47 ఏళ్ల క్రితం ఆఖరి ఉరి | No gallows in Telangana: No hanging in state in last 47 years | Sakshi
Sakshi News home page

47 ఏళ్ల క్రితం ఆఖరి ఉరి

Published Tue, Mar 11 2025 5:04 AM | Last Updated on Tue, Mar 11 2025 5:04 AM

No gallows in Telangana: No hanging in state in last 47 years

1978లో ముషీరాబాద్‌ జైల్లో రామవతార్‌ యాదవ్‌అనే దోషికి శిక్ష అమలు 

ప్రస్తుతం రాష్ట్రంలోనిఏ జైలులోనూ లేని ఉరికంబం

ఉరి తీసే తలారీ ‘హ్యాంగ్‌మన్‌’ పోస్టులు కూడా లేవు 

ఉమ్మడి ఏపీ పరిధిలో రాజమండ్రి సెంట్రల్‌ జైల్లోనే ఉరికంబం

ప్రణయ్‌ హత్య కేసులో తీర్పు వెలువడింది. ఏ2గా సుభాష్‌ శర్మను కోర్టు దోషిగా నిర్ధారిస్తూ మరణశిక్ష విధించింది. అయితే శిక్ష అమలు కావడానికి మూడు అంకాలు దాటాల్సి ఉంటుంది. ఇక్కడ తెరపైకి వచ్చే అంశం ఏమిటంటే.. ప్రస్తుతం రాష్ట్రంలోని ఏ జైలులోనూ గ్యాలోస్‌ (ఉరికంబం ఉండే ప్రాంతం సాంకేతిక నామం) లేదు. తలారులుగా పిలిచే హ్యాంగ్‌ మన్‌ పోస్టులు అసలే లేవు.

రాష్ట్రపతి వరకు అప్పీల్‌కు చాన్స్‌..
ప్రస్తుతం ట్రయల్‌ కోర్టు సుభాష్‌ శర్మకు మరణశిక్ష విధించింది. అతను ఈ తీర్పును హైకోర్టులో సవాల్‌ చేసే అస్కారం ఉంది. అంతేకాదు ట్రయల్‌ కోర్టు కూడా ఈ శిక్ష విషయాన్ని హైకోర్టు దృష్టికి తీసుకువెళ్తుంది. ఈ క్రమంలో ‘రిఫర్డ్‌ ట్రయల్‌’గా పిలిచే విధానంలో హైకోర్టు విచారణ చేయవచ్చు. మరణశిక్షను హైకోర్టు సమర్థిస్తే.. సుప్రీంకోర్టులో అప్పీల్‌ చేయవచ్చు. అక్కడా చుక్కెదురైతే క్షమాభిక్ష కోరుతూ రాష్ట్రపతికి విజ్ఞప్తి చేయవచ్చు. రాష్ట్రపతి తిరస్కరిస్తే.. దోషులకు విధించిన మరణశిక్ష పూర్తిగా ఖరారైనట్లే. దీంతో శిక్ష విధించిన
న్యాయస్థానానికి సంబంధించిన రాష్ట్రంలో.. మరణశిక్షను అమలు చేస్తారు. 

ఉమ్మడి రాష్ట్రంలో 47 ఏళ్ల క్రితం..
ఉమ్మడి ఏపీ రాష్ట్రానికి సంబంధించి ఆఖరి ఉరిశిక్షను 47 ఏళ్ల క్రితం ముషీరాబాద్‌ సెంట్రల్‌ జైలులో అమలు చేశారు. 1978లో భారత వైమానిక దళంలో పనిచేసిన ఎయిర్‌మన్‌ రామవతార్‌ యాదవ్‌పై హత్య కేసు నిరూపితమై, మరణశిక్ష ఖరారు కావడంతో ఉరి తీశారు. అప్పట్లో ముషీరాబాద్‌ సెంట్రల్‌ జైల్‌ సూపరింటెండెంట్‌గా ఉన్న సుబ్బారెడ్డి పర్యవేక్షణలో శిక్షను అమలైంది. తర్వాతి కాలంలో ముషీరాబాద్‌ సెంట్రల్‌ జైలును చర్లపల్లి ప్రాంతానికి మార్చారు.

ఇక్కడ జైలు నిర్మిస్తున్నప్పుడు గ్యాలోస్‌ (ఉరికంబం) కోసం ఓ ప్రాంతాన్ని ఎంపిక చేసినా ఏర్పాటు చేయలేదు. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ఉరికంబం ఉన్న జైలు ఒక్క రాజమండ్రి సెంట్రల్‌ జైలు మాత్రమే. ఇక తెలంగాణ జైళ్ల శాఖలో హ్యాంగ్‌మన్‌గా పిలిచే తలారీ పోస్టులు లేవు. చాలా ఏళ్లుగా ఉరిశిక్ష అమలు లేకపోవడంతో కొందరు హెడ్‌–వార్డెర్లకే ఈ అంశంలో ప్రాథమిక శిక్షణ ఇస్తున్నారు.

రాజమండ్రి జైల్లో 49 ఏళ్ల క్రితం...
రాజమండ్రి సెంట్రల్‌ జైలులో చివరిసారిగా 1976 ఫిబ్రవరిలో ఉరిశిక్షను అమలు చేశారు. ఓ హత్య కేసులో దోషిగా తేలిన అనంతపురం జిల్లాకు చెందిన నంబి కిష్టప్పను ఉరి తీశారు. తర్వాత కొందరు ఖైదీలను ఉరిశిక్ష అమలు కోసం ఈ జైలుకు తరలించినా అమలు కాలేదు. 1875 నుంచీ గ్యాలోస్‌ ఉండి, ఇప్పటికీ కొనసాగుతున్న కేంద్ర కారాగారం రాజమండ్రి సెంట్రల్‌ జైల్‌ మాత్రమే.

స్వాతంత్య్రం అనంతరం దేశవ్యాప్తంగా వివిధ కారాగారాల్లో దాదాపు 100 మందిని ఉరితీశారు. అందులో అత్యధికంగా 42 శిక్షలను రాజమండ్రి సెంట్రల్‌ జైల్లోనే అమలు చేశారు. ఉరి అమలుకు ముందు సదరు ఖైదీని ఆఖరి కోరిక ఏమిటని అడగటం ఆనవాయితీ. కిష్టప్ప తన ఆఖరి కోరికగా లడ్డూ తింటానని కోరగా.. జైలు అధికారులు అతడికి లడ్డూలు అందించారు. రాజమండ్రి జైలు తలారీ ధర్మరాజు ఆ ఉరి తీశారు.

అదో ప్రత్యేకమైన గ్యాలోస్‌..
రాజమండ్రి సెంట్రల్‌ జైల్లోని గ్యాలోస్‌ 1980 వరకు ప్రధాన ద్వారం పక్కనే బహిరంగ ప్రదేశంలో ఉండేది. ఉరిశిక్ష అమలు తర్వాత మృతదేహాన్ని ఉరికంబం కింద ఉండే ప్రత్యేక చాంబర్‌లో దింపుతారు. అక్కడి నుంచి నేరుగా ట్రే ద్వారా సంబంధీకులకు అప్పగించాలని, మృతదేహాన్ని జైలుగదుల మీదుగా బయటికి తీసుకురావద్దనే ఉద్దేశంతో అలా ఏర్పాటు చేశారు. 1980 తర్వాత గ్యాలోస్‌ను అడ్మినిస్ట్రేటివ్‌ భవనం పరిసరాల్లోకి మార్చారు.

2013లో ఈ గ్యాలోస్‌ ఉన్న ప్రాంతంలోనే రూ.7.5 కోట్లతో కొత్తగా పరిపాలనా భవనాన్ని నిర్మించారు. అయితే గ్యాలోస్‌ను అక్కడి నుంచి మార్చడం ఇష్టం లేక భవనం కింద భూగర్భంలో ఏర్పాటు చేశారు. ఈ తరహా గ్యాలోస్‌ కలిగిన కారాగారం దేశంలో మరోటి లేదు. అంతేకాదు నిర్మాణాలు ఎన్ని మారినా ఇప్పటికీ బ్రిటిష్ కాలం నాటి ఇనుప ఉరికంబాన్నే వినియోగిస్తున్నారు. తరచూ దీనికి నూనె రాస్తూ దెబ్బతినకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement