న్యూఢిల్లీ : కడుపులో ఆకలి మంటల్ని చల్లార్చడానికి అక్కడ పొయ్యి రేయింబగళ్లు మండుతూనే ఉంది. కేంద్ర ప్రభుత్వం దిగి వచ్చేదాకా వారిలో స్ఫూర్తి ఆరని జ్వాలలా రగులుతూనే ఉంటుంది. కుండపోతగా వాన కురిసినా, ఎముకలు కొరికే చలిలోనైనా రైతన్నలు చలించడం లేదు. సాగు చట్టాలను వెనక్కి తీసుకునే దాకా తాము వెనక్కి వెళ్లే ప్రసక్తే లేదని తేల్చేశారు. 40 రోజులుగా నిరసన ప్రదర్శనలు చేస్తున్నప్పటికీ వారిలో ఆత్మస్థైర్యం రవ్వంత కూడా సడల్లేదు. అందరి కడుపులు నింపే అన్నదాతల కడుపు నింపడానికి ఢిల్లీ–హరియాణా సరిహద్దుల్లో సకల సదుపాయాలు ఏర్పాటు చేశారు. నిరసన ప్రదర్శనల్లో పాల్గొనే రైతులెవరూ ఆకలి బాధతో ఉండకూడదన్న ఏకైక ఎజెండాతో రైతు నాయకులు ప్రత్యేక దృష్టి పెట్టారు. లంగర్లలో (కమ్యూనిటీ కిచెన్) నిరంతరం ఏదో ఒక వంటకం తయారవుతూనే ఉంటుంది.
పెద్ద పెద్ద పొయ్యిలు, గిన్నెలు, రోటీ మిషన్లు, ఒకటేమిటి అన్ని సదుపాయాలు ఏర్పాటు చేశారు. రైతు కుటుంబాల వారే వంతులవారీగా వంటలు చేస్తూ ఉంటారు. గురుదాస్‌పూర్‌కి చెందిన పల్వీందర్ సింగ్ (45) అనే రైతు హైవేపైనే ఒక లంగరు ఏర్పాటు చేశారు. ‘‘ఆకలి బాధతో ఉంటే విప్లవం ముందుకు వెళ్లలేదు. సిక్కు గురువుల ప్రబోధాలే మాకు ఆదర్శం. వారి ఆశీర్వాదం మా పై ఉంది. అందుకే ఈ కిచెన్‌లో పొయ్యి నిరంతరాయంగా మండుతూనే ఉంది’’ అని పల్వీందర్ సింగ్ చెప్పారు.‘‘ ఏ క్షణంలోనైనా మాపై కరకు లాఠీ దెబ్బలు పడొచ్చు, బాష్పవాయువు ప్రయోగాలు జరగొచ్చు. వాటర్ కెనాన్లు ముంచేయొచ్చు. అయినా అన్నీ ఎదుర్కోవడానికి సిద్ధపడే ఇక్కడికి వచ్చాం’ అని చెప్పారు. మొత్తం 200 మంది షిప్ట్‌ల వారీగా ఆ కిచెన్‌లో పనిచేస్తారు. పూరీలు, కూర, హల్వా, ఖీర్, అన్నం ఎవరికి ఎంత కావాలో అంత పెడతారు. అక్కడ గొప్పవాళ్లు, పేదవారు అన్న భేదం లేదు. ఎవరైనా సరే ముకుళిత హస్తాలతో క్యూ లైన్లలో వచ్చి తినాల్సిందే.
స్ఫూర్తి తగ్గలేదు..
‘‘గురునానక్ శతాబ్దాల క్రితం ప్రారంభించిన లంగర్లు ఇప్పటికీ కొనసాగుతూనే ఉన్నాయి. ఇవీ అంతే. 40 రోజులైంది. మా పొయ్యి ఆరలేదు. సరుకులు నిండుకోలేదు. మాలో స్ఫూర్తి కూడా ఏ మాత్రం తగ్గలేదు’’ అని ఒక మహిళా రైతు అన్నారు. అన్నింటికంటే విశేషం ఏమిటంటే ఈ కమ్యూనిటీ కిచెన్లలో సేవలందించడానికి వచ్చిన వారెవరూ తమ పేరు, ఊరు చెప్పడానికి ఇష్టపడడం లేదు. మేము ఎవరిమైతే ఏంటి మాదంతా రైతు కుటుంబమే అని చిరునవ్వుతో చెబుతున్నారు. రైతు పోరాటానికి అక్కడ ఉన్న స్థానికులు కూడా మద్దతు తెలుపుతున్నారు. పాలు, కూరలు వంటివి ఇస్తూ తమ ఔదార్యాన్ని చాటుకుంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment