
సాక్షి, హైదరాబాద్: అల్లారుముద్దుగా చూసుకున్న కూతురు పెళ్లి విషయంలో సొంత నిర్ణయం తీసుకుందనో.. తమ సామాజిక వర్గం కాకుండా ఇతరులను ఇష్టపడిందనో.. అవతలి కుటుంబం తమ తాహతుకు తగినది కాదనో.. ఇలా కారణమేదైనా పరువు, ప్రతిష్టల పేరిట దారుణమైన హత్యలు జరుగుతున్నాయి. పరువు సంగతేమోగానీ.. తమవారిని కోల్పోయి ఓవైపు, హంతకులుగా మారి జైళ్లలో మగ్గుతూ మరోవైపు.. రెండు వైపులా కుటుంబాలు ఛిద్రమవుతున్నాయి. తాజాగా ప్రణయ్ హత్య కేసులో దోషులకు శిక్షలు విధించిన నేపథ్యంలో.. పరువు హత్యలపై మరోమారు విస్తృత చర్చ మొదలైంది.
కులమతాల పట్టింపులతో..: కాలంతోపాటు మనిషి ఎన్నో విషయాల్లో మారుతూ వచ్చి నా.. కులమతాల విషయంలో మాత్రం ఇంకా పట్టింపులను వదలని పరిస్థితులు ఉన్నాయి. పిల్లలకు ఇష్ట ప్రకారం చదువులు, నచ్చిన ఉద్యోగం చేసే స్వేచ్ఛ ఇచ్చినా జీవిత భాగస్వామిని ఎంపిక చేసుకునే విషయంలో తల్లిదండ్రులు కట్టుబాట్లు పెడుతున్నారు. ఈ క్రమంలో తెగించి కులాంతర వివాహాలు చేసుకున్న పిల్లలపై కక్ష సాధింపులకు దిగుతున్నారు. కొన్నిసార్లు పరువు హత్యలకూ పాల్పడుతున్నారు. ప్రణయ్ హత్య తర్వాత అలాంటి ఘటనలే మరికొన్ని జరిగాయి కూడా.
ఆగని పరువు హత్యలు..
⇒ హయత్‌నగర్ పోలీస్ స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న నాగమణి ప్రేమ వివాహం చేసుకోవడంతో పగ పెంచుకున్న ఆమె తమ్ముడు.. గతేడాది డిసెంబర్ 1న స్కూటీపై వెళుతుండగా వెంబడించి కొడవలితో నరికి హత్యచేశాడు.
⇒ దండుమైలారం గ్రామంలో ఒక యువకుడిని ప్రేమించిందన్న కోపంతో తన కుమార్తె భార్గవిని తల్లి జంగమ్మ చీరతో ఉరివేసి హతమార్చింది.
⇒ప్రేమ వివాహం చేసుకున్న నాగరాజు, అశ్రీన్ దంపతులు 2022 మేలో హైదరాబాద్ సరూర్‌నగర్ ప్రాంతంలో బైక్‌పై వెళుతుండగా ఆపి.. నాగరాజును దారుణంగా చంపారు.
⇒ 2022 మేలో ప్రేమ వివాహం చేసుకున్న యువతి కుటుంబ సభ్యులు బేగంబజార్ మచ్చి మార్కెట్ సమీపంలో నీరజ్ పన్వర్ అనే యువకుడిని దారుణంగా పొడిచి హత్య చేశారు.
Comments
Please login to add a commentAdd a comment