ఆ విమర్శలకు సరైన సమాధానం అయ్యింది. విమర్శకులెవ్వరూ ఆ తరువాత నోరుమెదపలేదు. సాహిర్‌ లూథియాన్వీ కవిత్వంలో పైన పేర్కొన్నట్టుగానే మహిళల జీవితం ఒక కోణం అయితే పేదలు, కార్మికులు, అనాథలు మరో పార్శ్వంగా ఆయన కవితాలోకాన్ని ఆశ్రయిస్తారు. పెట్టుబడిదారీ విధానం, దోపిడీ, వివక్ష, అణచివేత, ఇవన్నీ ఆయనకు బద్ధ శత్రువులు. 

తాజ్‌మహల్‌ అందచందాలనూ, చలువరాతి సోయగాలనూ పొగిడిన కవులే మనకెంతో మంది కనిపిస్తారు. ఈ కట్టడం ప్రేమకు చిహ్నమే కావచ్చు. రాజుల గొప్పతనమే కావచ్చు. కానీ తాజ్‌మహల్‌ నిర్మాణంలో శ్రమజీవుల నెత్తుటి ధారలను కవిత్వాం తరంగంలోకి ఇంకించింది మాత్రం సాహిర్‌ లూథి యాన్వీనే. నూతన సంవత్సర వేడుకల్లో మునిగి తేలుతూ సంబరాలు చేసుకుంటున్న వాళ్ళకార్లను వెంబడించే పేదపిల్లల గురించి రాస్తాడు. రెండవ ప్రపంచ యుద్ధం విధ్వంసాన్ని కళ్ళారా చూసిన సాహిర్‌ లూథియాన్వీ యుద్ధాన్ని తీవ్రస్వరంతో ద్వేషిస్తాడు. యుద్ధం ఒక సమస్య మాత్రమే. అది సమాధానం కాదు అని ప్రకటించిన లూథి యాన్వీ యుద్ధం ఈ రోజు రక్తపాతాన్ని సృష్టిస్తే, రేపు అది ఆకలినీ, ఆర్తనాదాల్నీ బహూకరిస్తుందంటాడు. పేద, అణగారిన వర్గాల జీవితాల్లోని ప్రతి చీకటి కోణాన్నీ తడిమి చూసినవాడు సాహిర్‌. పీడితులకూ, పేదలకూ రేపటి కలల సౌధాన్ని నిర్మించుకోవడానికి ఏకమౌదాం రండి అంటూ పిలుపునిస్తాడు. 

ఈనాటి సమాజానికి సాహిర్‌ లూథియాన్వీ వదిలివెళ్ళిన లౌకిక అభ్యుదయ, ప్రజాస్వామ్య వారసత్వాన్ని మనం కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రస్తుతం భారతదేశంలో నెలకొన్న పరిస్థితులు సాహిర్‌ స్వప్నాన్ని చిన్నాభిన్నం చేసేవిగా ఉన్నాయి. మతాల మధ్య, సాంప్రదాయాల మధ్య, అగాధాలను సృష్టించి రాజకీయ పబ్బం గడుపుకుంటున్న శక్తులు నానాటికీ విజృంభిస్తున్నాయి. ఇవి భారతదేశ వారసత్వ భావనలను ధ్వంసం చేస్తోన్న పరిణామాలు. సరిగ్గా ఇక్కడే సాహిర్‌ లూథియాన్వీ మనకు ఒక వెలుగుదివ్వెలా కనిపిస్తాడు. పాకిస్తాన్‌ నుంచి ఇండియాకు పారిపోయి వచ్చిన సమయంలో ఆయన అన్న మాటలు మనకు ప్రతిక్షణం గుర్తుకు రావాలి. అంతేకాదు ఆ మాటల అంతస్సారం మనకు మార్గదర్శకం కావాలి. లౌకిక భారతావనిలో జీవిస్తాను అని ప్రకటించిన సాహిర్‌ లూథియాన్వీ వ్యాఖ్యలు మనకాదర్శం కావాలి. 

సాహిర్‌ లూథియాన్వీ తల్లి కూడా ఎంతో సాహసోపేతమైన జీవితాన్ని గడిపింది. అదే సాహసం తన కొడుక్కి వారసత్వంగా అందించింది. అదే ఆయనను నిజాయితీగా, నిర్భీతితో ఎదిగేలా చేసింది. ఆయనలో అత్యంత మానవీయతను నాటింది. అతడిని శ్రామిక జనపక్షపాతిగా నిలిపింది. ఎంత ఎత్తుకెదిగినా తన పునాదిని మరువకుండా చేసింది. కష్టజీవుల కన్నీళ్ళను తడిమి చూసింది. ఆయన ప్రతి అక్షరం అణచివేతపై ఎక్కుపెట్టిన విల్లంబే. ఆయన ప్రేమగీతాల్లో సైతం స్త్రీల పక్షపాత ధోరణి గోచరిస్తుంది. మొత్తంగా చెప్పాలంటే ఆయనొక వర్గదృక్పథాన్ని పుణికి పుచ్చుకున్న కమ్యూనిస్టు, స్త్రీల అస్తిత్వాన్ని చాటిచెప్పిన ఫెమినిస్టు. 

వ్యాసకర్త: మల్లెపల్లి లక్ష్మయ్య, సామాజిక విశ్లేషకులు
ఈ–మెయిల్‌ : lmallepalli@gmail.com

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement