Nightingale
-
స్త్రీ శక్తి: ఆర్మీ లాయర్ అఖిల
‘అఖిల నారాయణ్ గురించి కాస్త చెప్పండి’ అని అడిగితే... సమాధానం తట్టక బుర్ర గోక్కునేవాళ్లు ఉండొచ్చు. సినిమాలు ఎక్కువగా చూసే వాళ్లు అయితే ‘ఆ..గుర్తొచ్చింది. పోయిన సంవత్సరం ఒక సినిమాలో నటించింది కదా!’ అంటారు. అరుల్ దర్శకత్వంలో వచ్చిన తమిళ్ హారర్ మూవీ ‘కదంపారీ’లో అఖిల నటించింది. అయితే ఇప్పుడు ఆమె గురించి చెప్పుకోవడానికి ఈ హారర్ సినిమా మాత్రమే అక్కర్లేదు. యూఎస్‌లో భారత సంతతికి చెందిన అఖిల తాజాగా అక్కడి సైన్యంలో లాయర్‌గా చేరింది. ‘భేష్’ అనిపించుకుంటోంది. లీగల్ అడ్వైజర్‌గా ఆమె సేవలు అందించనుంది. ‘యూఎస్ ఆర్మీ కంబాట్ ట్రైనింగ్’లో కొన్ని నెలల పాటు కఠినమైన శిక్షణ పొందింది అఖిల. రెడ్, వైట్, బ్లూ...అనే మూడు దశల్లో సాగే ఆర్మీ కంబాట్ ట్రైనింగ్‌లో వెపన్ ఆపరేటింగ్, వారియర్ టాస్క్, బ్యాటిల్ డ్రిల్స్, టాక్టికల్ స్కిల్...మొదలైనవాటిలో శిక్షణ ఇస్తారు. అఖిలకు సంగీతం అంటే బోలెడు ఇష్టం. ‘నైటింగిల్ స్కూల్ ఆఫ్ మ్యూజిక్’ పేరుతో ఆన్లైన్ క్లాసులు నిర్వహిస్తోంది. -
స్వర్గం కొత్త కాంతులతో వెలుగుతుంది
భారత గానకోకిల, దిగ్గజ గాయని లతా దీదీ ఇక లేరు. ఆమె లేని లోటు ఎవరూ పూడ్చలేరు. సంగీతం సజీవంగా ఉన్నంత వరకు ఆమె పాటలు వినిపిస్తూనే ఉంటాయి. – చిరంజీవి లతాగారి మరణం దేశానికే కాదు.. సంగీత ప్రపంచానికే తీరని లోటు. దేశంలో ఎన్నో అవార్డులు, రివార్డులు పొందారామె. విదేశాలు కూడా పురస్కారాలతో ఆమెను గౌరవించడం గర్వకారణం. – బాలకృష్ణ నైటింగేల్ ఇక లేరని తెలిసి నా హృదయం ముక్కలయింది. లతాగారు ఎందరికో స్ఫూర్తి ఇచ్చారు. ఆమె లేని లోటు ఎప్పటికీ శూన్యాన్ని సృష్టిస్తుంది. – వెంకటేశ్ లతాజీ మరణం తీరని లోటు. భారతదేశ నైటింగేల్‌కి నా హృదయపూర్వక నివాళులు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలి. – రాజమౌళి, డైరెక్టర్ భారతీయ సినీ సంగీత లోకంలో ధ్రువతార, గాన కోకిల లతా మంగేష్కర్‌గారు తుదిశ్వాస విడి చారన్న విషయం ఆవేదనను కలిగించింది. లతాజీ అస్తమయం భారతీయ సినీ సంగీతానికే తీరని లోటు. బాల్యం నుంచి ఎన్నో కష్టాలను ఎదుర్కొని ఆమె నిలిచి, గెలిచిన తీరు స్ఫూర్తిదాయకం. – పవన్ కల్యాణ్ మా గానకోకిల మూగబోయింది. మా మధ్య భౌతికంగా మీరు లేకపోవచ్చేమో కానీ మీ పాటలు మాత్రం ఎప్పటికీ సజీవంగా ఉంటాయి. పాటలో ఒకే ఒక్క లైన్‌తో మమ్మల్ని ఎన్నో అనుభూతులకు గురి చేశారు. – మహేశ్‌బాబు పాకిస్తాన్–బర్మా యుద్ధంలో బర్మా తరఫున యుద్ధం చేస్తున్న మన దేశ సైనికులు చాలామంది అమరులయ్యారు. కొంతమంది గాయాలపాలయ్యారు. ఆ సమయంలో లతా మంగేష్కర్తో పాటు చాలామంది ప్రముఖులు సైనికులను పరామర్శించడానికి బర్మా వెళ్లారు. గాయపడ్డ ఓ సైనికుడు ‘లతాగారిని చూడాలని, ఆమె పాట వినాలని ఉంది’ అని డాక్టర్‌కి చెప్పాడు. లతగారు అతన్ని ఆలింగనం చేసుకుని, ‘ఆరాధన’ సినిమాలోని పాట పాడారు. ఆ పాటతో అతనిలో ఊపిరి వచ్చి కోలుకొని బతికాడు.. దటీజ్ లతా మంగేష్కర్. – ఆర్. నారాయణమూర్తి భారతీయ సినిమా నైటింగేల్ లతా మంగేష్కర్‌ను కోల్పోయినందుకు మాకు చాలా బాధగా ఉంది. మా సంస్థ నిర్మించిన ‘ఆఖరి పోరాటం’ సినిమాలోని ‘తెల్ల చీరకు..’ పాటకు మీరు (లతా మంగేష్కర్) ఇచ్చిన వాయిస్ మీతో మాకు ప్రత్యేక అనుబంధాన్ని కలగజేసింది. – వైజయంతి మూవీస్ భారతీయ సంగీతంలో ఆరేడు దశాబ్దాలుగా తన అద్భుత స్వరంతో సంగీత శ్రోతలను మైమరచిపోయేలా చేశారు లతా మంగేష్కర్‌గారు. ఆమె మరణం నాలో ఓ శూన్యతను నెలకొల్పింది. ఈ శోకం నుంచి నేను ఎలా బయటకు రావాలో అర్థం కావడం లేదు. ఒక్క మ్యూజిక్ ఇండస్ట్రీకే కాదు.. ఆమె మరణం ప్రపంచానికే తీరని లోటు. కానీ ఆమెతో కలిసి పని చేశాననే భావన నన్ను కాస్త ఓదార్చుతోంది. మనందరి హృదయాల్లోని లతా మంగేష్కర్ స్థానం ఎవరూ భర్తీ చేయలేనిది. – ఇళయరాజా మా నాన్నగారితో (సంగీతదర్శకుడు ఆర్కే శేఖర్) లతా మంగేష్కర్‌గారు వర్క్ చేశారు. అప్పట్లో నేను ఆమె రికార్డింగ్స్‌ను చూస్తూ ఎంతో స్ఫూర్తి పొందాను. ప్రతి లిరిక్‌ను ఎంతో స్పష్టంగా, ఎంతో బాగా పాడతారామె. భారతీయ సంగీతంలో ఆమె ఓ భాగం. లతగారు పాడిన పాటలకు నేను సంగీతం అందించడం, ఆమెతో కలిసి పాటలు పాడటం, కలిసి స్టేజ్ షేర్ చేసుకోవడం వంటివాటిని నేను మర్చిపోలేను. ఆమె నుంచి నేను ఎంతో స్ఫూర్తి పొందాను. – ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ ఇండస్ట్రీకి బ్లాక్ డే. లతాగారిలాంటి సింగర్ వస్తారా? అనేది నాకో క్వశ్చన్ మార్క్. లతా మంగేష్కర్గారిని రెండుసార్లు కలిసే అవకాశం నాకు లభించింది. ముంబైలోని ఉన్నప్పుడు ఆమె స్టూడియోలో వర్క్ చేసేవాడిని. ఓ సందర్భంలో ఆవిడ అక్కడకు వచ్చారు. అప్పుడు అక్కడి వారు నన్ను ఆవిడకు పరిచయం చేశారు. అంత పెద్ద గాయని అయ్యుండి ‘నమస్తే.. అనూప్ జీ’ అని ఎంతో గౌరవంగా మాట్లాడారు. – అనూప్ రూబెన్స్ భారతదేశం పాటలు పాడుతున్నంత కాలం లతా మంగేష్కర్ జీవించే ఉంటారు. ఆమె అద్భుతమైన సింగరే కాదు. మంచి మానవతావాది కూడా. నా దర్శకత్వంలో వచ్చిన హిందీ చిత్రం ‘లేకిన్’ (1991)కు లతా మంగేష్కర్ ఓ నిర్మాత. ఆ సినిమా షూటింగ్ సమయంలో చిత్రయూనిట్ సభ్యులకు ఆమె బహుమతులు ఇచ్చారు. ‘లేకిన్’ సినిమాలోని పాటకు బెస్ట్ ప్లే బ్యాక్ సింగర్‌గా లతా మంగేష్కర్‌కు జాతీయ అవార్డు రావడం హ్యాపీగా ఉంది. గౌతమ బుద్ధుని ప్రతిమలను సేకరించే అలవాటు నాకు ఉందని తెలుసుకున్న ఆమె నాకు నాలుగు బుద్ధుని ప్రతిమలను గిఫ్ట్‌గా ఇచ్చారు. ఆరు నెలల క్రితం కూడా ఆవిడ నాకు ఓ గౌతమ బుద్ధుని ప్రతిమను బహుమతిగా పంపారు. ఆమె వ్యక్తిత్వానికి ఇదో నిదర్శనం. – గుల్జార్ లతా మంగేష్కర్‌గారి మరణం తీరని లోటు. ఆమె పాటలతో పాటు ఆమె వ్యక్తిత్వం కూడా ఎప్పటికీ సజీవంగానే ఉంటుంది. – శత్రుఘ్న సిన్హా కొన్ని రోజుల క్రితం లతా మంగేష్కర్గారితో హాస్పిటల్లో మాట్లాడాను. లతా మంగేష్కర్‌గారు తిరిగి కోలుకుంటారని డాక్టర్స్ చెప్పేవారు. కానీ ఊహించనిది జరిగింది. నా జీవితంలో నన్ను ఎన్నోసార్లు మోటివేట్ చేశారు. ఆవిడతో నాకు మంచి అనుబంధం ఉంది. – ధర్మేంద్ర ఆమె మనల్ని విడిచి వెళ్లిపోయారు. ఎన్నో శతాబ్దాలు నిలిచి ఉండగల స్వరం మనకు దూరమైపోయింది. ఆ స్వరం ఇప్పుడు స్వర్గంలో ప్రతిధ్వనిస్తోంది. – అమితాబ్ బచ్చన్ లతా మంగేష్కర్‌గారు ఆదర్శప్రాయమైన వ్యక్తిత్వం ఉన్నవారు. ఆమె పాడిన ఎన్నో హిట్ సాంగ్స్‌లో నా పెర్ఫార్మెన్స్ ఉండటాన్ని నేను అదృష్టంగా భావిస్తున్నాను. ఫిబ్రవరి 6 బ్లాక్ డే. వ్యక్తిగతంగా కూడా నాకు తీరని లోటు. లతా స్వరం ఇకపై స్వర్గంలో వినిపిస్తుంది. – హేమమాలిని మన నైటింగేల్‌ను మిస్ అవుతున్నాం. కానీ మీ (లతా మంగేష్కర్) స్వరం మాత్రం ఎప్పటికీ సజీవంగానే ఉంటుంది. – సల్మాన్ ఖాన్ -
లతా మంగేష్కర్ కడసారి వీడ్కోలు.. బారీగా వచ్చిన అభిమానులు
-
గగన కోకిల - లతా మంగేష్కర్
-
మీరెక్కడ ఉన్న.. మా కోవెలే..మా ఇంటి కోకిలే
-
లతా మంగేష్కర్‌కు నివాళులు అర్పించిన ప్రధాని మోదీ
-
కోకిలమ్మ- లెజెండరీ సింగర్ లతా మంగేష్కర్ జర్నీ
-
ముంబై శివాజీ పార్కుకు లతా మంగేష్కర్ పార్థివదేహం తరలింపు
-
నైటింగేల్ ఆఫ్ ఇండియా లతాజీ అస్తమయం
-
గాన కోకిల లతా మంగేష్కర్ కన్నుమూత
లెజెండరీ సింగర్ లతా మంగేష్కర్ (92) ఇక లేరు. ముంబై బ్రీచ్ క్యాండీ ఆస్పత్రిలో ఈ ఉదయం 8గం.12ని. తుదిశ్వాస విడిచినట్లు సమాచారం. గత 29రోజులుగా ఆమె ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. గత నెల 8వ తేదీన కరోనాతో ఆమె ఆస్పత్రిలో చేరిన సంగతి తెలిసిందే. ఆపై కరోనా నుంచి రికవరీ అయిన ఆమె.. వెంటిలేటర్‌పై కొన్నాళ్లు చికిత్స పొందారు. ఈ క్రమంలో ఆమె కోలుకుంటున్నట్లు వైద్యులు ఈమధ్యే ప్రకటించారు కూడా. అయితే పరిస్థితి విషమించడంతో ఆమెకు మళ్లీ వెంటిలేటర్ మీదే చికిత్స అందించారు. 1942లో గాయనిగా ఆమె కెరీర్ ప్రారంభించారు. నౌషాద్ నుంచి ఏఆర్ రెహమాన్ వరకు.. ఎందరి సంగీతంలో ఆమె పాటలు పాడారు. నైటింగేల్ ఆఫ్ ఇండియాగా పేరున్న ఆమె.. దాదాపు 20 భాషల్లో 50 వేలకుపైగా పాటలు పాడారు. హిందీ చిత్రసీమలో లతా పాటలు నాటికి నేటికి శ్రోతలను అలరిస్తూనే ఉన్నాయి. ఆమె లేరనే వార్తతో శోక సముద్రంలో మునిగిపోయారు సినీ సంగీత అభిమానులు. తెలుగు సినీ పరిశ్రమతో అనుబంధం తెలుగులో 1955 లో ఏఎన్నార్ ‘సంతానం’ కోసం నిదుర పోరా తమ్ముడా.. 1965 లో ఎన్టీఆర్ దొరికితే దొంగలు సినిమాలో శ్రీ వేంకటేశ పాట. 1988 లో నాగార్జున ఆఖరి పోరాటం సినిమాలో తెల్ల చీర కు పాట పాడారు. గానమే పరమావధిగా.. 1929 సెప్టెంబరు 28 తేదీన సుప్రసిద్ధ సంగీతకారుడు దీనానాథ్ మంగేష్కర్‌కు పెద్ద కుమార్తెగా జన్మించారు లత. అయిదవ ఏటనే తండ్రివద్ద సంగీత శిక్షణ ప్రారంభించిన లత సంగీతమే మరోలోకంగా జీవించారు. చిన్న తనంలోనే తండ్రి మరణించడంతో పదమూడేళ్ళ వయసుకే కుటుంబ పోషణ బాధ్యత లతపై పడింది. దీంతో సినీరంగంలోకి ప్రవేశించి 1942లో మరాఠీ చిత్రం పహ్లా మంగళ గౌర్లో కథానాయిక చెల్లెలుగా నటించి రెండు పాటలు పాడారు. ఆ తరువాత పలు చిత్రల్లో నటించారు కూడా. గిన్నిస్ బుక్‌లోకి.. 1947లో మజ్ బూర్ చిత్రంతో గాయనిగా లత ప్రస్థానంమొదలైంది. మహల్‌తో స్టార్డమ్ సంపాదించుకున్నారు. అతి తక్కువకాలంలోనే తన ప్రతిభతో ఉన్న శిఖరాల్ని అధిరోహించారు. పలు భాషల్లో పాటలు పాడిన ఆమె జనం గుండెల్లో లెజెండరీ సింగర్‌గా చెరగని ముద్ర వేసుకున్నారు. తొలిసారిగా 1955లో రామ్ రామ్ పవ్హనే అనే మరాఠా సినిమాకు సంగీత సారధ్యం వహించారు లతా. సాధి మనసే సినిమాకు గాను ఆమె ఉత్తమ సంగీత దర్శకురాలిగా మహారాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వ అవార్డును గెలుచుకున్నారు. ఈ సినిమాలోని ఐరనించియా దేవ తులా పాటకు ఉత్తమ గాయినిగా కూడ అవార్డు అందుకున్నారు లతా. 1948- 1978 వరకు 30వేల పాటలు పాడిన ఏకైక గాయనిగా గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో పేరు సంపాదించుకున్నారు. నైటింగేల్ ఆఫ్ ఇండియాగా పేరు దక్కించుకున్న లతాజీ భారతీయ సినీ రంగానికి చేసినవిశిష్ట సేవలకు భారత అత్యున్నత పురస్కారమైన భారత రత్న అవార్డుతో సత్కరించింది . అలాగే పద్మ భూషణ్ , పద్మ విభూషణ్, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుతో పాటు పలు జాతీయ అవార్డులు ఆమెను వరించాయి. ఎంఎస్ సుబ్బులక్ష్మి తరువాత భారత ప్రభుత్వం నుండి ఎక్కువ అత్యుత్తమ పురస్కారాలు అందుకున్న అరుదైన గాయకురాలిగా కీర్తి గడించారు. -
కరోనా వారియర్లకు అసలైన స్ఫూర్తి
యుద్ధరంగ సైనిక క్షతగాత్రుల రక్తసిక్త గాయాలపై ఆమె పేరు నిర్లిఖితాక్షరి. గుండెలు దద్దరిల్లే, నిరంతర ధ్వనిజ్వలిత రణ క్షేత్రంలో ఆమె ఒక నిశ్శబ్ద సైనిక. మరఫిరంగులు మిగిల్చిన రక్తసిక్త బాధాతప్త సైనిక హాహాకా రాలు తప్ప, మరేమీ కానరాని కారుచీకట్లలో ఆమె ఓ నిలువెత్తు దీపాక్రాంతి. వందేళ్ళనాడే వైద్యరంగంలో నర్సింగ్ వ్యవస్థ ఆవశ్యకతను విద్యుల్లతలా రాజేసిన ఆశాకిరణం ఫ్లారెన్స్ నైటింగేల్.. నేటి మహావిపత్కాలాన స్మరించుకోదగిన మహిళ. నర్సింగ్ వృత్తిలో దాగివున్న సేవాతత్పరతకు మించిన మానవీయతను ప్రపంచానికి చాటిచెప్పి, ఆధునిక నర్సింగ్ వ్యవస్థకు ఆద్యురాలిగా నిలిచిన ఫ్లారెన్స్ నైటింగేల్ నూటాయాభయ్యేళ్ళ క్రితం ఈనాటిæ విప త్కాలాన్ని ఊహించలేకున్నా, సమాజరీతినీ, గతినీ మున్ముందుగానే వీక్షించి, భవిష్యత్ తరాల ఆరోగ్య అవసరాన్ని అక్షరాలా ఆనాడే అంచనావేశారు. ఈ ప్రపంచంలో ఇంటింటికీ ఒక నర్సు అవసరం ఉన్నదని తేల్చిచెప్పారు. ప్రస్తుతం మనం ఎదుర్కొంటోన్న కరోనా యుద్ధంలో డాక్టర్లతో పాటు, ఎంతో మంది నర్సులు ప్రాణత్యాగాలు చేస్తున్నారు. అయితే వారి లెక్కలు ఎక్కడా దొరకవు కానీ, నిజానికి వందల మంది నర్సులు కోవిడ్ పేషెంట్లను కాపాడటంలో ప్రాణాలు కోల్పోయి వుంటారు. అటువంటి వారికి ఫ్లారెన్స్ నైటింగేల్ ఒక స్ఫూర్తి. సరిగ్గా ఈ రోజు ఆమె 110వ వర్ధంతిని జరుపుకుంటున్నాం. ఈ సందర్భంగా ఫ్లారెన్స్ నైటింగేల్‌ను స్మరించుకోవడమంటే కరోనా యుద్ధంలో ముందు భాగాన ఉండి పోరాడుతోన్న నర్సులకు జేజేలు పలకడమే. పుట్టుకతో పరిమళించిన ఫ్లారెన్స్ నైటింగేల్ నైటింగేల్ 1820, మే 12న ఇటలీలో ఓ బ్రిటిష్ కుటుంబంలో జన్మిం చారు. ఆమె తండ్రి విలియం షోర్ నైటింగేల్ అత్యంత సంపన్నుడు. ఆమె తల్లి ఓ ప్రముఖ వ్యాపారవేత్త కుటుంబానికి చెందిన వ్యక్తి. చిన్నప్పటి నుంచి నైటింగేల్‌కి గణితంలో మంచి పట్టుండేది. తొలి నుంచీ ధార్మిక విషయాలపైనా, విద్యపైనే ఆసక్తి ఉండేది. పరోపకారం ఆమెకు పుట్టుకతో వచ్చిన సుగుణం. దైవ సేవకురాలిగా జీవితాంతం గడపాలనీ, ఆయన సూచించిన మానవ సేవలోనే తరించాలని ఆమె భావించారనడానికి ఆమె రాసిన ‘ది హయ్యెస్ట్ ఆనర్ ఈజ్ టు బి గాడ్స్ సర్వెంట్ అండ్ ఫెలో వర్కర్’ అన్న పుస్తకమే సాక్ష్యం. నైటింగేల్ నివసించే ఎస్టేట్ చుట్టుపక్కల, పొరుగు గ్రామాల్లో అనారోగ్యం పాలైన పేద ప్రజలకు సేవచేయడం ఆమెకు ఎంతో తృప్తినిచ్చేది. ఆ పరిస్థి తులే, 17 ఏళ్ళ వయస్సులోనే, జీవితమంతా రోగులకు సేవ చేస్తూ గడపాలనే నిర్ణయం తీసుకునేలా చేశాయి. 16 ఏళ్ళకే ఆమె కుటుంబ సభ్యుల నుంచి వచ్చిన పెళ్ళి ప్రస్తావనని సున్నితంగా తిర స్కరించారు. తాను నర్సుగానే జీవితం చాలిస్తానని తెగేసి చెప్పారు. మనలాంటి సంపన్నులకు ఈ పని తగదని కుటుంబ సభ్యులు వారిం చినా, సోదరి కన్నీళ్ళు పెట్టినా, ఎవరెన్ని చెప్పినా నైటింగేల్‌ని తన నిర్ణయం నుంచి కించిత్ కూడా కదలించలేకపోయాయి. 1844లో జర్మనీలోని కైసర్ వెర్త్ పట్టణంలోని, లూథరన్ ఆసుపత్రిలో నైటింగేల్ నర్సింగ్ విద్యార్థిగా చేరారు. 1851లో శిక్షణను ముగించుకొని, ఉన్నత చదువులకోసం, 1853లో పారిస్ వెళ్ళి శిక్షణ పూర్తి చేసుకుని, సెంట్రల్ లండన్‌లో, ఆసుపత్రిలో సూపరింటెండెంట్‌గా చేరారు. అది కేవలం పేదల ఆసుపత్రి. ఆ నాటి నుంచి ఆమె తన గురించి ఆలోచించడం మానేశారు. రోగుల సేవకే పునరంకితం అయ్యారు. తనని నడిపించేది మాత్రం ఏసుక్రీస్తేనని ఆమె భావన. ‘‘ఇతర వ్యక్తులతో నన్ను నేను ఎన్నోసార్లు పోల్చి చూసు కున్నాను. విపత్తులు సంభవించినప్పుడు వాళ్ళు సాకులు వెతికి తప్పించుకోజూస్తారు. కానీ నేను మాత్రం వాటిని ఎదుర్కోవడంలో నిమగ్నమైపోతాను. మనం పరిస్థితులను మార్చడానికి సిద్ధం కాకుండా, ఇతరులను విమర్శించడంలో అర్థం లేదు’’ అన్న నైటింగేల్ వ్యాఖ్యల్లో ఎంతో తాత్వికత గోచరిస్తుంది. నిజానికి ఆమె ఒక అసా ధారణ ఆరోగ్యకార్యకర్త. అంతేకాదు గణాంక నిపుణురాలు కూడా. అనేక భాషల్లో ప్రావీణ్యురాలు. ఆమె గొప్పకార్యనిర్వాహకురాలు కూడా. యుద్ధక్షేత్రంలో... క్రిమియాలో రష్యా, బ్రిటన్ల మధ్య సాగుతోన్న యుద్ధ కాలంలో ఆసుపత్రి నిర్వహణా బాధ్యతల్లో నైటింగేల్ సన్నిహిత మిత్రుడు సిడ్నీ హెర్బర్డ్ ఉన్నారు. సైనికాసుపత్రుల్లో ఆనాటికి పరిస్థితి అత్యంత దయ నీయంగా ఉంది. వివిధ రకాల అంటువ్యాధులతోనూ, యుద్ధరం గంలో గాయాలపాలవడంతోనూ అనేక మంది సైనికుల మరణాల సంఖ్య అనూహ్యంగా పెరిగిపోయింది. ఇదే విషయంపై పత్రికల్లో కథనాలు రావడంతో, ప్రజల్లో అలజడి మొదలయ్యింది. దీంతో అక్కడి యుద్ధ కార్యదర్శి టర్కీలోని మిలటరీ ఆసుపత్రిలో పరిస్థితు లను చక్కదిద్దడానికి నర్సుల బృందాన్ని నియమించాలని యుద్ధ కార్యదర్శి భావించారు. అతడు నైటింగేల్ నైపుణ్యం, ఆమె నాయకత్వ లక్షణాలను గురించి అవగాహన ఉన్న సన్నిహిత మిత్రుడు సిడ్నీ హెర్బర్డ్. నైటింగేల్‌కి ఆçహ్వానం అందింది. 1854లో నైటింగేల్ తన 38 మంది నర్సుల బృందంతో టర్కీలోని యుద్ధక్షేత్రంలోకి అడుగు పెట్టారు. అప్పుడే బ్రిటిష్ సైనిక క్షతగాత్రులకు ఆమె అందించిన అనూ హ్యమైన సేవల ద్వారా తొలిసారి ఫ్లారెన్స్ నైటింగేల్ పేరు వెలుగులోకి వచ్చింది. పరిశుభ్రతపై శ్రద్ధ, రోగుల్లో మనోనిబ్బరం... నైటింగేల్ సైనిక ఆసుపత్రిలోకి అడుగిడిన తక్షణమే సైనికాధికారులకు రోగుల సంఖ్యను బట్టి కొన్ని వందల టవళ్ళు, కొన్ని వందల సబ్బులు, గదులను శుభ్రపరిచేందుకు అవసరమైన, ఆనాటికి అందు బాటులో ఉన్న శానిటరీ వస్తువుల జాబితాను తయారుచేసి ఇచ్చారు. సైనికుల వార్డుల్లో రాత్రుళ్ళు చేతిలో లాంతరు పట్టుకుని రౌండ్స్ వేసేవారామె. అప్పుడే ఆమెను లేడీ విత్ ద ల్యాంప్ అని పిలిచేవారు. రోగుల నిద్రకు ఎంత ప్రాధానత్యనిచ్చేవారంటే వార్డుల్లో నర్సులు నడిచేటప్పుడు వారి గౌను శబ్దం కూడా పేషెంట్ల చెవులకు సోక రాదనేవారు నైటింగేల్. కేవలం వైద్య పరిరక్షకులుగానే కాక సైనికుల కోసం వారి కుటుంబాలకు వేలాది ఉత్తరాలు నైటింగేల్ స్వయంగా రాసి పోస్ట్ చేసేవారు. ఇది రోగుల్లో ఎంతో మానసిక స్థైర్యాన్ని నింపింది. నైటింగేల్ చేపట్టిన చేసిన అనేక సంస్కరణలు సైనికాసుపత్రి మరణాల రేటును, తొలి నెల రోజుల్లోనే 32 శాతం నుంచి 2 శాతానికి తగ్గించాయి. నర్సింగ్ వ్యవస్థను బలోపేతం చేయడం ద్వారా విప్లవా త్మక మార్పులు తీసుకొచ్చారు. క్రిమియా యుద్ధంలో ఫ్లారెన్స్ వైద్యా రోగ్య రంగంలో చేపట్టిన సంస్కరణలు అమెరికా, కెనడా దేశాలను ఆలోచింపజేశాయి. ఆ దేశాలకు నైటింగేల్ సలహాదారుగా కూడా పని చేశారు. నర్సింగ్ ఆద్యురాలైన నైటింగేల్ శిష్యురాలు లిండా రిచర్డ్, 1870లో అమెరికా తొలి శిక్షణ పొందిన నర్స్‌గా నియామకం అయ్యారు. పేషెంట్లను దివారాత్రులు కంటికి రెప్పలా కాపాడిన నైటింగేల్ వాడిన ల్యాంప్‌ని ఇప్పటికీ లండన్ మ్యూజియంలో భద్ర పరిచి ఉంచారు. ప్రకృతి నుంచే మనిషికి ఉపశమనం లభిస్తుందనీ, ప్రకృతిలో సహజ సిద్ధంగా దొరికే స్వచ్ఛమైన గాలి, వెలుతురు, సూర్యరశ్మి, సురక్షితమైన నీరు, ప్రత్యేకించి ఎంపిక చేసిన పౌష్టికాహారం, మనసుకి ప్రశాంతత నిచ్చే నిశ్శబ్ద సుఖవంతమైన నిద్ర, అన్నింటికన్నా ముఖ్యంగా వ్యాధి గ్రస్తులను ఉంచే పరిసరాల శుభ్రత అనేవి రోగులకు ఔషధాలకు మించి ఉపశమనాన్నిస్తాయనీ, పరిశోధనాత్మకంగా రుజువుచేసిన ఫ్లారెన్స్ నైటింగేల్ ఎన్విరాన్మెంటల్ థియరీని ప్రవేశపెట్టారు. ఆమె ఈ సిద్ధాంతాన్ని ప్రపంచం ముందుంచిన 150 ఏళ్ళ తరువాత రోగికి అవసరమైన కనీస విషయాలను గురించి ఇప్పుడు యావత్ ప్రపంచం మాట్లాడుతోండటం విచిత్రం. రోగులను అనునిత్యం కంటికి రెప్పలా కాపాడాల్సిన నర్సులకు శిక్షణ తప్పనిసరి అని భావించిన నైటింగేల్ తదనంతర కాలంలో 1860లో లండన్‌లో తొలి నర్సింగ్ స్కూల్, ‘నైటింగేల్ నర్స్ ట్రైనింగ్ స్కూల్’ని నెలకొల్పారు. అప్పటివరకు నర్సింగ్ అనేది ఒక వృత్తి విభాగంగా లేదు. దానికి ఒక విధి విధా నాల్లేవు. శిక్షణా పద్ధతులు లేవు. క్రిమియా యుద్ధం అనుభవాలతోనే ఆమె నర్సింగ్ విద్యకు రూపకల్పన చేశారు. రెండు ప్రధానమైన అంశా లను ఆమె పరిగణనలోనికి తీసుకున్నారు. దాదాపు 200 పుస్తకాలు రాశారు. ఆమెకు ఎన్నో ఉన్నత పురస్కారాలు లభించాయి. 1883లో రాయల్ రెడ్‌క్రాస్ నుంచి ‘క్వీన్ విక్టోరియా’ బిరుదుని, 1904లో ఆర్డర్ ఆఫ్ మెరిట్‌ను అందుకున్నారు. 1910, ఆగస్టు, 13న లండన్‌లోని తన నివాసంలో ఫ్లారెన్స్ నైటింగేల్ గొంతు శాశ్వతంగా మూగబోయింది. నర్సింగ్ వృత్తిలో అసామాన్య సేవలు అందించిన వారికి 1912లో ఫ్లారెన్స్ నైటింగేల్ పేరున ఒక మెడల్ని ప్రారంభించారు. జనాభా లెక్కల్లో ప్రజల ఆరోగ్యానికి కాలమ్... నూటాయాభై ఏళ్ళక్రితం ఫ్లారెన్స్ నైటింగేల్ నేటికీ అత్యంత అనుసర ణీయమైన, ఒక అద్భుతమైన సూచన చేశారు. జనాభా లెక్కల సమ యంలోనే ప్రజల ఆరోగ్యానికి సంబంధించిన సమాచారాన్ని సేకరిం చాలని బలంగా వాదించారు. ఇది సూచన మాత్రమే కాదు పార్ల మెంటు వరకు తన వాదనని వినిపించేలా చేశారు. అదే జరిగి ఉంటే నిజానికి కోవిడ్‌లాంటి మహావిపత్కాలంలో ఎంతగానో ఉపయోగ పడేది. ఈ రోజుకీ ఆనాడు ఆమె లేవనెత్తిన అంశం తప్పనిసరిగా ఆచ రణలో ఉంచాల్సిన విషయమన్నది నిర్వివాదాంశం. వ్యాసకర్త సామాజిక విశ్లేషకులు మల్లేపల్లి లక్క్ష్మయ్య మొబైల్ : 81063 22077 -
ఆస్టరాయిడ్ సమీపానికి నాసా నౌక
వాషింగ్టన్: ఉత్తరార్థగోళంలోని బెన్ను గ్రహశకలంలోని అగ్ని పర్వత ప్రాంతమైన నైటింగేల్‌కు 620 మీటర్ల దూరంలో అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ ఓస్రిస్ రెక్స్ అంతరిక్ష నౌక విహరించింది. నౌక తన 1.2 కిలోమీటర్ల కక్ష్యను వదిలేసి 11 గంటల పాటు ఆస్ట రా యిడ్ చుట్టూ తిరిగిందని అమెరికాలోని గోడార్డ్ స్పేస్ ఫ్లయిట్ సెంటర్లోని నాసా శాస్త్రవేత్తలు వెల్లడించారు. వచ్చే ఆగస్టులో అంతరిక్ష నౌక నైటింగేల్ ప్రాంతం నుంచి న మూనాలను సేకరించనుంది. ఈ అంతరిక్ష నౌక 250 మీటర్ల దగ్గరగా రెండుసార్లు ఆస్టరాయిడ్ చుట్టూ తిరుగు తుందని తెలిపింది. -
సేవా మూర్తి కన్నుమూత
– అనారోగ్యంతో మరణించిన కర్నూలు నైటింగేల్ సుగంధమ్మ – మే 11న రాష్ట్రపతి చేతుల మీదుగా ఫ్లారెన్స్ నైటింగేల్ అవార్డు ప్రధానం కర్నూలు(హాస్పిటల్): జాతీయ స్థాయి ఫ్లారెన్స్ నైటింగేల్ అవార్డు గ్రహీత కర్నూలు నగరంలోని న్యూ కృష్ణానగర్‌కు చెందిన గుండాల సుగంధమ్మ మంగళవారం అనారోగ్యంతో కన్నుమూశారు. అనంతపురం జిల్లా నార్పల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్‌గా పనిచేస్తున్న ఆమె కొంతకాలంగా షుగర్‌వ్యాధితో బాధపడుతున్నారు. సమాజసేవలో పడి ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేశారు. ఈ నేపథ్యంలో గత శనివారం ఆమెకు తీవ్ర గుండెపోటు వచ్చింది. కుటుంబసభ్యులు వెంటనే ఆమెను చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇదే నేపథ్యంలో మూత్రపిండాలు సైతం సరిగ్గా పనిచేయకపోవడంతో ఆదివారం హైదరాబాద్‌లోని ఓ ప్రై వేటు ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మంగళవారం కన్నుమూశారు. కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య, కుటుంబసంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ప్రతి ఏటా అందించే జాతీయ స్థాయి ఫ్లారెన్స్ నైటింగేల్ అవార్డును ఆమె గత మే 11వ తేదీన రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ చేతుల మీదుగా అందుకున్న విషయం విదితమే. సేవామార్గంలో అనేక కార్యక్రమాలు ప్యాపిలి మండలం హుసేనాపురం గ్రామానికి చెందిన జి.మద్దిలేటి, సరోజమ్మల కూతురైన సుగంధమ్మ 1985లో కర్నూలులోని ప్రభుత్వ నర్సింగ్ స్కూల్లో జీఎన్ఎం కోర్సు పూర్తి చేసి, 1986లో కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో స్టాఫ్‌నర్సుగా చేరారు. 1996 నుంచి 1998 వరకు బీఎస్సీ నర్సింగ్ విద్యను పూర్తి చేసి, ట్యూటర్‌గా పదోన్నతి పొంది ప్రాంతీయ శిక్షణా కేంద్రం(ఫిమేల్)కు బదిలీ అయి, అక్కడే 2006 వరకు పనిచేశారు. అనంతరం 2006 నుంచి 2012 వరకు ప్రభుత్వ నర్సింగ్ కాలేజిలో పబ్లిక్‌హెల్త్ నర్సుగా పనిచేశారు. ఆ తర్వాత కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్‌గా పదోన్నతి రావడంతో అనంతపురం జిల్లా నార్పల పీహెచ్‌సీకి బదిలీ అయ్యారు. సామాజిక సేవలో సుగంధమ్మ పేదరోగుల కోసం బుధవారం, లక్ష్మీనగర్, వన్‌టౌన్ ప్రాంతాలతో పాటు కర్నూలు మార్కెట్‌యార్డు సుగంధమ్మ ఫ్రీ క్లినిక్‌లు నిర్వహించారు. గుంతకల్‌లోని పద్మావతి నర్సింగ్ స్కూల్లో 100 మందికి పైగా విద్యార్థినిలను చదివించారు. కర్నూలు మండలం బి.తాండ్రపాడులోని ఓ గహంలో 12 మంది ఎయిడ్స్ రోగులను ఉంచి చికిత్స చేశారు. స్థానికులు అభ్యంతరం చెప్పడంతో వారిని తన ఇంట్లోనే ఉంచి సేవ చేశారు. 2009లో వచ్చిన వరదల సందర్భంగా 21 రోజుల పాటు మురికివాడల్లోనే ఉండి వైద్యసేవలందించారు. ఆమె సేవలకు మెచ్చి తెలుగు వికాస ఉద్యమం వారు శ్రీ కష్ణదేవరాయల 500 జయంతిని పురస్కరించుకుని విశిష్ట మహిళా అవార్డును, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సేవా పురస్కార్ అవార్డును అందుకున్నారు. 1998, 1999, 2004, 2005లో అప్పటి జిల్లా కలెక్టర్లు, మంత్రులు ఆమెకు ఉత్తమ సేవా పత్రాలను అందజేశారు. గ్రామీణ ప్రాంతాలు, మురికివాడల్లోని పేద ప్రజలకు సేవ చేసేందుకు సెయింట్ లూడ్స్ పీపుల్స్ సెల్ఫ్ సర్వీసు అండ్ సొసైటీని స్థాపించి గ్రామీణ, మురికివాడల్లోని పేదలకు సేవ చేశారు. లయన్స్ క్లబ్లో వివిధ హోదాల్లో, ఉమెన్స్ క్లబ్ కో ఆర్డినేటర్‌గా సేవలందించారు. సుగంధమ్మకు పలువురు నివాళి అనారోగ్యంతో కన్నుమూసిన సుగంధమ్మకు మంగళవారం ఆమె నివాసం వద్ద పలువురు ప్రముఖులు ఘనంగా నివాళులర్పించారు. సామాజిక సేవా కార్యక్రమాల్లో ఆమె చేసిన సేవలను వారు ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. నివాళులర్పించిన వారిలో ఎమ్మెల్సీ డాక్టర్ గేయానంద్, కేవీపీఎస్ జిల్లా ఉపాధ్యక్షులు టి.షడ్రక్, జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎం.రాజశేఖర్, ఎండి ఆనంద్‌బాబు, సఫాయి కర్మాచారుల హక్కుల సాధన సంఘం అధ్యక్షులు గుర్రాల శ్రీనివాసులు, సీనియర్ దళిత నాయకులు టిపి శీలన్న, వైఎస్ఆర్సీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర నాయకులు మద్దయ్య, ఎస్సీ,ఎస్టీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు బొంతా సుబ్బరాయుడు, ఎస్సీ,ఎస్టీ గజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు డాక్టర్ వై.ప్రవీణ్‌కుమార్, సునీల్‌కుమార్ తదితరులు సంతాపం తెలిపారు. -
ఏముందిరా బుల్బుల్..
ఈ క్రీం వాడండి.. మీ వయసు ఓ పదేళ్లు తగ్గిపోతుంది.. లేదా ఈ ఫేషియల్ చేయించుకోండి మీరు అరవైలో ఇరవైలా కనిపిస్తారు వంటి యాడ్స్ మనమెన్నో చూశాం.. వయసు తగ్గుతుందంటే చాలు.. ఎంత డబ్బు పెట్టడానికైనా సిద్ధపడిపోతాం.. ఇది చివరకు ఎంత వరకూ వెళ్లిందంటే.. పక్షుల రెట్టలను కూడా పులిమేసుకునేంత వరకూ.. ఇక్కడ జరుగుతోంది కూడా అదే. ఈ పక్షి పేరు నైటింగేల్.. మన దగ్గర బుల్బుల్ పిట్ట అని అంటారు.. అయితే.. జపాన్‌లో నైటింగేల్లోని ఓ అరుదైన రకం పక్షి ఉంది. దాని రెట్టను రాసుకుంటే.. వయసు తగ్గినట్లు కనిపిస్తుందని.. మొటిమల వల్ల ముఖంపై వచ్చే మచ్చలను అది తొలగిస్తుందన్నది జపానోళ్ల విశ్వాసం. అక్కడ 17వ శతాబ్దంలోనే ఈ నైటింగేల్ ఫేషియల్ ఫేమస్. తర్వాత అది ఆ నోటా ఈ నోటా పాకి.. విదేశాలకూ చేరింది. ఈ ఫేషియల్ అంటే పడి చచ్చే జాబితాలో హాలీవుడ్ హీరో టామ్ క్రూజ్, విక్టోరియా బెక్హాం వంటి వారూ చేరారు. ఓ సారి పులుముకుంటే రూ.20 వేలు సమర్పించుకోవాల్సిందే. ఎందుకింత ధర అంటే.. జపాన్‌లో స్థానిక నైటింగేల్ పిట్టలు తగ్గిపోతుండటంతో దాని రెట్టకూ డిమాండ్ పెరిగింది. పైగా.. నైటింగేల్‌ను చాలా జాగ్రత్తగా చూసుకుంటారు. దానికి ఏది పడితే అది పెట్టరు. పళ్లు లాంటి మంచి ఫుడ్ మాత్రమే పెడతారు. పురుగులు తినడం నిషిద్ధం. ఇంత మంచి ఫుడ్ తినడం వల్ల వచ్చే మంచి రెట్టతో ఎంతో మంచి జరిగిపోతుందట. దాన్ని పౌడర్ కింద మార్చి.. మరికొన్ని పదార్థాలు కలిపి.. ఫేషియల్ చేస్తారు. ఈ ఫేషియల్కు మంచి డిమాండ్ ఉంది.