కులతత్వంపై యుద్ధారావం ‘ప్రణయ్‌’ | Mallepally Laxmaiah Article On Caste System | Sakshi
Sakshi News home page

కులతత్వంపై యుద్ధారావం ‘ప్రణయ్‌’

Published Thu, Sep 27 2018 12:39 AM | Last Updated on Mon, Oct 8 2018 9:06 PM

Mallepally Laxmaiah Article On Caste System - Sakshi

రాజ్యాంగం, ప్రజాస్వామ్యం అందించిన అవకాశాల వల్ల అన్ని కులాల బిడ్డలూ ఒకే చోట చదువుకుని, ఉద్యోగాలు చేసే అవకాశాలొచ్చాయి. దీంతో కులాల గోడలను పెకిలించుకొని స్వేచ్ఛావిహంగాలై పిల్లలు ఎగురుతున్నారు. చాలా మంది పిల్లలు తమ మనసుని చంపుకుని ఇంకా కులాల కుంపట్లోనే మాడిపోతున్నారు. కొద్ది మంది మాత్రమే ప్రణయ్, అమృతల్లాగా కులరక్కసి కోరలు పీకడానికి రక్తతర్పణకి సైతం వెనకాడటంలేదు. ఇది కులం గోడలను తునాతునకలు చేయడానికి వేసిన తొలి సమ్మెట దెబ్బ. కులం అనే మురికి అడ్డుపడినంత మాత్రాన ఆధునికతను అందిపుచ్చుకుంటోన్న యువతరం అంతరంగ మహాప్రవాహాన్ని ఎవరు మాత్రం అడ్డుకోగలరు?

‘‘1950 జనవరి 26 తేదీ నుంచి మనం వైరుధ్యాల జీవితంలోనికి అడుగుపెట్టబోతున్నాం. రాజకీయాలలో సమానత్వాన్నీ, సామాజిక ఆర్థిక రంగాలలో అసమానత్వాన్నీ ఎదు ర్కోబోతున్నాం. ఒక మనిషి, ఒక ఓటు. ఒక ఓటు, ఒక విలువ అనే సూత్రంతో రాజకీయాల్లో సమా నత్వం సిద్ధిస్తున్నా, సామాజిక, ఆర్థిక రంగాల్లో ఇంకా కొనసాగుతోన్న అసమానత్వం ఒక మనిషికి ఒక విలువ అనే సూత్రాన్ని నిరాకరిస్తోంది. ఎంతకాలం మనం ఈ వైరుధ్యాల జీవితాలను కొనసాగించాలి? ఎంత కాలం సామాజిక, ఆర్థిక రంగాల్లో సమాన త్వాన్ని నిరాకరిస్తాం. ఇదే విధానం కొనసాగితే మనం సాధించుకున్న రాజకీయ ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడుతుంది. సాధ్యమైనంత త్వరలో మనం ఈ వైరుధ్యాలను తొలగించాలి. లేదంటే ఎంతో శ్రమకోర్చి రాజ్యాంగ సభ నిర్మించిన రాజకీయ ప్రజాస్వామ్య సౌధాన్ని అసమానతలతో కుంగి, కృశించిపోతోన్న ప్రజలు పేల్చి వేస్తారు’’..

దాదాపు ఏడు దశాబ్దాల క్రితం భారత రాజ్యాంగ సభలో బాబాసాహెబ్‌ అంబేడ్కర్‌ భవిష్యత్‌ అసమాన సమాజాన్ని ఉద్దేశించి చేసిన హెచ్చ రిక ఇది. ఈ దేశాన్ని దశాబ్దాల పాటు పాలించిన రాజకీయ పార్టీలూ, దేశానికి దిశానిర్దేశం చేస్తామం టోన్న మేధావి వర్గాలూ ఈ హెచ్చరికను ఇసుమం తైనా లక్ష్యపెట్టలేదు. దేశవ్యాప్తంగా దశాబ్దాలుగా దళి తులపైనా, ఆదివాసీలపైనా, మహిళలపైనా, మైనార్టీ లపైనా దాడులూ హత్యలూ, అత్యాచారాలూ కొనసా గుతూనే ఉన్నాయి. దళిత బిడ్డల నెత్తురు ఏరులై ప్రవ హిస్తూనే ఉంది. కుప్పలుపడిన శతాబ్దాల హింసా శకలాల్లో నల్గొండ జిల్లా దళిత బిడ్డ ప్రణయ్‌ హత్య కూడా ఒకటి. నిచ్చెనమెట్ల కుల వ్యవస్థ కుటిలత్వం తెలియని అమృత, ఈ సమాజంలో కులం కన్నబిడ్డల కంఠాలను తెగనరికేందుకు సైతం వెనకాడదని తెలియని ఓ అగ్రకుల యువతి, ప్రేమని మించింది ఈ ప్రపంచంలో మరొకటుండదని మనస్ఫూర్తిగా నమ్మిన వ్యక్తి, ఆధునికతతోనో, చైతన్యమో తన ప్రేమ విషయంలో అత్యంత పరిణతి ప్రదర్శించింది. తన మాట కాదన్న తల్లిదండ్రుల కుల దురహంకా రాన్ని తలదన్ని తను కోరుకున్న వ్యక్తి చెంతకు చేరింది. ఎందరో అభివృద్ధికాముకులు తమ బిడ్డల విషయంలోసైతం చేయలేని సాహసాన్ని ఆమె చేసి చూపించింది.

సమాజం దృష్టిలో కులం తక్కువ వాణ్ణి చేసుకున్నానన్న అపరాధ భావన ఆమెకు ఏ కోశానా లేదు. తన కులాంతర వివాహాన్ని దాచి పెట్టాలన్న అభిప్రాయం అంతకన్నా లేదు. అందుకే తన ఆనందాన్ని రిసెప్షన్‌ రూపంలో పంచుకుంది. బహుశా గుట్టుచప్పుడు కాకుండా ఎక్కడో చోట పడి ఉంటే తండ్రిలోని కర్కశత్వం అంత త్వరగా బయట పడేది కాదేమో, కానీ తన కళ్లెదుటే కులం తక్కువ వాణ్ణి పెళ్ళి చేసుకొని తన హర్షాతిరేకాలను ప్రకటిం చిన కూతురి ఆనందాన్ని సహించలేకపోయాడు. డబ్బుమదంతో విర్ర వీగుతోన్న అమృత తండ్రి, కూతుర్ని నమ్మించి, మోసగించి కోటి రూపాయలు సుపారీ ఇచ్చి మరీ నడిరోడ్డుపై అల్లుడి తలను తెగ నరికించాడు. ఈ ఘటనను సమాజం తమకి నచ్చి నట్టుగా, కులం పట్ల తమతమ అవగాహనకు తగ్గ ట్టుగా అర్థం చేసుకుంది. దేశవ్యాప్తంగా ప్రగతిశీల భావాలుగలవారు దీన్ని నిర్ద్వంద్వంగా నిరసించారు. ప్రతిఘటించారు.  

అయితే ఇది మొదటిదీ, ఇదే చివ రిదీ కూడా కాదు. నల్గొండ ఘాతుకపు నీలినీడలు మనని వీడి పోక ముందే హైదరాబాదు నగరం నడి బొడ్డున కన్న తండ్రే కూతురి తలతెగనరికిన పాశవిక చర్య ఆధునిక సమాజపు ఆనవాళ్ళను మధ్యయుగా లంతటి వెనక్కి తరిమికొట్టింది. ఇక్కడ అమృత తండ్రో, లేదామరో వ్యక్తో కారణం కానేకాదు... తర తరాలుగా ఈ నేలలో ఇంకిన దళితుల నెత్తురంతా కులరక్కసి కారణంగానే. ఈ సమాజాన్ని అగాధం లోకి తోసేస్తోన్న కుల రాకాసి ప్రభావాన్ని ఇప్పటి కింకా తక్కువ చేసి చూడటం మనలో పాతుకుపో యిన అగ్రకుల భావజాలానికి నిదర్శనం. ఒక్కమా టలో చెప్పాలంటే దళిత బిడ్డల హత్యలన్నీ కుల వ్యవస్థలో దాగి ఉన్న ఆధిపత్యానికీ, నిరంకుశత్వా నికీ, హింసాప్రవృత్తికీ ప్రత్యక్ష సాక్ష్యం. అందుకే దీన్ని వ్యక్తుల నేరస్వభావంగా కాకుండా కుల వ్యవస్థ అమానుష హత్యాకాండగా అర్థం చేసుకోవాలి. కుల వ్యవస్థ పుట్టుక, విస్తరణ, ప్రభావం చివరకు దాని నిర్మూలన గురించి అంబేడ్కర్‌ చాలా శాస్త్రీయంగా విశ్లేషిస్తారు. తనకు తానుగా బంధించుకున్న ఒక పంజరంగా కులాన్ని వర్ణిస్తారాయన. కులం పునాదులను కాపాడుకునేందుకు తన వర్గం వారిని ఉన్నతులుగానూ, ఇతరులను నీచులుగానూ  చూసే స్వభావాన్ని ఇది సంతరించుకుంది.

ప్రతిష్టను, పరు వునీ ఉన్నతమైన విలువల్లో కాక కులం మూలాల్లో వెతుక్కునే స్వభావం ఎంతటి అమానుషానికైనా ఒడి గట్టే క్రూరత్వానికి కారణం. కులం హిందూ ధర్మశాస్త్రాల పునాదుల్లోంచి పుట్టింది. ఒక కులం వాడు ఇంకొక కులం వాడిని నాయకుడిగా ఒప్పు కోడు. అమృత తండ్రి మారుతీరావు తన నేరాన్ని బహిరంగంగా ఒప్పుకున్నప్పటికీ, అదే కులానికి చెందిన పెద్దలు ఊరేగింపు చేసి, కూతురిని చంపి దోషిగా నిలిచిన వ్యక్తిని పరామర్శించి, ఓ నేరస్తుడికి అండగా నిలుస్తామని బహిరంగంగా ప్రకటించారు. ఇది ఇటీవలి కాలంలో పొడసూపుతోన్న ఓ నీచమైన సంస్కృతికి తార్కాణం. తన కులంవాడు ఎంత చెడ్డవాడైనా వాడికోసం నిలబడటమే కులం యొక్క బలంగా చలామణీ అవుతోంది.

భారత రాజ్యాంగం అందించిన సమానత్వ హక్కులూ, ప్రజాస్వామ్య భావనలూ దేశపు రూపు రేఖలను మార్చబోతున్నాయి. దేశవ్యాప్తంగా జరుగు తోన్న పరిణామాలు, శాస్త్ర సాంకేతిక రంగాల్లో వస్తోన్న మార్పులు, ఆధునికతతో ప్రజాస్వామ్య భావనలను సమాజం పుణికిపుచ్చుకుంటోంది. అందులో భాగంగానే ప్రణయ్, అమృతలాంటి యువతీయువకుల కులాంతర, మతాంతర వివా హాలు ఈ కుల వ్యవస్థపై ఒక తిరుగుబాటుగానే భావించాలి. అణగారిన వర్గాలు తలలు ఎగరేస్తే తలలు తెగిపడతాయనే విషయం కొత్తది కాదు. అయినా తలెత్తుకుని తిరగడానికి దళితబిడ్డలు, వారి జీవితాల్లోకి వస్తోన్న దళితేతరుల బిడ్డలు ఒక్క క్షణం తటపటాయించడం లేదు. ఇదే కులం పునాదులను పెకిలించే ఆధునిక ప్రజాస్వామ్య ఉప్పెనై, మనువాద సనాతన సాంప్రదాయాల మురికిని తుడిచిపెట్టేం దుకు సిద్ధమౌతోంది.

రాజ్యాంగ రక్షణ లేనప్పుడు, నగరాలూ, పట్ట ణాల అభివృద్ధి కానప్పుడు, పారిశ్రామిక రంగం ఉనికిలోలేనప్పుడు గ్రామాల్లో ఏ కులానికి ఆ కులం తమ తమ వృత్తులలో మునిగి ఉండేవి. కులాల మధ్య సంబంధాలకు తావేలేదు. అంటరానివారికి గ్రామాల్లో ప్రవేశం లేదు. కానీ పరిస్థితి మారింది. రాజ్యాంగం, ప్రజాస్వామ్యం అందించిన అవకాశాల వల్ల అన్ని కులాల బిడ్డలూ ఒకే చోట చదువుకుని, ఉద్యోగాలు చేసే అవకాశాలొచ్చాయి. దీంతో కులాల గోడలను పెకలించుకుని స్వేచ్ఛా విహంగాలై పిల్లలు ఎగురుతున్నారు. చాలా మంది పిల్లలు తమ మన సుని చంపుకుని ఇంకా కులాల కుంపట్లోనే మాడి పోతున్నారు. కొద్దిమంది మాత్రమే ప్రణయ్, అమృ తల్లాగా కులరక్కసి కోరలు పీకడానికి రక్త తర్పణకి సైతం వెనకాడటంలేదు. కులాంతర వివా హాలను ఒక మార్పుగా మాత్రమే చూడటం తప్పు. ఇది కులం గోడలను తునాతునకలు చేయడానికి వేసిన తొలి సమ్మెట దెబ్బ.

కులం అనే మురికి అడ్డుపడి నంత మాత్రాన ఆధునికతను అందిపుచ్చుకుంటోన్న యువతరం అంతరంగ మహాప్రవాహాన్ని ఎవరు మాత్రం అడ్డుకోగలరు? సోషల్‌ మీడియా సాక్షిగా కులాలకతీతంగా పెల్లుబుకుతోన్న ప్రగతిశీల భావ జాలం ఆ«ధునికతరం అంతరంగాన్ని ఆవిష్కరి స్తోంది. దీన్నే ప్రణయ్‌ సహచరి అమృత చేపట్టిన కులవ్యతిరేకోద్యమం రుజువుచేసింది. కానీ ప్రభుత్వాలూ, రాజకీయ పార్టీలూ, మేధావి వర్గం కుల వ్యవస్థ నిర్మూలనా కర్తవ్యాన్ని విస్మరిస్తున్నాయి. రాజ్యాంగంలో ఉన్న రక్షణల ఆధా రంగా ఎన్నో చట్టాలు రూపొందినా వాటి అమలులో ప్రభుత్వాలు ఘోరంగా విఫలమయ్యాయి. ఎస్‌సీ, ఎస్‌టీ అత్యాచారాల నిరోధక చట్టమే దానికి ప్రత్యక్ష ఉదాహరణ. ఆ చట్టం ఉద్దేశమే నేరాల నిరోధం. కానీ ప్రభుత్వ యంత్రాంగం, పోలీసులు చట్టం స్ఫూర్తినే దెబ్బతీస్తున్నారు. ప్రణయ్‌ విషయంలో సైతం పోలీ సులు ముందు జాగ్రత్త చర్యలు తీసుకోలేదనేది సుస్పష్టం. దేశవ్యాప్తంగా ఇదే స్థితి. రాజకీయ పార్టీలు కులం విషయంలో తలదూర్చితే తమ ఓట్లు రాలవనే భయంతో కుల నిర్మూలన అనే రాజ్యాంగ లక్ష్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారు. మేధావి వర్గం కూడా ప్రేక్షక పాత్రనే వహించడం బాధాకరం.

వందేళ్ళ క్రితం బొంబాయి ప్రెసిడెన్సీలో ఆధిపత్య కులాలకు చెందిన ఆనాటి ప్రముఖులు ‘ఆల్‌ ఇండియా యాంటీ అన్‌ టచ్‌బులిటీ మానిఫెస్టో’ విడుదల చేసారు. డిప్రెస్డ్‌ క్లాస్‌ మిషన్‌ సొసైటీ ఆఫ్‌ ఇండియా అనే సంస్థ నాయకత్వంలో ముంబాయిలో 1918 మార్చి 23, 24 తేదీల్లో జరిగిన సభ ఆనాడు అంటరాని కులాలకు తమ మద్దతును ప్రకటించింది. ఈ సమావేశానికి ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు విఠల్‌భాయ్‌ పటేల్, ఎమ్మార్‌ జైకర్, బిపిన్‌ చంద్రపాల్‌ లాంటి ప్రముఖులు హాజరయ్యారు. డాక్టర్‌ హరోల్డ్‌ మన్, రవీంద్రనాథ్‌ ఠాగూర్, ద్వారకాపీఠం శంకరాచార్య, డాక్టర్‌ కురాటకోటి లాంటి వారు అంటరానితనానికి వ్యతిరేకంగా సందేశాలను పంపారు. వీరంతా దళితే తరులేనని అర్థం చేసుకోవాలి. ఇదే స్పందన తక్షణా వసరం. కులం ఒక మానసిక రుగ్మత. కేవలం అంట రాని కులాలే దీన్ని తొలగించుకుంటే సరిపోదు. ఆధి పత్య కులాలతో సహా అందరూ కులతత్వాన్ని వది లించుకుని మానవీయ విలువలనే పరువుప్రతిష్ట లుగా భావించాల్సిన తరుణమిది.

మల్లెపల్లి లక్ష్మయ్య 
వ్యాసకర్త సామాజిక విశ్లేషకులు
మొబైల్‌ : 97055 66213  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement