విలియం విల్‌బర్‌ఫోర్స్ (ఫైల్ ఫొటో)
♦ కొత్తకోణం
బ్రిటిష్ పాలన వల్ల దేశం ఎన్నో నష్టాలను ఎదుర్కొని ఉన్నప్పటికీ, కుల వ్యవస్థను కదిలించడంలో బ్రిటిష్ పాలన పాత్రను కాదనలేం. కులం మూలాలను పెకిలించిన తొలి రాజకీయోపన్యాసంతో బ్రిటన్ హక్కుల నేత విలియం విల్‌బర్‌ఫోర్స్ 205 సంవత్సరాల క్రితం అందించిన కుల వ్యతిరేక చైతన్యం బ్రిటిష్ పాలకులకు కూడా మేలుకొలుపు అయింది. ఈ ప్రసంగం తదనంతరం భార త్‌లో ఎన్నో సంస్కరణలకు పునాది వేసింది.. అప్పటికే ఎదిగివస్తున్న భారతదేశ యువతరానికి మార్గ నిర్దేశం చేసింది. కుల వ్యవస్థకు వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటంలో ఆయన తొలి అడుగులు భారతీయ సమాజానికి అప్పటికీ, ఇప్పటికీ అనుసరణీయమే.
‘‘భారతదేశంలోని కుల వ్యవస్థ మనిషి వ్యక్తిగత ఎదుగుదలకు అవరోధంగా ఉంది. స్వేచ్ఛా సమాజంలో ఒక వ్యక్తి ఎంతటి పేద రికం నుంచైనా బయటపడగలడు. నిరంతర శ్రమ, ప్రయత్నం ద్వారా ఎలాంటి శిఖరాలనైనా అధిరో హించగలడు. కుల వ్యవస్థ అలాంటి అవకాశాలను అడ్డుకుంటోంది. దానితో ఏ కులంలో పుట్టిన వ్యక్తి ఆ కులంలోనే, శాశ్వతంగా ఉండిపోతున్నాడు. ఇది కుల వ్యవస్థ అభివృద్ధి నిరోధక స్వభావాన్ని బయటపెడు తున్నది’’ అని రెండు శతాబ్దాల క్రితం 1813 జూన్ 22న బ్రిటిష్ పార్లమెంటులో విలియం విల్‌బర్‌ఫోర్స్ సునిశిత పరిశీలనానంతరం చేసిన వ్యాఖ్య ఇది. దాదాపు 205 ఏళ్ల క్రితం భారత కుల వ్యవస్థపై విల్ బర్‌ఫోర్స్ మూడు గంటలు అనర్గళంగా మాట్లా డారు. ఈ ఉపన్యాసం రాతప్రతి 109 పేజీలుంది. వర్ణ వివక్ష కన్నా కుల వివక్ష, కుల అసమానతలు చాలా క్రూరమైనవని విల్‌బర్‌ఫోర్స్ ఈ ఉపన్యా సంలో వ్యాఖ్యానించారు. ‘జాతి వివక్ష నుంచి మనిషి బయటపడవచ్చు. కుల వ్యవస్థ సంకెళ్ళను తెంచుకో వడం సాధ్యం కాదు,’ అని ఆయన తేల్చి చెప్పారు. విల్‌బర్‌ఫోర్స్ సుదీర్ఘకాలం బ్రిటిష్ హౌస్ ఆఫ్ కామన్స్ సభ్యుడిగా ఉండడం మాత్రమే కాకుండా, బానిస వ్యవస్థ నిర్మూలన కు నిరంతరం కృషి చేశారు. బ్రిటన్‌లోని కింగ్‌స్టన్ అపాన్ హల్‌లో ఆయన 1759 ఆగస్ట్ 24న జన్మించారు. పార్లమెంటులో స్వతంత్రుడి గానే వ్యవహరించారు. ఇండియాలో ఆర్థిక, వ్యాపార కార్యకలాపాలు సైతం కులం గుర్తింపు మీదే ఆధార పడి సాగుతుంటాయని, గ్రామాల్లో అప్పులు ఇచ్చే పద్ధతిని కూడా కులం ప్రభావితం చేస్తుందని ఆయన వివరించారు.
అప్పటికే బ్రాహ్మణాధిపత్య భావ జాలం ఎంతగా విస్తరించిందో కూడా ఆయన ఉప న్యాసం పరిశీలిస్తే అర్థమవుతుంది. ‘బ్రాహ్మణు డికి అప్పిస్తే అతను చెల్లించే వడ్డీ ఒక శాతం మాత్రమే. అదే క్షత్రియుడైతే 2 శాతంతో సరిపెట్టుకో వచ్చు. శూద్రులకు 3 శాతం వడ్డీగా నిర్ణయిస్తారు,’ అని చెపుతూ ఆర్థిక దోపిడీకీ, కులానికీ ఉన్న సంబంధాన్ని తేటతెల్లం చేశారు. ఈరోజు మనం మాట్లాడుకుం టున్న శిక్షల అమల్లో సైతం కులం వాసనలను ఆయన తూర్పారబట్టారు. ఆధిపత్య కులాలు నేరాలు చేస్తే తక్కువ శిక్షలు, శూద్రులు నేరాలు చేస్తే కఠిన శిక్షలు అమలులో ఉంటాయని ఆయన వెల్లడించారు. హైదరాబాద్ ఆర్మీలో పనిచేసే సైనికులు కూడా తమ కులాన్ని బట్టి వేషధారణను వదులుకోవాలని గత జూలైలో (1812) ఇచ్చిన ఆదేశాన్ని ఎవ్వరూ పాటిం చలేదని, చివరకు అలాంటి ఆదేశాలను వెనక్కి తీసు కోవాల్సి వచ్చిందని కూడా విలియం గుర్తుచేశారు. ఇండియాలో కుల వ్యవస్థను వ్యతిరేకించే సాంప్రదా యాలు బౌద్ధం, సిక్కు మతాల్లో కనిపిస్తున్నాయని ఆయన పేర్కొ న్నారు. ‘‘అక్కడ భర్త మరణిస్తే సతి పేరుతో స్త్రీలను మంటల్లో కాల్చి చంపే దురాచారం అమలులో ఉంది. ఆడ పిల్లలను పురిటిలోనే చంపేస్తు న్నారు. భర్త మరణిస్తే మళ్లీ పెళ్లికి అవకాశం లేదు,’’ అంటూ ఎన్నో విషయాలు వివరించారు. మానవ త్వాన్ని ప్రేమించే ఎవరైనా ఇలాంటి క్రూరమైన విధా నాన్ని సహించకూడదనీ, పార్లమెంటు సభ్యులుగా అందరూ ఈ విధానాన్ని అరికట్టాలని ప్రసంగం చివర్లో ఆయన అభ్యర్థించారు.
కులం మూలాలు పెకిలించిన ఉపన్యాసం!
నిజానికి కులం మూలాలను పెకిలించిన తొలి రాజకీ యోపన్యాసం ఇదే. హక్కుల నేత విల్‌బర్‌ఫోర్స్ చేసిన ప్రసంగం తదనంతరం భారత్‌లో ఎన్నో సంస్కరణలకు పునాది వేసింది. విల్‌బర్‌ఫోర్స్ కేంబ్రిడ్జి సెయింట్ జాన్స్ కళాశాలలో ఉన్నత విద్యను అభ్యసించారు. 1780లో తొలిసారి పార్లమెంటులో అడుగుపెట్టి 1825 వరకు కామన్స్ సభకు ఎన్నిక వుతూ వచ్చారు. బ్రిటన్ దాదాపు పదహారవ శతాబ్దం నుంచే బానిస వ్యాపారాన్ని మొదలు పెట్టింది. అయితే 1780 నుంచి బ్రిటన్‌లో బానిసల వ్యాపారం, ఉత్పత్తిలో సైతం బానిసల వినియోగంపై ఉద్యమం మొదలైంది. జేమ్స్ రామ్సే అనే రచయిత మూడు సంవత్సరాలు బానిసలతో గడిపి ‘‘ఆఫ్రికన్ స్లేవ్స్ ఇన్ ద బ్రిటిష్ సుగర్ కాలనీస్’’ అనే పుస్తకం రాశారు. ఇది 1784లో అచ్చయింది. మూడేళ్ల తర్వాత విల్‌బర్‌ఫోర్స్ దీన్ని చదివారు. దీనితో ఉత్తేజితుడై బానిస వ్యాపారాన్ని విమర్శించడంతో పాటు బానిస వ్యవస్థనే నిర్మూలించాలనే కృత నిశ్చ యానికి వచ్చారు.
మొదటిసారి 1787 మే 22న బానిస వ్యవస్థ నిర్మూలనకు ఓ సొసైటీ ఏర్పాటైంది. విల్‌బర్‌ఫోర్స్ అందులో సభ్యునిగా చేరలేదుగాని ఆ సొసైటీతో సన్నిహితంగా పనిచేయడం మొదలు పెట్టారు. 1791లో ఆయన దీనిలో సభ్యుడిగా చేరి బానిసత్వ నిర్మూలనలో కీలక పాత్ర పోషించారు. ప్రజల్లో బానిస వ్యవస్థపై అవగాహన కల్పించడానికి ఆ సొసైటీతో పాటు విల్‌బర్‌ఫోర్స్ విశేష కృషి చేశారు. చివరికి 1833 జూలై 26న బానిస వ్యవస్థ నిర్మూలన చట్టాల్ని బ్రిటిష్ పార్లమెంటు ఆమోదిం చింది. స్వతంత్ర ఎంపీగా ఉంటూనే ప్రభుత్వాలను మెప్పించడంలో ఆయన అనుసరించిన విధానం ప్రత్యేకమైంది. అందువల్లనే చట్టం కూడా సాధ్యమైం దనిపిస్తుంది. విల్‌బర్‌ఫోర్స్ మరణించిన నెల తర్వాత బిల్లు చట్ట రూపం దాల్చింది. ఈ చట్టం రూపుదిద్దుకున్న వెంటనే దాదాపు 80 వేల మంది బానిసలు విముక్తి పొందారు. అలాంటి మానవతా హృదయం కలిగిన విలియం విల్‌బర్‌ఫోర్స్ సహజం గానే కుల వ్యవస్థపై స్పందించారు. కుల వ్యవస్థ భార తదేశ పురోగమనాన్ని అడ్డుకుంటోందని, దాన్ని పరిష్కరించాలని బ్రిటిష్ పార్లమెంటును కోరారు.
విల్‌బర్‌ఫోర్స్ మార్గంలో రాజా రామ్మోహన్ రాయ్, ఫూలే, అంబేడ్కర్ బ్రిటిష్ మేధావులు, పాశ్చాత్య విద్య అందించిన చైతన్యం వల్ల భారతదే శంలో పునర్జీవన ఉద్యమం మొదలైంది. హిందూ మతం, కుల దురాచారాలను తొలగించాలనే లక్ష్యంతో ఎంతో మంది కృషి చేశారు. అందులో హిందూ మతాన్ని సంస్కరించాలని ప్రయత్నించిన వారు కూడా ఉన్నారు. లేదు కుల నిర్మూలనే అస మానతలకు సరైన సమాధానమనే అభిప్రాయాన్ని బలంగా వినిపించిన వారూ ఉన్నారు. రాజారామ్మోహన్‌రాయ్ మొదటి ఆలోచనకు ప్రతినిధి అయితే, జ్యోతీబా çఫూలే, అంబే డ్కర్ రెండో ఆచరణకు ఆద్యులు.
రాజారామ్మోహన్‌రాయ్ హిందూమతాన్ని సంస్కరించాలనే ఉద్దేశంతో తన లక్ష్యాలకు అను గుణంగా 1829లో రాజా రామ్మోహన్ రాయ్ ఆత్మీయ సభను ఏర్పాటు చేశారు. ఆ తర్వాత అది బ్రహ్మసమాజంగా మారింది. కుల వ్యవస్థలో ఉన్న సంకుచితత్వం వల్ల ప్రజల్లో ఐక్యత దెబ్బతింటుందని రాజారామ్మోహన్ రాయ్ భావించారు. అయితే ఆయన నిరసించిన దురాచారాలన్నీ కూడా ఎక్కు వగా బ్రాహ్మణుల్లో ఉండేవి. ఈ ఉద్యమం వల్ల మొట్టమొదట అ«ధికంగా ప్రయోజనం పొందింది బ్రాహ్మణ, ఇతర ఆధిపత్య కులాలు మాత్రమే. అయితే అది కూడా సమాజంలో ఒక చలనాన్ని తీసు కొచ్చింది. ఆ తర్వాత హెన్నివిలియన్, రవీంద్రనాథ్ ఠాగూర్ తండ్రి దేవేంద్రనాథ్ ఠాగూర్, కేశవ్ చంద్ర సేన్, ఈశ్వరచంద్ర విద్యా సాగర్, రామకృష్ణ పరమ హంస, వివేకానంద, దయానంద సరస్వతి, పండిత రమాబాయి పాశ్చాత్య విద్య ప్రభావంతో సంస్క రణ మార్గంలోకి వెళ్ళారు. ఇదే సమయంలో 1835లో ప్రవేశపెట్టిన ఇంగ్లిష్ విద్య ఉన్నత కులా లతో పాటు, శూద్ర, అంటరాని కులాలలో చైత న్యాన్ని తీసుకొచ్చిందన్నది వాస్తవం. ఒక వైపు ఇంగ్లిష్ విద్యను తిరస్కరించిన ఆధిపత్యకులాలు, రెండోవైపు దానినే తిరిగి తమ ఆధిపత్య ప్రదర్శనకు ఆయుధంగా వాడుకున్నారు. ముఖ్యంగా బ్రాహ్మ ణుల తొలి అడుగులు భారతీయ సమాజానికి అప్ప టికీ, ఇప్పటికీ అనుసరణీయమే. ఇంగ్లిష్ విద్యను అభ్యసించి, బ్రిటిష్‌వారి తర్వాత అధిక స్థానాల్లో ఉద్యోగాలు సంపాదించారు. బ్రిటిష్ ప్రభుత్వంలో బ్రాహ్మణుల ఆధిపత్యానికి వ్యతిరేకంగా వచ్చిన ఉద్యమం వల్ల తొలిసారిగా 1902లో కొల్హాపూర్ సంస్థానాధీశుడు సాహూ మహారాజ్ మిగతా కులా లకు రిజర్వేషన్లు ప్రకటించారు. దేశచరిత్రలోనే ఇది తొలి రిజర్వేషన్ విధానమని చెపుతారు.
ఇంగ్లిష్ చదువులే చైతన్యానికి కరదీపికలు!
కుల వ్యవస్థకు వ్యతిరేకంగా నిరంతరం పోరాడిన జ్యోతీభాపూలేను కూడా ఇంగ్లిష్ విద్యనే ప్రభావితం చేసింది. ఆయన సామాజిక న్యాయం కోసం జరిపిన పోరాటానికి ప్రేరణగా నిలిచిన ఇంగ్లిష్ పుస్తకం ‘రైట్స్ ఆఫ్ మాన్’. అది రాసింది థామస్ పేన్. బాబాసాహెబ్ అంబేడ్కర్ అమెరికాలోని కొలం బియా విశ్వవిద్యాలయంలో, లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్‌లో చదివిన చదువుతో భారత ప్రజా స్వామ్య వ్యవస్థకు రూపకల్పన చేశారు. ముఖ్యంగా భారతదేశ సామాజిక అసమానతలను పాశ్చాత్య తాత్వికత ప్రభావం వల్ల ఎంతో మంది నిరసించ గలిగారు. అప్పటికే ప్రపంచంలో వస్తున్న మార్పులు వీళ్ళందరినీ ప్రభావితం చేశాయి. కొంతమంది ఇంకా సంకుచిత స్వభావాన్ని విడిచిపెట్టడానికి సిద్ధంగా లేరు. సత్యాన్ని సత్యంగా, న్యాయాన్ని న్యాయంగా చూడటానికి నిరాకరిస్తున్నారు. పరాయి దేశం వారి మాటలు మనమెందుకు వినాలని వాదిం చేవారూ ఉన్నారు. మానవ ప్రగతిని, చైతన్యాన్ని సరి హద్దులు ఏనాడూ నియంత్రించలేవు. భౌగోళిక విభ జన రేఖలు కేవలం పరిపాలన కోసమే కానీ, చైత న్యాన్ని, మంచిని నియంత్రించడానికి కాదు. అందు వల్ల విలియం విల్‌బర్‌ఫోర్స్ 200 ఏళ్ళ క్రితం అందిం చిన కుల వ్యతిరేక చైతన్యం బ్రిటిష్ పాలకు లకు కూడా మేలుకొలుపు అయింది. అప్పటికే ఎదిగి వస్తున్న భారతదేశ యువతరానికి కూడా మార్గ నిర్దేశం చేసింది. అందువల్ల కుల వ్యవస్థకు వ్యతి రేకంగా జరుగుతున్న పోరాటంలో విలియం విల్‌బర్ ఫోర్స్ వేసిన తొలి అడుగులు భారతీయ సమాజానికి అప్పటికీ, ఇప్పటికీ అనుసరణీయమే. (విల్‌బర్‌ఫోర్స్ ప్రసంగించి రేపటితో 205 ఏళ్లు పూర్తయిన సందర్భంగా)
మల్లెపల్లి లక్ష్మయ్య
వ్యాసకర్త సామాజిక విశ్లేషకులు
మొబైల్ : 97055 66213
Comments
Please login to add a commentAdd a comment