యుద్ధరంగ సైనిక క్షతగాత్రుల రక్తసిక్త గాయాలపై ఆమె పేరు నిర్లిఖితాక్షరి. గుండెలు దద్దరిల్లే, నిరంతర ధ్వనిజ్వలిత రణ క్షేత్రంలో ఆమె ఒక నిశ్శబ్ద సైనిక. మరఫిరంగులు మిగిల్చిన రక్తసిక్త బాధాతప్త సైనిక హాహాకా రాలు తప్ప, మరేమీ కానరాని కారుచీకట్లలో ఆమె ఓ నిలువెత్తు దీపాక్రాంతి. వందేళ్ళనాడే వైద్యరంగంలో నర్సింగ్ వ్యవస్థ ఆవశ్యకతను విద్యుల్లతలా రాజేసిన ఆశాకిరణం ఫ్లారెన్స్ నైటింగేల్.. నేటి మహావిపత్కాలాన స్మరించుకోదగిన మహిళ. నర్సింగ్ వృత్తిలో దాగివున్న సేవాతత్పరతకు మించిన మానవీయతను ప్రపంచానికి చాటిచెప్పి, ఆధునిక నర్సింగ్ వ్యవస్థకు ఆద్యురాలిగా నిలిచిన ఫ్లారెన్స్ నైటింగేల్ నూటాయాభయ్యేళ్ళ క్రితం ఈనాటిæ విప త్కాలాన్ని ఊహించలేకున్నా, సమాజరీతినీ, గతినీ మున్ముందుగానే వీక్షించి, భవిష్యత్ తరాల ఆరోగ్య అవసరాన్ని అక్షరాలా ఆనాడే అంచనావేశారు. ఈ ప్రపంచంలో ఇంటింటికీ ఒక నర్సు అవసరం ఉన్నదని తేల్చిచెప్పారు. ప్రస్తుతం మనం ఎదుర్కొంటోన్న కరోనా యుద్ధంలో డాక్టర్లతో పాటు, ఎంతో మంది నర్సులు ప్రాణత్యాగాలు చేస్తున్నారు. అయితే వారి లెక్కలు ఎక్కడా దొరకవు కానీ, నిజానికి వందల మంది నర్సులు కోవిడ్ పేషెంట్లను కాపాడటంలో ప్రాణాలు కోల్పోయి వుంటారు. అటువంటి వారికి ఫ్లారెన్స్ నైటింగేల్ ఒక స్ఫూర్తి. సరిగ్గా ఈ రోజు ఆమె 110వ వర్ధంతిని జరుపుకుంటున్నాం. ఈ సందర్భంగా ఫ్లారెన్స్ నైటింగేల్‌ను స్మరించుకోవడమంటే కరోనా యుద్ధంలో ముందు భాగాన ఉండి పోరాడుతోన్న నర్సులకు జేజేలు పలకడమే.
పుట్టుకతో పరిమళించిన ఫ్లారెన్స్ నైటింగేల్
నైటింగేల్ 1820, మే 12న ఇటలీలో ఓ బ్రిటిష్ కుటుంబంలో జన్మిం చారు. ఆమె తండ్రి విలియం షోర్ నైటింగేల్ అత్యంత సంపన్నుడు. ఆమె తల్లి ఓ ప్రముఖ వ్యాపారవేత్త కుటుంబానికి చెందిన వ్యక్తి. చిన్నప్పటి నుంచి నైటింగేల్‌కి గణితంలో మంచి పట్టుండేది. తొలి నుంచీ ధార్మిక విషయాలపైనా, విద్యపైనే ఆసక్తి ఉండేది. పరోపకారం ఆమెకు పుట్టుకతో వచ్చిన సుగుణం. దైవ సేవకురాలిగా జీవితాంతం గడపాలనీ, ఆయన సూచించిన మానవ సేవలోనే తరించాలని ఆమె భావించారనడానికి ఆమె రాసిన ‘ది హయ్యెస్ట్ ఆనర్ ఈజ్ టు బి గాడ్స్ సర్వెంట్ అండ్ ఫెలో వర్కర్’ అన్న పుస్తకమే సాక్ష్యం. నైటింగేల్ నివసించే ఎస్టేట్ చుట్టుపక్కల, పొరుగు గ్రామాల్లో అనారోగ్యం పాలైన పేద ప్రజలకు సేవచేయడం ఆమెకు ఎంతో తృప్తినిచ్చేది. ఆ పరిస్థి తులే, 17 ఏళ్ళ వయస్సులోనే, జీవితమంతా రోగులకు సేవ చేస్తూ గడపాలనే నిర్ణయం తీసుకునేలా చేశాయి. 16 ఏళ్ళకే ఆమె కుటుంబ సభ్యుల నుంచి వచ్చిన పెళ్ళి ప్రస్తావనని సున్నితంగా తిర స్కరించారు. తాను నర్సుగానే జీవితం చాలిస్తానని తెగేసి చెప్పారు. మనలాంటి సంపన్నులకు ఈ పని తగదని కుటుంబ సభ్యులు వారిం చినా, సోదరి కన్నీళ్ళు పెట్టినా, ఎవరెన్ని చెప్పినా నైటింగేల్‌ని తన నిర్ణయం నుంచి కించిత్ కూడా కదలించలేకపోయాయి. 1844లో జర్మనీలోని కైసర్ వెర్త్ పట్టణంలోని, లూథరన్ ఆసుపత్రిలో నైటింగేల్ నర్సింగ్ విద్యార్థిగా చేరారు. 1851లో శిక్షణను ముగించుకొని, ఉన్నత చదువులకోసం, 1853లో పారిస్ వెళ్ళి శిక్షణ పూర్తి చేసుకుని, సెంట్రల్ లండన్‌లో, ఆసుపత్రిలో సూపరింటెండెంట్‌గా చేరారు. అది కేవలం పేదల ఆసుపత్రి. ఆ నాటి నుంచి ఆమె తన గురించి ఆలోచించడం మానేశారు. రోగుల సేవకే పునరంకితం అయ్యారు. తనని నడిపించేది మాత్రం ఏసుక్రీస్తేనని ఆమె భావన.
‘‘ఇతర వ్యక్తులతో నన్ను నేను ఎన్నోసార్లు పోల్చి చూసు కున్నాను. విపత్తులు సంభవించినప్పుడు వాళ్ళు సాకులు వెతికి తప్పించుకోజూస్తారు. కానీ నేను మాత్రం వాటిని ఎదుర్కోవడంలో నిమగ్నమైపోతాను. మనం పరిస్థితులను మార్చడానికి సిద్ధం కాకుండా, ఇతరులను విమర్శించడంలో అర్థం లేదు’’ అన్న నైటింగేల్ వ్యాఖ్యల్లో ఎంతో తాత్వికత గోచరిస్తుంది. నిజానికి ఆమె ఒక అసా ధారణ ఆరోగ్యకార్యకర్త. అంతేకాదు గణాంక నిపుణురాలు కూడా. అనేక భాషల్లో ప్రావీణ్యురాలు. ఆమె గొప్పకార్యనిర్వాహకురాలు కూడా.
యుద్ధక్షేత్రంలో...
క్రిమియాలో రష్యా, బ్రిటన్‌ల మధ్య సాగుతోన్న యుద్ధ కాలంలో ఆసుపత్రి నిర్వహణా బాధ్యతల్లో నైటింగేల్ సన్నిహిత మిత్రుడు సిడ్నీ హెర్బర్డ్ ఉన్నారు. సైనికాసుపత్రుల్లో ఆనాటికి పరిస్థితి అత్యంత దయ నీయంగా ఉంది. వివిధ రకాల అంటువ్యాధులతోనూ, యుద్ధరం గంలో గాయాలపాలవడంతోనూ అనేక మంది సైనికుల మరణాల సంఖ్య అనూహ్యంగా పెరిగిపోయింది. ఇదే విషయంపై పత్రికల్లో కథనాలు రావడంతో, ప్రజల్లో అలజడి మొదలయ్యింది. దీంతో అక్కడి యుద్ధ కార్యదర్శి టర్కీలోని మిలటరీ ఆసుపత్రిలో పరిస్థితు లను చక్కదిద్దడానికి నర్సుల బృందాన్ని నియమించాలని యుద్ధ కార్యదర్శి భావించారు. అతడు నైటింగేల్ నైపుణ్యం, ఆమె నాయకత్వ లక్షణాలను గురించి అవగాహన ఉన్న సన్నిహిత మిత్రుడు సిడ్నీ హెర్బర్డ్. నైటింగేల్‌కి ఆçహ్వానం అందింది. 1854లో నైటింగేల్ తన 38 మంది నర్సుల బృందంతో టర్కీలోని యుద్ధక్షేత్రంలోకి అడుగు పెట్టారు. అప్పుడే బ్రిటిష్ సైనిక క్షతగాత్రులకు ఆమె అందించిన అనూ హ్యమైన సేవల ద్వారా తొలిసారి ఫ్లారెన్స్ నైటింగేల్ పేరు వెలుగులోకి వచ్చింది.
పరిశుభ్రతపై శ్రద్ధ, రోగుల్లో మనోనిబ్బరం...
నైటింగేల్ సైనిక ఆసుపత్రిలోకి అడుగిడిన తక్షణమే సైనికాధికారులకు రోగుల సంఖ్యను బట్టి కొన్ని వందల టవళ్ళు, కొన్ని వందల సబ్బులు, గదులను శుభ్రపరిచేందుకు అవసరమైన, ఆనాటికి అందు బాటులో ఉన్న శానిటరీ వస్తువుల జాబితాను తయారుచేసి ఇచ్చారు. సైనికుల వార్డుల్లో రాత్రుళ్ళు చేతిలో లాంతరు పట్టుకుని రౌండ్స్ వేసేవారామె. అప్పుడే ఆమెను లేడీ విత్ ద ల్యాంప్ అని పిలిచేవారు. రోగుల నిద్రకు ఎంత ప్రాధానత్యనిచ్చేవారంటే వార్డుల్లో నర్సులు నడిచేటప్పుడు వారి గౌను శబ్దం కూడా పేషెంట్ల చెవులకు సోక రాదనేవారు నైటింగేల్. కేవలం వైద్య పరిరక్షకులుగానే కాక సైనికుల కోసం వారి కుటుంబాలకు వేలాది ఉత్తరాలు నైటింగేల్ స్వయంగా రాసి పోస్ట్ చేసేవారు. ఇది రోగుల్లో ఎంతో మానసిక స్థైర్యాన్ని నింపింది. నైటింగేల్ చేపట్టిన చేసిన అనేక సంస్కరణలు సైనికాసుపత్రి మరణాల రేటును, తొలి నెల రోజుల్లోనే 32 శాతం నుంచి 2 శాతానికి తగ్గించాయి. నర్సింగ్ వ్యవస్థను బలోపేతం చేయడం ద్వారా విప్లవా త్మక మార్పులు తీసుకొచ్చారు. క్రిమియా యుద్ధంలో ఫ్లారెన్స్ వైద్యా రోగ్య రంగంలో చేపట్టిన సంస్కరణలు అమెరికా, కెనడా దేశాలను ఆలోచింపజేశాయి. ఆ దేశాలకు నైటింగేల్ సలహాదారుగా కూడా పని చేశారు. నర్సింగ్ ఆద్యురాలైన నైటింగేల్ శిష్యురాలు లిండా రిచర్డ్, 1870లో అమెరికా తొలి శిక్షణ పొందిన నర్స్‌గా నియామకం అయ్యారు. పేషెంట్లను దివారాత్రులు కంటికి రెప్పలా కాపాడిన నైటింగేల్ వాడిన ల్యాంప్‌ని ఇప్పటికీ లండన్ మ్యూజియంలో భద్ర పరిచి ఉంచారు.
ప్రకృతి నుంచే మనిషికి ఉపశమనం లభిస్తుందనీ, ప్రకృతిలో సహజ సిద్ధంగా దొరికే స్వచ్ఛమైన గాలి, వెలుతురు, సూర్యరశ్మి, సురక్షితమైన నీరు, ప్రత్యేకించి ఎంపిక చేసిన పౌష్టికాహారం, మనసుకి ప్రశాంతత నిచ్చే నిశ్శబ్ద సుఖవంతమైన నిద్ర, అన్నింటికన్నా ముఖ్యంగా వ్యాధి గ్రస్తులను ఉంచే పరిసరాల శుభ్రత అనేవి రోగులకు ఔషధాలకు మించి ఉపశమనాన్నిస్తాయనీ, పరిశోధనాత్మకంగా రుజువుచేసిన ఫ్లారెన్స్ నైటింగేల్ ఎన్విరాన్‌మెంటల్ థియరీని ప్రవేశపెట్టారు. ఆమె ఈ సిద్ధాంతాన్ని ప్రపంచం ముందుంచిన 150 ఏళ్ళ తరువాత రోగికి అవసరమైన కనీస విషయాలను గురించి ఇప్పుడు యావత్ ప్రపంచం మాట్లాడుతోండటం విచిత్రం. రోగులను అనునిత్యం కంటికి రెప్పలా కాపాడాల్సిన నర్సులకు శిక్షణ తప్పనిసరి అని భావించిన నైటింగేల్ తదనంతర కాలంలో 1860లో లండన్‌లో తొలి నర్సింగ్ స్కూల్, ‘నైటింగేల్ నర్స్ ట్రైనింగ్ స్కూల్’ని నెలకొల్పారు. అప్పటివరకు నర్సింగ్ అనేది ఒక వృత్తి విభాగంగా లేదు. దానికి ఒక విధి విధా నాల్లేవు. శిక్షణా పద్ధతులు లేవు. క్రిమియా యుద్ధం అనుభవాలతోనే ఆమె నర్సింగ్ విద్యకు రూపకల్పన చేశారు. రెండు ప్రధానమైన అంశా లను ఆమె పరిగణనలోనికి తీసుకున్నారు. దాదాపు 200 పుస్తకాలు రాశారు. ఆమెకు ఎన్నో ఉన్నత పురస్కారాలు లభించాయి. 1883లో రాయల్ రెడ్‌క్రాస్ నుంచి ‘క్వీన్ విక్టోరియా’ బిరుదుని, 1904లో ఆర్డర్ ఆఫ్ మెరిట్‌ను అందుకున్నారు. 1910, ఆగస్టు, 13న లండన్‌లోని తన నివాసంలో ఫ్లారెన్స్ నైటింగేల్ గొంతు శాశ్వతంగా మూగబోయింది. నర్సింగ్ వృత్తిలో అసామాన్య సేవలు అందించిన వారికి 1912లో ఫ్లారెన్స్ నైటింగేల్ పేరున ఒక మెడల్‌ని ప్రారంభించారు.
జనాభా లెక్కల్లో ప్రజల ఆరోగ్యానికి కాలమ్...
నూటాయాభై ఏళ్ళక్రితం ఫ్లారెన్స్ నైటింగేల్ నేటికీ అత్యంత అనుసర ణీయమైన, ఒక అద్భుతమైన సూచన చేశారు. జనాభా లెక్కల సమ యంలోనే ప్రజల ఆరోగ్యానికి సంబంధించిన సమాచారాన్ని సేకరిం చాలని బలంగా వాదించారు. ఇది సూచన మాత్రమే కాదు పార్ల మెంటు వరకు తన వాదనని వినిపించేలా చేశారు. అదే జరిగి ఉంటే నిజానికి కోవిడ్‌లాంటి మహావిపత్కాలంలో ఎంతగానో ఉపయోగ పడేది. ఈ రోజుకీ ఆనాడు ఆమె లేవనెత్తిన అంశం తప్పనిసరిగా ఆచ రణలో ఉంచాల్సిన విషయమన్నది నిర్వివాదాంశం.
వ్యాసకర్త సామాజిక విశ్లేషకులు
మల్లేపల్లి లక్క్ష్మయ్య
మొబైల్ : 81063 22077
కరోనా వారియర్లకు అసలైన స్ఫూర్తి
Published Thu, Aug 13 2020 12:39 AM | Last Updated on Thu, Aug 13 2020 12:39 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment