అన్నదాతే కాదు, ఉద్యమ దీపధారి | Mallepally Laxmaiah Story On Farmers Protest In Delhi | Sakshi
Sakshi News home page

అన్నదాతే కాదు, ఉద్యమ దీపధారి

Published Thu, Dec 17 2020 4:27 AM | Last Updated on Thu, Dec 17 2020 4:27 AM

Mallepally Laxmaiah Story On Farmers Protest In Delhi - Sakshi

అడవి, నీరు, గనులు, వినిమయ వస్తువుల వ్యాపారం నుంచి మొదలుకొని దేశంలోని మొత్తం భూమిని తమ కబంధ హస్తాల్లోకి తీసుకోవాలని కార్పొరేట్లు చూస్తున్నాయని పంజాబ్‌ రైతులు నిలదీస్తున్నారు. భారత పౌరులకు, కార్పొరేట్‌ వ్యవస్థకు మధ్య సాగుతున్న అంతర్గత ఘర్షణను ఈ పోరాటం బహిరంగ పరిచింది. అందుకే ఇప్పుడు జరుగుతున్న ఈ పోరాటం విజయవంతం అవుతుందా, లేక విఫలమవుతుందా? అన్న ప్రశ్నకన్నా ఈ ఉద్యమం చూపుతున్న ప్రభావం గొప్పది. పంట పొలాల్లో పారిన వారి చెమటచుక్కల సాక్షిగా, ఎముకలు కొరికే చలిలో చెక్కుచెదరని ఆత్మవిశ్వాసంతో, గుండెనిబ్బరంతో పోరాడు తున్న ఆ రైతాంగాన్ని చరిత్ర ఎన్నడూ మరచిపోదు. ఆ ఉద్యమంలో పాల్గొంటున్న ప్రతీ రైతన్న పోరాట పటిమ చరిత్రలో ఒక శిలాక్షరమై నిలిచి గెలుస్తుంది.

‘‘అధికారంలో ఉన్న వారికన్నా ప్రజాబలం అత్యంత శక్తిమంతమైంది’’. ఇది అక్షర సత్య మనడానికి నేటి భారతావని ప్రత్యక్ష సాక్ష్యంగా నిలుస్తోంది. పంజాబ్‌ రైతన్నలు మొదలుపెట్టిన పోరాటం ప్రధానంగా ఉత్తర భారతాన్ని చుట్టేసింది. దాదాపు 20 రోజులకు పైగా రైతులంతా దేశ రాజధానిని ముట్టడిస్తున్నారు. ఒకరకంగా చదరంగం ఆటలో సాధారణ  సైనికులు రాజుకి చెక్‌ పెట్టినట్టు సామాన్య రైతులు ఢిల్లీ ప్రభుత్వాన్ని దిగ్బంధిం చారు. ప్రభుత్వాలు, రాజ్యాలు, చక్రవర్తులు అన్ని రకాల పాలనలూ ప్రజాబలం ముందు మోకరిల్లక తప్పలేదనేది చరిత్ర ఎన్నో సార్లు రుజువు చేసింది. అయితే ఈనాడు జరుగుతున్న రైతాంగ ఉద్యమం పైకి కనిపిస్తున్నట్టుగా కేవలం ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా, ప్రత్యేకించి కొత్త చట్టాలకు వ్యతిరేకంగా మాత్రమే కాదు, ఇది భారత దేశాన్ని కబళించేందుకు పూనుకున్న కార్పొరేట్‌ శక్తులకు వ్యతిరేకంగా సాగుతున్న పోరాటం. గతంలో కూడా ఇటువంటి పోరాటాలు జరి గాయి. కొన్ని కంపెనీలకు వ్యతిరేకంగా కూడా ఆ ఉద్యమాలు గళమె త్తాయి. ఇంత సూటిగా, శక్తిమంతంగా ఆ ఉద్యమాలు నిలబడలేదు. పంజాబ్‌తో సహా యావత్‌ దేశంలోని రైతాంగం చేస్తున్న ఈ పోరాటం రాబోయే ప్రజా ఉద్యమాలకు ఒక దశ, దిశను చూపిస్తున్నది. భారత రైతాంగం సాగించిన గత పోరాటాలన్నీ కూడా ఆనాటి సామాజిక మార్పునకు పునాదులు వేశాయి. 

బ్రిటిష్‌ ప్రభుత్వ హయాంలో అనేక పోరాటాలు జరిగాయి. అందులో బిహార్‌లోని చంపారన్‌  పోరాటం ప్రముఖమైనది. బ్రిటిష్‌ ప్రభుత్వం చంపారన్‌ వ్యవసాయ చట్టం పేరుతో 1917లో ఒక చట్టాన్ని తెచ్చింది. ఇది రైతులకు పెనుశాపంగా మారింది. ఇందులో ప్రధా నంగా భూమిశిస్తు పెంచి రైతుల గొంతుమీద కత్తిపెట్టారు. నీలిమందు పంటను పెంచాలనే నిబంధనను విధించారు. దీనివల్ల రైతులకు తమకు నచ్చిన పంటను వేసుకునే స్వేచ్ఛ లేకుండా పోయింది. అంతే కాకుండా రైతులకు తక్కువ ధర ఇచ్చి పంటను కొనుక్కునే అధికా రాన్ని ప్రభుత్వం వ్యాపారులకు కట్టబెట్టింది. బ్రిటిష్‌ వ్యాపారుల ప్రయోజనాల కోసం పంట వేయడం వల్ల అదే పంటను ఇంకా ఎక్కడా అమ్ముకునే అవకాశం రైతులకు లేకుండా పోయింది. దీంతో రైతులు పేదరికంలోకి దిగజారిపోయారు. సరిగ్గా ఈ పరిస్థితుల్లో కాంగ్రెస్‌ నాయకుడిగా గాంధీజీ భారతదేశంలో అడుగుపెట్టారు. దక్షిణాఫ్రికాలో ప్రారంభించిన అహింసాయుతమైన సత్యాగ్రహ ఉద్య మాన్ని చంపారన్‌లో ప్రయోగాత్మకంగా మొదలుపెట్టారు. ఆకలితో, దారిద్య్రంతో అల్లాడుతున్న రైతులకు గాంధీజీ ఒక ఆశాకిరణంగా కనిపించారు. కానీ చౌరీచౌరాలో పోలీస్‌ స్టేషన్‌ తగులబడటంతో ఉద్యమం హింసాత్మకంగా మారింది. దీంతో గాంధీ అక్కడ ఉద్య మాన్ని విరమించారు. అయితే చంపారన్‌ ఉద్యమం భారతదేశంలో బ్రిటిష్‌ ప్రభుత్వ రహస్య ఉద్దేశాన్ని బట్టబయలు చేసింది. తమ వ్యాపార ప్రయోజనాలు, దేశంలోని వనరుల దోపిడీ వారి ప్రధాన లక్ష్యాలని బయటపెట్టింది. అంతేకాకుండా అహింస, సత్యాగ్రహం ద్వారా జాతీయవాదం మరింత బలపడింది.

గుజరాత్‌లోని ఖేడాలో కూడా పత్తి, పొగాకు పండించే రైతులు తీవ్రమైన కరువు కాటకాల్లో చిక్కుకున్నారు. బ్రిటిష్‌ ప్రభుత్వం వారికి ఎటువంటి సహాయం అందించకపోగా, భూమి పన్ను కట్టాల్సిందే నంటూ వేధింపులకు గురిచేసింది. 1919లో గాంధీజీ, వల్లభాయ్‌ పటేల్, ఎన్‌.ఎం.జోషి నాయకత్వంలో సత్యాగ్రహం మొదలైంది. బ్రిటిష్‌ ప్రభుత్వం దిగిరాక తప్పలేదు. అక్కడ పాటిదార్లు ప్రధాన రైతాంగ శక్తి. ఖేడా ఉద్యమం వల్ల భూమిశిస్తు రద్దయింది. గాంధీజీ, వల్లభాయ్‌ పటేల్‌ నాయకత్వ బలోపేతానికి కారణమైంది. 
అదే గుజరాత్‌లోని బార్దోలి ప్రాంతంలో వరదలతో రైతులు పంటలను పోగొట్టుకున్నారు. అయినా బ్రిటిష్‌ ప్రభుత్వం భూమిశి స్తును 30 శాతం పెంచింది. తగ్గించడానికి ససేమిరా అంగీకరించ లేదు. దీనికి వ్యతిరేకంగా 1925లో వల్లభాయ్‌ పటేల్‌ నాయకత్వంలో సహాయనిరాకరణ ఉద్యమం ప్రారంభమైంది. బ్రిటిష్‌ ప్రభుత్వం ఉద్యమాన్ని అణచివేయడానికే నిశ్చయించుకుంది. పోలీసు బలగా లను దించింది. అరెస్టులను సాగించింది. అయినా రైతాంగం చాక చక్యంగా ఉద్యమాన్ని కొనసాగించింది. వల్లభాయ్‌ పటేల్‌ అందించిన నాయకత్వానికి ప్రతిగా రైతాంగం ఆయనకు ‘సర్దార్‌’ బిరుదును ఇచ్చింది. ఆ రోజు నుంచి సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌గా మారిపోయారు. ఈ రెండు ఉద్యమాలు ప్రజల్లో భారత స్వాతంత్య్రకాంక్షను పెంచాయి. 

కేరళలోని మలబార్‌ ప్రాంతంలో జరిగిన మొఫ్లా రైతాంగ పోరాటం అక్కడి స్థానిక జమీందారుల దోపిడీ, దౌర్జన్యాలకు వ్యతిరే కంగా సాగింది. 1835 నుంచి మొఫ్లా రైతులను అక్కడి భూస్వాములు దోపిడీ చేస్తున్నారు. ఇక్కడ ఒక ప్రత్యేక పరిస్థితి ఉంది. మొఫ్లా రైతులు మెజారిటీ ముస్లిం రైతులు కాగా, భూస్వాములు హిందువులు. అయితే సమస్య మతపరమైనది కాకపోయినప్పటికీ, అంతిమంగా ఆ రూపం తీసుకున్నది. మొఫ్లా తిరుగుబాటు 1921లో ప్రారంభమైంది. మొదటి ప్రపంచ యుద్ధంలో తీవ్రంగా నష్టపోయిన బ్రిటిష్‌ ప్రభుత్వం నిర్బంధాన్ని ప్రయోగించలేకపోయింది. ఈ ఉద్యమం ముస్లింలు ప్రారంభించిన ఖిలాఫత్‌ ఉద్యమం బలపడటానికి, ఒకరకంగా ముస్లింలు ప్రత్యేక శక్తిగా నిలదొక్కుకోవడానికి ఉపయోగపడింది. 

1946లో ప్రారంభమైన తెలంగాణ సాయుధ పోరాటం స్థాని కంగా జమీందార్లకు, జాగీర్దార్లకు వ్యతిరేకంగా ప్రారంభమైంది. వీళ్ళకు అండగా వచ్చిన రజాకార్లకు, వీళ్ళందరినీ కాపాడిన నిజాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా సాగింది. ఈ పోరాటం వల్ల జమీందారు, జాగీర్దారు విధానం పోయి, ఆ భూములను ప్రజలు పంచుకున్నారు. దున్నేవాడికే భూమి అనే నినాదం ఇక్కడే ప్రముఖంగా వినిపించింది. వీటన్నింటితోపాటు, కమ్యూనిస్టు సిద్ధాంతం ఆచరణలో ఎంతో శక్తి కలిగి ఉన్నదని చెప్పడానికి తెలంగాణ సాయుధపోరాటం ఉపయోగ పడింది. భూస్వామ్య, పెత్తందారీ, రాచరిక పాలన స్థానంలో ప్రజా స్వామ్య ప్రభుత్వం ఏర్పడటానికి మార్గం వేసింది తెలంగాణ సాయుధ పోరాటమేనని చెప్పక తప్పదు.భారతదేశం స్వాతంత్య్రం పొందిన తర్వాత ఆదివాసీ ప్రాంతాల్లో పెల్లుబికిన నక్సల్బరీ, శ్రీకాకుళం, గోదావరిలోయ రైతాంగ పోరా టాలు పాలకుల మొద్దునిద్రను వదిలించాయి. ఆ పరంపరంలో ఇప్ప టికీ నక్సలైట్‌ ఉద్యమాలు సాగుతున్నప్పటికీ, నక్సల్బరీ అనంతరం ప్రభుత్వాలు ఆదివాసుల కోసం ఎన్నో చట్టాలను, పథకాలను తెచ్చాయి. ప్రత్యక్షంగా, పరోక్షంగా ఆ ఉద్యమ ప్రభావం సమాజంపై పడిందనేది వాస్తవం.

ప్రస్తుతం మనం చూస్తున్న పంజాబ్‌ నాయకత్వంలోని జాతీయ రైతాంగ పోరాటం కార్పొరేట్లతో భారత ప్రజలు సాగించాల్సిన ప్రత్యక్ష పోరాటానికి తెరలేపింది. 1990 నుంచి ప్రారంభమైన ప్రైవేటీకరణ, సరళీకరణ, విశ్వీకరణలు ఈరోజు కార్పొరేట్‌ వ్యవస్థగా మారి పోయాయి. పారిశ్రామిక వస్తువుల ఉత్పత్తుల నుంచి, అడవి, నీరు, గనులు, వినిమయ వస్తువుల వ్యాపారం నుంచి మొదలుకొని దేశం లోని మొత్తం భూమిని తమ కబంధ హస్తాల్లోకి తీసుకోవాలని కార్పొ రేట్లు చూస్తున్నాయని పంజాబ్‌ రైతులు నిలదీస్తున్నారు. ప్రభుత్వాలు, కార్పొరేట్లు వేరువేరనే ముసుగును ప్రస్తుత పోరాటం తొలగించింది. అందుకే ఈ ఉద్యమం సాధారణమైనది కాదు. ఇది చరిత్రాత్మక మైనది. భారత పౌరులకు, కార్పొరేట్‌ వ్యవస్థకు మధ్య సాగుతున్న అంతర్గత ఘర్షణను ఈ పోరాటం బహిరంగ పరిచింది.

గతంలో ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్, ఆంధ్రా ఒరిస్సా సరిహద్దుల్లో కార్పొరేట్లను ప్రవే శింపజేయడాన్ని అక్కడి ఆదివాసులు వ్యతిరేకించారు. రెండు సంవ త్సరాల క్రితం నాసిక్‌ నుంచి 40,000 మంది ఆదివాసీ రైతులు మహా పాదయాత్ర చేసి ప్రభుత్వానికి సవాల్‌ విసిరారు. తమిళనాడులో, ఆంధ్రాలో ఇంకా అనేక చోట్ల ప్రజలు కార్పొరేట్‌ కంపెనీలను నిరసిం చారు. పశ్చిమబెంగాల్‌లోని సింగూరు రైతుల ప్రతిఘటనను కూడా అందులో భాగంగానే చూడాలి. అందుకే ఇప్పుడు జరుగుతున్న ఈ పోరాటం విజయవంతం అవుతుందా, లేక విఫలమవుతుందా? అన్న ప్రశ్నకన్నా ఈ ఉద్యమం చూపుతున్న ప్రభావం గొప్పది. పంట పొలాల్లో పారిన వారి చెమటచుక్కల సాక్షిగా, ఎముకలు కొరికే చలిలో చెక్కుచెదరని ఆత్మవిశ్వాసంతో, గుండెనిబ్బరంతో పోరాడుతున్న ఆ రైతాంగాన్ని చరిత్ర ఎన్నడూ మరచిపోదు. ఆ ఉద్యమంలో పాల్గొం టున్న ప్రతీ రైతన్న పోరాట పటిమ చరిత్రలో ఒక శిలాక్షరమై నిలిచి గెలుస్తుంది. 

వ్యాసకర్త సామాజిక విశ్లేషకులు ‘ మొబైల్‌ : 81063 22077
మల్లెపల్లి లక్ష్మయ్య

 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement