సాక్షి, పరకాల(హనుమకొండ): చుట్టూ పచ్చనిపొలాలు.. పంటకాల్వల్లో ఉరకలేస్తున్న జలాలు.. ఆ పక్కనే చీమ చిటుక్కున్నా వినిపించేంత నిశ్శబ్దం అలుముకున్న చెట్లపొదలు. ఆ పొదల్లో ఓ వ్యక్తి ఆదమరిచి నిద్రపోతున్నాడు. ఏదో అలికిడికి ఉలిక్కిపడి లేచి చూసేసరికి చుట్టూ సాయుధులైన పోలీసులు. తప్పించుకోబోయి చివరికి పోలీసులకు చిక్కాడు. జైలు సిబ్బందిని నమ్మించి పారారైన రిమాండ్ ఖైదీ చివరికి అతడి భార్య ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులకు పట్టుబడ్డాడు.
2019లో మహదేవ్‌పూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఓ బాలికపై అత్యాచారం కేసులో ములుగు జిల్లా ఏటూరునాగారం గ్రామానికి చెందిన సైకిల్ మెకానిక్ షేక్ గౌస్ పాషా అలియాస్ చోటు(22) కరీంనగర్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నాడు. బెయిల్‌పై బయటకు వచ్చి తిరిగి కోర్టుకు హాజరుకాకుండా తప్పించుకు తిరుగుతుండటంతో ఈ ఏడాది మార్చి 18న పోలీసులు అతడిని అరెస్టు చేసి పరకాల సబ్‌జైలుకు తరలించారు. అప్పటి నుంచి జైలు సిబ్బందితో సన్నిహితంగా ఉంటూ వస్తున్నాడు. ఈ క్రమంలో మున్సిపల్ వాహనంలో చెత్తవేయడానికని తాజాగా సోమవారం తెల్లవారుజామున 6.20 గంటలకు జైలు గేటు దాటి వచ్చి పరారయ్యాడు.
భార్య ఇచ్చిన సమాచారంతో...
పరారైన తరువాత భార్యకు నిందితుడు ఫోన్ చేసి ఉంటాడని జైలు అధికారులు పసిగట్టి పరారీ విషయాన్ని ఆమెకు ఫోన్‌ద్వారా తెలియజేశారు. అతడు తిరిగి జైలుకువస్తే శిక్ష తక్కువగా ఉంటుందని, లేకపోతే మరింత ఎక్కువ కాలం శిక్ష అనుభవించాల్సి వస్తుందని చెప్పారు. కొద్దిసేపటి తరువాత అనుకున్నట్టే గౌస్ పాషా ఇతరుల సెల్‌ఫోన్‌తో భార్యకు ఫోన్ చేశాడు.
ఆమె ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు ఆ నంబర్ లొకేషన్ గుర్తించి అయ్యప్ప గుడి వద్దకు చేరుకున్నారు. అతడు అదే ప్రాంతంలో ఉంటాడని భావించిన పోలీసులు ఆ చుట్టుపక్కల పంటపొలాలు, కాల్వలు, చెట్లపొదలలో గాలించారు. చివరకు ఓ పంటకాల్వ సమీపంలోని చెట్లపొదల్లో నిద్రపోతూ పోలీసులకు చిక్కాడు.
Comments
Please login to add a commentAdd a comment